వేసవిలో వేధించే.. మూత్రనాళ వ్యాధులు


Tue,March 5, 2019 01:06 AM

మార్చిలో మాడ్చి మాడ్చి కొడుతున్నాయి ఎండలు. ఫిబ్రవరి వరకు వాతావరణం మామూలుగానే ఉన్నది కాబట్టి.. ఆహార నియమాలు.. జీవనశైలి ఎలా ఉన్నా నడిచిపోయింది. ఇప్పుడు మండే ఎండలు మస్త్ ఊపు మీదున్నాయి. మూత్రనాళ.. కిడ్నీ వ్యాధులు విజృంభించే ప్రమాదముంది. అప్రమత్తంగా ఉండి.. వేధించే వేసవి వ్యాధులను తరిమికొట్టండి!
urinals
దేశంలో సుమారు 80 లక్షల మంది మూత్రనాళ సమస్యల వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రతి 1000 మందిలో ఒకరు మూత్రపిండ వ్యాధి కోసం చికిత్సలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఎక్కువవుతున్నాయి. వేసవి కాలంలో దాదాపు 40% మందికి ఈ సమస్య ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగిపోవడం.. తేమ తగ్గడం.. ఆహారపు అలవాట్లలో లోపాల వల్ల మూత్రనాళ సమస్యలు పెరిగి అవి మూత్రాశయంపై ప్రభావం చూపిస్తున్నాయి.


మూత్ర పిండాల్లో రాళ్లు

మూత్రపిండాలలో రాళ్లు చాలావరకు క్యాల్షియంతో కూడినవి. శరీరంలోని రక్తాన్ని మూత్రపిండాలు వడగడతాయి. శరీరంలో నీరు, ఇతర ద్రవాలు తక్కువ కావటంతో మూత్రం చిక్కబడి ఆమ్ల(యాసిడిక్)రూపానికి మారుతుంది. మరోవైపు శరీరధర్మక్రియల అనంతరం వెలువడిన ఉప్పు, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పేట్, ఆక్జలేట్స్, యూరిక్ యాసిడ్ మూత్రపిండాలను చేరుకుంటాయి. వడపోత అనంతరం కూడా ఇవి అక్కడే మిగిలిపోతాయి. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఈ మిగులుబడ్డ పదార్థాలు గట్టిబడి స్ఫటికాలుగా ఏర్పడతాయి. ఇవి క్రమంగా ఒక్కచోటచేరి చిన్న రాళ్లుగా తయారవుతాయి.


యూరినరీ ఇన్ఫెక్షన్లు

సాధారణ సమయాలలో కంటే ఎండాకాలంలో చెమట ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నీరు-ద్రవాల శాతం తగ్గుతుంది. ఈ స్థితిని గుర్తించిన మెదడు దేహంలోంచి బయటకు వెళ్లే నీటి పరిమాణాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవటం ప్రారంభిస్తుంది. మూత్రం పరిమాణం తగ్గించటం ఈ దిశలో ఎక్కవ ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఆమేరకు మూత్రపిండాలకు సూచిస్తుంది. అందువల్ల తక్కువ మొత్తంలో మూత్రం తయారవుతుంది. అది ఎక్కువ సమయం పాటు మూత్రాశయంలో నిలువ ఉండిపోతుంది. ఇలా ఉండటం దానిలో బాక్టీరియాలు పెరగటానికి కారణం అయి మూత్రనాళ సమస్యకు దారితీస్తుంది.


యూటీఐ అంటే?

మూత్రపిండాలు, వాటి నుంచి బయలుదేరే రెండు యురేటర్, మూత్రాశయంను కలిపి యూటీఐ అంటారు. దీంట్లో సాధారణంగా కనిపించేది సిస్టైటిస్. దీనిలో మూత్రాశయపు లైనింగ్ వాపునకు గురవుతుంది. అందువల్ల తరచూ మూత్రానుమాననం కలుగుతుంటుంది. మూత్రవిసర్జన సమయంలో నొప్పి కలుగుతుంది. మూత్రం రక్తంతోనో, ఆసాధారణ వాసనకలిగో ఉంటుంది. పొట్టదిగువ భాగంలో నెమ్మదిగా, నిరంతరాయంగా ఉండే నొప్పి కలుగుతుంది. యూటీఐల్లో 90% ఇ.కొలై బాక్టీరియా వల్లనే సోకుతుంది. ఆహారనాళంలో సహజంగా ఉండే సూక్షజీవులు యురెత్రాలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు దారితీయడంతో వేసవిలో యూటీఐ సోకుతుంది.


ఎలా గుర్తించాలి?

మూత్రపిండాలలో రాళ్లు.. ఇన్ఫెక్షన్లు.. యూరినరీ.. యూటీఐ సమస్యలు ఏర్పడిన విషయం చాలా కాలం పాటు గుర్తించకపోవచ్చు. ఆ రాళ్లు మూత్రపిండాల నుంచి యురేటర్ (మూత్రపిండాలను మూత్రాశయాన్ని కలిపే నాళం)లోకి జారి మూత్రాన్ని అడ్డుకున్నప్పుడో లేక ఆ నాళంలో ఇరుక్కొని నొప్పి లేచినప్పుడో ఏదో సమస్య ఉందన్న విషయం తెలుస్తుంది. ఇదే సమయంలో వీపులో, పొట్టలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి కూడా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడ్డాయనేందుకు మరో సూచన. కొన్నిసార్లు ఈ క్రమంలో మూత్రంలో రక్తం పడుతుంది. కడుపులో తిప్పినట్లు ఉండటంతో పాటు వాంతులవుతాయి.


చికిత్స తప్పనిసరి

యూటీఐ సోకినట్లు అనుమానం కలిగితే డాక్టర్‌కు చూపించుకోవాలి. నిర్ధారణ అయితే వెంటనే చికిత్సచేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలదాకా చేరుకొని ప్రమాదం తీవ్రతరం అవుతుంది. ఎక్స్ రే, యూరిన్ ఎనాల్సిస్, సి.టి.స్కాన్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు నిర్వహించి మూత్రనాళ సంబంధిత సమస్యలను నిర్ధారిస్తారు. రాళ్లు ఉండి అవి చిన్నవిగా ఉంటే సహజంగానే బయటకు పోయేందుకు అవకాశం ఉంటే మెడిసిన్స్ ద్వారా కరిగేట్లు మందులు ఇస్తారు. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీళ్లు తాగాల్సిందిగా సూచిస్తారు. 5 మిల్లీ మీటర్స్ అంతకంటే చిన్నవిగా ఉన్న రాళ్లు మూత్రంతో పాటు బయటకు వెళ్తాయి. అంతకంటే పెద్దవిగా ఉంటే చికిత్స చేసి తొలగించే ప్రయత్నాలు చేస్తారు.


urinals2

మహిళల్లో ఎక్కువ

స్త్రీ జీవితకాలంలో ఈ ఇన్సెక్షన్లు 50% ఎక్కువ. యాభై సంవత్సరాల వయసులో 3% మంది.. యవ్వనంలో ఉన్న 36% మంది మూత్రనాళ వ్యాధి బారిన పడుతున్నారు. మహిళల్లో యురెత్రా చిన్నదిగా ఉండటం వల్ల బాక్టీరియా వేగంగా మూత్రాశయాన్ని చేరుకొంటుంది. ఈ ఇన్ఫెక్షనుకు చికిత్సచేయని పక్షంలో అది మూత్రపిండాలకు కూడాసోకుతుంది. లైంగిక సంబంధం ద్వారా బాక్టీరియా యురెత్రాలోకి ప్రవేశించి తద్వారా మూత్రాశయానికి చేరుకుటుంది.


ఇవీ సమస్యలు

వాతావరణ ఉష్టోగ్రత 5-7 డిగ్రీలు అధికంగా ఉంటే మూత్రపిండాల్లో సమస్యలు 30% పెరుగుతాయి. ఉష్ణోగ్రత మధ్యస్థంగా ఉండే ప్రదేశం నుంచి ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్లడం వల్ల మూత్రపిండాల సమస్యలు పెరుగుతున్నాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి డీహైడ్రేషన్ ఎక్కువవుతుంది. చెమట రూపంలో నీరు ఆవిరైపోతున్నా ఆ నీటి నష్టాన్ని భర్తీ చేయకపోవడంతో కొంతమంది డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు.


నివారించటం ఎలా?

-ఆహార అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్తపడవచ్చు.
రాత్రిళ్లు తగినంత నీరు తీసుకోవాలి. ఇంట్లో ఉండేవారు రోజుకు 3-4 లీటర్ల నీరు తాగాలి. బయట పనిచేసేవాళ్లు అయితే 4-5 లీటర్లు తాగాలి.
-వేసవిలో చాలామంది సోడా, ఐస్‌టీ, చాకొలేట్ షేక్ తాగుతుంటారు. ఇవి రక్తంలో ఆక్సలేట్ యాసిడ్‌ను పెంచుతాయి. ఈ యాసిడ్ మూత్రపిండాలలో రాళ్లు పెరగటానికి కారణం అవుతుంది. కాబట్టి అవి తాగొద్దు. వీటికి బదులుగా నిమ్మ రసం తాగండి.
-మాంసం, చేపలు, గుడ్ల ద్వారా లభించే ప్రొటీన్ వల్ల కాల్షియం, యూరిక్ ఆసిడ్ స్టోన్స్ పెరుగుతున్నట్లు గుర్తించారు. వీటిలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాలు జీర్ణక్రియ వల్ల యూరిక్ ఆసిడ్స్‌గా విడిపోతాయి. అందువల్ల పోషకాహారంగా ఎంతో ఉపయోగకరమైన ఈ జంతు ఆధారిత ప్రోటీన్లు రోజువారీ ఆహారంలో పరిమితమైన పరిమాణంలో ఉండేట్లు చూసుకోవటం అవసరం.
-సాధారణ ఉప్పులో ఉండే సోడియం వల్ల మూత్రంలో చేరే క్యాల్షియం పరిమాణం పెరిగిపోతుంటుంది. దానివల్ల మూత్రపిండాలలో కాల్షియంతో కూడిన రాళ్లు ఏర్పడతాయి. ఆహారంలో ఉప్పు, టీ-కాఫీ తాగటాన్ని కనీస పరిమాణానికి పరిమితం చేయాలి.
dr-shashi-kiran

1043
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles