ఆత్మవిశ్వాసమే ఆమె సంపద!


Wed,September 26, 2018 01:28 AM

kalpana
కొన్ని లక్షల ఉలి దెబ్బలు తిన్న రాయి అద్భుత శిల్పంగా మారుతుంది. అలాగే ఆత్మ విశ్వాసంతో కష్టాలను ఎదుర్కొన్నప్పుడే మరిన్ని విజయాలు సాధించగలుగుతామనే దానికి కల్పన సరోజ్ ఉదాహరణ. సామాన్య కుటుంబంలో పుట్టి మిలియన్ డాలర్ల సంస్థకు అధినేత అయ్యింది. నేడు ఎంతో మంది మహిళలకు మార్గదర్శిగా నిలుస్తున్నదీమె.కల్పన సరోజ్ మహారాష్ట్రలోని అకోల గ్రామంలోని ఓ దళిత కుటుంబంలో పుట్టింది. సమాజంలోని కొన్ని ఒత్తిళ్ల కారణంగా ఆమెకు చిన్న వయసులోనే పదేండ్ల పెద్ద వాడితో పెండ్లి చేశారు. భర్తది ముంబై. పళ్లైన దగ్గర్నుంచి కల్పన సరోజ్ ఎన్నో బాధలు పడింది. రోజూ తమ అత్తామామలకు చాకిరి చేసేది. పైగా వాళ్లు ఆమెను చిత్రహింసలకు గురి చేసేవారు. ఒకరోజు అనుకోకుండా ఆమెను చూసేందుకు వచ్చిన తండ్రి.. కల్పన దుర్భర స్థితిని చూసి పుట్టింటికి తీసుకెళ్లాడు. కొద్దిరోజులకు ఇరుగు, పొరుగు వాళ్ల మాటలకు ఆత్మహత్యాయత్నం చేసింది. కొన్నాళ్లకు తన తప్పును తెలుసుకొని సొంతంగా ఏదైనా చేయాలని ముంబైకి పయనమైంది కల్పన.

అక్కడ టైలర్‌గా కొత్త జీవితాన్ని ఆరంభించింది. తన మొదటి సంపాదన వంద రూపాయలతో ఓ గదిని అద్దెకు తీసుకున్నది. తన కుటుంబాన్ని ముంబైకి రప్పించుకొని కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్నది. చెల్లెళ్లకు పెండ్లిళ్ల్లు చేయాలంటే వ్యాపారమే సరైన మార్గమని నమ్మి ప్రభుత్వ రుణంతో ఫర్నీచర్ బిజినెస్‌ను ప్రారంభించింది. దాంట్లో లాభాలు రావడంతో మిగిలిన డబ్బులని పేదల సంక్షేమానికి ఖర్చు చేసేది. స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎందరికో ఉపాధి కల్పించి మంచి పేరును సంపాదించింది. అదే తరుణంలో 500 కుటుంబాలు ఆధారపడి జీవించే కమని పైపుల కంపెనీ మూత పడింది. సంస్థను తెరువాలంటే రూ.116 కోట్లు అవసరం. ఆ సమయంలో తెలివిగా ఆలోచించి, ఆర్థికశాఖ మంత్రితో ఆ కంపెనీని తాను లాభాల బాట పట్టిస్తానని చెప్పింది. అందుకు ఆయన కూడా ఓకే చెప్పడంతో 2006లో ఆ సంస్థకు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టింది. కొత్త ఫ్యాక్టరీలను నిర్మించి, మిషనరీ మొత్తాన్ని మార్చివేసి ఆ కంపెనీ లాభాలు ఆర్జించేలా కృషి చేసింది. ఎంతో మందికి తన సంస్థ ద్వారా ఉపాధి కల్పించింది. సమాజానికి మంచి సేవలందించిన కల్పన సరోజ్‌ను 2013లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు. తన జీవితంలో ఎదురైన ఎన్నో ఒడుదొడుకులను ఆత్మవిశ్వాసంతోనే ఎదుర్కొన్నానని అంటున్నది.

326
Tags

More News

VIRAL NEWS