ఆకట్టుకున్నాయిలా..


Tue,January 16, 2018 11:15 PM

పాతవి పోతుంటాయి. కొత్తవి వస్తుంటాయి. ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ విషయంలో ఆ పాత కొత్తల మధ్య వారధి ఈ మెగా ఈవెంట్. అదే సీఈఎస్ (కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో) . జనవరి 9 నుంచి 12 వరకు జరిగిన ఈ షోలో ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచాయి. ఈ సారి ఎలాంటి గ్యాడ్జెట్స్ ఆకట్టుకోనున్నాయో పోయిన వారం తెలుసుకున్నారు. మరి ఇప్పుడు షో ముగింసింది. ఏ గ్యాడ్జెట్స్ ఎక్కువగా ఆకట్టుకున్నాయో, కొత్త టెక్నాలజీని ఏ సంస్థలు తీసుకొచ్చాయో ఈ వారం తెలుసుకోండి. అమెరికాలోని లాస్‌వెగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన సీఈఎస్- 2018 సమీక్ష ఇది.
ces2018
best-gaming

బెస్ట్ గేమింగ్:

కంప్యూటర్స్‌లో, సెల్‌ఫోన్స్‌లో ఇప్పటి వరకూ చాలా గేమ్స్ ఆడి ఉంటారు. కానీ ఎన్వీడియా ప్రవేశపెట్టిన బీఎఫ్‌జీడీ (బిగ్ ఫార్మాట్ గేమింగ్ డిస్‌ప్లేస్) సీఈఎస్‌లో బెస్ట్ గేమింగ్ గ్యాడ్జెట్‌గా నిలిచింది. రెండు వింతైన ప్రపంచాలను చూపించే స్క్రీన్‌లు ఉన్న గేమింగ్ కన్సోల్ ఇది. ఆసస్, హెచ్‌పీ, ఎసర్ వంటి కంపెనీలతో కలిసి సీఈఎస్‌లో ఎన్వీడియా ఈ టెక్నాలజీని ప్రదర్శిచింది. అధిక స్థాయి గేమ్ మానిటరింగ్‌తో పాటు అపారమైన సున్నితత్వాన్ని కలిగిన ఈ పెద్ద స్క్రీన్.. జి-సింక్ టెక్నాలజీతో పనిచేస్తుంది.
కండ్లు మిరిమిట్లు గొలిపే కాంతులు.. అంతకు మించి అదిరిపోయే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్. కొత్తదనాన్ని చూపించేందుకు కంపెనీలు ఎంత తపన పడ్డాయో చూపించింది సీఈఎస్ 2018 ఈవెంట్. ఒకదాన్ని మించి మరొకటి తమ ప్రొడక్ట్స్‌ను వినూత్నంగా రూపొందించాయి. కన్‌జ్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గ్రాండ్ షో విశేషాలివి.

acer-lapy

ఎసర్ కొత్త ఎంట్రీ:

ల్యాప్‌టాప్‌ల తయారీలో ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకొన్న ఎసర్ కంపెనీ.. 2018లో మరోసారి కొత్త వర్షన్‌తో ఎంట్రీ ఇచ్చింది. స్విఫ్ట్7 అల్ట్రాబుక్ వెర్షన్‌కు అప్‌డేటెడ్ వెర్షన్ ఎసర్ స్విఫ్ట్7ను సీఈఎస్‌లో లాంచ్ చేసింది. ఇప్పుడు ప్రపంచంలో ఇదే థిన్నెస్ట్(అతి పలుచని) ల్యాప్‌టాప్‌గా చెబుతున్నారు. అంతర్గతంగా 4జీ ఎల్‌టీఈ టెక్నాలజీని కూడా కలిగి ఉండడం విశేషం. ఇక ఈ ఏడాది వచ్చిన 2018 డెల్ ఎక్స్‌పీఎస్ 13కు ఇది ప్రత్యర్థిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు టెక్నాలజీ నిపుణులు.
headset

సూపర్ హెడ్‌సెట్:

ఫోన్, ల్యాప్‌టాప్‌లకు ఎంత ప్రాముఖ్యతనిస్తారో హెడ్‌సెట్స్‌కూ అంతే ప్రాధాన్యం ఇస్తున్నారిప్పుడు. అందుకే ప్రముఖ కంపెనీ సెన్‌హైసర్ కొత్త ప్రొడక్ట్‌ను ఈ గ్రాండ్ ఈవెంట్‌లో రిలీజ్ చేసింది. న్యూ హెచ్‌డీ 820 హెడ్‌ఫోన్స్‌ను నూతన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండువైపులా బయటకు కనిపించేలా దీనికి గొరిల్లా గ్లాస్ విండో ఉండడం విశేషం. చెవులకు వినసొంపైన ధ్వనిని అందించేందుకు ఇవి ఉపయోగపడుతాయి. అందుకే సీఈఎస్ ఈవెంట్‌లో ది బెస్ట్‌గా నిలిచాయి.
vojo

ఫోర్ట్ ఓజో:

మోటార్ సైకిల్స్ విభాగంలో సీఈఎస్ 2018కు ప్రత్యేక ఆకర్షణ ఫోర్డ్ ఓజో. ప్రదర్శనలో ఉంచిన లైట్ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో దీన్ని బెస్ట్‌గా చెప్పొచ్చు. అచ్చం జిరాఫీలా ఎత్తైన మెడ కలిగి ఉండి, కూర్చొనే సీటును మాత్రం తక్కువ ఎత్తులో కలిగి ఉండి.. చిన్న టైర్లతో డిఫరెంట్‌గా దర్శనమిచ్చిందీ నయా బండి. ఒక్కసారి రీచార్జ్ చేస్తే చాలు..యాభై మైళ్ల వరకు ఆగకుండా దూసుకెళ్తుంది. దీన్ని కాలిఫోర్నియాకు చెందిన ఓజో కంపెనీ తయారు చేసింది. త్వరలోనే పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి రానున్నది.
m-bux

మెరిసిన మెర్సిడెస్:

సీఈఎస్ లాంటి గ్రాండ్ ఈవెంట్స్‌ను ఉపయోగించుకోవడంలో ముందుంటుంది మెర్సిడెస్ బెంజ్. తన ప్రొడక్ట్స్‌ను ప్రదర్శనకు ఉంచేందుకు పోటీపడుతుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎమ్‌బక్స్ అనే కొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది. ఈ టెక్నాలజీ సాయంతో.. కారులో చల్లదనాన్ని, ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేయొచ్చు. . కారులో కూర్చొని నోటితో చెబితే చాలు.. ఆ వాయిస్‌కు తగ్గట్టు కారులోని టెంపరేచర్, కూలింగ్‌లు మారిపోతుంటాయి. అదే ఈ ఎమ్‌బక్స్.
samsung-the-wall

స్యామ్‌సంగ్ ది వాల్:

ఈ ఏడాది స్యామ్‌సంగ్ నుంచి దూసుకొచ్చిన కొత్త టీవీ.. సీసీఎస్ 2018లో ది బెస్ట్‌గా నిలిచింది. ఈ కంపెనీ ప్రవేశపెట్టిన ది వాల్ అందరినీ ఆకట్టుకున్నది. మైక్రో ఎల్‌ఈడీ టెక్నాలజీతో రూపొందిన ఈ అధునాతన టీవీ ఓఎల్‌ఈడీలో లభించే అన్ని ఫీచర్స్‌నూ కలిగి ఉన్నది. ప్రకాశవంతమైన స్క్రీన్ మీద సొగసైన చిత్రాన్ని వీక్షించేందుకు అనువైన టీవీ ది వాల్ అని చెప్పొచ్చు.
sony

సోనీ కొత్త ఫోన్..

జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ.. సీఈఎస్ 2018లో కొత్త ఫోన్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఎక్స్‌పీరియా సిరీస్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. మొబైల్ లవర్స్‌ను ఆకట్టుకొనే సరికొత్త ఫీచర్స్‌తో ఎక్స్‌పీరియా ఎల్2, ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ2, ఎక్స్‌పీరియా ఎఎక్స్‌ఏ2 అల్ట్రా మోడల్స్‌లో.. ఇవి అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
robot-dog

బెస్ట్ రోబో :

ఇప్పటి వరకు చాలా రోబోలను చూసుంటాం. భారీ ఎల్‌సీడీ ముఖాలు, భావావేశంతో కూడిన కండ్లు, వినూత్నమైన కదలికలతో కూడిన రోబోలను మరింత అప్‌డేటెడ్‌గా తయారు చేసేందుకు పోటీపడుతున్నాయి పలు కంపెనీలు. ఈ ఏడాది సోనీ కంపెనీ ఒక మనోహరమైన రోబో డాగ్‌ను సృష్టించింది. దీనికి ఐబోగా పేరు పెట్టారు. సెన్సార్స్, సర్వోస్‌లతో రూపొందిన ఈ రోబోడాగ్ కదలికలు, స్పందనలు.. అద్భుతం అనిపిస్తాయి. అందుకే సోనీ రూపొందించిన ఐబో రోబోడాగ్‌ను సీఈఎస్‌లో ది బెస్ట్ అనకుండా ఉండలేమంటున్నారు నిపుణులు.

208
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles