సొరియాసిస్.. అంటువ్యాధా?


Wed,December 9, 2015 12:30 AM

సొరియాసిస్ చర్మ సంబంధమైన ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనివల్ల రోగి చర్మం పై పొర పొలుసులుగా రాలిపోతుంది. అందువల్ల దీన్ని పొలుసుల వ్యాధి అని కూడా అంటారు. మన శరీరంలో ఏ భాగానికైనా ఈ వ్యాధి రావొచ్చు. ముఖ్యంగా తల, చేతులు, కాళ్లు, పాదాలకు వస్తుంది. మొదటగా చర్మం ఎర్రగా, దురదతో మొదలై క్రమేపి తెలుపు రంగులో మెరుస్తూ చర్మం పై పొర పొలుసులు పొలుసులుగా రాలిపోతుంది. అరిచేతులు, అరికాళ్లలో ఈ వ్యాధి వస్తే బొబ్బలు, పగుళ్లు ఏర్పడతాయి. తలకి సోకితే పొట్టు రాలిపోవడంతో పాటు, జుట్టు కూడా విపరీతంగా రాలిపోతుంది. వ్యాధి తీవ్రంగా ఉంటే కీళ్లపై ప్రభావం చూపించి, నొప్పులు మొదలవుతాయి. దీన్నే సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. గోళ్లు పటుత్వాన్ని కోల్పోయి, సులువుగా విరిగిపోతాయి. సొరియాసిస్ వల్ల కీళ్లవాపు, కీళ్లనొప్పులు మొదలై సొరియాటిక్ ఆర్థరైటిస్ దీర్ఘకాలిక సమస్యగా వేధిస్తుంది.

కారణాలు


సొరియాసిస్ ఏ వయసులోనైనా రావొచ్చు. మానసిక ఒత్తిడి వల్ల లేదా జన్యుపరమైన కారణాల వల్ల కలుగవచ్చు. రోగనిరోధక శక్తిలో కలిగే మార్పులు, దీర్ఘకాలికంగా మలేరియా మందులు వాడడం వల్ల, గాయాలు, చర్మం పరిశుభ్రంగా లేకపోవడం వల్ల వస్తుంది.

రకాలు


సొరియాసిస్‌లో పలు రకాలున్నాయి.
-గట్టేట్ సొరియాసిస్ : చిన్న చిన్న ఎర్రని మచ్చలు చర్మంపై ఏర్పడతాయి. నీటిబొట్ట లాంటి చిన్న వ్రణాలు కూడా వస్తాయి. కాళ్లు, ముఖం, తల మీద కనిపిస్తుంది. ఎక్కువ ఒత్తిడి, గాయాలు తగిలినప్పుడు వస్తుంది.
-ప్లేక్ సొరియాసిస్ : జన్యుపరంగా సంక్రమించవచ్చు. లేదా ఒత్తిడి, ఇతర కారణాల వల్ల రావొచ్చు. 80 శాతం మంది ఈ సొరియాసిస్‌తో బాధపడుతున్నారు. మోచేతులు, మోకాళ్లు, తల, వీపుపై కనిపిస్తుంది. మందమైన ఎర్రని మచ్చలు ఏర్పడతాయి. వీటితో పాటు వెండి లేదా తెలుపు రంగులో పొలుసులుంటాయి.
-ఇన్‌వర్మ్ సొరియాసిస్ : చర్మం ముడతలు పడిన భాగాల్లో అనగా చంకలు, గజ్జలు, రొమ్ము కింది భాగంలో ఎక్కువగా వస్తుంది. ఈ భాగాల్లో చర్మం నున్నగా, ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. చెమట, తేమ వల్ల ఇన్‌వర్మ్ సొరియాసిస్ వస్తుంది. చర్మం పై పొర పొలుసులుగా రాలిపోతుంది.
-పస్టులార్ సొరియాసిస్ : ఎర్రని చర్మం చుట్టూ తెల్లని, చిక్కటి పదార్థంతో కూడిన బొబ్బలు ఏర్పడతాయి.
-పామోప్లాంటార్ సొరియాసిస్ : అరిచేతులు, అరికాళ్లకు ఎక్కువగా వస్తుంది. ఈ భాగాల్లో చర్మం మందంగా, పొడిగా, ఎర్రగా ఉంటుంది. పగుళ్లు ఏర్పడి నొప్పి ఉంటుంది.
-స్కాల్ప్ సొరియాసిస్ : తల మీద మొదలై నుదుటి పైకి, మెడ వెనుక భాగంలోకి, చెవుల వెనుక వస్తుంది. తల పైన మందమైన, పెద్ద పుండ్లు ఏర్పడతాయి. దురద ఎక్కువగా ఉంటుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఎర్రని ఎగుడుదిగుడుగా మచ్చలు, వెండి లేదా తెలుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. చుండ్రు పెచ్చులు పెచ్చులుగా రాలిపోతుంది. పొడిగా, దురదగా ఉంటుంది. మంట కూడా ఉంటుంది.
-నెయిల్ సొరియాసిస్ : గోళ్లకి వస్తుంది. గోళ్లపై గుంతలు ఏర్పడి, నొప్పిగా ఉంటుంది. గోళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. సుద్ద వంటి పదార్థం గోళ్ల కింది భాగంలో ఏర్పడుతుంది.
అపోహలు - వాస్తవాలు
-అంటువ్యాధా? : సొరియాసిస్ అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి సోకదు. చలికాలంలో ఈ వ్యాధి సోకుతుందని అనుకుంటారు గాని ఏ కాలంలోనైనా వస్తుంది. కాకపోతే చలికాలంలో దీని తీవ్రత పెరుగుతుంది.
-ఏం తినాలి? : కొన్ని రకాల ఆహారపదార్థాలు తినకూడదని అనుకుంటారు గాని అలాంటిదేమీ ఉండదు. అన్నీ తినవచ్చు. పౌష్టికాహారం తీసుకోవాలి. అయితే అవిసె గింజలు ఎక్కువగా తీసుకుంటే మంచిది.

నివారణ


తీవ్రతను బట్టి సరైన మార్గంలో చికిత్స మొదలుపెడితే దీన్ని నివారించవచ్చు. దీర్ఘకాలిక సమస్య కాబట్టి నివారణకు కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా మొదట వ్యక్తి ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా, ప్రశాంతంగా ఉండాలి. విశ్రాంతి అవసరం. చర్మ శుభ్రత పాటించడం, గాయాల పాలవకుండా జాగ్రత్తపడడం, చర్మం పొడిబారకుండా తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి.

హోమియో చికిత్స


srikanth


ప్రకృతి నియమాలపై ఆధారపడిన హోమియోపతి వైద్య విధానంతో రోగి వ్యాధి లక్షణాలు, వంశపారంపర్యంతో, రోగి శారీరక, మానసిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ పద్ధతిలో చేసే హోమియో చికిత్స మంచి ఫలితాలను ఇస్తుంది. ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా వ్యాధిని సంపూర్ణంగా నయం చేస్తుంది.

1988
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles