పారిశుధ్య పనులకు రోబో!


Sat,November 3, 2018 11:47 PM

పారిశుధ్య కార్మికుల కష్టాలను చూడలేక వారికోసం ప్రత్యేకంగా డ్రెయినేజీ క్లీనింగ్ కోసం ఓ రోబోను ఆవిష్కరించారు యువ శాస్త్రవేత్తలు. ఇటీవల ఢిల్లీలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. అలా మరో కార్మికుడు ప్రాణాలు కోల్పోవద్దనే సంకల్పంతో డ్రెయినేజీ క్లీలింగ్‌కు రోబోను తయారు చేశారు.
bandi-coot-robo
2017 ప్రభుత్వ గణాంకాల ప్రకారం 102 మంది పారిశుధ్య కార్మికులు మ్యాన్‌హోల్స్‌లో పనిచేస్తూ ప్రాణాలు విడిచారు. ఇలా ప్రతియేటా పురుష, మహిళలు కార్మికులు డ్రెయిన్ శుభ్రం చేస్తూ అనారోగ్యం బారినపడి సుమారు 23వేల మందికి పైగా మరణిస్తున్నారు. పారిశుధ్య కార్మికులు మురికిలోకి దిగి శుభ్రం చేయాల్సి రావడంతో అనారోగ్యం పాలవుతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని మురికి కాలువలు, చెత్తా చెదారాన్ని సులువుగా తొలగించడానికి బందికూట్ రోబోని కనుగొన్నారు కేరళకు చెందిన యువ శాస్త్రవేత్తలు. పలు రకాల డాక్యుమెంటరీలు, అవతార్ సినిమాలో సూపర్ హ్యూమన్ విన్యాసాలను చూసి ఈ బందికూట్ రోబోను తయారు చేసినట్లు చెబుతున్నారు. జెన్ రోబోటిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విమల్ గోవింద్‌తోపాటు మెకానికల్, ఇన్ స్ట్రూమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్ వంటి విభాగాలలో నిష్ణాతులైన ఇంజనీర్ల బృందం ఎంతో శ్రమించి దీనిని ఆవిష్కరించింది. విమల్ గోవింద్.. జెన్ రోబోటిక్స్ సంస్థకు వ్యవస్థాపకుడు కాగా అరుణ్ జార్జ్, నిఖిల్, రషీద్ తదితరులు ఈ సరికొత్త పరికరాన్ని తీసుకురావడంలో తమవంతు సహాయం చేశారు.

ఆక్సోస్కెలిటెన్ ప్రాజెక్టు చేసే సమయంలో మ్యాన్‌హోల్స్ పూడిక తీసేలా ఓ పరిష్కారాన్ని కనుగొనాలని కేరళ గవర్నమెంట్ వీరిని కోరింది. అప్పటి నుంచి ఈ టీమ్ ఎంతో శ్రమించి దీనిని రూపొందించింది. బందికూట్ రోబో పది మీటర్ల లోతులోకి వెళ్లి మరీ మురికిని తొలగిస్తుంది. అంతేకాదు మనిషి మట్టి, చెత్తను ఎలాగైతే చేతితో పట్టుకుని పైకి వేయగలడో ఈ రోబో కూడా అలాగే పనిచేస్తుంది. ఇప్పుడు పారిశుధ్య కార్మికులకు బందికూట్‌ను ఎలా ఉపయోగించాలో తెలియజేస్తూ.. వారి సమస్యను సులువుగా పరిష్కరించగలిగారు యువ ఇంజనీర్లు. ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఈ బందికూట్‌పై ఆసక్తి కనబరుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ర్టాలు బందికూట్ రోబో కావాలని ఇప్పటికే ఆర్డర్ చేశాయి. ఈ విషయం తెలిసిన దుబాయ్, షార్జా వంటి దేశాలు కూడా దీనిపై ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ కొత్త ఆవిష్కరణకు కారణమైన విమల్ గోవింద్ బృందం.. రాష్ట్రపతి భవన్‌లో స్వచ్ఛభారత్ దినోత్సవం రోజున ప్రధానమంత్రి నుంచి గౌరవ సత్కారాన్ని అందుకున్నది.

698
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles