హైదరాబాదే.. ఉత్తమం!


Sat,July 21, 2018 01:35 AM

NR-ALLURI
హైదరాబాద్‌లో నిర్మాణ రంగం అతివేగంగా అభివృద్ధి చెందుతుందని.. నేషనల్ క్యాపిటల్ రీజియన్, చన్నై వంటి మార్కెట్లు వృద్ధి చెందడానికి ఏడాదిన్నర నుంచి రెండేండ్లు పడుతుందని ఎన్‌సీసీ అర్బన్ ఎండీ నారాయణ రాజు అల్లూరి తెలిపారు. దేశీయ నిర్మాణ రంగంలో నెలకొన్న తాజా పరిస్థితులు, హైదరాబాద్ రియల్ మార్కెట్ స్థితిగతులపై నమస్తే సంపదకు ప్రత్యేక ఇంటర్వ్యూనిచ్చారు. దేశవ్యాప్త నిర్మాణ రంగంలో సరికొత్త మార్పులు సంతరించుకుంటున్నాయని, కొత్త తరహా డెవలపర్లు ఈ రంగంలో మరింత పారదర్శకత తీసుకొస్తారని అభిప్రాయ పడ్డారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే..

దేశంలో ఒక్క హైదరాబాద్ మినహా మిగతా నిర్మాణ రంగాల్లో స్తబ్దత నెలకొన్నది. ముంబై, పుణె, బెంగళూరు వంటి మార్కెట్లు క్రమక్రమంగా కోలుకుంటున్నాయి. చన్నై, నొయిడా వంటి ప్రాంతాల్లో అమ్మకాలు పెరగడానికి మరికొంత సమయం పడుతుంది. అక్కడ ఉన్న ఇండ్లను అమ్ముకోవడం మీదే డెవలపర్లు దృష్టి సారిస్తున్నారు. అందుకే, కొత్త ప్రాజెక్టులను పెద్దగా ఆవిష్కరించడం లేదు. మొత్తానికి, దేశీయ నిర్మాణ రంగం గతంతో పోల్చితే మరింత బలోపేతం అయ్యేందుకు అడుగులు ముందుకేస్తున్నది. ఇప్పటివరకూ మార్కెట్లో చిన్నాచితకా నిర్మాణ సంస్థలుండేవి. అందులో కొంతమందిలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. ఇప్పుడు ఇలాంటివారిలో కొందరు ఒక బృందంగా ఏర్పడి కొత్త ప్రాజెక్టులను చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇక రానున్న రోజుల్లో డెవలపర్లలో చిన్నాపెద్ద అనే తేడా ఉండదు. కట్టే ఫ్లాట్ల సైజులతో సంబంధం లేకుండా ఆర్థిక క్రమశిక్షణ లేనివారు మాత్రమే ఈ మార్కెట్ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.

-ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే కేంద్రం ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం నిర్మాణాల్ని చేపట్టలేరు. ఎందుకంటే, కొనుగోలుదారుల నుంచి వసూలు చేసే సొమ్ములో సుమారు డెబ్బయ్ శాతాన్ని ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలి. ఆ సొమ్మును ముట్టుకోవడానికి చట్టం అంగీకరించదు. నిబంధనల్ని పాటించని డెవలపర్లపై న్యాయస్థానం కఠినమైన శిక్షల్ని విధించే ప్రమాదముంది. పైగా, సోషల్ మీడియా ఎంతో చురుకైంది. పొరపాటున డెవలపర్ చిన్న తప్పు చేసినా, అది ప్రజల్లోకి ఇట్టే వెళ్లిపోతుంది. అందుకే, బడా సంస్థలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయినా, గతంలో మాదిరిగా 25, 30 శాతం లాభం ప్రస్తుతం డెవలపర్లకు గిట్టుబాటు కావడం లేదు. కొన్నేండ్ల నుంచి ఈ రంగాన్ని నమ్ముకున్నవారే లాభనష్టాలతో సంబంధం లేకుండా ఫ్లాట్లను కొంటున్నారు. ప్రాజెక్టులు ఎంత ఆలస్యమైతే డెవలపర్లకు అంత ప్రయోజనం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎంత వేగంగా పూర్తి చేస్తే అంత లాభముంటుందని మర్చిపోవద్దు.

-నిర్మాణ రంగంపై 20, 30 ఏండ్ల నుంచి అవగాహన ఉన్నవారిలో కొందరు.. ఏదో ఒక తప్పును వెతకడానికి ప్రయత్నిస్తారు. అదే, ఈ రంగంలోకి వచ్చిన కొత్తతరం డెవలపర్లు చట్టాన్ని పూర్తి స్థాయిలో గౌరవించే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో కొన్ని ప్రాజెక్టులు ఆలస్యమయ్యే అవకాశముంది. ఈ విషయాన్ని కొనుగోలుదారులకు అర్థమయ్యేలా చెప్పడంలో నవతరం బిల్డర్లు విజయవంతం అవుతున్నారు. ఈ రంగాన్ని పూర్తి స్థాయిలో శుద్ధి చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే, నిర్మాణ రంగానికి సర్జరీ చేసింది. కాకపోతే, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది.

జీఎస్టీ భారమే..

నిర్మాణ రంగానికి జీఎస్టీ అతిపెద్ద అవరోధంగా మారింది. ఇల్లు కొనుగోలు చేయడం మధ్యతరగతి వేతనజీవులకు ఖరీదైన వ్యవహారమైంది. నిర్మాణంలో ఉన్న ఫ్లాటు కొనాలంటే పన్నెండు శాతం జీఎస్టీ కట్టాల్సిన పరిస్థితి. ఈ అంశంలో కేంద్రం పునరాలోచించాల్సిన అవసరముంది. ఈ విషయాన్ని క్రెడాయ్ సంస్థ అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అందుకే, అందుబాటు గృహాలపై కొంతమేరకు రాయితీని ప్రకటించింది. పీఎంఏవై పథకంలో భాగంగా ఇండ్లను కొనేవారు ఎనిమిది శాతం జీఎస్టీ కడితే సరిపోతుంది. ఇతరులు మాత్రం యధావిధిగా 12 శాతం కట్టాల్సిందే. రెరా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాకే, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు నివాస సముదాయాల్లో పెట్టుబడుల్ని పెట్టేందుకు ముందుకొస్తాయనే విషయం మర్చిపోవద్దు.

529
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles