ఆవిష్కరణల రైతు నేస్తం


Tue,August 28, 2018 11:49 PM

సాంకేతికత చేనులో.. కొత్త ఆలోచనల విత్తనాలు వేస్తూ.. శాస్త్ర పరిజ్ఞానమనే పంట పండిస్తుంది తెలంగాణ. అలాంటి అద్భుత ఆవిష్కరణలతో ముందుకొచ్చాడు ఓ పల్లె ఆణిముత్యం! సాంకేతికతను వ్యవసాయానికి జోడిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో అతడి ఆవిష్కరణలు చూస్తే తెలుస్తుంది. చదివింది పదో తరగతే అయినా.. ఆధునిక రైతాంగ ఆవిష్కరణల్లో తెలంగాణ సత్తా చాటుతున్న ఆ గ్రామీణ శాస్త్రవేత్తే బొమ్మగాని మల్లేశం. తెలంగాణ వినియోగ దశ నుంచి ఉత్పత్తి దశకు చేరుకున్నది. అద్భుత ఆవిష్కరణలను చేస్తూ ప్రపంచానికి పరిచయం చేస్తున్న యువతే దీనికి నిదర్శనం. బాగా చదువుకున్న వాళ్ల దగ్గర మాత్రమే కాదు.. పల్లెటూరి వాళ్లలోనూ పుష్కలమైన మేధో సంపత్తి ఉంటుంది తెలంగాణ బిడ్డలకు. వ్యవసాయం దండగ అన్నోళ్ల నోళ్లు మూయిస్తూ వ్యవసాయం పండగ అని నిరూపిస్తూ సంతోషకర సాగు చేస్తూనే.. ఆధునిక సాంకేతికతను జోడించే నైపుణ్యంలో ఆరితేరుతున్నారు. అలాంటి అరుదైన ఆణిముత్యమే బొమ్మగాని మల్లేశం.
b-mallesh
రిమోట్ కంట్రోల్: బొమ్మగాని మల్లేశం చదువుకున్నది పదో తరగతే. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేట గ్రామానికి చెందిన బొమ్మగాని లక్ష్మమ్మ, వెంకటయ్య కొడుకు మల్లేశం. ఆర్థిక పరిస్థితులు కారణంగా పదో తరగతితోనే చదువుకు దూరమై కుటుంబం కోసం ఏదో ఒక పని చేసేవాడు. లక్ష్మమ్మ ఫ్లోరోసిస్ బాధితురాలు. ఎక్కువసేపు కూర్చోలేదు.. నిలబడలేదు. ఏదైనా కావాలన్నా వెళ్లి తీసుకోలేని పరిస్థితి ఆమెది. ఎవరి పనిమీద వాళ్లు వెళ్లిపోగా ఇంట్లో లక్ష్మమ్మ ఒక్కరే ఉండేవారు. కనీసం లైట్స్.. ఫ్యాన్.. టీవీ పెట్టుకోలేని స్థితి. అనారోగ్యంతో ఉన్న అమ్మను ఇలా ఇబ్బంది పెట్టలేక రిమోట్ కంట్రోల్ ద్వారా విద్యుత్ ఉపకరణాలు ఆన్-ఆఫ్ చేసే ఆలోచన వచ్చింది. అప్పటికే సోలార్ కంపెనీలో పనిచేస్తున్న అనుభవం తోడై తొలి ఆవిష్కరణగా రిమోట్ కంట్రోల్ కనిపెట్టాడు.


ఇరిగేటర్ స్టార్టర్: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం కోసం 24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్నది. ఇది దేశం మెచ్చిన రైతాంగ సంక్షేమ పథకం. భూగర్భ జలాలను, విద్యుత్‌ను సద్వినియోగం.. ఆదా చేసుకునేందుకు మల్లేశం ఓ అద్భుత ఆవిష్కరణ చేశాడు. అదే టైమింగ్ సిస్టమ్ ఇరిగేటర్ స్టార్టర్. దీనిద్వారా పంటకు ఎంత నీరు కావాలో అంతే వాడుకోవచ్చు. ఎన్ని గంటలపాటు మోటార్ నడవాలో ఆ సమయాన్ని స్టార్టర్‌లో టైమర్ ద్వారా సెట్ చేస్తే అంతవరకే నడుస్తుంది. ఉదాహరణకు రెండు నారు మడులు ఒక గంటలో పారుతాయి అనుకుంటే.. మధ్యాహ్నం రెండు గంటలకు టైమ్ సెట్ చేస్తే రెండు గంటల వరకే మోటార్ నడుస్తుంది. ఒకవేళ మధ్యలో కరంట్ పోయినా.. ఎంతసేపు కరంట్ పోతే అంత సమయం ఆ తర్వాత ఆటోమేటిగ్గా మోటార్ నడుస్తుందన్నమాట. ఒకటే ఆవిష్కరణ ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉండటంతో రైతులు వీటిని అమర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.


b-mallesh2
సోలార్ పవర్ స్ప్రేయర్: మల్లేశం ఆలోచనలో నుంచి వచ్చిన మరో ఆవిష్కరణ సోలార్ పవర్ స్ప్రేయర్. మామూలుగా పంట చేలల్లో క్రిమి సంహారక మందులు పచికారి చేసే స్ప్రేయర్‌లు ఉంటాయి. పెట్రోల్ ఇంధనంగా ఇవి పనిచేస్తాయి. ఎంతలేదన్నా దీనికోసం రోజులో వెయ్యి రూపాయలు ఖర్చు అవుతాయి. సన్న చిన్నకారు రైతులకు ఇలా ఎప్పటికప్పుడు వేల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసేంత నగదు ఉండకపోవచ్చు. ఇలాంటి తరుణంలో అప్పులు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని దగ్గరుండి చూసిన మల్లేశం ఎలాంటి ఇంధన వినియోగం లేకుండా స్ప్రేయర్‌ను కనిపెట్టలేమా? అని ఆలోచించాడు. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే సోలార్ పవర్ స్ప్రేయర్. ఉచితంగా లభించే సూర్యరశ్మి ద్వారా నడిచే పరికరం ఇది. దీంతో అదనంగా ఒక బల్బు, ఒక ఫ్యాన్, మొబైల్ చార్జింగ్ పెట్టుకునే వెసులుబాటు కూడా ఉంది.


సీడ్ మాన్యువల్ మెషీన్: సీజన్ వస్తే విత్తనాల హడావుడి ఎలా ఉంటుందో ప్రతి రైతుకూ తెలుసు. అయితే ఇదొక క్లిష్టమైన ప్రక్రియ. విత్తనాలు వాటితోపాటు గ్రోమోర్ లాంటి మందులు వేయడానికి ఇద్దరు మనుషులు కావాలి. అరక దున్నడానికి రెండు ఎద్దులు, ఒక వ్యక్తి కావాలి. అరక సాయం లేకుండా ఏదైనా మెషీన్‌ను కనిపెట్టాలని సీడ్ మాన్యువల్ మెషీన్ ద్వారా అనుకున్నది సాధించాడు. దీనికి అమర్చిన యంత్రంలో విత్తనాలు, మందులు వేసి దున్నుకుంటూ వెళితే సరిపోతుంది. మంచి సాలు రావడమే కాదు.. క్రమ పద్ధతిలో విత్తనాలు పడతాయి. ముగ్గురు చేసే పనిచేయడం వల్ల రైతులు ఎక్కువగా వాడుతున్నారు.


b-mallesh4
కోతులు వాపస్ తరిమే యంత్రం: చేతికొచ్చిన పంటను నాశనం చేయడంలో కోతులు, అడవి పందులు సమస్యాత్మకంగా మారుతున్నాయి. అలాంటి పరిస్థితులను చాలా చూశాడట మల్లేశం. విద్యుత్ షాక్ పెట్టకుండా వాటిని తరిమికొట్టాలని నిర్ణయించుకున్నాడు. అడవిపందులను, కోతులను భరించలేక మరోవైపు విద్యుత్ షాక్ పెట్టే సాహసం చేయలేకపోతున్న రైతులకు కొత్త పరికరాన్ని కనిపెట్టాడు. ఎలక్ట్రానిక్ సెన్సర్ల ద్వారా ఇది పనిచేస్తుంది. పొలంలో ఈ మెషీన్‌ను అమర్చి, చుట్టూ తీగ వేస్తాడు. ఒకవేళ కోతులుగానీ, అడవి పందులుగానీ ఈ తీగకు తగలగానే సెన్సర్ల ప్రభావం వల్ల పెద్ద శబ్ద్ధాలు వినిపిస్తాయి. శబ్దాలకు భయపడి అవి వెనుదిరుగుతాయన్నమాట.


నీళ్లు పోయించే వాయిస్ మెసేజ్: ఇది ముఖ్యంగా పండ్లతోటలను ఉద్దేశించి చేసిన పరికరం. మొక్కలకు ఒక్కోసారి నీళ్లు పెట్టడం మర్చిపోతుంటాం. ఏదో పనిలో పడితే ఎండిపోయే వరకు కూడా చూడలేని పరిస్థితి కొందరిది. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న మల్లేశం సెన్సర్లు.. నెట్‌వర్కింగ్ సిగ్నల్స్ ద్వారా వాయిస్ మెసేజ్ పరికరం కనిపెట్టాడు. ఒకవేళ మొక్కకు నీళ్లు ఎండిపోతే.. దయచేసి మొక్కకు నీళ్లు పోయండీ అనే మెసేజ్ మొబైల్‌కు వచ్చేలా దీని పనితీరు ఉంటుంది.

b-mallesh6

ప్రతిభకు పురస్కారం

-మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా రాష్ట్రపతి పురస్కారం.
-ఎన్‌ఐఆర్‌డీ డైరెక్టర్ చేతుల మీదుగా 2014లో బెస్ట్ స్టాల్ అవార్డ్
-యునైటెడ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి 2015లో గౌరవ డాక్టరేట్
-తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్-2015
-అమెరికా నుంచి ఇంటర్నేషనల్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు- 2015
-కేటీఆర్ చేతుల మీదుగా 2016లో యూత్ ఐకాన్ అవార్డు
-పద్మశ్రీ వరప్రసాద్‌రెడ్డి చేతుల మీదుగా 2016లో సేవా ధార్మిక అవార్డు


అద్భుతాలు సృష్టిస్తా..

b-mallesh3
నాకు తొమ్మిదో తరగతిలోనే ఇలాంటి వాటిపై ఆసక్తి కలిగింది. మేడమ్ క్యూరీ పరిశోధనలు నాకు స్ఫూర్తినిచ్చాయి. నేను కూడా ఏదో ఒకటి చేయాలని చిన్న చిన్న పరికరాలు కనిపెట్టాను. అలా మొదటగా రిమోట్ కంట్రోల్ కనిపెట్టాను. నాలోని ప్రతిభకు పల్లె సృజన, రైతునేస్తం, శాంతా బయోటెక్ వారు ప్రోత్సహించారు. రామానంద తీర్థ సంస్థలో నేను తీసుకున్న ట్రెయినింగ్ ఉపయోగపడింది. ఇంతకన్నా మెరుగైన ఆలోచనలు.. ఆవిష్కరణలు, ఆలోచనలు నా దగ్గర ఉన్నాయి. పూర్తిస్థాయి సహకారం లభిస్తే అద్భుతాలు సృష్టిస్తా.
-బొమ్మగాని మల్లేశం


ఎరువులు చల్లే మెషీన్:

యూరియా లాంటి ఎరువు మందులు అందరికీ చల్లరాదు. ఈ రకమైన నేర్పరితరం ఉన్నవాళ్లు ఊర్లో వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలో ఉంటారు. పైగా ఖర్చు కూడా ఎక్కువే. ఈ ప్రక్రియలో మార్పులు రాబట్టేందుకు మల్లేశం ఫర్టిలైజర్ స్ప్రేయర్ కనిపెట్టాడు. ఇది కూడా సౌరశక్తి ద్వారానే నడుస్తుంది. ఎకరం పొలంలో పావుగంటలో మందు చల్లొచ్చు. ఒక వరుసలో 5-5 ఫీట్ల మేర మందు చల్లుతారు.


కలుపు తీసే యంత్రం:

4హెచ్‌పీ ఇంజిన్‌తో ఈ యంత్రం నడుస్తుంది. రోజుకు రెండు ఎకరాలు పనిచేస్తుంది. సుమారు ఒక లీటర్ డీజిల్ సరిపోతుంది. బైక్ వలె ఉన్న ఈ యంత్రంతో దుక్కి దున్నడంతో పాటు కలుపు తీస్తారు. ఒకరు డ్రైవర్, అతనికి సాయంగా మరొకరు ఉంటే సరిపోతుంది.


పత్తి ఏరే మెషీన్:

మామూలుగా కలుపు తీసే యంత్రాలు చాలా చూశాం. కానీ పత్తి తీసే యంత్రాలు పెద్దగా కనిపించవు. అలాంటి అరుదైన యంత్రాన్ని కనిపెట్టాడు మల్లేశం. ఎకరాల కొద్దీ పత్తిసాగు చేసే రైతులకు ఈ పరికరం ద్వారా మేలు జరుగుతున్నది.


నాటు వేసే మెషీన్:

ఇది ప్రాసెసింగ్‌లో ఉన్నది. కలుపు తీయడమే కాదు.. నాట్లు వేసే యంత్రాన్ని కనిపెట్టాలనే మల్లేశం ఆలోచన ఇంకో 3-4 నెలల్లో నిజం కాబోతున్నది.
-దాయి శ్రీశైలం
చిన్న యాదగిరి గౌడ్

b-mallesh5

1106
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles