క్యాన్సర్ అంటువ్యాధా?


Thu,February 8, 2018 01:42 AM

మా అమ్మ వయసు 47 సంవత్సరాలు. ఇటీవల జరిపిన పరీక్షలో క్యాన్సర్ మొదటి దశలో ఉన్నట్టుగా గుర్తించారు డాక్టర్లు. కీమోథెరపీ ప్రారంభించారు. వ్యాధి బయటపడినప్పటి నుంచీ ఇది మీకూ సోకుతుందంటూ మమ్మల్ని దూరంగా ఉండమంటున్నది. నాకు, అన్నయ్యకు కూడా రావచ్చని భయపడుతున్నది. నిజంగానే క్యాన్సర్ అంటువ్యాధా?
వంశపారంపర్యంగా కుటుంబంలో అందరికీ వస్తుందా? అసలు చికిత్స ద్వారా క్యాన్సర్ నయం అవుతుందా? దయచేసి వివరంగా తెలియజేయండి.
- వి. మనోహరి, మధిర

Cancer-care
ఈ వ్యాధికి సంబంధించి మీ కుటుంబంలో లాగానే మన సమాజంలో చాలామంది కూడా అపోహలు, అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. క్యాన్సర్ అంటువ్యాధి కాదు. క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తికి సన్నిహితంగా ఉండడం, వారికి సేవలు చేయడం వల్ల ఎవ్వరూ ఈ వ్యాధి బారినపడే అవకాశాలు ఎంతమాత్రం ఉండవు. పలు సినిమాల్లో, నవలల్లో చూపించినట్లు క్యాన్సర్ సంపన్నులకు మాత్రమే వచ్చే వ్యాధి కాదు. అదే సమయంలో కేవలం వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి మాత్రమే కాదు. కొన్ని కుటుంబాల్లో పలువురు ఈ వ్యాధికి గురవుతున్నప్పటికీ ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ క్యాన్సర్ వస్తుందేమోనని భయపడడం సరికాదు. ఆర్థిక, సామాజిక, స్త్రీ-పురుష భేదం లేకుండా ఎవరైనా క్యాన్సర్ బారిన పడవచ్చు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, ఆహార పదార్థాల కల్తీ, సమతూకం కోల్పోయిన జీవనశైలి, అలవాట్ల కారణంగా మనదేశంలో క్యాన్సర్ వ్యాధి వేగంగా వ్యాపిస్తున్నది. పలు కారణాల వల్ల చిన్న వయసులో క్యాన్సర్ వ్యాధి వచ్చినంత మాత్రాన ఆ వ్యక్తులు వివాహానికి, దాంపత్య జీవితానికి అర్హులు కాదని భావించనవసరం లేదు. దానివల్ల జీవిత భాగస్వామికి క్యాన్సర్ రావడం గానీ, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడం గానీ జరిగే అవకాశమూ ఉండదు.

చికిత్స అనంతరం సంతానాన్ని కూడా పొందవచ్చు. ఇక క్యాన్సర్ చికిత్స విషయానికి వస్తే స్త్రీ, పురుషుల్లో ఇప్పటివరకూ గుర్తించిన క్యాన్సర్లలో అత్యధిక భాగం ముందుగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే పూర్తిగా నయం అవుతాయి. అయితే తొలిదశలోనే చికిత్స పొందితే క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కొని విజయం సాధించామని చెప్పకుండా మౌనంగా ఉంటూ ఉండడం, చాలా ఆలస్యంగా చికిత్సకు రావడం చేత సరైన సమయంలో చికిత్స తీసుకోక మరణించిన వారి విషయం మాత్రమే ప్రచారంలోకి వస్తూ ఉండడం.. ఇలాంటి కారణాల వల్ల క్యాన్సర్ అంటేనే మరణం అన్న అపోహ కొనసాగుతున్నది. మీ అమ్మగారికి వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, వెంటనే చికిత్స ప్రారంభించడం ద్వారా మీరు మంచి అడుగు వేశారు. మొదటి దశలో క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోతుంది. అనేక మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్థుల మాదిరిగా కొంత నయం కాగానే చికిత్సను నిలిపివేయడం, మందుల పట్ల అశ్రద్ధగా ఉండడం వంటి పొరపాటు చేయకండి. క్రమం తప్పకుండా డాక్టర్‌కు చూపించుకుంటూ ఉంటే ఆమె పూర్తిగా కోలుకుంటారు.

డాక్టర్ ఎం. జగన్మోహన్ రెడ్డి
సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్
యశోద హాస్పిటల్స్
హైదరాబాద్

535
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles