డెవలపర్లు టెకీలుగా మారాలి


Sat,September 29, 2018 12:17 AM

పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్ రియల్ రంగం బెంగళూరును దాటేసింది. కేపీఎంజీ తాజా నివేదిక ప్రకారం.. 2018లో బెంగళూరు 694 మిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని ఆకర్షిస్తే.. హైదరాబాద్ 793 మిలియన్ డాలర్లను ఆకర్షించింది. ఇప్పటిదాకా భాగ్యనగరం వైపు దృష్టి పెట్టని దేశీయ పెట్టుబడిదారులే పెట్టుబడుల వర్షం కురిపించడం ఆకర్షణీయమైన అంశం. తొంభై శాతానికి పైగా విదేశీ పెట్టుబడిదారుల్ని హైదరాబాద్ అమితంగా ఆకట్టుకుంది. రానున్న రోజుల్లో పెట్టుబడుల ప్రవాహం మరింత రెట్టింపు కావాలన్నా.. దేశంలోనే అత్యుత్తమ నగరంగా ఖ్యాతినార్జించాలన్నా.. భాగ్యనగర రియల్ సంస్థలు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి.
reraa
తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చింది. వినూత్న సంస్కరణలకు పురుడుపోసింది. బ్లాక్ చెయిన్, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి సరికొత్త పరిజ్ఞానాల్ని ప్రోత్సహిస్తోంది. వీటిని నిర్మాణ సంస్థలు అందిపుచ్చుకుంటే కొనుగోలుదారులకు మెరుగైన సేవల్ని అందించవచ్చు. పైగా, వారి రోజువారి కార్యకలాపాల నిర్వహణ సులభతరంగా మారుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆపరేషనల్ టెక్నాలజీ వంటి ఆధునిక పరిజ్ఞానాలు ఆఫీసు, వాణిజ్య రియల్ రంగాలకు సరికొత్త దిశానిర్దేశం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆధునిక ఆవిష్కరణలను అందిపుచ్చుకున్నప్పుడే రియల్ కంపెనీలు మరింతగా దూసుకెళతాయని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భూఆక్రమణలకు అడ్డుకట్ట..

ఇండియాచెయిన్ అంటూ నీతి యోగ్ 2018లో సరికొత్త బ్లాక్‌చెయిన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు శ్రీకారం చుట్టింది. దీని సాయంతో నిర్మాణాలకు సంబంధించిన సామాజిక యాప్‌లను సులువుగా నిర్వహించవచ్చు. భూరికార్డులనూ నిర్వహించవచ్చు. స్థల యజమానుల హక్కులను కాపాడటమే కాకుండా భూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడంలో ఈ పరిజ్ఞానం సాయం చేస్తుంది. మనదేశంలో ఏటా కేవలం భూరికార్డులను సంపాదించడానికే దాదాపు 700 మిలియన్ల అమెరికన్ డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తుందని సమాచారం. ఈ ఇబ్బంది వద్దనుకుంటే బ్లాక్ చెయిన్ పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంటే సరిపోతుంది. భూరికార్డులను బ్లాక్‌చెయిన్‌లో నిర్వహించడం వల్ల నేరుగా బిల్డర్లకు ప్రయోజనం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బ్యాంకులు, కొనుగోలుదారులు వినియోగించడానికి వీలు కలుగుతుంది. దీని వల్ల సమయమెంతో ఆదా అవుతుంది. అదనపు ఖర్చూ తగ్గుతుంది. భూఅక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు.

-డెవలపర్లు సరైన వస్తు సామగ్రిని కొనుగోలు చేయడానికి బ్లాక్‌చెయిన్ పరిజ్ఞానం సాయం అందిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం బ్లాక్ చెయిన్ లెడ్జర్‌ను భూరికార్డులతో అనుసంధానం చేసే ప్రయత్నాలను చేస్తుంది. ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని చెప్పొచ్చు. టైటిల్ వివాదాలకు అడ్డుకట్ట వేయడం వల్ల టాక్స్ రెవెన్యూ కలెక్షన్లు పెరుగుతాయి. మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుంది. రికార్డుల డిజిటలీకరణ, రెరా అమలు, జీఎస్టీ వంటివి భారత రియల్ రంగంలో సరికొత్త పారదర్శకతను తీసుకొస్తాయి. కొనుగోలుదారులకు స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పుతాయి.త

కొనేదెవరు? తెలిసేదెలా?

