సినిమా చూసి.. రోబో చేశాడు!


Sat,August 18, 2018 11:41 PM

ఈ కాలం పిల్లలకు చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఆటలు ఆడుతూ, యూట్యూబ్‌లో సినిమాలు చూస్తూ, సోషల్‌మీడియాలో స్నేహితులతో చాట్ చేస్తూ కాలం గడిపేస్తుంటారు. కానీ, ఈ కుర్రోడు అలాకాదు. ఓ ఇంగ్లిష్ సినిమా చూసి, ఏకంగా రోబోను రూపొందించాడు. వ్యర్థాలతోనే అద్భుతాలను సృష్టించొచ్చని నిరూపించి, లోకల్‌గా సెలబ్రెటీ అయ్యాడు. ఎన్నో అవార్డులను అందుకున్నాడు కూడా.


Nandalal
మణిపూర్‌కు చెందిన నందలాల్ సింగ్ ఇంఫాల్‌లోని జాన్‌స్టోన్ హైయర్ సెకండరీ స్కూల్‌లో ప్లస్-2 చదువుతున్నాడు. తండ్రి సాధారణ రైతు. వచ్చిన కూలీ డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ, నందలాల్‌ను చదివించేవాడు. నందలాల్ కూడా తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ, పొలం పనులూ చేసేవాడు. అయితే, అతనికి చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆసక్తి ఎక్కువ. తీరిక సమయాల్లో వాటిని రిపేర్ చేస్తూ, కొత్త విషయాలను నేర్చుకునేవాడు. ఇంట్లో తానే ఎలక్ట్రీషియన్ అయ్యాడు. బల్బ్ దగ్గర్నుంచి టీవీ వరకూ ఏది రిపేర్ వచ్చినా తానే బాగు చేసేవాడు. తనకు చేతకాకపోతే ఎలక్ట్రీషియన్ చేసే పనిని క్షుణ్ణంగా పరిశీలించేవాడు. మళ్లీ అలాంటి రిపేర్ వచ్చినప్పుడు అలాగే చేస్తూ.. ఆయా పరికరాలను బాగు చేసేవాడు. ఈ క్రమంలో స్కూల్ నుంచి సైన్స్‌ఫెయిర్, సైన్స్ ఎగ్జిబిషన్‌లకు హాజరై.. అక్కడి మిగతా పాఠశాలల విద్యార్థులు ఏమేం ప్రయోగాలు చేశారో, ఎలా చేస్తున్నారో తెలుసుకునేవాడు. వారి పరిశోధనల గురించి ఆరా తీసేవాడు. అలా మొదలైన నందలాల్ ప్రస్థానం.. రోబో తయారీ వరకు వెళ్లింది.


సినిమా చూసి ప్రయోగం!

Nandalal2
నందలాల్‌కు ఇంగ్లిష్ సినిమాలంటే చాలా ఇష్టం. అది కూడా టెక్నాలజీ పరంగా మంచి సందేశాలు ఇచ్చే సినిమాలనే ఎక్కువగా చూసేవాడు. ఓ సినిమాలో వ్యర్థాలను ఉపయోగించి అద్భుతాలను ఎలా సృష్టించవచ్చో తెలుసుకున్నాడు. అప్పటి నుంచి అతని మదిలో ఒకటే ఆలోచన.. ఏదైనా సాధించాలని. ఏం చేయాలో తెలియదు. ఎలా మొదలు పెట్టాలో తెలియదు. అయినా, ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. తనకు ఆసక్తి, అనుభవం ఉన్న ఎలక్ట్రిక్ పరికరాలతో ఏదైనా కొత్తగా ప్రయోగం చేయాలనుకున్నాడు. ఇంట్లో అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, ఎలక్ట్రిక్ పరికరాలతో రోబోను సృష్టించాలనుకున్నాడు. ఉపాధ్యాయులకు తన ఆలోచనలు చెప్పాడు. వారు కూడా ఓకే చెప్పి, కొంత ఆర్థికసాయం చేయడంతో కేవలం 15-20 రోజుల్లోనే రోబోను తయారు చేశాడు.


జేఓఎన్-17గా నామకరణం!

కేవలం ఇంట్లో అందుబాటులో ఉన్న పరికరాలతోనే రోబోను సృష్టించాడు నందలాల్. తయారీకి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇంట్లో దొరికే వస్తువులనే వాడుకొన్నాడు. రోబో చేతులకి సిరంజీలను, తలకు పాత బైనాకులర్స్, శరీరానికి ఖాళీ బాటిల్స్‌ను ఇలా.. మొత్తం బరువును తట్టుకొనేలా స్పీకర్ ఫ్రేమ్‌తో 12 రోజుల్లో రోబోను రూపొందించాడు. దానికి జేఓన్-17 అని నామకరణం చేశాడు. రోబో రిమోట్ సహాయంతో ముందుకి వెనక్కి కదులుతుంది. తలను లెఫ్ట్, రైట్ తిప్పుతుంది. చేతులతో వస్తువులను పట్టుకొని పక్కన పెడుతుంది. తయారీలో ఉపాధ్యాయులు జైచంద్ ఓనమ్, కిరణ్ కుమార్ సలహాలు తీసుకున్నాడు. కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు జైచంద్ ఓనమ్.. రోబో చేసే పనులను వీడియో తీసి స్కూల్ ఫేస్‌బుక్ పేజ్‌లో, వారి వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాడు. అది కాస్తా వైరల్ అయి మణిపూర్ రాష్ట్ర విద్యాశాఖ అధికారికి చేరడంతో నందలాల్ దశ తిరిగింది.


పలు అవార్డులు కైవసం!

nandan-lal
2017లో స్టేట్ లెవల్ సైన్స్ ఎగ్జిబిషన్‌లో ఉత్తమ వ్యక్తిగత ప్రదర్శన విభాగంలో నందలాల్‌కు మొదటి బహుమతి వరించింది. కోల్‌కతాకు చెందిన బిర్లా ఇండస్ట్రియల్ టెక్నాలాజికల్ మ్యూజియమ్ సైన్స్ ఫైర్‌లో ఉత్తమ వ్యక్తిగత బహుమతిని పొందాడు. స్టేట్‌లెవల్ జోనల్ సైన్స్ ఎగ్జిబిషన్‌లో ద్వితీయ బహుమతి సాధించాడు. నంద్‌లాల్‌తో పాటు గురువు జైగోపిచంద్ ఓనమ్‌కు స్టేట్ ఎగ్జిబిషన్, సైన్స్ ఫెయిర్‌లో ఉత్తమ గైడ్ టీచర్‌గా అవార్డులు వచ్చాయి. దీంతో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని నందలాల్ సింగ్ దక్కించుకున్నాడు. తన ప్రతిభ ఆధారంగా లోకల్ సెలబ్రిటీ అయ్యాడు నందలాల్. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఎన్నో ప్రయోగాలు చేస్తానని ధీమాతో చెబుతున్నాడు. అన్నట్లు ప్రయోగాల్లోనే కాదూ.. చదువుల్లోనూ, ఆటల్లోనూ నందలాల్ ఫస్టే.

501
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles