స్ట్రెస్ రిలీఫ్-14


Fri,May 3, 2013 12:19 PM

ఆఫీస్‌లో గంటల తరబడి పనిచేస్తుంటారు చాలామంది. ముఖ్యంగా కంప్యూటర్ వర్క్ చేసేవాళ్లు ఎక్కువ సమయం ఒకే స్థితిలో కూర్చొని ఉండాల్సి వస్తుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఆసనాలు చాలా ఉపయోగపడతాయి.

medaexerమెడ ఎక్సర్‌సైజులు
-సుఖాసనంలో కానీ, వజ్రాసనంలోకానీ కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి పీల్చుకుని తల కుడివైపుకు తీసుకెళ్లాలి. మళ్లీ గాలి వదులుతూ యథాస్థానానికి తీసుకురావాలి. ఇలా వెనక్కి 10 సార్లు చేయాలి. ఇదేవిధంగా ఎడమవైపు కూడా 10 సార్లు చేయాలి.
-ఇప్పుడు నెమ్మదిగా గాలి పీల్చుకుని తలను పైకెత్తి వెనక్కి వంచాలి. మళ్లీ గాలి వదులుతూ యథాస్థానానికి తీసుకురావాలి. ఇలా పదిసార్లు చేయాలి. ఇలా ముందుకు కూడా చేయాలి. ఏ విధమైన జర్కులు లేకుండా నెమ్మదిగా చేయాలి. (స్పాండిలైటిస్ ఉన్నవారు మాత్రం తలను చుబుకాన్ని ఛాతికి దగ్గరగా తీసుకురాకూడదు.)
- గాలి పీల్చుకుని నెమ్మదిగా తలను కుడివైపుగా వీలైనంత వెనక్కి తిప్పాలి. శరీరం కదలకూడదు. కేవలం తలను మాత్రమే వెనక్కి తిప్పాలి. తిరిగి గాలి వదులుతూ తలను యథాస్థానానికి తీసుకురావాలి. ఇలా ఐదుసార్లు చేయాలి. తిరిగి ఎడమవైపుకు కూడా ఐదుసార్లు చేయాలి. గాలి మామూలుగా తీసుకోవాలి.
-గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా తలను కుడి భుజం వైపు వంచాలి. గాలి వదులుతూ తిరిగి తలను యథాస్థానానికి తీసుకురావాలి. ఇలా ఐదుసార్లు చేయాలి. తిరిగి ఎడమభుజం వైపు కూడా ఐదుసార్లు చేయాలి.

urdvahasanamఊర్థ్వహస్తాసనం
నిటారుగా నిల్చోవాలి. రెండు చేతులు శరీరానికి రెండు పక్కలా ఉంచాలి. పాదాలు రెండు దగ్గరగా పెట్టాలి. ఇప్పుడు గాలి పీల్చుకుంటా రెండు చేతులను జతచేసి తలపైకి తీసుకెళ్ళాలి. చేతులను పైకి లాగినట్లుగా కొద్దిసేపు ఉంచి, గాలి పీల్చుకుంటూ సాధారణ స్థితికి రావాలి. ఇదే విధంగా పది సార్లు రిపీట్ చేయాలి.

ఉపయోగాలు
- భుజాలు మంచి ఆకృతిని సంతరించుకుంటాయి.
- శరీరపు ఊర్థ్వభాగానికి మంచిది.

padahasanamహస్తపాదాసనం
సూర్యనమస్కారంలో మూడో ఆసనం హస్తపాదాసనం. ముందు సులభమైన పద్ధతిలో ప్రయత్నించాక ఈ అడ్వాన్స్‌డ్ ఆసనాన్ని ప్రయత్నించొచ్చు. రెండు పాదాలు దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడాలి. గాలి పీల్చుకుంటూ రెండు చేతులను పైకి తీసుకెళ్లాలి. గాలిని నెమ్మదిగా వదులుతూ చేతులను ముందుకు... పాదాలవైపు తీసుకురావాలి. మొదట్లో పాదాలవరకూ రాకున్నా... ఎంతవరకు చేతులు వస్తే అంతవరకూ తెచ్చి, గాలిని వదిలేస్తూ ఈ స్థితిలో కొద్దిసేపు ఉండాలి. ప్రాక్టీస్ ఎక్కువయ్యే కొద్దీ.. రెండు చేతులు పాదాల పక్కగా వస్తాయి. అరచేతులు పాదాల పక్కగా నేలను ఆనేట్లుగా ఉంచాలి. మోకాళ్ల మధ్యకు తలను తీసుకురావాలి. గాలి మొత్తం వదిలి ఆరు సెకన్ల పాటు ఇదే స్థితిలో ఉండాలి.
నిలబడి చేయలేనివాళ్లు ఇలా కుర్చీలో కూర్చుని కూడా ఈ ఆసనాన్ని చేసి అవే ప్రయోజనాలను పొందవచ్చు.

ఉపయోగాలు
- వెన్నెముకను ముందుకు వంచడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
- పొట్టకు సంబంధించిన రుగ్మతలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి.
- ఛాతి భాగం, చేతులు శక్తివంతమవుతాయి.
- పొట్టను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.
- వెన్నెముకకు సంబంధించిన నరాలన్నింటిని ఉత్తేజితం చేస్తుంది.
-ముఖానికి రక్త ప్రసరణ పెరగడం వల్ల ముఖం కాంతివంతమవుతుంది.
‘ఓం సూర్యాయ నమః’ అని ఉచ్ఛరిస్తూ ఈ ఆసనం చేయాలి.

సంగీత అంకత
యోగా ట్రైనర్, బ్యూటీ ఎక్స్‌పర్ట్, 9705665266

2559
Tags

More News

VIRAL NEWS