వెంటాడే ఎమోషన్స్


Sun,July 22, 2018 01:50 AM

నేడు పేరెంట్స్ డే

అమ్మానాన్నలంటే..ఎప్పుడూ మనల్ని వెంటాడే ఎమోషన్స్. ఇలాంటి ఎమోషన్స్‌ను ఆధారంగా చేసుకొని వస్తున్న సినిమాల్లో అమ్మానాన్నల పాత్రలు మనసును హత్తుకుంటున్నాయి. సినిమాల్లో అమ్మానాన్నల పాత్రల్లో నటించి ప్రేమను, కోపాన్ని, బాధ్యతను
ప్రదర్శిస్తూ ఆ ఎమోషన్‌ను గుర్తుండిపోయేలా చేసిన సినిమా అమ్మానాన్నల గురించి చిన్న కథనం. పేరెంట్స్ డే సందర్భంగా మీ కోసం..

ప్రకాష్‌రాజ్ జయసుధ


ఏ పాత్ర అయినా అవలీలగా నటించగల నటుడు ప్రకాష్‌రాజ్. హీరోయిన్ నుంచి హీరో తల్లిపాత్ర వరకు ఎలాంటి పాత్ర అయినా ఉతికి ఆరేయగల నటి జయసుధ. వీరిద్దరూ కలిసి ఒకే తెర మీద పక్కపక్కన కనిపిస్తే అక్కడ నటన నాట్యం చేస్తుంది. అమ్మానాన్నలుగా ఈ జంట ఎన్నోసార్లు ప్రేక్షకులను మెప్పించారు. బొమ్మరిల్లు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, గోవిందుడు అందరివాడేలే, శతమానంభవతి, కొత్తబంగారులోకం.. సినిమాల్లో అమ్మానాన్నలుగా నటించారు వీరిద్దరు.

చంద్రమోషన్ సుధ


ఎన్నో సినిమాల్లో అమ్మానాన్న పాత్రలో కనిపించారు వీరు. ఒకవైపు భార్యాభర్తలుగా నిత్యం గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే తల్లిదండ్రుల పాత్రల్లోనూ ఒదిగిపోయారు. కడుపుబ్బా నవ్విస్తూనే కన్నీరు కూడా పెట్టించారు. ఇప్పటికీ కుర్ర హీరోలకు తల్లిదండ్రుల పాత్రల కోసం వీరివైపు చూస్తారు దర్శకులు.

నరేష్ పవిత్రాలోకేష్


ఈ మధ్యే ప్రేక్షకులను అలరించిన సమ్మోహనం చిత్రంలో ఈ జంట హీరోకు అమ్మానాన్నలుగా నటించారు. సినిమా పిచ్చోడైన తండ్రి, కొడుకును సపోర్ట్ చేసే తల్లి పాత్రలో తెర మీద ప్రేక్షకులను తెగ నవ్వించారు. వీరిద్దరూ కలిసి, విడివిడిగా ఇతర నటులతో కలిసి పోషించిన అమ్మానాన్నల పాత్రలు ఆకట్టుకున్నాయి.

శ్రీనివాసరావు సంగీత


ఇడియట్ సినిమాలో చంటి (రవిజేత) తల్లిదండ్రుల పాత్రలో కనిపించారు కోట శ్రీనివాసరావు, సంగీత. నిత్యం కొడుకును తిడుతూ కోట, గారాభం చేస్తూ సంగీత నేటితరం పిల్లలకు గుర్తుండిపోయిన అమ్మానాన్నల పాత్రలు.

నాజర్ ప్రగతి


దూకుడు సినిమాలో సమంతా అమ్మానాన్నల పాత్రలు కామెడీని ఇష్టపడే అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కుటుంబం పట్ల స్ట్రిక్ట్‌గా ఉండే తండ్రి, పిల్లలకు కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తూ, తానూ స్వేచ్ఛ కోరుకునే తల్లి పాత్రలో ప్రగతి బాగా ఒదిగిపోయారు. ఓ వైపు నవ్విస్తూనే మంచి నటన కనబర్చిన ఈ దూకుడు అమ్మానాన్నలు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతారు.

రావు రమేష్ నదియా


అత్తారింటికి దారేది సినిమాలో బలమైన పాత్ర పోషించింది నదియా. ఆమెకు భర్తగా రావు రమేష్ నటించారు. సమంత, ప్రణతిలకు అమ్మానాన్నలుగా నటించిన రావు రమేష్, నదియల జంట తెలుగునాట సూపర్‌హిట్టయిన అమ్మానాన్నల జంటల్లో ఒకటి.

వీళ్లే కాదు.. తెరమీద కనిపించిన సినిమా అమ్మానాన్నలు ఇంకా చాలామందే ఉన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ పేరెంట్స్ డే సందర్భంగా అమ్మానాన్నలను గుర్తు చేసుకునే సందర్భంలో కొద్దిమందిని, కొన్ని పాత్రల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. దృశ్యంలో అమ్మానాన్నల పాత్రలో మెప్పించిన వెంకటేష్, మీనా, నేను లోకల్ సినిమాలో పోసాని కృష్ణమురళి, ఈశ్వరీ రావు, మిర్చిలో సత్యరాజ్, నదియా ఇలా తల్లిదండ్రుల పాత్రల్లో మెప్పించిన సినిమా అమ్మానాన్నలు చాలామందే ఉన్నారు.

998
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles