స్వర్ణమనస్కురాలు


Sat,September 15, 2018 12:57 AM

swarnalatha

దివ్యాంగులకే కాకుండా సకలాంగులకు సైతం ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నదామె.
ఎనభై శాతం వైకల్యంతో బాధపడుతున్నా ఆమె ఆలోచనలు మాత్రం ఏనాడూ ఖాళీగా కూర్చోలేవు. మోటివేషనల్ స్పీకర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా, గాయనిగా, సామాజిక కార్యకర్తగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న మహిళ స్వర్ణలత.

చిన్న వయసులోనే మల్టిపుల్ స్కేరోలసిస్ బారిన పడింది. దీంతో ఆమె శరీరంలో ఎనభైశాతం అవయవాలు పనిచేయని పరిస్థితి. అయినా సరే.. ఆమె ఏనాడూ బాధపడలేదు. తనలా ఎన్నో సమస్యలను ఎదుర్కొనేవారికి చేయూతనివ్వాలనుకుంది. అందుకే బెంగళూరుకు చెందిన స్వర్ణలత ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. దానికి స్వర్గ ఫౌండేషన్ అని పేరు పెట్టింది. అంగవైకల్యంతో కృంగిపోయేవారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపి స్వశక్తితో ఎదగడం ఎలాగో తన మోటివేషనల్ స్పీచ్‌లతో చెప్తున్నది. వందలాదిమంది దివ్యాంగులను స్వయంశక్తి కేంద్రాలుగా మలిచింది. స్వర్గ ఫౌండేషన్ ద్వారా మానసికంగా బాధపడేవారికి ఉచిత కౌన్సెలింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నది. దివ్యాంగులతో యోగాసనాలు వేయిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నది. వారికి అవసరమైన వాకర్స్, వీల్ చెయిర్స్, విద్యాసౌకర్యం, ఉపాధి, ఇతర సౌకర్యాలు కల్పిస్తూ అండగా ఉంటున్నది. కోయంబత్తూర్‌లో ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా టాయ్‌లెట్లు నిర్మింపచేసింది. కస్టమైజ్డ్ పనిముట్లు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా తయారుచేయించి ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఇటీవలే తమిళనాడులో సారధి పేరుతో దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించింది.

ఇందులో సోఫా కమ్ బెడ్, టాయ్‌లెట్, టీవీ, హాట్‌వాటర్ లాంటి సకల హంగులూ ఉంటాయి. ఈ వాహనాలు కేవలం దివ్యాంగుల కోసం మాత్రమే. స్వర్ణలత తన గాత్రంతో కూడా ఆకట్టుకుంటున్నది. ఆమె రచయిత్రి కూడా. తన కథలు, వ్యాసాలు, పాటల ద్వారా ఎంతోమందికి ప్రేరణ కలిగిస్తున్నది. ఫొటోగ్రాఫర్‌గా కూడా స్వర్ణలత మంచి గుర్తింపు తెచ్చుకున్నది. మల్టిపుల్ స్కేరోలసిస్ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా ఓ సంచిక, క్యాలెండర్‌ను రూపొందించి ప్రచురిస్తున్నది. పారా ఒలంపిక్స్‌లో విజయం సాధించిన అథ్లెట్ల ఫొటోలతో స్వర్ణలత రూపొందించిన క్యాలెండర్ పలువురి ప్రశంసలు, అవార్డులు గెలుచుకుంది. అంతేకాదు.. మిస్ ఇండియా బ్యూటీ కాంపిటీషన్‌లో స్వర్ణలత మొదటి రన్నరప్‌గా నిలిచింది. కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నది స్వర్ణలత.

246
Tags

More News

VIRAL NEWS