రియల్ ఎస్టేట్ రంగం నిత్యం ఒడిదొడుకులకు లోనవుతుంది. మార్కెట్ ప్రతికూలంగా మారితే.. ముందుగా పడిపోయేది నిర్మాణ రంగమే. అందుకే, ఈ రంగంలో ఎప్పటికప్పుడు కొనుగోలుదారుల సమాచారం సేకరించడం, వారి పోకడలు తెలుసుకోవడం, ప్రాథమ్యాలను కనుక్కోవడం వంటి అంశాలపై దృష్టి సారించాలి. అప్పుడే, ఫలానా వ్యక్తులు ఇండ్లను కొంటారా? లేదా? అనే విషయం డెవలపర్లకు అర్థమవుతుంది. పెట్టుబడులు పెట్టేదెవరో అర్థమవుతుంది. ఇలాంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి డేటా ఎనలిటిక్స్ అత్యంత కీలకమని మర్చిపోవద్దు.
reraa1
కొనుగోలుదారుల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల యాభై శాతం దాకా కొనుగోళ్లు పెరిగాయి. ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ పోర్టళ్లు, కొనుగోలుదారుల స్థానిక అవసరాలు, అమ్మకాల ప్రక్రియ వంటివాటిని జియోస్పాషియల్ సమాచారంతో అనుసంధానం చేస్తున్నాయి. ఫలితంగా పూర్తి సమాచారాన్ని విశ్లేషించి ఇళ్లను కొనేదెవరె? అద్దెకు ఉండేదెవరు? వంటి అంశాలు డెవలపర్లకు ఇట్టే అర్థమవుతుంది.

వృథాను అరికట్టవచ్చు ఇలా..

నివాస, వాణిజ్య రియల్ రంగాల్లో వనరుల వినియోగంలో వృథాను అరికట్టడానికి ఐవోటి (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) కీలక పాత్ర పోషిస్తుంది. పలు ఐవోటి సంస్థలు మేనేజర్లు, అద్దెదారులు, ఇండ్ల యజమానులకు ఉపయోగపడేలా విసృ్తతమైన సేవల్ని అందిస్తున్నాయి. విద్యుత్తు, మంచినీరు, వృథాను అరికట్టడం వంటి విషయంలో ఐవోటీ కంపెనీలు సాయం అందిస్తాయి. ఇప్పటికే పలు సంస్థలు ఇండ్లల్లో గృహోపకరణాల్ని సురక్షితంగా వినియోగించేందుకు తోడ్పడుతున్నాయి. ఐవోటి వల్ల అపార్టుమెంట్ల నిర్వహణ సులభంగా మారుతుంది.

-ఆధునిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు అధికంగానే ఉన్నాయని రాంకీ ఎస్టేట్స్ ఎండీ నందకిశోర్ అభిప్రాయపడ్డారు. తమ సంస్థలో ఐటీ పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తున్నామని తెలిపారు. దాదాపు నగర బిల్డర్లందరూ నెమ్మదిగా ఐటీ వైపు అడుగులు పెడుతుండటం సానుకూల అంశమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులో కొనుగోలుదారులకు సకాలంలో ఫ్లాట్లను అందించాలన్నా.. అందించిన తర్వాత వాటి నిర్వహణ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న ఆధునిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించాలన్నారు. కొన్నాళ్ల తర్వాత హైదరాబాద్ నిర్మాణ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన నమస్తే సంపదకు తెలిపారు.

సైబర్ సెక్యూరిటీకి సై..

cyber
రియల్ ఎస్టేట్ రంగం ఆధునిక పరిజ్ఞానం మీద ఆధారపడితే సైబర్ దాడులు పెరిగే ఆస్కారముంది. స్మార్ట్ భవనాల సంఖ్య పెరుగుతుండటం వల్ల ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్, మొబిలిటీ వంటి పరిజ్ఞానాల వినియోగం సర్వసాధారణంగా మారింది. పలు సంస్థలు కొనుగోలుదారుల వ్యక్తిగత వివరాల్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. వచ్చే మూడేండ్లలో బయ్యర్ల వివరాలు మూడో వ్యక్తులకు ఇట్టే తెలిసిపోయే ప్రమాదముంది. ఇలాంటి ఇబ్బందుల్ని వద్దంటే.. బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (బీఎంఎస్) లేదా బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (బీఐఎం) వంటివి భవనాల మెకానికల్, ఎలక్ట్రికల్ పరికరాలే కాకుండా భద్రత పరికరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి. కంప్యూటర్లను పరిరక్షించుకోకపోతే ఇబ్బందులు తలెత్తవచ్చు.

564
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles