శ్రమకోర్చి.. సమకూర్చి!


Wed,September 5, 2018 01:10 AM

ఒక ప్రయత్నం జరుగాలి అది మన నుంచే జరుగాలిఆ ప్రయత్నంలో ఓడిపోతామా? గెలుస్తామా? ప్రయత్నించి ఓడిపోతే ఓటమైనా క్కుతుందిప్రయత్నంలోనే ఓడిపోతే ఏం దక్కుతుంది? అంతర్మథనంతో మొదలైన ఒక ఆలోచన 38 అక్షరాలను తయారు చేసే ఆచరణ అయింది లంబాడీ భాషకు అక్షరాలను చెక్కుతున్న గిరిజన శిల్పి పాట్లావత్ దశరథ్ నాయక్ పరిచయమిది.
Dhasharatha
భాష ఉన్నది.. సాహిత్యం ఉన్నది. పాటలున్నాయి. ఆటలున్నాయి. భాషకు లిపి మాత్రం లేదు. ఇప్పటికే తండాల్లో ఉన్న మట్టి వాసనకు అభివృద్ధి మంత్రం కాటేసింది. సంస్కృతి సంప్రదాయాలు ప్రత్యేక రాష్ట్రంలో గుర్తింపును తెచ్చుకొని పరిఢవిల్లుతున్నా.. భాషను కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో భంగం వాటిల్లే ప్రమాదముందని తెలుసుకున్నాడు. రాష్ట్రంలో ఇంత జనాభాకు ప్రత్యేక భాష ఉన్నా, లిపి లేకపోవడంతో పరభాషలపై ఆధారపడాల్సి వస్తుందని భావించాడు. తమ భాష పదికాలాల పాటు ఉండడానికి లిపి అవసరం అని గుర్తించాడు. రెండేళ్లుగా ఆలోచిస్తూనే ఉన్నాడు. తను అనుకున్న పనితో అందరికీ సమాధానం చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. చదువుకున్నది ఇంటర్మీడియట్ అయినా కొత్త అక్షరాలకు రూపకల్పన చేశాడు.

చిరు ప్రయత్నం..

సంచార జాతుల వారైన బంజారాలలో ఉన్నత స్థాయిల్లో స్థిరపడినవారున్నారు. గొప్ప ఉద్యోగాలు చేస్తూ ఉన్నత జీవితం గడుపుతున్న కుటుంబాలు ఉన్నాయి. గ్రూప్ 4 ఉద్యోగాల నుంచి మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు ఉన్నారు. వాళ్లు తమ పిల్లలకు భాషను నేర్పించుకుంటున్నారు. సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా ఎప్పటికప్పుడు చూపించుకుంటున్నాడు. కానీ అక్షరాలు లేకపోవడంతో తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో చదివించుకుంటున్నారు. అదే భాషకు లిపి ఉంటే ఎంతో కొంత మేలు జరిగి ఉండేదని, మిగతా భాషల చదువులతో పాటు ఈ బంజారా జాతి అక్షరాలను నేర్చుకొని ఉండేవారని అంటున్నాడు. గతంలో కూడా కొందరు లంబాడీ భాషకు లిపి రాశామని వార్తల్లోకెక్కినా ఎవరు రాసిన అక్షరాలు అధికారికంగా ఎంపిక కాలేదు. దశరథ్ కూడా తను రాసిన అక్షరాలు అధికారికం కావని, తన జాతి కోసం చేసిన చిన్న ప్రయత్నమని చెప్తున్నాడు. ప్రభుత్వం ఓ కమిటీ వేసి ఇంతకుముందు రాసిన వాళ్లను, జాతి పెద్దలను చర్చకు కూర్చోబెట్టి కమిటీ ద్వారా లిపిని అధికారికంగా గుర్తిస్తే బాగుంటుందని కోరుతున్నాడు.

అభిప్రాయం..అనారోగ్యం

తాను రూపొందించిన గిరిజన భాషను నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్లకు ఉచితంగా నేర్పించడానికి దశరథ్ సిద్ధంగా ఉన్నాడు. చాలామంది ఇంగ్లీష్, తెలుగు అక్షరాలు నేర్చుకోవడంలో వెనుకబడి ఉన్నారని ఇంకా ఈ భాష ఎక్కడ నేర్చుకుంటారని హేళన చేశారని చెప్పాడు. ఎప్పటికైనా తను పుట్టిన జాతి కోసం భాష, లిపి కోసమే కాకుండా సాహిత్యం కోసం, సంస్కృతి, సంప్రదాయం కోసం శ్రమిస్తానని అంటున్నాడు. ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న గిరిజన అధికారులు, నేతలు ప్రత్యేక దృష్టి పెడితే అధికారికంగా లిపిని సిద్ధం చేయడం, అమలుపరచడం సులువు అవుతుందని అభిప్రాయపడుతున్నాడు. రాష్ట్ర జనాభాలో పదిశాతం ఉన్న లంబాడీ గిరిజనుల అక్షరాస్యతను పెంపొందించేందుకు వీలుగా లంబాడీ భాషా, లిపిలో పాఠ్య పుస్తకాలనూ ముద్రిస్తే అలాంటి చర్చలు జరిగి చర్యలు తీసుకుంటే మరింత మంచి జరుగుతుందని భావిస్తున్నాడు. ఇతను రూపొందించిన భాషలో అరబిక్ భాష అక్షరాలకు దగ్గరగా ఉందని కొందరు వ్యతిరేకించినా, ఒక ప్రయత్నానికి నాంది పలికాడని మరికొందరు మెచ్చుకుంటున్నారు. కాగా ప్రస్తుతం దశరథ్ నాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నరాలకు సంబంధించిన వ్యాధితో వైద్యం చేయించుకోలేక సతమతమవుతున్నాడు.

అక్షరశిల్పి.. భాషకు లిపి

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరి గ్రామ పంచాయితీ పరిధిలోని లచ్యానాయక్ తండాకు చెందిన పాట్లావత్ దశరథ్ ఈ ఘనత సాధించాడు. బాలానగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆర్థిక పరిస్థితులు బాగులేకపోవడంతో పక్క గ్రామంలో ఉన్న కంపెనీలో పనికి చేరాడు. ఇల్లు గడువాలంటే తప్పని పరిస్థితుల్లో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో చాలామంది భాష ఉన్నది కానీ లిపి లేదని మాట్లాడుకుంటుంటే విన్నాడు. తను పుట్టిన బంజారా జాతి కోసం తనవంతుగా ఏదైనా చేయాలని సంకల్పించాడు. ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ కష్టమేదో చదువులో కష్టపడితే మంచి ఫలితం ఉంటుందని భావించాడు. కానీ ఆర్థికంగా పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నది. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కన్నా ఏదైనా ప్రయత్నించడం మంచిదని అనుకున్నాడు. లంబాడీ పదాలను పలుకుతూ వాటిని అక్షరాలుగా రాశాడు. కానీ కొన్ని పదాలకు అక్షరాలు దొరకలేదు. ఏ పదానికి ఏది రాస్తే బాగుంటుందని ఆలోచించి మూడు విభాగాల్లో విభజించి శబ్దాలంకాలను సమకూర్చి రెండు,మూడు నెలలు కష్టపడి టైప్ 1, టైప్ 2, టైప్ 3 గ్రూపులుగా 38 అక్షరాలను రూపొందించాడు. గిరిజన జాతుల్లో ఒకటైన లంబాడీలకు భాషలేకపోవడంతో భవిష్యత్తులో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ముందస్తుగా ఈ లిపిని సృష్టించానని చెప్తున్నాడు.

883
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles