సహకారం..


Sat,August 4, 2018 11:39 PM

Katha
అడవిలో వారం రోజులపాటు కుండపోత వర్షాలు కురవడంతో అడవి సగం వరకూ మునిగిపోయింది. దాంతో నేలమీద బతికే జంతువులన్నింటికీ నీళ్లల్లో మునిగి చనిపోతామేమోనన్న భయం పట్టుకుంది. బతుకు మీద ఆశతో అవి దగ్గరలో ఉన్న చెట్లను ఎక్కాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ, వాటికి చెట్లు ఎక్కే అలవాటు లేకపోవటంతో మళ్లీ నీళ్లల్లో పడిపోతున్నాయి. ఇలా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ కిందపడిపోతున్నాయి. ఇదంతా చెట్లపై నివసించే పక్షులు, కోతులు గమనిస్తున్నాయి. కిందున్న జంతువులు పైకి వచ్చి తమను చంపుతాయేమోనని భయంతో.. జంతువులు చెట్లు ఎక్కకుండా అడ్డుపడుతున్నాయి. ఇదంతా గమనిస్తున్న ఓ ముసలి సింహానికి చాలా కోపం వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా పైకి చూస్తూ.. ఇది వర్షాకాలం కాబట్టి వర్షాలు బాగా కురిసి మన అడవి అంతా నీళ్లతో నిండిపోయింది. మాకు నిలబడడానికి స్థలం లేదు. ఇది మాకు కష్ట సమయం. దీనిని చులకనగా చూడకండి. ఇప్పుడు మేము కష్టంలో ఉన్నామని మమ్మల్ని మీరు చులకనగా చూస్తే, తర్వాత వేసవికాలం వస్తుంది. వేసవిలో అగ్నిప్రమాదం వచ్చి చెట్లన్నీ కాలిపోవచ్చు.

అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? కిందకి దిగరా? కాలిపోతున్న చెట్లతో పాటు మీరూ కాలిపోతారా? అలాగే కాలిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు మమ్మల్ని మీరు పైకి రానివ్వకపోతే. మీరు మమ్మల్ని పైకి రానివ్వనప్పుడు మేము మిమ్మల్ని ఎందుకు కిందకు దిగనిస్తాము? అయినా అదేనా పద్ధతి? కష్టకాలంలో ఒకరికొకరం సహాయం చేసుకోవద్దా? అంటూ చెట్లపై ఉన్న జంతువులను హెచ్చరించింది. ఇందుకు మిగతా జంతువులన్నీ సింహానికి మద్దతు పలికాయి. సింహం మాటలకు చెట్లపైనున్న ప్రాణులు కూడా నిజమేకదా! అని కిందనున్న వాటికి సహాయం చేసేందుకు చెట్లకొమ్మలను కిందివరకూ వంచాయి. వాటి మీదుగా కిందనున్న జంతువులన్నీ కోలాహలంగా చెట్ల పైకెక్కి ప్రాణాలను దక్కించుకున్నాయి. అంతేకాదు, వాటి ఆకలి బాధ్యత కూడా తమదే అని భావించి, అంత వానలో కూడా చెట్ల పైనున్న ప్రాణులు ఎంతో శ్రమించి ఆహారాన్ని సమకూర్చి, అతిథి మర్యాదలు చేశాయి.

నీతి ః కష్టకాలంలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.
- అనసూయ కన్నెగంటి

293
Tags

More News

VIRAL NEWS