స్పాండిలోసిస్‌తో.. వెన్నులో వణుకు!


Mon,August 27, 2018 11:35 PM

మానవ శరీరంలో అత్యంత కీలకమైనది వెన్నెముక. దీని నిర్మాణం చాలా సంక్లిష్టమైనది. మెదడు నుంచి వెలువడే వెన్నుపామును నిరంతరం కాపాడుతూ.. శరీర కదలికలన్నింటికీ సహకరిస్తుంది. అంతిమంగా ఇది శరీరం మొత్తానికే ఒక మూలస్థంభంగా పనిచేస్తుంది. అలాంటి వెన్నెముకకు సమస్య వస్తే? ఆ సమస్య వెన్నెముక డిస్క్‌లకు సంబంధించినది అయితే.. ఇక ఆ నొప్పి మాటల్లో వర్ణించలేనిది!
spondylosis
వెన్నెముక డిస్కు సమస్యలు చాలామందికి ఒక సమస్యగా మారాయి. ఒకచోట కూర్చోలేరు.. నిల్చోలేరు.. ఏపనీ చేసుకోలేరు. మృదువైన వెన్నెముక నుంచి వచ్చే ఈ కఠోర నొప్పికి కారణాలు చాలా రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా వాహన ప్రయాణం వల్ల ఇటీవలి కాలంలో డిస్కు సమస్యలు ఎక్కువవుతన్నాయి. వెన్నెముక డిస్కు సమస్యలో తీవ్రమైనది స్పాండిలోసిస్.


ఏమిటీ స్పాండిలోసిస్?

వెన్నెముకలో ఉండే ఎముకలను వెన్నుపూసలు అంటారు. వీటిమధ్య రబ్బరు లాంటి మృదువైన కండరం ఉంటుంది. దీనిని డిస్క్ అంటారు. వెన్నుముక ఎముకకు ముందుభాగంలో అనవసరమైన ఎముక ఏర్పడుతుంది. దీనివల్ల నరాలు బయటకు రావడానికి ఉన్న ద్వారాల పరిమాణం తగ్గిపోయి డిస్కులు, ఫేసెట్ జాయింట్లలోని మృదులాస్థి క్షీణతకు గురవుతుంది. దీనినే స్పాండిలోసిస్ అంటారు. సాధారణంగా స్పాండిలోసిస్ సమస్యలు అందరిలోనూ కనిపిస్తుంటాయి. కాకపోతే దీనికి ఓ నిర్దిష్టమైన వయసు ఉంటుంది. 40 ఏళ్లు దాటినవారిలోనే ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు 20 ఏళ్ల వారిలోనూ.. 30 ఏళ్ల వారిలోనూ ఈ సమస్యలు కనిపిస్తున్నాయి.


కారణాలేంటి?

ఒకే భంగిమలో ఎక్కు సమయం కూర్చోవడం, ద్విచక్ర వాహనాలపై ఎక్కువ దూరం పయనించడం, కంప్యూటర్ల పైన రోజంతా పనిచేయడం, ఎత్తయిన దిండ్లు వాడటం, ఎక్కువ సేపు మెడను ఒక పక్కకు వంచి ఉంచడం వంటి కారణాల వల్ల మెడనొప్పిఎక్కువవుతుంది. జన్యు కారణాల వల్ల కూడా డిస్క్‌లు అరిగిపోతాయి. ఇవన్నీ సహజంగా జరిగేవి. వాహనాల్లో వెళ్లేటప్పుడు గుంతలు.. ఎగుడు దిగుడు రోడ్లు.. స్పీడ్ బ్రేకర్‌లలో ఎత్తేయడం వల్ల ఈ డిస్క్‌ల్లో సమస్యలు వస్తాయి.


ఎలా జరుగుతుంది?

వెన్నెముకలోని రెండు పూసల మధ్య డిస్కులు ఉంటాయి. వాటి వెనుక భాగంలో ఫేసెట్ జాయింట్లు ఉంటాయి. వీటిలోని మృధులాస్తి వెన్నెముకకు సంబంధించిన అన్ని కదలికలకూ సహకరిస్తూ, ఒత్తిడికి తట్టుకునే షాక్ ఆబ్‌సార్బర్‌లుగా పనిచేస్తాయి. వీటి చుట్టూ ఉండే కండరాలు, లిగమెంట్లు, టెండాన్లు కీళ్లను దృఢంగా ఉంచుతాయి. వెన్పుపాము ప్రయాణించేటప్పుడు డిస్కులు లేదా ఫేసెట్ జాయింట్లు క్షీణతకు గురై వెన్నెముకలో కొన్ని మార్పులు ఏర్పడుతాయి. నొప్పి కలుగుతుంది. కదలికలు కష్టమవుతాయి. ఇలాం టి సమస్యల వల్ల అవయవాల పనితీరు దెబ్బతిని నొప్పి మొదలవుతుంది.


spondylosis2

వ్యాధి లక్షణాలు

డిస్కుల్లో జరిగే చర్యల వల్ల నరాలు ఒత్తిడికి గురై నడు ము నొప్పి, మెడనొప్పి, చే తుల్లో నొప్పులు, కాళ్లలో తిమ్మిర్లు, కాళ్లలో మంటలు ఏర్పడుతాయి. స్పాండిలోసిస్ వల్ల చేతుల్లో వచ్చే నొప్పులను రాడిక్యులోపతీ అంటారు. అయితే క్షీణతకు గురైన ప్రాంతాన్ని బట్టి, ఈ సమస్యను సర్వైకల్ స్పాండిలోసిస్, థొరాసిక్ స్పాండిలోసిస్, లుంబార్, సాక్రల్ స్పాండిలోసిస్ అంటారు. వీటన్నిటిలోకెల్లా సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబార్ స్పాండిలోసిస్ సమస్యలు ఎక్కువ మందిలో కనిపిస్తాయి.


సర్వైకల్

మెడనొప్పి సాధారణం నుంచి తీవ్రస్థాయికి చేరడం, నొప్పి భుజాలతో పాటు, చేతులకు , వేళ్లకు పాకడం, మెడ బిగుసుకుపోవడం, కదలిక లు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు మెడ నరాల మీద ఒత్తిడిపడటం వల్ల చేతులు బలహీనపడటం, పట్టుకోల్పోవడం, తిమ్మిర్లు, మొ ద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు తలనొప్పి, కళ్లు తిరగడం, వికారం, వాంతులు కావ డం వంటి లక్షణాలను కూడా గమనించవచ్చు.


లుంబార్

నడుము నొప్పి, ఉదయాన్నే నడుము బిగుసుకుపోవడం, నొప్పి నడుమునుంచి పిరుదులకు, కాళ్లవరకు వ్యాపించడం, నడుము భాగంలోని నరాలపై ఒత్తిడి పడటం వల్ల కాళ్లల్లో తిమ్మిర్లు, మొద్దుబారడం, నడకలో బ్యాలెన్స్ తప్పడం, మలమూత్రాల విసర్జన పై నియంత్రణ కోల్పోవడంతో పాటు సయాటికా లక్షణాలను కూడా గమనించవచ్చు. ఎవరికైనా వెన్నెముకలో దీర్ఘకాలిక నొప్పి, కారణంగా జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అవి క్షయ లేదా క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.


ఎలాంటి పరీక్షలు?

సీబీపీ, ఎక్స్‌రే, సి.టీ స్కాన్, ఎంఆర్‌ఐ, హెచ్‌ఎల్‌ఏబి 27 పరీక్షలు చేస్తారు. ఎలాంటి ఆపరేషన్లు లేకుండా జాగ్రత్తల ద్వారా 80% స్పాండిలోసిస్‌ను నయం చేయొచ్చు. 10% మందికి ఇంజెక్షన్స్ ద్వారా నయం చేయొచ్చు. ఈ ఇంజక్షన్లను ఎపిడ్యూరల్ ఇంజక్షన్స్, రూట్‌బ్లాక్స్ అంటారు. 10% మందికి మాత్రమే ఆపరేషన్స్ ద్వారా నయం చేయొచ్చు. కాళ్లు, చేతులు బలహీనంగా ఉన్నవాళ్లు.. భరించరాని నొప్పి ఉన్నవాళ్లు.. మూత్రం అప్రయత్నంగా లీక్ అవడం.. వంటి లక్షణాలున్నవారికి ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఇవిలేనివాళ్లకు పిజియోథెరపీ, మెడిసిన్స్ వల్ల నయం అవుతుంది.


చేయాల్సిన చికిత్సలు

మినిమల్లీ స్పైన్ సర్జరీ. ఎక్కువ కండరాలు డామేజ్ కాకుండా చిన్న రంధ్రం చేసి ఈ చికిత్స చేస్తారు. ఇది కాకుండా ఎండోస్కోపీ సర్జరీ, మైక్రోస్కోపిక్ సర్జరీ చేస్తారు. కొంతమందికి ఎముకలు ఎక్కువగా కరిగితే స్క్రూలు, రాడ్స్ వేస్తారు. వీటిని స్పైనల్ ఫ్యూజన్ సర్జరీ అంటారు. మెడలో అయితే డిస్క్ రీప్లేస్ చేస్తారు. కానీ నడుములో రీప్లేస్ చేయడం లేదు. 90-95% ఈ సర్జరీలు సురక్షితం.


చికిత్స అనంతర జాగ్రత్తలు

ఇది పూర్తిగా జీవనశైలికి సంబంధించిన సమస్య. దీనిని సక్రమ పద్ధతిలో పెట్టుకుంటే స్పాండిలోసిస్‌ను స్పాంటేనియస్‌గా తగ్గించొచ్చు. బరువు పెరగకుండా చూసుకోవాలి. నడుము మీద బరువు పడే పని చేయొద్దు. కంప్యూటర్ల ముందు పనిచేసేవాళ్లు ప్రతీ 30 నిమిషాలకు ఒకసారి లేచి చిన్నపాటి వ్యాయామం చేయాలి. పొగతాగడం ఆపేయాలి. షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు కంట్రోల్‌లో పెట్టుకోవాలి. బరువులు ఎత్తకూడదు.
shyam-sundar

307
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles