సేవింగ్స్‌కిదే సరైన సమయం


Sat,August 11, 2018 01:24 AM

వ్యక్తికైనా.. వ్యవస్థకైనా సేవింగ్స్ అనేది తప్పనిసరి. పొదుపుతో ప్రతీ ఒక్కరి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అలాంటి పొదుపునకు ఇదే సరైన సమయం. పొదుపు నిర్ణయాలను తీసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. ఎందుకంటే మంచి పని చేయడానికి అన్నీ శుభముహూర్తాలే. పొదుపునకు ఇప్పుడు అనేది ఎల్లప్పుడూ చక్కగా సరిపోయే మాట. నిజానికి చాలామంది తమ ఖర్చులు, అవసరాల తర్వాత పొదుపు, పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. వారికి ఏం కావాలన్న దానిపై ఓ స్పష్టమైన అవగాహన ఉన్నాసరే ఇదే తీరుతో ముందుకెళ్తూంటారు. దీనివల్ల అనుకోని ఖర్చులు పెరుగుతూపోతుంటాయి. ఫలితంగా పొదుపు లక్ష్యాలు దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. అయితే పొదుపునకు సంబంధించి ఈ అంశాలపట్ల మీరు అవగాహన ఏర్పరుచుకుంటే.. వీటిని మీరు పరిగణనలోకి తీసుకుంటే.. నిర్ణయాలను వేగంగా తీసుకోవచ్చు. సమస్యలనూ జయించవచ్చు.
MONEY
ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. పొదుపు, పెట్టుబడుల విషయంలో ఇది అక్షరాల సత్యం. కష్టార్జితాన్ని పదింతలు చేసుకోవాలని ఎవరికుండదు. అయితే అత్యాశకుపోయి కనిపించిన దానిపైనల్లా పెట్టుబడులు పెట్టేయడమూ సరికాదు. మనం పెట్టిన పెట్టుబడి, దాచిన ప్రతీ రూపాయికీ ఆకర్షణీయమైన ప్రతిఫలం దక్కాలంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అంతకంటే ముందు మనం చేసే ఈ పనిపై ఆసక్తి ఉండాలి. చిత్తశుద్ధిలేని చర్యలు, నిర్ణయాలు ఎప్పటికీ విజయాన్ని ఇవ్వలేవు. ప్రతీది ఇష్టంతో చేస్తే కష్టం తెలియకుండా పోతుంది. పొదుపు, పెట్టుబడుల విషయంలోనూ ఇంతే. ఆసక్తితో అన్వేషిస్తే మెరుగైన మార్గాలు కనిపిస్తాయి. వాటి ఉద్దేశాలూ మనకు కావాల్సినంత లాభాల్ని తెచ్చిపెడుతాయి. కాబట్టి అశ్రద్ధ తగదు. ఉత్సాహంగా ఉండాలి.

కాలం..

కాలం అత్యంత విలువైనది. అవసరం కూడా అంతే. పొదుపు విషయంలో ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిది. చాలాసార్లు ఆలస్యం చేసినకొద్దీ మనకు చేకూరాల్సిన ప్రతిఫలం ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు. అందుకే ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా ఆలోచించి ఎక్కడ పెట్టుబడి పెడితే, ఎలా పొదుపు చేస్తే లాభిస్తుందన్నది తెలుసుకోవడం అత్యుత్తమం. కొన్ని పథకాలు ఆకర్షణీయమైన రాబడులనిస్తాయి. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ఉంటాయి. పిల్లలు, పెద్దల అవసరాలకు వీలుగా ఏ వయసులో మన పొదుపు ఫలితాలు దక్కుతాయో చూసుకోవాలి. తద్వారా భవిష్యత్ లక్ష్యాలను అలవోకగా చేరుకునేలా చూసుకోవాలి. సాధారణంగా యుక్త వయసులో ఉన్నప్పుడే పొదుపుపై దృష్టి సారించడం మంచిది. దీనివల్ల పొదుపు కోసం వెచ్చించే ధనం తక్కువవుతుంది. అలాగే రేపటి రోజున అందే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.

అత్యవసర నిధి

ఇది అందరికీ చాలా ముఖ్యమైనది. కష్టాలు చుట్టుముట్టినప్పుడు మనల్ని బయటపడేసేలా ఓ అత్యవసర ద్వారం ఉండటం ఎప్పటికైనా మంచిది. ప్రధానంగా ఆర్థికపరమైన సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఈ తరహా నిధి కోసం ప్రణాళిక వేసుకోవడం ఎంతో తెలివైన పని. ఏ దిక్కూ తోచనప్పుడు మాత్రమే ఈ సొమ్మును వాడుకోవడం వల్ల దానికున్న ప్రాధాన్యాన్ని మనం గౌరవించినట్లవుతుంది. కనుక కొంత నగదును అత్యవసరాల కోసం దాచిపెట్టుకోవడం చాలాచాలా కీలకం. అది ఏ రూపంలోనైనా ఉంచుకోవచ్చు. బంగారం, భూములు తదితర పెట్టుబడి మార్గాలను ఉపయోగించుకునైనా ఈ నిధిని నిర్వహించుకోవచ్చు. ధర తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి, ఎక్కువైనప్పుడు వాటిని అమ్మేసి నగదునూ భద్రపరుచుకోవచ్చు. ఫలితంగా అటు పెట్టుబడి, ఇటు పొదుపు రెండింటి ద్వారా మనం లబ్ధిపొందినవారమవుతాం.

పొదుపు లక్ష్యం

పొదుపు లక్ష్యాలను చేరాలంటే.. ఆ పొదుపు అవసరంపై సరైన అవగాహన ఏర్పరుచుకోవాలి. ఎందుకు మనం పొదుపు చేస్తున్నామనే దాన్ని గుర్తెరుగాలి. అప్పుడే ఆ పొదుపు చివరిదాకా సాగుతుంది. ఎలాంటి సమయాల్లోనూ అవరోధాలు ఏర్పడవు. మన పిల్లల కోసమా? లేదా తల్లిదండ్రుల కోసమా? లేదా గృహ, విద్య, వైద్య అవసరాల నిమిత్తమా? మరేదైనా ఆశయాల కోసమా? అన్నది ముందుగానే నిర్ణయించుకుంటే.. సమకాలీన పరిస్థితులకు తగ్గట్లుగా పొదుపు చేయగలుగుతాం. చాలామంది రిస్క్ ఎందుకులే.. అని బ్యాంకుల్లోని తమ సేవింగ్స్ అకౌంట్లలోనే సొమ్మును భద్రపరుచుకుంటారు. దీనివల్ల తక్కువ లాభం చేకూరడమేగాక, పన్నులను చెల్లించే అవకాశాలుంటాయి. అదే ఇతర మార్గాల్లో సేవింగ్స్ చేసుకున్నైట్లెతే పన్నుల మినహాయింపును పొందవచ్చు. అలాంటి వాటిని పసిగట్టాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ) మంచివే అయినా అప్పుడప్పుడు అవి మన అవసరాలకు తగిన విధంగా ఉండకపోవచ్చు. కనుక పొదుపునకు ముందు భవిష్యత్ అవసరాల లక్ష్యం తప్పనిసరి.

రుణ భారం

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అందరికీ రుణాలు అనివార్యమైపోయాయి. అవసరాలనుబట్టి రుణ భారం ఉంటుంది. కాబట్టి పొదుపు విషయంలో మనకున్న అప్పులనూ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ అప్పులను తీర్చడం పొదుపు కాకపోయినా.. రుణ భారం తీరిపోవడం అనేది ఆర్థికపరంగా ముఖ్యమైనదే కాబట్టి ఇందుకోసం కూడా పొదుపు చేయడం సరైన చర్యే. అయితే చేసే పొదుపు రుణ చెల్లింపులకు అనుగుణంగా ఉంటే మంచిది. లేనిపక్షంలో ఇబ్బందులపాలవుతాం. ముఖ్యంగా గృహ, వాహన రుణాలు త్వరగా తీరిపోయేలా ఇతరత్రా పొదుపు మార్గాలను అవలంభించడం వల్ల రేపటి రోజున మనపై ఆర్థికంగా భారం తగ్గుతుంది.

సాంకేతిక పరిజ్ఞానం

పొదుపు, పెట్టుబడుల విషయాల్లో సాంకేతిక పరిజ్ఞానం మనకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అంతా డిజిటలైజ్ అయిపోతున్న రోజులివి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనమూ మారాలి. లేదంటే వెనుకబడి పోతాం. బడ్జెట్, సేవింగ్ యాప్స్ వంటి వాటి గురించి తెలుసుకోవాలి. డిజిటల్ విధానాలను అనుసరిస్తే చేకూరే ప్రయోజనాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రోత్సాహకాలతో మన ఖర్చులను చాలావరకు తగ్గించుకోగలం. చిన్నచిన్నవే కదా అని వాటిపై అలక్ష్యం తగదు. రూపాయికి రూపాయి తోడైతేనే వందలు.. వేలు.. లక్షలు.. కోట్లు. ఇదే పొదుపునకు అసలు సూత్రం.

నిపుణుల సలహా

నిపుణుల నుంచి తీసుకునే సలహాలు మనకు మేలు చేస్తాయి. ఆర్థికపరమైన అంశాల్లో అవగాహన లేకపోతే మిగిలేది నష్టాలే. దీనివల్ల పొదుపు లక్ష్యాలే పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. మన ఆర్థిక స్థితి, సామర్థ్యానికి సరిపోయే పొదుపు మార్గాలు ఏవన్నదానిపై నిపుణుల నుంచి సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఏయే రంగాల్లో ఆకర్షణీయమైన లాభాలు ఉంటాయి. అవి మనకు ఎలా ఉపయోగపడుతాయి అన్నది నిపుణులు చక్కగా వివరించగలరు. దీనివల్ల మనం పొదుపు ప్రణాళికలను ప్రభావవంతంగా, సమర్థవంతంగా వేసుకోవడానికి వీలుంటుంది. ఏదిఏమైనా భవిష్యత్ ఎలా ఉంటుందో?.. మంచివో, చెడ్డవో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో?.. ఎవరికీ తెలియదు కాబట్టి వెంటనే పొదుపునకు సిద్ధం కావడం మంచిది.
-కే నరేశ్ కుమార్
సహ వ్యవస్థాపకులు, వెలాసిటీ, వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థknk@wealocity.com

610
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles