రంగస్థలమే వీరికి బడి!


Sat,October 6, 2018 11:11 PM

సురభి అంటే పురాణాల్లో కామధేనువు. పాలధారలు కురిపించే కామధేనువులాగ సురభి కళాకారులు నిత్యం ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. తెలుగు నాటకం ఓ స్థాయిలో వెలుగొందుతున్నదంటే.. దానికి కారణం సురభి సమాజం. తెలుగు నేల నలువైపులా సురభి విహారం చేసింది. వీళ్లకు కులం, మతం లేదు. జగమంత కుటుంబం వీరిది. నాటకమే వీరి జీవితం. జీవితమే ఓ నాటకం. ఛత్రపతి శివాజీ కాలం నుంచి నేటి వరకూ.. భవిష్యత్‌లో కూడా నాటకమే వీరి జీవితం, ప్రాణం. చెట్టుకొకరు పుట్టకొకరైనా కళామతల్లికి వీరు కన్న బిడ్డలే. వీరి కాపురాలూ అక్కడే! పురుళ్లూ అక్కడే! చావులూ అక్కడే! ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్లకు రంగస్థలమే బడి, గుడి. అమ్మా, నాన్న, తాతయ్య, నానమ్మ, అక్క, చెల్లి, బావ, తమ్ముడు, బామ్మర్ది... ఇలా అందరూ కలిసిపోయి నాటకం వేయడం ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో. కానీ, రంగస్థలమే ప్రాణప్రదంగా బతుకుతున్న సురభి సమాజంలో చూడొచ్చు. అంతరించిపోతున్న నాటకరంగాన్ని తమ భుజాలపై మోస్తూ.. భావితరాలకు స్ఫూర్తినిస్తూ బతికేస్తున్నారు. పెద్దలబాటలోనే ఈ బాల సమాజం కూడా పయనిస్తున్నది.
Baala-Maaya

కళావారధిగా బాల సమాజం

సురభి నాటకాలు నేటికీ ప్రజాదరణ పొందుతున్నాయంటే కారణం వారి కుటుంబ సభ్యుల చొరవే. వారి పిల్లలకు, పిల్లల పిల్లలకు నాటకాన్ని నేర్పుతుండడం వల్ల నేటి వరకూ సురభి అనే మహావృక్షం మనగలుగుతుంది. ఈ క్రమంలోనే జయచంద్రవర్మ ఆధ్వర్యంలో బాల మాయాబజార్‌కు ప్రాణం పోశారు. ఇందులో నటిస్తున్న పిల్లలంతా సురభివారే. వీరి నటన, ఆహార్యం కచ్చితంగా చూడాల్సిందే. ఈ పరీక్షల సమయంలో కూడా పిల్లలు ఉదయం పాఠశాలలకు వెళ్తూ.. సాయంత్రం ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారంటే వీరి పట్టుదల ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. అందుకే వీరు ఢిల్లీలో నిర్వహించే జస్నే బచ్‌పన్ అంతర్జాతీయ నాటకోత్సవాలకు ఎంపికయ్యారు. ఈ వారోత్సవాలకు దాదాపు ఐదు దేశాల నుంచి బాల కళాకారులు వస్తున్నారు. మన దేశం నుంచి ఈ ఉత్సవాలకు సురభి సమాజానికి చెందిన బాల కళాకారులు ఎంపికవడం ఇదే ప్రథమం.


వన్స్‌మోర్ అనకుండా ఉండలేరు

తెలుగునాట పౌరాణిక నాటకాలు అంటే.. హరిశ్చంద్ర, గయోపాఖ్యానం, కురుక్షేత్రం, రామాంజనేయ యుద్ధం. వీటిల్లో నటులంతా పోటీ పడి పద్యాలు పాడుతుంటే ప్రేక్షకులు ఈలలేసి వన్స్ మోర్ అంటూ కేకలేస్తుంటారు. వాటికి తోడు సెట్టింగ్‌లు, ట్రిక్స్, ఆహార్యంతో ఆసాంతం కదలకుండా కట్టిపడేసేదే సురభి నాటకం. నాటక రంగంలో చూస్తే దేశంలో మరే సమాజానికీ లేనంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కుటుంబం సురభి. కళ్లతో చూసే మంచి దృశ్యకావ్యం సురభి వారి నాటకమేనని గర్వంగా చెబుతారు ఈ కళాకారులు. సురభి కుటుంబం ప్రస్తుతం ఎనిమిదో తరం నడుస్తున్నది. నాటకానికి ఆదరణ తగ్గిపోయిందనుకునే రోజుల్లో సురభి నాటకం అంటే మైళ్ల దూరం నుంచి వచ్చి చూసే ప్రేక్షకులు ఉన్నారనడం అతిశయోక్తికాదు.


వీళ్లే యాక్టర్స్, టెక్నీషియన్స్

సురభి కళాకారులు ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే తమ ట్రిక్స్, సెట్టింగ్స్‌తో కట్టి పడేశారు. ఇవాళ గ్రాఫిక్కులూ, స్పెషల్ ఎఫెక్టులూ వచ్చాక అవి మనకు ఆనకపోవచ్చేమో కానీ, వాళ్ల టెక్నికల్ నాలెడ్జ్ సామాన్యమైంది కాదు. ఇంకో చిత్రం ఏంటంటే, ఓ నాటకంలో ఓసారి వాడిన టెక్నిక్‌ని మళ్లీ వాడరు. ఆగ్నేయాస్త్రం, నాగాస్త్రం అంటూ బాణాలు విసురుకోవడం, ఠకీమని మనుషులు మాయమైపోవడం, పక్షుల్లా ఎగరడం.. ఇవన్నీ స్టేజ్ మీద చేసి చూపించాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. చిత్రమేమిటంటే వీళ్లే యాక్టర్స్, వీళ్లే టెక్నీషియన్స్. ఉదాహరణకు శకుని పాత్ర చేసేవాడు ఈ సీన్‌లో లేడనుకోండి. వాడు తెర వెనుక వైర్ వర్క్ చేస్తుంటాడు. రాముడు లేడనుకోండి. వాడు వెనకాల మ్యూజిక్ కొడుతుంటాడు. మార్కెట్‌లోకి కొత్తగా వచ్చే ప్రతీ టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. తొలి తరం సినిమాలకు సురభి వాళ్లే ఆధారం. ఎంతమంది ఆర్టిస్టులో ఇక్కడనుంచి అక్కడికెళ్లారు. మన తొలి పూర్తి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాదలో చేసినవాళ్లు సురభి వాళ్లే. విశేష ఆదరణ పొందిన మాయాబజార్ చిత్రం కూడా సురభి కళాకారులను చూసే తీశారని చెప్తారు.


ఉపాధి కంటే నాటకానికే ఎక్కువ మొగ్గు

సంప్రదాయ వృత్తులు విడిచిపెట్టేసి కొత్తదారులు వెతుక్కునే కాలం ఇది. వృత్తుల కంటే కేరీర్ ముఖ్యమని ఇంటి పెద్దలకు తెగేసి చెబుతున్నారు. అటువంటిది సురభిలో మాత్రం ఉపాధి కంటే నాటకమే ప్రధానమని జీవిస్తున్నారు. ప్రస్తుత ఎనిమిదో తరంలో అనేక మంది యువతీ యువకులు ఉన్నత చదువులు చదువుకున్నారు. ఎంబీఎ, ఎంఏ, బీఎస్సీ చేసి ఉపాధి రంగంలో అవకాశాలొచ్చినా నాటకాన్ని బతికించాలనే దృఢసంకల్పంతో ముఖాలకు రంగులేసుకునేందునే మొగ్గు చూపుతున్నారు. పెళ్లిళ్లు సురభి కుటుంబాల మధ్యే జరగడంతో ఏ కుటుంబంలోకి వెళ్లినా అక్కడ కూడా నాటకాల్లో నటిస్తుంటారు. ఇలా ఒక కుటుంబం మొత్తం ఒకే వృత్తినే నమ్ముకోవడమంటే చాలా గొప్ప విషయం. ఇప్పుడు శ్రీవేంకటేశ్వర నాట్య మండలి, శ్రీ శారద విజయ నాట్యమండలి, శ్రీ విజయభారతి నాట్యమండలి, శ్రీ వినాయక నాట్య మండలి, శ్రీ బీఎన్ మండలి ఆధ్వర్యంలో సురభి నాటకాలు ప్రదర్శితమవుతున్నాయి. సురభి నాటకం... కుటుంబ నాటకం. 60 నుంచి 70 మంది నాటకం వేస్తారు. చంటి బిడ్డ నుంచి 90 ఏళ్ల వృద్ధుడి వరకు వేసే నాటకం ఇదే మరి.


సురభి అంటే టీం వర్క్..

Baala-Maaya2
సురభి సంస్థకు ఇప్పుడో సైనాధ్యక్షుడున్నాడు. పేరు సురభి నాగేశ్వరరావు. అందరూ బాబ్జీ అంటుంటారు. ఆయన చేతిలో అయిదు సభ్య సమాజాలున్నాయి. నాటకరంగానికి ఆయన చేసిన కృషికి పద్మశ్రీ వచ్చింది. పురుషుడు/మహిళ అనే తేడా ఉండదు. స్టేజీపై పాత్ర పోషించి తరువాత తెర వెనక్కి వెళితే అక్కడ ఏ పని ఉంటే అది చేస్తారు. వారు సొంతంగా డ్రెస్‌లు డిజైన్ చేస్తారు. సెట్టింగ్‌లు వేస్తారు. అందుకే ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడిచే సెట్టింగ్స్ వేయగలుగుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని స్పెషాల్టీ సురభి వాళ్ల దగ్గరుంది. ఒక నాటకం విజయవంతం అవడానికి వాళ్లు ప్రాణం పెడుతారు. అందుకే ఇదో సమష్టి కృషి. అందుకే దేశ విదేశాల్లో వందల ప్రశ్నలు ఇవ్వగలుగుతున్నారు. 1991లో ప్రధాని పీవీ నరసింహారావు ఢిల్లీకి పిలిపించుకొని వీరితో ఐదు నాటకాలు వేయించారు. 2013లోఫ్రాన్స్‌లో కూడా 40 రోజుల పాటు సురభి నాటకాలు ప్రదర్శించారు.
-డప్పు రవి

1385
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles