సినిమాల విషయంలో పేక్షకులకు చాయిస్ ఉండాలి!


Sun,August 5, 2018 01:42 AM

ఏఎన్నార్ మనుమరాలిగా, నాగార్జున మేనకోడలిగా పరిశ్రమలో అందరికీ సుపరిచితం సుప్రియ యార్లగడ్డ. దాదాపు 22ఏళ్ల క్రితం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా కథానాయికగా అరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో ప్రొడక్షన్ వ్యవహారాలను స్వీకరించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నది. నిర్మాణ వ్యవహారాల్లో అందెవేసిన చేయిగా ఆమెకు పరిశ్రమ వర్గాల్లో పేరుంది. సుదీర్ఘ విరామం తర్వాత సుప్రియ ఇటీవలే విడుదలైన గూఢచారి చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సందర్భంగా సినిమాల్లోకి తన పునరాగమనంతో పాటు ప్రొడక్షన్ వ్యవహారాల గురించి పాత్రికేయులతో ముచ్చటించింది సుప్రియ యార్లగడ్డ. ఆమె చెప్పిన విశేషాలివి..
Supriya

దాదాపు 22 ఏళ్ల విరామం తర్వాత సినిమా చేశారు. ఎలా ఉంది?

-స్క్రిప్ట్ నచ్చి ఈ సినిమాకు ఓకే చెప్పాను. కథ చెప్పిన తర్వాత దర్శకుణ్ణి ఆడిషన్ చేయమని కోరాను. సినిమా చేసి 22 ఏళ్లయింది. ఆ రోజులు సరిగ్గా గుర్తు కూడా లేవు. మీరు ఆడిషన్ చేసుకోండి. అది చూసిన తర్వాత మీరే నన్ను వద్దని చెబుతారు అని అన్నాను. ఆడిషన్‌లో నా పర్‌ఫార్మెన్స్ నచ్చడంతో సినిమాకు ఎంపిక చేశారు. విరామం తర్వాత కెమెరా ముందుకు రావడం ఆనందంగా అనిపించింది.

గూఢచారి కథలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశాలేమిటి?

-నేను అన్నపూర్ణ సంస్థ ప్రొడక్షన్ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తుంటాను. ఎంతోమంది వచ్చి కథలు చెబుతుంటారు. దర్శకుడు శశికిరణ్ గూఢచారి కథ చెప్పినప్పుడు కూడా అలాగే అనుకున్నాను. స్క్రిప్ట్‌లో నదియా అనే క్యారెక్టర్ గురించి చెబుతూ ఈ పాత్ర మీరు చేస్తారా? అని అడిగారు. మొదట నేను ఆశ్చర్యపోయాను. కథతో పాటు ఆ పాత్ర చిత్రణలోని కొత్తదనం నచ్చడంతో సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా కోసం కొన్ని హాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ చిత్రాలోని పాత్రల్ని రెఫరెన్స్‌గా తీసుకున్నాను.

కథానాయికగా పరిచయమైన రోజులతో పోల్చితే ఇప్పుడు పరిశ్రమలో వచ్చిన మార్పులేమిటి?

-ప్రస్తుతం ఇండస్ట్రీ ముఖచిత్రం మొత్తం మారిపోయింది. ఓ రకంగా పరిశ్రమకు ఇవి మంచి రోజులని చెప్పొచ్చు. నేటితరంలో నటీనటులు తమ అభిరుచులకు తగినట్లుగా వినూత్న పాత్రల్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఎక్కువైంది. తమ ప్రతిభాపాటవాల్ని ఆవిష్కరించుకోవడానికి సరికొత్త మార్గాలు వారి ముందు కనిపిస్తున్నాయి.

సుదీర్ఘ విరామం తర్వాత కెమెరా ముందుకు రావడం ఒత్తిడిగా అనిపించిందా?

-అలాంటిదేమీ లేదు. నటనకు దూరంగా ఉన్నప్పటికీ నేను గత ఇరవై ఏళ్లుగా ప్రొడక్షన్ వ్యవహారాల్ని చూసుకుంటున్నాను. సెట్ వాతావరణం నాకు కొత్తేమి కాదు. సినిమాలకు గ్యాప్ వచ్చిందని ఎప్పుడూ భావించలేదు. గూఢచారి షూటింగ్‌లో కెమెరా ముందు ఏ మాత్రం టెన్షన్ పడలేదు.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తర్వాత చిత్రసీమలో కొనసాగలేకపోవడానికి కారణాలేమిటి?

-కథానాయికగా ఓ ప్రయత్నం చేశాను. కానీ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఏం చేద్దామని ఆలోచించి వెంటనే ప్రొడక్షన్‌లోకి దిగిపోయాను. దాదాపు ఇరవైఏళ్లుగా అన్నపూర్ణ సంస్థ ప్రొడక్షన్ వ్యవహారాలతో బిజీగా ఉన్నాను. కాబట్టి కథానాయికగా సక్సెస్ కాలేదని ఎప్పుడూ బాధ పడలేదు.

ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంటూ ఒక్కసారిగా యాక్టింగ్ వైపు దృష్టి పెట్టారు. ఈ రెండు పనుల్ని ఎలా సమన్వయం చేయగలిగారు?

-నిర్మాణ వ్యవహారాల్లో రోజూ టెన్షన్స్ ఉంటాయి. ఒక్కరోజు పది సినిమాల షూటింగ్స్ జరుగుతుంటాయి. ఎన్నో పనుల్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంటుంది. నా దృష్టిలో ప్రొడ్యూసర్‌గా పనిచేయడమనేది సినిమాల్లో వరస్ట్ జాబ్ అనుకుంటాను. ఎందుకంటే ప్రొడక్షన్ పనుల్ని అనుకున్న విధంగా డీల్ చేయడం అంత సులభంకాదు. అదే నటిస్తున్నప్పుడు షూటింగ్‌లో మన ఫోన్ పక్కన పెట్టేయొచ్చు. దర్శకుడు చెప్పింది చేసి హాయిగా కూర్చొవచ్చు. అందుకే ప్రొడక్షన్ వ్యవహారాలకు దూరంగా గూఢచారి షూటింగ్ సమయాల్ని బాగా ఆస్వాదించాను. రొటీన్‌కు భిన్నంగా రిలాక్స్‌డ్‌గా ఫీలయ్యాను.

Supriya1
నేను సినిమాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడు తాతగారు ఎందుకమ్మా నీకు నచ్చదు అని వారించారు. సినిమా చేస్తేనే మన గురించి తెలుస్తుంది తాతయ్యా అని సర్దిచెప్పాను. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం విడుదలైన సంవత్సరం తర్వాత నేను అన్నపూర్ణ ప్రొడక్షన్ వ్యవహారాల్లోకి అడుగెట్టాను. నాకు తెలిసింది కేవలం సినిమానే. ఏదో సాధిద్దామనే భావనతో కాకుండా చిత్రసీమలో పనిచేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే తపనతో అన్నపూర్ణ ప్రొడక్షన్‌లోకి ప్రవేశించాను.

గూఢచారి చిత్రంలో మీకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన విషయాలేమిటి?

-పతాక ఘట్టాలు బాగా నచ్చాయి. నా దృష్టిలో స్త్రీ పురుషులు సినిమా చూసే విధానంలో తేడా వుంటుంది. భావోద్వేగాల్ని వ్యక్తం చేసే విషయంలో కూడా ఇద్దరి మధ్య భేదాలుంటాయి. ముఖ్యంగా స్త్రీలు సున్నితమైన భావోద్వేగాలకు కూడా బాగా కనెక్ట్ అవుతారు. గూఢచారి స్పైథ్రిల్లర్ చిత్రమైనా ఇందులో హృదయాన్ని స్పృశించే ఎమోషన్స్ ఉన్నాయి. తండ్రీకొడుకుల సెంటిమెంట్ నన్ను బాగా కదిలించింది.

సినిమా విడుదలైన తర్వాత మీకు లభించిన ఉత్తమ ప్రశంసలేమిటి?

-మా నిర్మాతగారికి రాజమండ్రి నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి సినిమాలో నాగేశ్వరరావుగారి మనుమరాలు బాగా చేసింది అని చెప్పారట. ఇదే ఉత్తమ ప్రశంస అనుకుంటున్నాను. తాతయ్యగారి అభిమానులతో నేను ఎప్పుడూ టచ్‌లో ఉంటాను. చాలామంది హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నన్ను కలుస్తుంటారు. గూఢచారి విడుదలై తర్వాత ఎంతోమంది తాతగారి అభిమానులు ఫోన్‌లో అభినందిస్తున్నారు. అమ్మా మీరు సినిమా చేశారా? మాకు ముందుగా చెప్పలేదే? సినిమా చూశాం. బాగా నటించారు అని ప్రశంసిస్తూ మెసేజ్‌లు పెడుతున్నారు.

నటిగా కొనసాగుదామనే నిర్ణయించుకున్నారా?

-ఆ విషయం గురించి ఇప్పుడే చెప్పలేను. అన్నపూర్ణ సంస్థ నిర్మాణ వ్యవహారాలకు సంబంధించి ఎన్నో బాధ్యతలున్నాయి. కథ బాగా నచ్చితే తప్పకుండా సినిమాల్లో నటించే విషయం గురించి ఆలోచిస్తాను.

ఇంతకు ముందు సినిమాలో అవకాశాలొచ్చాయా?

-కొంతమంది దర్శకులు అడిగారు. ఎందుకో చేయలేకపోయాను. తమిళంలో ఓ ఆఫర్ వచ్చింది. అయితే, భాషా సమస్య వల్ల ఆ సినిమా వొద్దనుకున్నాను.

గూఢచారిలో నెగెటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్ చేశారు. భవిష్యత్తులో ఇదే తరహా పాత్రల్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారా?

-తప్పకుండా చేస్తాను. నేను నెగెటివ్ పాత్రలకు బెటర్‌గా సూటవుతానని అనుకుంటాను (నవ్వుతూ). షూటింగ్ సమయంలో కూడా కొన్ని షాట్స్‌లో సాఫ్ట్‌గా కనిపించమని దర్శకుడు నాతో చెప్పేవారు. నేను మాత్రం నెగెటివ్‌గా ఉంటేనే బాగుంటుందని అనేదాణ్ని.

అన్నపూర్ణ వంటి ప్రఖ్యాత సంస్థకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ప్రస్తుత తెలుగు సినీరంగంపై మీ అభిప్రాయమేమిటి?

-ప్రస్తుతం పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. ముఖ్యంగా బాహుబలి తెలుగు సినిమా గమనాన్నే మార్చివేసింది. ఆ సినిమా విజయంతో తెలుగులో కొత్త ప్రయోగాలు ఎక్కువయ్యాయి. క్షణం, అర్జున్‌రెడ్డి, మహానటి, ఆర్‌ఎక్స్ 100 వంటి చిత్రాలు వైవిధ్యానికి చిరునామాగా నిలిచాయి. మూసధోరణుల్ని బద్దలు కొడుతూ నవీనపంథాలో సినిమాలకు రూపకల్పన చేస్తున్నారు. ప్రతి శుక్రవారం విభిన్న కథా చిత్రాలు రావాలని నేను కోరుకుంటాను. ప్రేక్షకులకు సినిమా విషయంలో చాయిస్ వుండాలి. వాణిజ్య లెక్కలకు అతీతంగా సినిమాను జడ్జ్ చేసుకొని చూడాలి.

Supriya2
బయట ఏదైనా ఊళ్లకు వెళ్లినప్పుడు తాతగారి ఫ్యాన్స్ చూపించే ప్రేమాభిమానాలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అసలు మేము నిజంగా ఏం సంపాదించుకున్నామో ఆ సమయంలో అర్థమవుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో నేను ఫుల్‌టైమ్ ఎంప్లాయిగా భావిస్తాను. స్టూడియో ఎగ్జిక్యూటివ్ అనేదానికంటే ఒక గేట్‌కీపర్‌లా స్టూడియో వ్యవహారాల్ని చూసుకుంటాను.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కేవలం నిర్మాణ వ్యవహారాలకే పరిమితమైపోతారా? లేక సినిమాకు సంబంధించిన సృజనాత్మక అంశాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతారా?

-క్రియేటివ్ సైడ్ అంతగా ఇన్‌వాల్వ్‌మెంట్ వుండదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో సూచనలిస్తాను. వారందరినీ సమన్వయ పరిచే బాధ్యత తీసుకుంటాను. నాకు స్వతహాగా రచన అంటే చాలా ఇష్టం. ఇప్పటికి నాకు వచ్చినా ఆలోచనల్ని కథలుగా రాస్తుంటాను. ఒకప్పుడు ఎవరు ఇంటికొచ్చిన కథలు చెబుతుండేదాణ్ని. అనుకోకుండా ప్రొడక్షన్‌లోకి దిగాల్సి వచ్చింది. చిన్నమావయ్య నాగార్జున సూచనతోనే అన్నపూర్ణ ప్రొడక్షన్ వ్యవహారాల్ని చేపట్టాను.

ఇప్పటికీ మిమ్మల్ని పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించిన తొలినాయిక అనే ట్యాగ్‌తో పిలుస్తుంటారు?

-ఇరవైఏళ్లుగా పరిశ్రమలో పనిచేస్తున్నాను. ఇంకా అందరూ పవన్‌కల్యాణ్ ఫస్ట్‌హీరోయిన్ అనే ట్యాగ్‌తో పిలుస్తుంటారు. ఇదేంటి నాకు సొంతం గుర్తింపు రాదా? అని అనుకునేదాణ్ని (నవ్వుతూ). కానీ కల్యాణ్ ఈజ్ కల్యాణ్. అతనొక పెద్ద స్టార్. పవన్‌కల్యాణ్ ఆ స్థాయికి చేరుతాడని అస్సలు ఊహించలేదు.

అన్నపూర్ణ సంస్థలో నాగార్జున కథానాయకుడిగా నటించనున్నబంగార్రాజు సినిమా పూర్వ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి?

-ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. అంతా ఫైనలైజ్ అయ్యాక సినిమా వివరాల్ని వెల్లడిస్తాను.

కళాధర్‌రావు
సి.ఎం. ప్రవీణ్‌కుమార్

736
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles