సైనస్ ఉంటే ఆస్తమా వస్తుందా?


Sat,November 24, 2018 12:17 AM

నా వయసు 38 సంవత్సరాలు. నాకు వారం పది రోజుల నుంచి గాలి పీల్చుకోకుండా ముక్కు మూసుకుపోతున్నది. దీని ప్రభావం చెవులపై కూడా కనిపిస్తున్నది. చెవులు దిబ్బటేసిన్టలే అవుతాయి. నాకు చన్నీటి స్నానం పడదు. అందుకే వారానికి రెండు మూడుసార్లు మాత్రమే తలస్నానం చేస్తాను. ఇది సైనెసైటిస్ సమస్యా? సైనస్‌కు.. ఆస్తమాకు ఏమైనా సంబంధం ఉందా? ఆస్తమాను ఎలా నిర్ధారించవచ్చు? దయచేసి తెలుపగలరు.
- సునీల్‌రెడ్డి, నాగర్‌కర్నూల్
Councelling
సునీల్‌రెడ్డి గారూ.. ఈ సమస్య ప్రతీ సీజన్‌లో ఉంటుందా? ఈ వారం పదిరోజుల నుంచే ఏర్పడిందా? అనే విషయం తెలుపలేదు. కొంతమందికి చలికాలం రాగానే ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. మీకూ అలా ఉందా? అనేది స్పష్టంగా తెలియజేయాల్సి ఉంది. ఒకవేళ మీది వారం పదిరోజుల నుంచి ఇబ్బందికి గురిచేస్తున్న సమస్య అయితే సమస్య ఏమీ లేనట్టు. సాధారణంగా చలికాలం వచ్చిందంటే గాలి పీల్చుకోకుండా ముక్కులు మూసుకొని పోవడానికి కారణం ముక్కులో ఇరువైపుల ఉండే మాంసం (టర్బినేట్స్) పరిమాణం పెరుగడం. ఈ టర్బినేట్స్ పరిమాణం పెరుగడానికి మామూలుగా ఎలర్జీ కారణం. లేదా దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కావచ్చు. సహజంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతర్గతంగా ముక్కు, చెవులు యూస్టేషియన్ ట్యూబ్ అనే సన్నని గొట్టం ద్వారా కలుపబడి ఉంటాయి. మామూలుగా ముక్కు నుంచి ఈ యూస్టేసిషియన్ ట్యూబ్ ద్వారా చెవులకు గాలి వెళుతుంది. అలా వెళితేనే చెవుల వినికిడి మామూలుగా ఉంటుంది. ముక్కులు మూసుకొని పోయినప్పుడు గాలి చెవులను చేరక దిబ్బడ పడుతాయి. ఈ సమస్య ఉన్నవాళ్లు చల్లని నీళ్లతో స్నానం చేసినా, చల్లని పానీయాలు సేవించినా, చల్లని వాతావరణంలో ఉన్నా సమస్య తీవ్రత ఎక్కువగా అవుతుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెవి-ముక్కు-గొంతు నిపుణులను సంప్రదించాలి. అన్ని రకాల పరీక్షలు చేసి మీ సమస్య ఏంటో డాక్టర్లు తెలుపుతారు.

ఎలర్జీ లేదా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ లేదా ఇంకా ఇతర కారణాలు ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన ఏ చికిత్స తీసుకోవాలో డాక్టర్లు సూచిస్తారు. ఒక్కోసారి ఆపరేషన్‌చేసి టర్బినేట్స్ పరిమాణం తగ్గించాల్సి వస్తుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు చలికాలంలో తరుచుగా గోరువెచ్చగా ఉండే పానీయాలు తీసుకోవాలి. ఇంట్లో వాతావరణం వెచ్చగా ఉంచుకోవాలి. వేడి నీళ్లతో స్నానం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎలర్జీ ఉన్నవాళ్లు కొంతమంది ఆస్తమా బారినపడే ప్రమాదం కూడా ఉంది. ఆస్తమా ఉన్నవాళ్లలో శ్వాసనాళాలు కుంచించుకొనిపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఎలర్జీ అనేది ముక్కుకు సంబంధించిన సమస్య. చెవి, ముక్కు, గొంతు నిపుణులు చూడాల్సిన విషయం. ఆస్తమా అనేది శ్వాస నాళాలకు సంబంధించిన విషయం ఇది ఛాతి వైద్యులు సమస్య ఏంటో నిర్ధారిస్తారు. కాబట్టి మీరు ఏ మాత్రం దిగులు చెందకుండా ముందుగా చెవి-ముక్కు-గొంతు వైద్యులను సంప్రదించండి. వారు సూచించే జాగ్రత్తలు.. చికిత్సను బట్టి మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీ సందేహం అది ఆస్తమా అయితే అనే కదా? అది కూడా నివృత్తి చేసుకునేందుకు ఛాతి వైద్య నిపుణులను కలువాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండి సమస్యలను పరిష్కరించుకోండి. దీనికి తోడు మంచి జీవనశైలిని అలవర్చుకోండి. చలి పడడం లేదు అనే విషయం స్పష్టంగా తెలుస్తున్నది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లని పానీయాలు తీసుకోవద్దు. చలికి బయటకు వెళ్లాల్సి వస్తే చలి నియంత్రకాలు వాడాలి. ఆహార పదార్థాలు వేడివేడివి తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆల్ ది బెస్ట్!
డాక్టర్ రవిశంకర్
చెవి-ముక్కు-గొంతు నిపుణులు
గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్, కోఠి

854
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles