సినిమాకంటే ఎవరూ గొప్పోళ్ల కాదు


Sun,July 15, 2018 02:01 AM

కథానాయకుడు, ప్రతినాయకుడు.. పాత్ర ఏదైనా తన కోసమే సృష్టించారన్నంత అలవోకగా అందులో ఇమిడిపోతుంటారు రానా. ఇమేజ్ ఛట్రంలో బందీ కాకుండా భిన్నతరహా పాత్రలతో విలక్షణమైన నటుడిగా తనను తాను కొత్త పంథాలో ఆవిష్కరించుకునేందుకు తపనపడుతుంటారు. ప్రయోగాలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధపడుతుంటారు. ఈ ఆలోచనా విధానమే ఆయన్ని భిన్న భాషల ప్రేక్షకులకు చేరువ చేసింది. ప్రతిసారి ఎంచుకునే కథ ద్వారా తాను సరికొత్త ప్రపంచాన్ని చూడటంతో పాటు ప్రేక్షకులకూ నవ్యతను పంచాలన్నదే తన అభిమతమని, ఆ సిద్ధాంతాన్నే నమ్మే తాను సినిమాలు చేస్తుంటానని చెబుతున్నారు రానా. తన సినీ ప్రయాణాన్ని, తెలుగు సినిమా గమనంలో వచ్చిన మార్పులను గురించి రానా చెబుతున్న విశేషాలివి..
Rana

మీ సినిమాల విషయంలో తప్పొప్పుల్ని ఎలా విశ్లేషించుకుంటారు?

-హీరోల్లో బన్నీ, నాని నా బెస్ట్ ఫ్రెండ్స్. నేను చేయబోయే సినిమాలకు సంబంధించి కథ, కథనాల విషయంలో చిన్న అనుమానం వచ్చినా వెంటనే బన్నీతో పంచుకుంటా. అతడికి ఆ కథ వినిపించడమో, సినిమాను చూపించో నా అనుమానాల్ని నివృత్తి చేసుకుంటాను. వారి ద్వారానే నా తప్పొప్పుల్ని సవరించుకుంటాను. అలాగే బన్నీ తాను చేసే సినిమాల విషయంలోనూ నా సలహాలు తీసుకుంటాడు.

ప్రతిసారి కొత్త కథలను ఎంచుకోవడం చాలెంజింగే కదా?

-అది చాలా కష్టమండీ బాబు. ప్రతిసారి నవ్యమైన కథలు దొరకవు. ఇండస్ట్రీలో విభిన్నంగా ఆలోచిస్త్తూ కథలు రాసేవారు తక్కువయ్యారు. చాలా మంది మూసధోరణితో కూడిన కాలేజ్ ప్రేమకథలు, విలన్‌తో పోరాటాలంటూ వచ్చిన కథలనే వినిపిస్తుంటారు. ఆ ఇతివృత్తాలతోనే చాలామంది సినిమాలు చేస్తున్నారు. నేను కూడా వారి దారిలోనే రొటీన్ కథాంశాలతో సినిమాలు చేయడంలో అర్థం లేదు. ప్రతిసారి ఎంచుకునే కథ ద్వారా నేను సరికొత్త ప్రపంచాన్ని చూడటంతో పాటు ప్రేక్షకులకు ఆ అనుభూతిని పంచాలన్నదే నా అభిమతం. ఆ సిద్ధాంతాన్నే నమ్ముతాను.

బాహుబలి తర్వాత దక్షిణాది సినీ పరిశ్రమ పట్ల ఇతర భాషల వారిలో గౌరవం పెరిగిందని అనుకుంటున్నారా?

-ప్రస్తుతం తెలుగు అసిస్టెంట్లకు సైతం గౌరవం పెరిగింది. తెలుగు సినిమా పరిశ్రమపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ముంబై చిత్రసీమతో నాకు మంచి అనుబంధం ఉంది. ఏడేండ్లుగా హిందీలో నటనతో పాటు ఎండార్స్‌మెంట్స్, షోలు చేశాను. తొలుత నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, తెలుగు వాడిని అని చెబితే ఎవరూ పట్టించుకోలేదు. మద్రాస్ నుంచి వచ్చానని అపోహపడేవారు. శంకర్, మణిరత్నం, రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా కొందరు మినహా దక్షిణాదివారి గురించి ఇతర భాషల వారికి తెలియదు. ఇప్పుడా పరిస్థితి మొత్తం తలకిందులైంది. ప్రయోగాత్మక కథాంశాలకు పెద్దపీట వేస్తూ తెలుగు చిత్రసీమ ధైర్యం చేస్తున్నది. అదే మనల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతున్నది. మరింత మంది కొత్త దర్శకులు ప్రతిభను చాటితే ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాం.

చిత్రపరిశ్రమలో చూసుకుంటే మెగా, మంచు, అక్కినేని ఇలా విభజనలు కనిపిస్తాయి. అందరితో సన్నిహితంగా ఉండే హీరోగా మీ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. అదేలా సాధ్యమైంది?

-చరణ్‌ది నాది ఒకే స్కూల్, ఒకే క్లాస్. కలిసే చదువుకున్నాం. అలాగే నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ నాకు సోదరులు అవుతారు. నవతరం నటుల్లో చాలా మందితో కలిసిపనిచేశాను. ఇండస్ట్రీలో కనిపించే విభజనల్ని నేనెప్పుడూ పట్టించుకోను. ఓ సంగీత దర్శకుడు జీవితాంతం స్వరాలను సమకూర్చడంలోనే సంతోషాన్ని వెతుక్కుంటాడు. ఓ రచయితకు రాయడంలోనే ఆనందం ఎక్కువగా ఉంటుంది. అలాగే నటుడు నిరంతరం మనుగడ సాగిస్తూనే ఉండాలి. సినిమా ఓ కళారూపం అనేది ప్రతి ఒక్కరూ నమ్మాలి. సినిమా కంటే ఎవరూ గొప్పోళ్లు కాదు. తామే గొప్ప వాళ్లమని భావించిన వారంతా ఎప్పుడో కనుమరుగైపోయారు. మరొకరితో పోల్చిచూసుకోను. వంద కోట్ల బడ్జెట్, కోటి రూపాయల వ్యయం అనే లెక్కలు వేసుకోను. నాకు నచ్చిన కథలతో సినిమాలు చేస్తాను. పోటీతత్వం గురించి ఎప్పుడూ ఆలోచించను.

వెంకటేష్, మీరు కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా ఎప్పుడు ఉండవచ్చు?

-బాబాయితో సినిమా చేయాలనే ఆసక్తి కంటే భయం ఎక్కువగా ఉన్నది. ఖచ్చితంగా మేం చేసే సినిమా బాగుంటుంది అన్నప్పుడే కలిసి నటిస్తాం. అది రీమేక్ అయినా, స్ట్రెయిట్ సినిమా అయినా, ఏదైనా ఓకే. వారంలో రెండు, మూడు సార్లు బాబాయిని కలుస్తుంటాను. ఆ సమయంలో మేం మాట్లాడుకునే గంటలో ఇద్దరం చేయబోయే సినిమా గురించి ఎక్కువగా ప్రస్తావన వస్తుంటుంది.

బాహుబలి మీ కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడిందని అనుకుంటున్నారు?

-నాతో పాటు తెలుగు ఇండస్ట్రీ కెరీర్‌ను సమూలంగా మార్చింది బాహుబలి. కొత్త సినిమాలు చేసే ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. బాహుబలి తొలిభాగం రూపొందించే సమయంలో ప్రభాస్, నేను, రాజమౌళి అందరం కలిసి తెలుగులో ఓ పెద్ద సినిమాను చేస్తున్నామనే అనుకున్నాం. అంతిమంగా అది దేశంలోనే గొప్ప సినిమాగా నిలిచింది. హిందీ, తమిళ, మలయాళం అన్ని భాషల్లో అత్యధిక వసూళ్లను సాధించి నంబర్‌వన్ స్థానాన్ని సాధించింది. భాషాభేదాలతో పట్టింపులు లేకుండా మంచి సినిమా తీయాలని సంకల్పిస్తే దేశం మొత్తం ఆదరిస్తారనే నమ్మకాన్ని నిలబెట్టింది. దేశంలోని భిన్న భాషలకు చెందిన సాంకేతిక నిపుణులు సమిష్టిగా జాతీయ స్థాయి సినిమా తీస్తే ఎలా ఉంటుందో బాహుబలి నిరూపించింది.

మూసధోరణిలో ఆలోచించే విధానం నుంచి దర్శకులు బయటపడుతున్నారని అనుకుంటున్నారా?

-ఖచ్చితంగా మారుతున్నారు. చాలామంది దర్శకనిర్మాతలు కొన్నిసార్లు జనం ఇలాంటి సినిమాలు చూడరు అంటూ చెబుతుంటారు. అది చాలా తప్పు. ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలూ చూస్తున్నారు. మనకు తీయడం రాదు. ఆ వాస్తవాన్ని గ్రహించాలి. చిన్న సినిమా, పెద్ద సినిమా తేడాలు లేకుండా కొత్తదనం దిశగా అడుగులు వేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని అనేక చిత్రాలు నిరూపించాయి.

సినిమాలు, రియాలిటీ షోలు, కొత్త కథలు వినడం.. అన్నింటికీ సమయాన్ని ఎలా కేటాయించగలుగుతున్నారు?

-ఉదయం స్టూడియోలో అడుగుపెడితే వాటంతట అవే అన్ని జరిగిపోతుంటాయి. బాహుబలిలో మహారాజుగా నటించాను, ఘాజీలో సబ్‌మెరైన్ జీవితాన్ని చూశాను. నేనే రాజు నేనే మంత్రిలో వడ్డీవ్యాపారిగా, రాజకీయ నాయకుడిగా నటించాను. ఇలా వినూత్నమైన పాత్రల ద్వారా ప్రతిసారి కొత్త విషయాల్ని నేర్చుకుంటాను. వాటిలోనే నేను ఆనందాన్ని వెతుక్కుంటాను. అందుకే ఎప్పుడూ బోర్‌గా ఫీలవ్వను.

నరేష్ నెల్కి

560
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles