అవగాహనఅవసరం


Sat,September 29, 2018 12:57 AM

stock-market
చాలామంది మదుపరులు, సలహాదారులు తమ భద్రత దృష్ట్యా లిక్వి డ్ ఫండ్స్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీల వంటి షార్ట్-టర్మ్ మార్కెట్ పెట్టుబడులకు మన సొమ్మును వినియోగించే సరళమైన డెబ్ట్ మ్యూచువల్ ఫండ్సే ఇవి. తక్కువ రిస్క్ ఉండటంతో ఎక్కువమంది వీటిపట్ల ఆసక్తి చూపిస్తారు. కనీస మెచ్యూరిటీ చాలావరకు నెల, రెండు నెలలుగానే ఉంటుంది. ఈ ఫండ్ల సెక్యూరిటీ వ్యవధి 91 రోజుల దిగువనే. ఈ ఫండ్ల మరో రూపం అల్ట్రా-షార్ట్-టర్మ్ ఫండ్స్. కొద్ది రోజుల నుంచి ఏడాదికిపైగా వీటి కాలపరిమితి ఉంటుంది. సెబీ మార్గదర్శకాలు కూడా మదుపరులను ఈ లిక్విడ్ ఫండ్ల వైపునకు ఆకర్షింపజేస్తున్నాయి. ఎక్కువ లాభం, భద్రతతో కూడిన పెట్టుబడికి ఈ ఫండ్లు నిదర్శనం.

ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ పెట్టుబడులు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈక్విటీ ఫండ్ అనేది మ్యూచువల్ ఫండ్. ప్రధానంగా స్టాక్ మార్కెట్లలో వీటి పెట్టుబడులు ఉంటాయి. రిస్క్‌తో కూడిన పెట్టుబడులివి. డెట్ ఫండ్స్‌ను అమిత ప్రయోజనం కోసం ఎంచుకుంటారు. సాధారణంగా మదుపరులు తక్కువ లాభం వచ్చినాసరే.. తమ మూల పెట్టుబడులకు ఎలాంటి ప్రమాదం ఉండకూడదని ఆలోచిస్తారు. ఇక సెక్యూరిటీల్లో ఫండ్స్ అంశం అనేక రకాల కారణాలపై ఆధారపడి ఉంటుంది. సెక్యూరిటీలు ఫండ్ హౌస్‌లు, రేటింగ్ ఏజెన్సీల రిసెర్చ్‌లతో ఎక్కువగా ప్రభావితం అవుతాయి. రేటింగ్ పడిపోతే ఆస్తుల విలువ అమాంతం క్షీణిస్తుంది. బాగుంటే పెట్టుబడులూ పెద్ద ఎత్తున వచ్చి చేరుతాయి.

ప్రస్తుతం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభాన్నే చూస్తే.. గత వారం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, దాని అనుబంధ సంస్థల రేటింగ్‌ను మూడు రేటింగ్ ఏజెన్సీలు తగ్గించేశాయి. దీంతో నిధుల నికర ఆస్తుల విలువ గణనీయంగా దిగజారింది. వివిధ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో దాదాపు రూ.175 కోట్ల ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కమర్షియల్ పేపర్లు మెచ్యూరిటీకి వచ్చాయిప్పుడు. ప్రస్తుత పరిణామాలు ఎలాఉన్నా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఉదంతం ఓ గుణపాఠం. సెబీ, మదుపరులకూ ఇది మేల్కొలుపే. దురదృష్టవశాత్తు ఇటీవలికాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. వేగంగా మారుతున్న మార్కెట్ పరిస్థితులో, అవగాహన లేకో అమాయక మదుపరులు నష్టపోతున్నారు.

పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత వివరాలన్నింటి గురించి మదుపరులు పూర్తిగా తెలుసుకోవడం మంచిది. అలాగే మార్కెట్ రిస్క్‌లతో కూడిన పెట్టుబడులపై అవగాహన కూడా చాలా అవసరం. ప్రస్తుతం నెలకొన్న మందగమన పరిణామాలు మదుపరుల పెట్టుబడులపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఆయా ఆర్థిక సంస్థల్లో చోటుచేసుకుంటున్న ఘటనలూ మదుపరుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, ఇతరత్రా నియంత్రణ వ్యవస్థలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కొత్తకొత్తవి వాటికి సవాల్ విసురుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కనీస అవగాహన అనేది ఉంటే మార్కెట్లను జయించడం కష్టమేమీ కాదు. మన పెట్టుబడులకూ సరైన భద్రత లభిస్తుంది.
K-NARESH-KUMAR

475
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles