బ్యాంకింగ్‌లో విజయబావుటా


Sun,August 6, 2017 11:01 PM

HSBC
ఆర్థిక రంగంలో రాణించాలనే తపనతో కెరీర్ ప్రారంభించిన మహిళ ఆమె. అనుకున్నట్లే బ్యాంకింగ్ రంగంలో గొప్పగా రాణించి క్వీన్ అనిపించుకున్నారు. పనినే దైవంగా భావించి అనుకున్నది సాధించే వ్యక్తిగానూ పేరు సాధించారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. దేశంలోనే తొలిసారిగా ఒక విదేశీ బ్యాంక్‌కు భారతదేశ బాధ్యతలు నిర్వర్తించి శభాష్ అనిపించుకున్నారు. ఇండియన్ చాంబర్‌కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా కీర్తిని గడించడంతో పాటు వ్యాపార రంగంలో రాణిస్తున్న మహిళల వివరాలతో కూడిన పుస్తకాన్ని రాసి రచయిత్రిగా కూడా మారారు. విభిన్న రంగాల్లో సేవలందించి ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న నైనా లాల్ కిద్వాయ్ సక్సెస్ మంత్ర.

నైనా లాల్ కిద్వాయ్ పేరు తెలియని వారుండరు. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా పేరున్న హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ (హెచ్‌ఎస్‌బీసీ) భారత శాఖకు అధ్యక్షురాలిగా పనిచేసిన తొలిమహిళగా ఆమె గుర్తింపు పొందారు. అంతేకాదు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ)కి అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆ స్థాయికి చేరుకున్న తొలి మహిళ కూడా ఆమె కావడం విశేషం. ఆమె తన కెరీర్‌లో అనేక ప్రతిష్టాత్మక స్థానాలను అధిరోహించారు. ఆర్థిక రంగం కేవలం మగవారికి మాత్రమే సొంతం అని భావిస్తున్న తరుణంలో మహిళగా ఆ స్థానాన్ని అధిష్టించడమంటే ఆషామాషీ కాదు. అంతటి స్థాయికి చేరుకోవడానికి ఆమె చేసిన కృషి అనన్య సామాన్యం.

వెనక్కి వెళ్తే...

నైనా తండ్రి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నత వృత్తి నిపుణుడు. ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారం అనేది ఆమె తల్లి రక్త సంబంధీకుల నుంచి వారసత్వంగా వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే, వారి దగ్గరి బంధువు లలిత్‌మోహన్ తాపర్ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త. నైనా, ఆమె సోదరి ఇద్దరూ కూడా వారి తల్లిదండ్రుల నుంచే స్ఫూర్తిని పొందారు. అలా వారు ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించడానికి ఎంతో కష్టపడ్డారు. నైనా సోదరి ప్రఖ్యాత గోల్ఫ్ ప్లేయర్. 1957లో జన్మించిన నైనా..హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో స్కూల్ లైఫ్ ఫైనలియర్‌లో క్లాస్ హెడ్‌గర్ల్‌గా వ్యవహరించారు. ఆమె యుక్తవయస్సంతా ఢిల్లీ, ముంబైలో గడిచింది. భారత రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లేడీ శ్రీరాం కాలేజీలో ఎకనామిక్స్‌కు ఎంపికైంది. అయితే, ఆమె వయస్సు తక్కువ ఉందన్న కారణంగా అడ్మిషన్‌ను తిరస్కరించారు. దీంతో ఆమె చార్టర్డ్ అకౌంటెన్సీ వైపు మళ్లీ సీఏ పూర్తి చేసింది. 1977లో ప్రైజ్ వాటర్ హౌజ్ ఉద్యోగినిగా జీవితం ప్రారంభించారు. ఆ సంస్థలో ఉద్యోగాలు పొందిన ముగ్గురు మహిళల్లో నైనా ఒకరు.

ప్రతిష్టాత్మక పదవులు

1982 నుంచి 1994 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాంకింగ్ సంస్థల్లో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ఆ తరువాత వెనుతిరిగి చూడనవసరం లేకుండా కార్పొరేట్ నిచ్చెనను మెట్లుగా మలుచుకొని పైపైకి ఎగబాకింది. విప్రో, నెస్లే దక్షిణాసియా (బోర్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), సిటీ ఆఫ్ లండన్ అడ్వయిజరీ కౌన్సెల్ ఫర్ ఇండియాకు చైర్ ఉమెన్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (గ్లోబల్ అడ్వయిజర్), నేషనల్ కౌన్సెల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రిసెర్చ్, (గవర్నింగ్ మెంబర్ ఆఫ్ బోర్డ్), కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)లో (జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు), కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (మెంబర్ ఆఫ్ అడిట్ అడ్వయిజరీ బోర్డ్) వంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేసే అవకాశాల్ని సొంతం చేసుకుంది.

పనిలో వ్యూహాలు

భారతీయ క్యాపిటల్ మార్కెట్లో పారదర్శకత చాలా కీలకమని నైనా బావిస్తారు. అందుకే ఆమె ఊహించని అంచనాలను ముందుగానే అంచనా వేసి నష్టాలను ఎదుర్కొనడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంది. పరిశోధనా రంగం, నూతన టెక్నాలజీ రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహించింది. నైనా ఆమె బృందం ఐఎఏస్ ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేశారు. భారతదేశంలో భవిష్యత్తులో వివిధ ప్రాజెక్టులకు ప్రైవేటు రంగం నుంచి మరిన్ని సంస్థలు పాల్గొనడాన్ని ప్రోత్సహించేలా యాంత్రిక విధానాలను రూపొందించారు. దేశంలో విదేశీ పెట్టుబడులను పొందాలన్న ప్రాముఖ్యాన్ని కూడా ఆమె గ్రహించారు. దాన్ని సులభతరం చేయడానికి వ్యూహాలను రూపొందించారు.

సవాళ్లను అధిగమించి..

నైనా వృత్తి జీవితంలో అనేక పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆమె కిందిస్థాయి నుంచి ఎదిగి వచ్చిన వనిత. ఆమె కుటుంబాన్ని మిగతా వాటికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. నిజానికి ఒక వర్కింగ్ ఉమెన్‌గా ఉండి అన్ని రకాల పనులు చేసుకోవడం అంత సులభం కాదు. నిజానికి నైనాకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు తన వృత్తికి విరామం ఇచ్చి కుటుంబానికి అంకితం కావాలనుకున్నారు. కానీ, ఆమె తండ్రి మాత్రం ఆమె వృత్తిని కొనసాగించడానికే ప్రోత్సహించారు. ఒక రకంగా ఆమె కుటుంబమంతా ఆమె వెనుకాల నిలిచింది. అందుకే, ఆమె కెరీర్‌ను కొనసాగించగలిగారు. అంతేకాదు, తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నత స్థానానికి చేరుకోవడంతోపాటు ప్రపంచాన్ని చుట్టి రాగలిగారు. ఆమెలోని పనితనాన్ని గుర్తించిన ఎన్నో దేశాలకు చెందిన పలు సంస్థలు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ముందు కు వచ్చాయి. కానీ, భారతీయ హృదయం కలిగిన నైనా భారతీయురాలిగా ఇక్కడే పని చేయడానికి నిర్ణయించుకున్నారు. తన వృత్తి జీవితంలో వ్యక్తిగత, కుటంబ జీవితం చెడిపోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.

వ్యక్తిగత ఇష్టాలు

ఆమె వృత్తి పట్ల ఎంత అంకితభావంతో ఉండేదంటే 1993లో ముంబైలో అల్లర్లు చెలరేగుతున్నాయి. అయినా ఆమె తన ఆఫీస్‌కు వెళ్లి పనులను చక్కబెట్టారు. అంతేకాదు వృత్తి ధర్మాన్ని భుజాలపై మోస్తున్నా తన వ్యక్తిగత ఇష్టాలను ఆమె ఎప్పుడూ పక్కన పెట్టలేదు. ఆమె ప్రకృతి, జంతు ప్రేమికురాలు. వన్యప్రాణుల పట్ల ఆసక్తి ఎక్కువ. అలాగే గుర్రపుస్వారీలోనూ అనుభవం ఉంది. పర్వతారోహణ కోసం ట్రెక్కింగ్ ట్రిప్పులకు కూడా వెళ్లేది. మరోవైపు భారతీయ శాస్త్రీయ సంగీతం, పాశ్చత్య సంగీతం, నాటకరంగాల్ని కూడా ఇష్టపడుతుంది.

రచయిత్రిగా మారి..

నిర్భయ సంఘటన దేశాన్ని తీవ్రంగా కదిలిస్తున్న సమయంలో నా వంతుగా ఏమీ చేయలేనా అన్న ప్రశ్న కిద్వాయిని కలవర పరిచింది. మహిళ అంటే అబలో, ఆటబొమ్మో కాదు. ఆధునిక భారత నిర్మాణంలో భాగస్వామి, మేథోయోధురాలు అన్న విషయాన్ని ప్రపంచానికి చాటాలి. ఆమె గౌరవాన్ని ఇనుమడింపజేయాలి అన్న అంతర్మథనమే ఆమెను రచయిత్రిని చేసింది. ముప్పై మంది మహిళా వ్యాపార దిగ్గజాల ఆలోచనలు, అనుభవాలతో 30 ఉమెన్ ఇన్ పవర్ పుస్తకాన్ని రాశారు.

మహిళా సాధికారతకు కృషి

నైనా లింగసమానత్వాన్ని కోరుకున్నారు. అంతేకాదు, మహిళల సాధికారతకోసం కృషి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళల సాధికారత గురించి ఆలోచించేవారు. సమాజంలోని బలహీన వర్గాల జీవనోపాధికోసం వారి వ్యాపారాలకు చిన్నమొత్తంలో పెట్టుబడులు అందేలా చర్యలు తీసుకున్నారు. ఎక్కువగా సామాజిక సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పనిచేశారు. దేశంలో అక్షరాస్యత శాతాన్ని పెంచి, సామాన్య మానవుడికి నాణ్యమైన జీవితాన్ని అందించాలన్నది ఆమె తాపత్రయం. ఆమె భర్త రషీద్ కె. కిద్వాయ్ కూడా గ్రాస్ రూట్ ట్రేడింగ్ నెట్‌వర్క్ ఫర్ ఉమెన్ అనే ఎన్‌జీవోను నడిపారు. ఆ సంస్థ ద్వారా మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి అవసరమైన కార్యకలపాలు నిర్వహించారు.
స్థిరత్వం, నిబద్ధత, ఐక్యంగా పనిచేసే స్వభావం, శిక్షణ, పరిసరాల నుంచి తెలుసుకొనే సామర్థ్యం ఉంటే ఎవ్వరైనా తాము ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థాయికి చేరవచ్చని నిరూపించింది నైనాలాల్ కిద్వాయ్. ఆర్థిక నిపుణులు, కీలక నిర్ణయదారులకు నేడు నైనాలాల్ కిద్వాయ్ స్ఫూర్తినిచ్చే పేరు.

ప్రపంచ గుర్తింపు

ప్రముఖ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ 2002లో ప్రపంచవ్యాప్తంగా ప్రతిభగల 15 మంది మహిళా వాణిజ్యవేత్తల్లో ఒకరుగా ప్రచురించింది! 2003లో ఫార్చ్యూన్ పత్రిక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో నైనా పేరును చేర్చింది. 2006లో టైమ్ మ్యాగజైన్‌లో అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకింగ్ రంగంలో విశేష ప్రతిభ కనపరుస్తున్న మహిళల జాబితాలో ఆమెకు 12వ స్థానం దక్కింది. వాణిజ్య పరిశ్రమలో ఆమె సేవలను గుర్తించిన భారతప్రభుత్వం 2007లో పద్మశ్రీ బిరుదును ప్రదానం చేసింది.

తొలి భారతీయ మహిళ

ఎకనామిక్స్ చదువాలన్న తన కోరికను మాత్రం చంపుకోలేదు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి 1982లో ఎంబీఏ చేశారు. అలా హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన మొట్టమొదటి భారతీయ మహిళగానూ నైనా రికార్డ్ సాధించారు. ఆ తర్వాత ఏఎన్‌జెడ్ గ్రిండ్లేస్ బ్యాంక్‌లో అవకాశం రావడంతో కొంతకాలం అక్కడే పనిచేశారు. తక్కువ సమయంలోనే ఆ సంస్థకు ప్రాచ్యప్రాంతపు హెడ్‌గా 1989 వరకూ పనిచేశారు. ఆ తర్వాత హెచ్‌ఎస్‌బీసీ భారత శాఖకు అధ్యక్షురాలిగా పనిచేసిన తొలిమహిళగా ఆమె గుర్తింపు పొందారు.

425
Tags

More News

VIRAL NEWS