దివ్యాంగుల దిక్సూచి


Wed,September 12, 2018 12:35 AM

దివ్యాంగులు పరీక్షలు రాసేందుకు సాయం అందిస్తూ వారి రేపటి భవితకు దిక్సూచిగా మారుతున్నది బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పుష్పప్రియ. దివ్యాంగుడైన తన తండ్రి పడే బాధలను చూసి.. అలాంటి కష్టాలు వేరేవాళ్లకు రాకుండా ఉండేందుకు గత పదేళ్లుగా వివిధ సబ్జెక్టుల్లో పరీక్షలు రాస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది.
pushpa-preeya
అంధురాలైన పదో తరగతి అమ్మాయి పరీక్షలు రాసేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో స్నేహితురాలి కోరిక మేరకు పరీక్షలు రాసేందుకు సహాయకారిగా పనిచేసింది. ఆ అమ్మాయి పరీక్షలు అయిపోయాక పుష్ప ప్రియ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. దివ్యాంగుల సమస్యల పట్ల మరింత అవగాహన ఏర్పరచుకున్నది. తర్వాత ఎవ్వరికి సాయం కావాలన్నా వెళ్లేది. ఇలా దాదాపు వెయ్యికి పైగా పరీక్షలు రాసింది. కేవలం పరీక్షలు రాసి పెట్టడమే కాకుండా వాళ్లకు ఆర్థికంగానూ చేయూతనిస్తున్నది. ఇప్పటివరకు 681 స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు సహాయకారిగా పనిచేసింది. ఆరేళ్ల వయసున్న వారి దగ్గరనుంచి 60 ఏళ్లున్న దివ్యాంగులందరికీ, పక్షవాతం వచ్చిన వారికి కూడా పరీక్షలు రాసి పెడుతున్నది. ఎవరైనా సరే దివ్యాంగులకు పరీక్షలు రాయాలంటే ఓపిక, సమన్వయం, ఆత్మవిశ్వాసం అనే మూడు లక్షణాలు తప్పనిసరిగా ఉండాలంటున్నది ఆమె. దివ్యాంగులు సంవత్సరమంతా చదివిన చదువుకు ఫలితం పొందేది ఆఖరి పరీక్షల్లోనే కాబట్టి వాళ్లు చెప్పే ప్రతి అంశాన్ని జాగ్రత్తగా విని రాయాల్సి ఉంటుంది అని చెప్తున్నది. వీటితోపాటు పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి యాసిడ్ బాధితులకు, అనాథలకు కూడా తన వంతు సాయాన్ని అందిస్తున్నది. రక్తదానం చేసేందుకు ఫేస్‌బుక్‌లో ఓ పేజీని కూడా రూపొందించింది.

279
Tags

More News

VIRAL NEWS

Featured Articles