హైవేలపై ఆధునిక ఫుడ్‌కోర్ట్స్ దాబాలు


Thu,May 24, 2018 01:56 AM

రొటీన్‌కు భిన్నంగా వారాంతంలో బయట గడపాలని అనుకునేవాళ్ళకు దాబాలు చక్కటి వేదికలు. ఒకప్పుడు రవాణా రంగంలో పనిచేసేవారికి మాత్రమే అన్నట్టుగా ఉండే దాబాలు ఇప్పుడు సామాన్య జనాలను కూడా రా రమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఎన్నో వెరైటీ రుచులకు, ఆటవిడుపు సాయంత్రాలకు ఇవి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. తెలంగాణలోని ప్రధాన రహదారుల (హైవే)కు ఇరువైపులా ఎన్నో దాబాలున్నాయి. ఒకప్పుడు మద్యం కూడా లభించడంతో మహిళలు భోజనం చేయడానికి కొంత వెనుకాడేవారు. తెలంగాణ ప్రభుత్వం హైవేల పక్కన మద్యం అమ్మకాలను నిషేధించడంతో ప్రస్తుతం హైవేల పక్కనున్న దాబాలు ఫ్యామిలీస్‌తో కళకళలాడుతున్నాయి.
HOTEL
పూర్వకాలంలో బాటసారులకు భోజన, విశ్రాంతి సదుపాయాలు కల్పించడానికి పూటకూళ్ల ఇళ్లు ఉండేవి. ప్రస్తుత
కాలంలో ఆధునిక పూటకూళ్ల ఇళ్లుగా పక్కన దాబాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఆధునిక జీవనశైలికి అనుగుణంగా, సరికొత్త రుచుల సమ్మేళనంతో దాబాలు కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు దాబాలలో హైవేలపై దూరప్రాంతాలకు లారీలు, ట్రక్కుల వంటి వాహనాలు నడిపే డ్రైవర్లు మాత్రమే తినడానికి ఆసక్తి చూపేవారు. అయితే మారుతున్న కాలంలో కుటుంబాలతో సహా దాబాలకు వెళ్లి తినడం నయా ట్రెండ్‌గా మారింది. రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లో ఇలాంటి దాబాలు అనేకం ఉన్నాయి. అయితే ఇవి పూర్తి వెజ్‌కాగా రాజధాని నగరం నుండి జిల్లాలకు వెళ్లే హైవేలపై వివిధ రాష్ర్టాల వారు ఏర్పాటు చేసిన దాబాలెన్నో నాన్‌వెజ్ వంటలతో ఆకట్టుకుంటున్నాయి.

ఉత్తరాది నుంచి..

ఒకప్పుడు జాతీయ రహదార్ల పక్కన మాత్రమే దాబాలు ఉండేవి. హైవేలపై సుదూర ప్రాంతాలకు రేయింబవళ్ళు తిరిగే వాహనాల సిబ్బంది ఆకలి తీర్చేందుకు మాత్రమే ఇవి ఉపయోగపడేవి. మొదట్లో పంజాబ్ రాష్ర్టానికి చెందినవారు ఇటువంటి హోటళ్లను ప్రారంభించారు. ఉత్తరాది ప్రజలు స్థానిక భాషలో వీటిని దాబాలు అని పిలిచేవారు. తెలుగు రాష్ర్టాల్లో కూడా ఈ పేరే వీటికి స్థిరపడిపోయింది. అప్పట్లో పంజాబీలు ఎంతో ఇష్టంగా తినే రోటీలు, పుల్కాలు వంటివి, వాటికి కాంబినేషన్‌గా తడకా, రకరకాల కుర్మాలు లభించేవి. రాను రానూ తందూరీ వంటకాలు, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ వంటివి కూడా దాబాల్లో రాజ్యమేలుతున్నాయి. పంజాబీ, రాజస్థాన్ ప్రాంతాల వారు వారి ప్రాంతాల పేరుతోనే (పంజాబీ దాబా, రాజస్థాన్ దాబా) వీటిని ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు స్థానికులు కూడా దాబాలు ఏర్పాటు చేసి మన ప్రాంత వంటలు, బిర్యానీ, టిఫిన్లు విక్రయిస్తున్నారు.
CURRYS

భిన్న ప్రాంతాలు, విభిన్న రుచులు

పూర్వ దాబాలకు భిన్నంగా ఇప్పుడు దాబాల్లో వివిధ రాష్ర్టాల ప్రజల ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా వంటకాల తయారీ జరుగుతున్నది. దాంతో వాటిని ఆస్వాదించడానికి వచ్చే స్థానిక, స్థానికేతర ప్రజలతో అవి కళకళలాడుతున్నాయి. పగటి సమయాల్లో కన్నా సాయంత్రం నుంచీ రాత్రి పది, పదకొండు గంటల వరకూ నిత్యం రద్దీగా కన్పిస్తున్నాయి. రాత్రి పూట ప్రయాణం ట్రాఫిక్ లేకుండా సాగుతుందని భావించేవారు, సొంత వాహనాల్లో ప్రయాణం చేసేవారు తప్పకుండా దాబాల్లో భోజనం చేయాలని అనుకుంటున్నారు. హైదరాబాద్ నుండి రాజీవ్ రహదారి వెంట వెళ్లేవారు సిద్ధిపేటలో తప్పకుండా ఆగుతారు. ఇక్కడ రోడ్డుకిరువైపుల పదుల సంఖ్యలో దాబాలున్నాయి. అలాగే వరంగల్ రూట్, వికారాబాద్, నల్గొండ రహదారుల వెంట కూడా దాబాలు కనిపిస్తాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు కూడా భోజనం చేయడానికి దాబాల వద్దే బస్సులను ఆపుకొంటారు.

ఫ్యామిలీ దాబాలు

ఒకప్పుడు దాబాలు అంటే మద్యం, మాంసం అన్నట్లు ఉండేది. దీంతో ఫ్యామిలీతో భోజనం చేయడానికి మహిళలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. మద్యం అమ్మకాలను నియంత్రించడంతో పాటు నగరం లోపల కూడా దాబాల సంస్కృతి ప్రవేశించడంతో కుటుంబ సమేతంగా భోజనం చేయడానికి వీలుగా ఫ్యామిలీ దాబాలు రంగ ప్రవేశం చేశాయి. కొన్ని దాబాల్లో ప్రత్యేకంగా ఫ్యామిలీ సెక్షన్ కూడా ఏర్పాటు చేస్తుండడంతో వాటిని సందర్శకులు ఆశ్రయిస్తున్నారు.

మారుతున్న రూపురేఖలు

దాబాలకు పెరుగుతున్న ఆదరణతో రహదారి పక్కన కాకుండా పట్టణ, నగరాల మధ్యన, శివారు ప్రాంతాల్లో కూడా దాబాలు వెలుస్తున్నాయి. ఇవి రహదార్ల పక్కనున్న దాబాలకు కాస్తా భిన్నంగా ఉంటున్నాయి. రహదార్ల పక్కనున్న దాబాల్లో ఒకప్పడు నులక మంచాలే భోజన టేబుళ్లుగా ఉండేవి. ఇప్పుడవి ఇనుపతీగలతో అల్లిన మంచాలుగా మారితే, నగరాల్లో వెలసిన దాబాల్లో మాత్రం హోటళ్ల మాదిరిగా కుర్చీలు, ప్లాస్టిక్, టైల్స్‌తో తయారుచేసిన డైనింగ్ టేబుళ్లు ఉంటున్నాయి. వీటికి తోడు ఇంకా ఎన్నో ఆకర్షణలతో దాబాలను ఆధునీకరించడంతో వాటి రూపురేఖలు మారుతున్నాయి.
DHABA

విందులు, వినోదాలు

పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి వేడుకలను స్నేహితులు, సన్నిహితుల మధ్య జరుపుకోవడానికి చాలా మంది హోటళ్లను వేదికలుగా ఎంచుకుంటూ ఉంటారు. ఇటువంటివారు పట్టణాల్లోని హోటళ్ల కన్నా, దరిదాపుల్లో ఉన్న దాబాల్లో జరుపుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పట్టణాల్లోని హోటళ్లలోనైతే ఇలాంటివి జరుపుకోవడానికి అదనంగా సొమ్ము చెల్లించాలి. అదే దాబాల్లో అయితే అలాంటి ఖర్చులేమీ ఉండవు. కనుక వీటిని ఆశ్రయించేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నది. దీంతో స్టార్ హోటల్స్‌ను తలపించేలా ఇపుడు దాబాలు వసతులను కల్పిస్తున్నాయి. తోడు చక్కని రుచికరమైన మంచి ఆహారం లభిస్తుండడం కూడా దాబాలకు ఆదరణ పెరుగడానికి కారణం.

ఎన్నెన్నో రుచులు

పంజాబీల ప్రత్యేక వంటకాలైన సర్సన్ కా సాగ్ అండ్ మక్కీ ది రోటీ, తందూరి కుక్కడ్, పిండీ చోలే, కడీ పకోడి, పన్నీర్ మఖనీ, ఇమ్మర్తీ, ఫిర్నీ, కేసర్ కుల్ఫీ, బటర్ చికెన్, ఆలూ ద ప్రంత, రాజ్మా చావల్ వంటి వెరైటీ ఫుడ్ దాబాల్లోనే తినగలం. నూనె లేకుండా కాల్చే తందూరీ రోటీతో పనీర్ బట్టర్ మసాలానో, జింజర్ చికెనో నంజుకుంటూ తింటే ఆ మజా మరెక్కడా కనిపించదు. అదే విధంగా కబాబ్స్, టిక్కాలు ఇలా ఒకటేమిటి తందూరీ ఐటెమ్స్ రుచే వేరు. తందూరీ చికెన్, తందూరీ మటన్, ఫిష్ తందూరీ, తందూరీ, ఫ్రాన్స్, వెజిటేరియన్ వెరైటీలు... ఇలా రకరకాల వంటకాలు మంచి సువాసనలతో ఘుమఘుమలాడుతూ నోరూరిస్తుంటాయి.

1740
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles