వేడి పాలే మేలు


Mon,June 19, 2017 01:08 AM

పచ్చి పాలల్లోనే అన్ని పోషకాలు ఉంటాయన్న ప్రచారం ఇటీవల ఊపందుకున్నది. అంతేకాదు, అంతర్జాతీయ సెలిబ్రిటీలు మార్టిన్ షీన్, గ్వైనెత్ పాత్రో తదితరులు పచ్చి పాలపై ప్రచారం చేస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని ఊదరగొడుతున్నారు.
drinking-hot-milk
పచ్చి పాలలో వ్యాధికారక ఈ.కోలి, సాల్మొనెల్లా, ఇంకా బోలెడన్ని పరాన్న జీవులు ఉంటాయి. పాలు తీసే ప్రక్రియ ద్వారా ఇవన్నీ అందులోకి చేరుతాయి. అమెరికాలో పచ్చి పాలు తాగడం పై ప్రచారం 2007 నుంచి 2012 మధ్య ఊపందుకుంది. అదే సమయంలో వెయ్యి మంది ఆసుపత్రుల పాలయ్యారు. పచ్చి పాలపై జరుగుతున్న ప్రచారంపై స్పందించిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పచ్చి పాలు తాగడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. పాలను పాశ్చరైజేషన్ చేయడం వల్ల అందులోని విటమిన్లు నశించి పోతాయన్న ప్రచారం సరికాదన్నారు. రైతులు విరివిగా పెస్టిసైడ్లను వాడుతున్నారని, పశువులు గడ్డి తినడం, ఇతర మార్గాల ద్వారా హెచ్‌సీ చ్, డీడీటీ తదితర పెస్టిసైడ్స్ పశువుల్లోకి చేరుతున్నాయని కన్సల్టెంట్ డైటీషియన్ డాక్టర్ జీనత్ ఫాతిమా అన్నారు. ఇటీవల లీటర్ పాలు, పాల పదార్థాల్లో 4 మిల్లీ గ్రాముల హెచ్‌సీహెచ్‌ను కనుగొన్నట్టు చెప్పారు.

ఈ రసాయనాలు మనిషికి చాలా చేటు చేస్తాయని తెలిపారు. పాలను కనీసం పది నిమిషాల పాటు వేడి చేయడం ద్వారా మాత్రమే ఈ హానికారక రసాయనాలను నివారించవచ్చన్నారు. పాశ్చరైజేషన్లో 45 శాతం బ్యాక్టీరియా నశిస్తుందని, పాలను మరుగబెట్టడం ద్వారా మిగతా బ్యాక్టీరియాను తొలగించవచ్చని వివరించారు. పాశ్చరైజేషన్ వల్ల న్యూట్రిషన్ విలువలు ఏమాత్రం తగ్గవని చెప్పారు. అయితే కొన్ని ఎంజైములను, విటమిన్-సి తగ్గిస్తుందని పేర్కొన్నారు. పాలను మరుగబెట్టుకుని తాగడమే మంచిదని స్పష్టం చేశారు.

1335
Tags

More News

VIRAL NEWS