మక్కువ+తపన= ఆస్కార్ బరి


Mon,September 24, 2018 11:43 PM

సినిమా తీయాలంటే ఒక కథ ఉండాలి.. కానీ సినిమా తీసే ప్రక్రియే ఓ గొప్ప కథలా ఉంటే.. ఆ సినిమా కచ్చితంగా ఆస్కార్‌ను అందుకోవాల్సిందే. అవును.. అచ్చంగా అలాగే జరుగుతున్నది. ఒక అస్సాం సినిమా.. విలేజ్ రాక్‌స్టార్.. నిన్న జాతీయ అవార్డుల పంట పండించింది. ఇప్పుడు ఆస్కార్‌కు ఎంపికయ్య భారతీయ సినిమాకు కొత్త చిగురులు తొడుగుతున్నది. ఈ క్రెడిట్ ఒక అమ్మాయిది. ఆమె సినిమాలపై మక్కువతో ముంబైకి వచ్చింది. సినిమా తీయాలన్న తపనే ఆమెను ముందుకు నడిపించింది. ఆ మక్కువ, తపనలే ఆమెను ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలబెట్టాయి. ఆమె పేరు రిమాదాస్. ఆమె పరిచయం మీ కోసం.. సినిమాపై ఉన్న మక్కువతో ముంబైకి వచ్చిన రిమాదాస్‌కు తొలినాళ్లలో ఏం చేయాలో తోచలేదు. ఎవర్ని, ఎక్కడ కలువాలో, ఏం చెయ్యాలో, ఎలా చేయాలో తెలియదు. ముంబైలో జరిగే చిన్న నాటకాల్లో నటించేది. అలా మెల్లగా బాలీవుడ్ పరిచయాలయ్యాయి. రిమాదాస్‌కు నటిగా మాత్రమే కాకుండా డైరెక్షన్ మీదే ఎక్కువ ఆసక్తి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సత్యజిత్ రే లాంటి దర్శకుల సినిమాలు చూస్తూ వాళ్లెలా తీశారో, కథను ఎలా చెప్పారో పరిశీలించేది. ఇలా 2009లో సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తునే స్వయంగా ఓ షార్ట్‌ఫిలిం తీసింది. దానికి ప్రాత అని పేరు పెట్టింది. ఆ తర్వాత మరో రెండు షార్ట్‌ఫిలింస్ చేసింది. ఆ షార్ట్‌ఫిలింసే ఆమెను సినిమా ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిపేందుకు స్ఫూర్తినిచ్చాయి.
Rockstars
కొన్ని జీవితాలు ఎక్కడ మలుపు తిరుగుతాయో ఎవరూ ఊహించలేరు. రిమాదాస్ జీవితంలో కూడా అదే జరిగింది. తన కొలీగ్ ఒకరు వాళ్ల నాన్న కోసం బైనాక్యులర్ కొన్నాడు. అది రిమాదాస్‌కు చూపించాడు. మా నాన్న కోసం ఇది కొన్నా.. ఆయన ఖాళీ సమయాల్లో ఆయనకు ఇదొక కాలక్షేపం అన్న మాటల్లో ఆమెకు కథ దొరికింది. అంతే.. ఆ స్టోరీ లైన్ మీద స్క్రిప్టు రాసుకున్నది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 2013లో అంతరదృష్టి (మ్యాన్ విత్ బైనాక్యులర్) పేరుతో సినిమా తీయడం మొదలుపెట్టింది. సినిమా తీయడానికి డబ్బుల్లేవు.. తనే రచన, దర్శకత్వం, నిర్మాత, ఎడిటింగు, చిత్రీకరణ, ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్స్ డిజైనింగు.. వన్ వర్క్ ఆర్మీగా పనిచేసింది. ముంబైలో జరిగే రకరకాల ఫిలిమ్ ఫెస్టివల్స్‌కు వెళ్తుండేది. ఈ సినిమాకు వాడిన కెమెరాలు కనీసం డీఎస్‌ఎల్‌ఆర్ కూడా కాదు. అలా మొదలుపెట్టిన సినిమా పూర్తయ్యేసరికి మూడేళ్లు పట్టింది. ఆ సినిమా ద్వారా రిమాదాస్ పేరు అందరికీ తెలిసిపోయింది.


తానొకటి తలిస్తే..

రిమాదాస్ అసోంలోని కాలార్దియాలో పుట్టింది. అసోంలో టీచర్ జాబ్ వస్తే అది గొప్ప విషయంగా భావించేవారు. రిమాదాస్ తండ్రి టీచర్ కావడంతో ఆ కుటుంబానికి మంచి పేరుండేది. తండ్రి అడుగుజాడల్లో నడుచుకునేది. తండ్రి దగ్గరే చదువు నేర్చుకున్నది. పుణె యూనివర్సిటీలో సోషియాలజీలో మాస్టర్స్ చేసింది. అంతేకాకుండా నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ క్లియర్ చేసింది. రిమాదాస్‌ని టీచర్‌గా చూడాలన్నదే తండ్రి ఆశయం. కానీ.. తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది అన్నట్టుగా జరిగింది. రిమాదాస్‌కు చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. పెరిగే కొద్దీ నటిని కావాలన్న కోరిక బలపడింది. స్కూల్లో జరిగే నాటకాల్లో చురుగ్గా పాల్గొనేది. ఆ కోరికే ఆమెను ముంబై వైపు అడుగులు వేయించింది.


ఊరి నేపథ్యమే కథగా..

రిమాదాస్ చిన్నప్పట్నుంచీ ఊరిని పరిశీలిస్తూ పెరిగింది కదా.. తాను తీయబోయే రెండో సినిమాలో ఆ ఊరి నేపథ్యాన్నే తీసుకోవాలనుకుంది. అందులో నుంచే ఓ కొత్త కథ రాసుకుంది. దాని పేరే విలేజ్ రాక్‌స్టార్స్. 2014లో ఈ సినిమా మొదలు పెట్టింది. 150 రోజులు వరుసగా తీసింది. తరువాత కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని రోజులు షెడ్యూల్ ఆలస్యంగా పెట్టుకునేది. ఆర్థికంగా రిమాదాస్ అంత బలంగా లేకపోవడం వల్ల సినిమాకు సంబంధించిన అన్ని పనులు తానే సొంతంగా చేసుకునేది. అలా విలేజ్ రాక్‌స్టార్స్ సినిమా తీయడానికి మూడేండ్లు పట్టింది. 2017లో సినిమా పూర్తయింది.


కథేంటంటే..

అద్భుతమైన సినిమాల కథలెప్పుడూ చాలా సింపుల్‌గా ఉంటాయి. ఈ కథ కూడా అలాంటిదే. దును అనే బాలిక చయాగాన్ గ్రామంలో తల్లి, తమ్ముడితో నివసిస్తుంటుంది. దును తల్లి సంతలో స్నాక్స్ అమ్ముతుంటుంది. ఆమెకు దును సాయపడుతుంటుంది. ఒకసారి గ్రామంలో జరిగిన బ్యాండ్ పర్ఫార్మెన్స్ చూసి ముగ్ధురాలైన దును ఎలాగైనా గిటార్ కొనుక్కోవాలనుకుంటుంది. పుస్తకాలు చదివి తను కూడా ఓ బ్యాండ్ ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఆ ఆలోచన వచ్చినప్పటి నుంచి డబ్బులు కూడబెట్టుకోవడం మొదలుపెడుతుంది. ఇంతలో వరదల కారణంగా పంట నష్టం వస్తుంది. ఈ పరిస్థితుల్లో తాను కూడబెట్టుకున్న డబ్బులతో దును ఏం చేస్తుందనేదే కథ. దును పాత్ర పోషించిన బన్నితా దాస్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవార్డు పొందింది. విలేజ్ రాక్‌స్టార్స్ సినిమా మొత్తం దేశాన్నే తమ గ్రామం వైపు చూసేలా చేసింది.


Rockstars2

ఆస్కార్‌కి ఇలా ఎన్నికైంది..

విలేజ్ రాక్‌స్టార్స్ సినిమా ఉత్తమ చిత్ర అవార్డుతో పాటు మరో మూడు జాతీయ అవార్డులూ సాధించింది. ఇప్పుడు ఏకంగా ఆస్కార్‌కే వెళ్తున్నది. కేవలం.. రిమాదాస్ రెండో సినిమా . అదికూడా తక్కువ ఖర్చుతో అన్నీ తానే సమకూర్చుకుంటూ ఓ ప్యాషన్‌తో తీసుకున్న సినిమా. ఎంత తపన పడి ఉంటే, ఎంత కష్టప డి ఉంటే ఈ ఫలితం సాధించి ఉంటుందనిపిస్తుంది విలేజ్ రాక్‌స్టార్ సినిమా చూస్తే. రిమాదాస్ డైరెక్ట్ చేసిన విలేజ్ రాక్‌స్టార్స్ ఫిల్మ్ వచ్చే ఏడాది జరుగనున్న ఆస్కార్స్ పోటీలకు ఇండియా తరపున అర్హత సాధించింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను ఆస్కార్‌కు ఎంపిక చేయడం విశేషం. 2019 ఫిబ్రవరి 24న ఆస్కార్ అవార్డుల ప్రదానం ఉంటుంది. రిమాదాస్ తీసిన విలేజ్ రాక్‌స్టార్స్ చిత్రం అస్కార్ అవార్డును సొంతం చేసుకుంటుందో లేదో ఫిబ్రవరి వరకు వేచిచూడాల్సిందే.


ఇదే విశేషం..

1935వ సంవత్సరంలో అస్సామీలో ఒక సినిమా ప్రారంభమైనది. తరువాత 53 సంవత్సరాలకు గానీ ఆ అస్సామీ సినిమాకు జాతీయ గుర్తింపు లభించలేదు. 1988లో జాహ్నా బారువా తీసిన ఓ సినిమా స్వర్ణకమలం సాధించినది. ఆ తరువాత ముఫ్పై యేండ్లకు అంటే ఇప్పుడు మరో జాతీయ అవార్డు.. అదే విలేజ్ రాక్‌స్టార్స్ సినిమా. ఈ సారి భారతదేశం తరపున అస్కార్‌కు వెళ్తున్న చిత్రంగా బరిలోది. 83 సంవత్సరాల తరువాత అస్సామీ సినిమా విశ్వవేదికపై కనిపించబోతున్నదన్నది. అసలు ఫిలిం మేకింగ్‌లో ఎలాంటి శిక్షణ పొందకుండానే ఆస్కార్ బరిలో నిలువడం విశేషమే కదా!

593
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles