సంపద సృష్టికి అడ్డదారులు


Sat,August 4, 2018 01:34 AM

సత్వర వైఫల్యాలకు రహదారులే

go-upస్టాక్ మూలాలు ఎలా ఉన్నా.. ఆ స్టాక్ ధరను నిర్ణయించేది మాత్రం మదుపరులే. ఇన్వెస్టర్ల కొనుగోళ్లపైనే ఎంతటి స్టాక్ విలువలైనా ఆధారపడి ఉంటాయి. స్టాక్ కదలికల్ని నిర్దేశించేది కూడా మదుపరుల అవగాహనే. అందుకే కొన్నికొన్ని సందర్భాల్లో బలమైన ప్రముఖ సంస్థల షేర్లు కూడా నష్టపోతుంటే, అనామక షేర్లు సైతం లాభాల్లో కదలాడుతుంటాయి. కాబట్టి మదుపరులలో సెంటిమెంట్ అనేది దృఢంగా ఉంటే దేశ, విదేశీ పరిణామాలతో సంబంధం లేకుండా స్టాక్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. అన్ని ఒడిదుడుకులకు తట్టుకుని నిలబడు తుంటాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లూ వరుస లాభాల్లో కదలాడుతుంటాయి. అలాగే భయాందోళనలు నెలకొంటే మార్కెట్ ఏ దశలో ఉన్నా అమ్మకాల ఒత్తిడి తప్పదు. లాభాల స్వీకరణే ధ్యేయంగా మదుపరులు ముందుకు సాగుతారు.


ప్రఖ్యాత గణాంకవేత్త, సిద్ధాంతకర్త, శాస్త్రవేత్త అయిన న్యూటన్ సైతం మనుషుల ఆలోచనా విధానాల్ని అన్నివేళలా అంచనా వేయడం అసాధ్యం అన్నారు. సరిగ్గా స్టాక్ మార్కెట్‌లోని మదుపరుల విషయంలో ఇది నిజం. మదుపరులు ఎప్పుడు ఎలా స్పందిస్తారనేది కచ్ఛితంగా చెప్పడం కష్టమే. అయితే స్టాక్ మార్కెట్ కదలికలు అనేవి మదుపరుల ఆశ, ఆందోళన, తెలివి, అమాయకత్వం మధ్యే తిరుగాడుతుంటాయని చెప్పగలం. స్వల్పకాల ఒడిదుడుకులకు భయపడి అమ్మకాలకు దిగే మదుపరులున్నట్లే, దీర్ఘకాల ప్రయోజనాల కోసం ధైర్యంగా ముందుకుసాగే మదుపరులూ ఉన్నారు. ఈ రెండో రకం మదుపరులు మార్కెట్‌లో చోటుచేసుకునే ఆకస్మిక పరిణామాలకు వెనుకడుగు వేయరు. తద్వారా తమ పెట్టుబడులకు సుస్థిరమైన లాభాలను, ఆకర్షణీయమైన ప్రయోజనాలను పొందగలుగుతారు.


నిజానికి స్టాక్ మార్కెట్లు భీకర నష్టాలకు లోనైనప్పుడు చాలామంది మదుపరులు పెట్టుబడులకు దూరంగా ఉంటారు. కొన్ని రోజులదాకా మార్కెట్ లావాదేవీల్లో పాల్గొనేందుకు ముందుకురారు. మార్కెట్లు తిరిగి కోలుకుని, స్థిరపడ్డాక మళ్లీ పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తారు. అయితే స్టాక్ మార్కెట్ రోజువారీ కదలికలతో నిమిత్తం లేకుండా ట్రేడ్ అయ్యే స్టాక్స్ ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిని గమనించి, మన ఆర్థిక సామర్థ్యానికి సరితూగినవి ఎంచుకుని నిర్దిష్ట పెట్టుబడులు పెడితే విజయం మనదే. భారీ నష్టాలు వాటిల్లినప్పుడు తప్ప.. ఈ స్టాక్స్ నష్టపోవడం అనేది అరుదు. వీటి విలువ నిలకడగా పెరుగుతూనే ఉంటుంది. దీర్ఘకాల పెట్టుబడులకు ఈ తరహా షేర్లు అత్యుత్తమమైనవి. అయితే వీటిలో లాభాలు ఆశించినస్థాయిలో ఉండకపోవచ్చు. అయినప్పటికీ నష్టాలకు మాత్రం అత్యంత తక్కువ అవకాశాలే ఉంటాయి.


ఏదిఏమైనా సంపద సృష్టికి అడ్డదారులు.. సత్వర వైఫల్యాలకు రహదారులేనన్న విషయాన్ని మదుపరులు గుర్తుంచుకోవాలి. సులభంగా ఆర్జించాలనుకుంటే.. ఎప్పటికైనా సమస్యలు తప్పవు. స్టాక్ మార్కెట్లు కూడా ఇందుకు మినహాయింపు కాబోవు. నిలకడైన తీరుతోనే విజయాలు పలుకరిస్తాయి. కొన్ని సమయాల్లో మన దూకుడు లాభించినప్పటికీ, అది శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తించాలి. కష్టార్జితానికి అసలైన విలువ దక్కేది అప్పుడే. స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు అనేవి అత్యంత సహజమని, అంతిమంగా వృద్ధికి తప్పక చోటుంటుందని ప్రతీ మదుపరి గ్రహించడం అవసరం. ఎందుకంటే మన నిర్ణయాలపై విశ్వాసం పెరుగాలంటే ఇది అన్నింటికంటే ఆవశ్యకం. కాబట్టి తెలివిగా పెట్టుబడులు పెడుతూ.. ఆకట్టుకునే లాభాలను పొందుతూ.. భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి.
naresh

306
Tags

More News

VIRAL NEWS