పండుటాకుల పండుగ


Wed,October 3, 2018 01:14 AM

ఎవరన్నారు.. వయసైపోతే ఏమీ చేయలేరని? వయసు శరీరానికే కానీ మనసుకు కాదు. ఈ వయసులోనూ ఆడొచ్చు.. పాడొచ్చు.. కండలు పెంచొచ్చు.. ర్యాంప్‌వాక్‌లూ చేయొచ్చు. అసాధ్యం అనేమాటను ఆరడుగుల లోతులో పాతరేసి.. ఇవన్నీ మేం చేయగలం అని నిరూపించారు వారంతా. వారు పేరుకు పెద్దలు.. కానీ అనుభవజ్ఞానులు. వారు నడిచిన దారుల్లో మనం రేపటికి ముందడుగులు వేయాలనేలా హడావిడి.. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆ పండుటాకుల గుండెచప్పుడు రవీంద్రభారతి సాక్షిగా పండుగలా వినిపించింది.
Elders
ఉదయం పది గంటలు.. ఓ ప్రైవేటు స్కూల్‌బస్సు వచ్చి రవీంద్ర భారతి మెయిన్‌హాల్ ముందున్న వాటర్ ఫౌంటెన్ దగ్గర ఆగింది.. అందులోంచి కల్మషం లేని నవ్వులు, ముగ్గు బుట్టల్లాంటి తలలతో ఇరవై మంది పెద్దలు దిగి చుట్టూ చూస్తున్నారు. వాళ్లంతా ఓ వృద్ధాశ్రమం నుంచి వచ్చారనే విషయం స్కూల్‌బస్సుకు కట్టిన ఫ్లెక్సీ ద్వారా తెలుస్తున్నది. ఇంతలో హాల్ మెయిన్‌డోర్‌లోంచి మరో పెద్దాయన నవ్వుతూ వచ్చి వారిని లోపలికి తీసుకెళ్లారు. అప్పటికే లోపల సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. హాలంతా తెల్లటి బట్టలేసుకుని ఠీవీగా కూర్చున్న వయోవృద్ధులతో నిండిపోయింది.

ఇంతలో వేదిక మీద నుంచి .. ఇప్పుడు మీ ముందు ఆహ నా పెళ్లియంటా.. పాట మీద మిమ్మల్ని అలరించడానికి ఓ నృత్యరూపకం అని ఒక అనౌన్స్‌మెంట్. పాట మొదలైందో, లేదో.. చప్పట్లు.. ఈలలు.. అరుపులు.. 85 సంవత్సరాలు నిండిన ఓ బాపమ్మ. ఎంతో ఉత్సాహంగా, ఎంతో హుషారుగా కనుబొమ్మలెగరేస్తూ.. పెండ్లికూతురులా సిగ్గులు ఒలకబోస్తూ చక్కని హావభావాలతో స్టెప్పులేస్తున్నది. ఆ డ్యాన్స్ చూస్తూ.. ఈలలు వేస్తూ, గోల చేస్తున్నవారూ డ్బ్బై ఏండ్లు పైబడిన వారే. డ్యాన్స్ తర్వాత ఎనభయేండ్ల తాత అమ్మపాటతో శ్రోతలను సుస్వరాల ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత మరో తాతయ్య తన స్మార్ట్‌ఫోన్ చూసుకుంటూ ఈ కాలం కుర్ర గాయకుల కంటే అద్భుతంగా, ైస్టెల్‌గా నిలబడి పాట పాడిన తీరు మాటల్లో చెప్పలేం.

వేదిక మీద ఇలా ఉంటే.. వేదిక కింద జరుగుతున్న హడావుడి మామూలుగా లేదు. పంచె కట్టు, చేతిలో కర్ర, మరోచేతిలో హ్యాండీక్యామ్ పట్టుకొని ఈ పండుగనంతా రికార్డు చేస్తున్నాడో తాత. ఆయనకూ 75 ఏండ్లకు పైనే ఉంటాయి. ఈ తాతను చూసిన ఆశ్చర్యంలోంచి తేరుకోక ముందే.. మరో తాత ఏమండీ.. కొంచెం పక్కకు జరుగుతరా.. కెమెరాకు అడ్డొస్తున్నరు అంటూ.. ఓ డైలాగ్. ఏంటా అని అటువైపు చూస్తే.. తన స్మార్ట్‌ఫోన్‌లో ఈ సాంస్కృతిక కోలాహలాన్ని రికార్డు చేస్తున్నాడు.
కెమెరాకు ఎవరైనా అడ్డుగా వస్తే.. ఏమండీ.. కొంచెం పక్కకు జరుగండీ.. రికార్డు చేస్తున్నా అంటూ సౌమ్యంగా చెప్తున్నారు.

సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్స్ ఫోరం నుంచి ఫ్యాషన్ షో చేయడానికి మీ ముందుకు వస్తున్నారు అంటూ మరో అనౌన్స్‌మెంట్.. తెలుగుతనానికి నిలువెత్తు రూపమేమో అనిపించేలా ఓ డ్బ్బై ఏండ్ల తాత పంచె, కండువాతో వేదిక మీద ర్యాంప్‌వాక్ చేశారు. అరవై సంవత్సరాలు నిండినా.. ఇరువయేండ్ల చురుకుదనంతో ఓ అమ్మమ్మ లంగావోణి వేసుకొని వేదిక మీద హొయలు పోతూ నడిచిన తీరుకు సభంతా చప్పట్లతో దద్దరిల్లింది. ఆ వెంటనే మరో బామ్మ గుజరాతీ సంప్రదాయ దుస్తుల్లో అందరికీ వందనం తెలిపింది. 80 ఏండ్లు నిండిన ఓ తాత రాజస్థానీ పెండ్లికొడుకు వస్త్రధారణలో వేదిక మీద నడుస్తుంటే.. ఏమి రాజసం.. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే.. ఆ వయసులో ఇంకెంత అందంగా ఉండేవారో.. అంటూ యాంకర్లు చేసే కామెంట్లకు సభికుల చప్పట్లు, ఆ తాత ముసిముసి నవ్వులతో వేదిక మరింత వన్నెతో మురిసిపోయింది. ఆ తర్వాత వివిధరాష్ర్టాల వస్త్రధారణతో ఎనభయేండ్లు నిండిన పెద్దలంతా నడిచొస్తుంటే. యూత్ ఫెస్టివల్‌లో కూడా ఇన్ని ఈలలు, ఇంత గోల, ఇంత ఉత్సాహం ఉండదేమో అనిపించింది. ఉత్సాహం అనే పదం.. హుషారుగా రంకె వేస్తూ.. ఆ సభలో కొలువు దీరిందా అనిపించింది.
6-pack

ట్రాక్‌ప్యాంట్, టీషర్ట్, స్పోర్ట్స్ షూస్, రెండుచేతుల మణికట్టులకు ఫిట్‌నెస్ బ్యాండ్లు, కండలు తిరిగిన దేహంతో ఓ వ్యక్తి అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆయన వేదిక మీద కండలు ప్రదర్శించిన తర్వాత తెలిసింది ఆయన వయసు 75 అని.

ఎన్నో భావోద్వేగాలు, టన్నుల కొద్దీ అనుభవం, అపారమైన జ్ఞానం కలిస్తే వాళ్లు. నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు. మన భవిష్యత్ కోసం త్యాగాలు చేసి.. మన నవ్వుల్ని చూసి వారి బాధలు మరిచిపోయే మంచివాళ్లు. వాళ్లది చాదస్తం అనుకుంటాం మనం. కానీ, కాదు.. అనుభవం, మంచి చెడు ఆలోచించే పెద్దరికం. మనం భద్రంగా తిరిగి రావాలన్న ఆరాటం. ఇంట్లో వయసు పైబడిన వారిని నీకెందుకివన్నీ.. చేతగానప్పుడు ఒక దగ్గర కూసోవచ్చు కదా అని తీసిపారేస్తాం.. చులనకగా చూస్తాం. ముసలోళ్లు, వృద్ధులు అంటాం వారిని. కానీ.. నిజం చెప్పాలంటే వారు అన్నీ తెలిసిన జ్ఞానులు. వారు అనుభవజ్ఞులు వయో వృద్ధులు కాదు.. జీవనజ్ఞానవృద్ధులు. నిత్యం చైతన్యం వెదజల్లే ఆ కండ్లను ఓసారి సూటిగా చూడండి. మీ కంటే ఎక్కువ ఉత్సాహం, హుషారు మీకనిపిస్తుంది. కాకపోతే.. వయసు మీద పడి, శరీరం సహకరించిక మీలో తమని చూసుకుంటూ ఉంటారు. ఇంటికి పెద్ద దిక్కు ఉంటే.. ఆ ఇంట్లో దివిటీ ఉన్నట్టే. అందుకే.. వారిని మనం భారంగ భావించవద్దు. వారు కూడా మనల్ని భారం అనుకొని ఉంటే.. ఈ రోజు మనం ఉండేవాళ్లమా? అందుకే.. మన జ్ఞానవృద్ధులను కాపాడుకుందాం. ఇప్పటికైనా దేశంలో వృద్ధాశ్రమాలకు చరమగీతం పాడుదాం.

ప్రవీణ్‌కుమార్ సుంకరి
జి. భాస్కర్

607
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles