సెన్సెక్స్ @ 50,000


Sat,July 28, 2018 12:42 AM

మూడేండ్లలో చేరుకునే అవకాశం
మహీంద్రా ఏఎంసీ ఎండీ అశుతోష్

రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుండటం, ఆర్థిక సంస్కరణలకు నరేంద్ర మోదీ సర్కార్ పెద్దపీట వేయడంతో సూచీలు రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకుతున్నాయి. స్టాక్ మార్కెట్ల గమనంపై మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అశుతోష్ బిష్ణోయ్ మాటల్లో...
Mahindra-MF
వచ్చే మూడేండ్లకాలంలో సెన్సెక్స్ 50 వేల పాయింట్లకు చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. మోదీ అధికారం చేపట్టిన తొలి రెండేండ్లు నిలకడగా సాగిన సెన్సెక్స్ ఆ తర్వాత దూకుడు పెంచిందన్నారు. ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేయడం ముఖ్యంగా నల్లధనానికి చెక్ పెట్టడానికి పెద్ద నోట్ల రద్దు, బ్యాంకులను భారీగా మోసం చేసి విదేశాలకు పారిపోతున్న వారిపై ఉక్కుపాదం మోపడానికి ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టిన నాటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదని వెల్లడించారు. అలాగే గతంలోలాగా పెట్టుబడిదారులు ఏ కంపెనీ షేర్లు పడితే ఆ కంపెనీల షేర్లు కొనుగోలు చేసేవారు..ప్రస్తుతం వీరి ట్రెండ్ మారుతున్నది. ముఖ్యంగా లాభపడుతున్న షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గుచూపుతున్నారని ఆయన చెప్పారు. ముఖ్యంగా బ్లూచిప్ సంస్థలతోపాటు చిన్న స్థాయి సంస్థల్లో తమ పెట్టుబడులను చొప్పిస్తున్నారు. రంగాల వారీగా చూస్తే మౌలిక, ఐటీ, ఫార్మా రంగాలకు చెందిన సంస్థలు వీటిలో ఉన్నాయి. కానీ కమోడిటీ సంస్థల జోలికి ఎవరు వెళ్లడం లేదు..ఎందుకంటే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పడిపోతుండటం ఇందుకు కారణమని ఆయన విశ్లేషించారు. మార్కెట్లపై రాజకీయాల ప్రభావం పెద్దగా ఉంటుందని అనుకోవడం లేదన్నారు. ఉన్నా ఇది చాలా స్వల్పకాలం మాత్రమే.. తిరిగి మళ్లీ కోలుకుంటున్నాయని పేర్కొన్నారు.

రూపాయికి వాణిజ్య సెగ

రూపాయి మరింత పడిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం మరింత ముదిరితే దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు తప్పవన్నారు. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 69 స్థాయిలో కదలాడుతున్నది. దేశ జీడీపీలో ఎగుమతుల వాటా 12 శాతం ఉన్నప్పటికీ ఇరు అగ్రదేశాల మధ్య నెలకొన్న పన్నుల యుద్ధం ఎంతో కొంత మేర ప్రభావాన్ని చూపనున్నదని ఆయన వెల్లడించారు. మరోవైపు క్రూడాయిల్ కూడా సెగలు కక్కుతుండటం కూడా ఆర్థిక వ్యవస్థకు చేడు చేయనున్నదన్నారు. దేశీయ ఇంధన వినిమయంలో 80 శాతం దిగుమతులపై ఆధారపడుతుండటం ఇందుకు కారణమని చెప్పారు. అలాగే బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్లకు మించకపోవచ్చుని ఆయన అంచనావేస్తున్నారు. ప్రస్తు తం ఇది 70-74 డాలర్ల మధ్య ట్రేడవుతున్నది.

2025 నాటికి 100 లక్షల కోట్లకు ఫండ్ మార్కెట్

ఈక్విటీ మార్కెట్లతో పాటు మ్యూచువల్ ఫండ్ మార్కెట్ కూడా శరవేగంగా దూసుకుపోతున్నది. 2025 నాటికి ఫండ్ మార్కెట్ రూ.100 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఇది రూ.23 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నది. గడిచిన ఐదేండ్లలో 35 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. భారత ఆర్థిక వ్యవస్థలో ఇది 10%. ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల్లో అవగాహణ పెరుగుతున్నదన్న ఆయన.. చాలా మంది తమ మిగులు నిధులను రియల్ ఎస్టేట్, అతి విలువైన లోహాలకు బదులుగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈక్విటీ మార్కెట్లో పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

214
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles