వీడియో గేమింగ్ రంగంలో విజేత అనిల ఆండ్రేడ్


Sun,October 28, 2018 11:25 PM

బిజినెస్ అనగానే హోల్‌సేల్ బిజినెస్, రిటైల్ బిజినెస్ అనుకునే రోజులు ఏనాడో పోయాయి. ఇప్పుడంతా ఆన్‌లైన్ బిజినెస్‌దే ప్రపంచం. అటువంటి వాటిలో వీడియోగేమ్స్ తయారీ రంగం కూడా ఒకటి. స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరిగాక వీడియో గేమింగ్‌ల ప్రాధాన్యం పెరిగింది. కానీ వీడియోగేమ్స్ తయారీ రంగంలో పురుషులదే ఆధిపత్యం. ఈ రంగంలో మహిళల సంఖ్య చాలా తక్కువ. చాలాకొద్దిమంది మహిళలు మాత్రమే ఈ రంగంలో ఉన్నారు. అటువంటి వారిలో అనిల ఆండ్రేడ్ ఒకరు. చిన్నతనం నుంచే వీడియోగేమింగ్ పట్ల ఆసక్తి ఉన్న ఆమె ఈ రంగంలో విజయం సాధించారు. 99 గేమ్స్ పేరుతో గేమింగ్ స్టార్టప్‌ను ప్రారంభించి
విజయవంతంగా నిర్వహిస్తున్న అనిల ఆండ్రేడ్ సక్సెస్‌మంత్ర.

చిన్నప్పటి నుంచే అనిల ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించుకున్నారు. చదువుపై ఆమెకు అమితమైన ఆసక్తి ఉండేది. పోటీ పరీక్షల్లోనూ ఆమె మెరిట్ సాధించేది. అంతేకాదు అన్ని రకాల యాక్టివిటీస్‌లోనూ ప్రతిభ ప్రదర్శించడం ఆమె స్పెషాలిటీ. వయొలిన్, క్లారినెట్ వాయించడంలోనూ దిట్ట. స్కూల్, కాలేజ్ ఆర్కెస్ట్రా బ్యాండ్‌లోనూ పని చేశారు. మణిపాల్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వాలీబాల్, త్రోబాల్ ఆడేవారు అనిల.

వీడియోగేమింగ్‌కు అడిక్టయి

ప్లేగ్రౌండ్ ప్లేయర్ అయిన అనిల వీడియోగేమింగ్ రంగంలోకి రావడం ఆశ్చర్యమనిపించినా, వీడియోగేమింగ్‌లోనూ తనకు ప్రవేశం ఉందని స్వయంగా చెప్పుకుంది. నేను మొదట అడిక్ట్ అయిన ఆట... ఫేస్‌బుక్‌లోని ఫామ్‌విల్లే. నాకు ఫార్మింగ్ అంటే అంత మక్కువ అని ఆ ఆట ఆడేవరకూ నాకు కూడా తెలీదు. ఎప్పుడూ ఆడుతూనే ఉండేదాన్ని. వేళాపాళా లేకుండా అర్ధరాత్రి కూడా లేచి నా క్రాప్స్ ఎండిపోకుండా చూసుకునేదాన్ని అని వివరించారు. అలాగే టెట్రిస్ ఆడేదట. తర్వాత డిగ్రీ సమయంలో బిజ్యూవెల్డ్ అంటే మక్కువ పెంచుకుంది. ఆతర్వాత డైనర్ డాష్, ది సిమ్స్ వంటి వీడియోగేమ్స్‌నూ ఆడింది. ఆ తర్వాత క్రిమినల్ కేస్, వర్డ్స్‌వర్త్, క్యాండీ క్రష్, జెల్లీ స్ల్పాష్ వంటి గేమ్స్ కూడా ఆమె లిస్ట్‌లో ఉన్నాయి.

మస్కట్ టూ మంగళూరు

అనిల ఆండ్రేడ్.. మస్కట్‌లో జన్మించారు. ఆమె తల్లి టీచ ర్, తండ్రి అకౌంటెంట్. కుటుంబంలోని నలుగురు పిల్లల్లో ఆమె రెండో సంతానం. ఇద్దరు అక్కచెల్లెళ్లు, ఒక తము్ముడు ఉన్నారామెకు. తండ్రి మస్కట్‌లో ఉద్యోగం చేస్తుండగానే పిల్లల కోసం మంగళూరు వెళ్లాలని నిర్ణయించుకున్నారు అనిల తల్లి. ప్రాథమిక, హైస్కూల్ విద్యాభ్యాసం మంగళూరులో పూర్తి చేసిన అనిల.. మణిపాల్ ఎంఐటీ నుంచి ఇంజినీరింగ్, ఇక్ఫాయ్ ద్వారా ఎంబీఏ పూర్తి చేశారు.

తొలి ఉద్యోగం

చదువు పూర్తి కాగానే రోబోసాఫ్టోలో క్వాలిటీ కంట్రోల్ మేనేజర్‌గా ఉద్యోగం ప్రారంభించారు అనిల. రెండేళ్లలోనే అనలిస్ట్‌గా మారేందుకు అవసరమైన కోర్సులను పూర్తి చేశారు. దీంతో ఆమె పాత్ర గేమ్స్ డిజైనింగ్‌లోకి మారింది. నేను కాన్సెప్ట్, డిజైన్ తయారు చేసి, బ్లూప్రింట్ రూపొందిస్తాను. ప్రోగ్రామింగ్ టీం దీన్ని అమలు చేస్తారు అంటారు అనిల. కొత్త ప్రొడక్ట్స్ తయారు చేయడానికి అనిల దగ్గర తగినంత టీం ఎప్పుడూ ఉంటుంది. ఆమె కార్యకలాపాలు ప్రారంభించిన తొలి గేమ్ వర్డ్స్‌వర్త్. ఐఫోన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వర్డ్ పజిల్ గేమ్ ఇది. వర్డ్ గేమ్‌లలో రెండో స్థానం, మొత్తం అమెరికా వీడియోగేమ్స్‌లలో 33వ స్థానం పొందడం విశేషం. ఆ తర్వాత మెల్లగా డిజైనర్ నుంచి ప్రొడ్యూసర్ స్థాయికి చేరుకున్నారు. ఈ రంగంలో ఇదే అద్భుతమైన రోల్ అంటూ మురిసిపోతారామె.

99 గేమ్స్‌కు ప్రొడ్యూసర్‌గా..

తొలి ఉద్యోగంగా రోబోసాఫ్ట్ టెక్నాలజీస్‌లో జాయిన్ కావడం అదృష్టమే అంటారు అనిల. క్యాంపస్‌లో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టులో పాల్గొనకపోయినా.. అదృష్టం కొద్దీ రాత పరీక్షకు అవకాశం లభించింది. ఆ పరీక్షను 70 మంది రాస్తే.. షార్ట్ లిస్ట్ చేశాక ఆరుగురిలో అనిల ఒకరు. రోబోసాఫ్ట్ సీఈఓ రోహిత్ భట్.. ఆమెను ప్రతిభావంతురాలిగా గుర్తించి అవకాశమిచ్చారు. ఎక్సెల్‌లో ఎన్నో అవకాశాలు కల్పించారామెకు. 2008లో యాప్ స్టోర్ ప్రారంభమైంది. దీంతో కొత్త కంపెనీ 99 గేమ్స్‌కు ప్రొడ్యూసర్ బాధ్యతలు చేపట్టారు. ఇది రోబోసాఫ్ట్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ. అనిల ఇక్కడ 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.

లేట్‌గానైనా లేటేస్ట్‌గా..

మన దేశంలో ఈ ట్రెండ్ లేటుగా మొదలైంది. 99 గేమ్స్ ప్రారంభించేనాటికి ఇండియాలో ఉన్న గేమింగ్ కంపెనీల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ప్రస్తుతం కొన్ని కాలేజీల్లో ఓ సబ్జెక్ట్‌గా గేమింగ్ ఎంచుకునే అవకాశమిస్తున్నాయి. అలాగే కొన్ని సంస్థలు గేమింగ్స్ డిగ్రీ కోర్స్ బోధిస్తున్నాయి కూడా. అలాంటి గేమింగ్ ఇండస్ట్రీలో మహిళలు చాలాకొద్ది మందే ఉన్నారు. 99 గేమ్స్ సంస్థలో మొత్తం 24 మంది ఉంటే అందులో ఇద్దరు ప్రొడ్యూసర్లు కాగా.. వారి ఇద్దరూ మహిళలే ఉన్నారు.

విజయాలు

కర్ణాటకలోని ఉడిపి నుంచి గేమింగ్ కమ్యూనిటీకి ప్రతినిధిగా పలు జాతీయ, అంతర్జాతీయ కాన్ఫిరెన్సులకు హాజరైన మహిళా స్పీకర్ అనిల మాత్రమే. మేధావులైనా సరే చాలా సింపుల్‌గా ఉండే టీంను లీడ్ చేయడం, ఓ గేమింగ్ సంస్థ స్టార్టప్ స్థాయి నుంచి విధులు నిర్వహించగలగడం, 2 కోట్లమందికి పైగా యూజర్లను ఆకట్టుకున్న గేమ్స్ తయారు చేయగలగడం.. అనిల సాధించిన విజయాలలో కొన్నిగా చెప్పుకోవచ్చు.

ఎదుర్కోవాల్సిన సవాళ్లు

పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినపుడు.. దాన్నో సవాల్‌గానే భావిస్తానంటారు అనిల. టెస్టింగ్, రిక్వైర్‌మెంట్, అనాలసిస్, ఫైనల్‌గా గేమింగ్.. అన్నింటినీ సవాల్‌గానే స్వీకరించానని చెప్తారు. ఈ రంగాన్ని నేను ఓ అవకాశంగా భావించాను. దీనిలోకి వచ్చేశాను. ముందుగా ఇక్కడున్న అబ్బాయిలతో కలిసి పనిచేయాలి. మనం చెప్పేది అంతమందీ వినేలా చెప్పగలగాలి. అర్థమయ్యేట్లుగా చూసుకోవాలి. మనకు ఎంత పరిజ్ఞానం ఉందో వారికి తెలియచెప్పాలి అంటారు అనిల.

స్ఫూర్తిదాతలు.. ఇష్టయిష్టాలు..

మరిస్సా మాయర్, షెరిల్ శాండ్బెర్గ్, జె.కె. రోలింగ్‌లు తనకు స్ఫూర్తి అంటారు అనిల. ఆమెకు ప్రయాణలన్నా.. వాటితో పరిచయాలన్నా చాలా ఇష్టం. ఏదైనా ఒంటరి ప్రయాణం చేయాల్సి వచ్చినా.. తోటి ప్రయాణికులతో వెంటనే మాటలు కలిపేస్తారామె. పుస్తకాలు చదువడం ఆమెకు చాలా ఇష్టం. అలాగే రొమాంటిక్ కామెడీ మూవీస్ చూడడం, ఫ్రెండ్స్- ఫ్యామిలీతో టైం గడుపడం నచ్చుతాయంటారు అనిల.

కాన్ఫిడెంట్‌గా ఉండాలి

success
నా తల్లి ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు. ప్రతీ ఒక్కరూ సొంతకాళ్లపై నిలబడాలని చెప్పేవారు. అభివృద్ధి కోసం ఎవరికి వారు కష్టపడాలని బోధించేవారు. తానే సొంతగా స్పీచ్‌లు తయారు చేసి మరీ... పబ్లిక్‌లో మాట్లాడడాన్ని ప్రోత్సహించేవారు. మేం ఆ ప్రసంగ పాఠాలను ముందుగానే చదువుకొని.. ఎంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలిగేవాళ్లం. నా జీవితంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషించిందని భావిస్తాను. నేనెప్పుడూ స్టేజ్ ఫియర్‌ను ఫేస్ చేయలేదు. చిన్నప్పటి నుంచే నలుగురిలో మాట్లాడడానికి ఇబ్బంది పడలేదు.
- అనిల

మహిళలూ రావాలి

xiaomi-black-shark
ప్రస్తుత కాలంలో ఎంతో మంది మహిళలు గేమింగ్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. డిజైనర్లు, ప్రోగ్రామర్లతోపాటు మార్కెటింగ్‌లోనూ సత్తా చాటుతున్నారు. ఇంతటి పురుషాధిక్య రంగంలో మహిళలు పెరుగడం అభినందించదగ్గ విషయమే. గేమింగ్ రంగంలోకి రావాలనే ఉత్సాహం ఉన్న మహిళలకు అనిల గేమింగ్ ఎప్పుడూ చాలెంజే. కానీ ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం. ఇక్కడ అవకాశాలకు కొదువ లేదు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ సామద్ధ్యాన్ని, టాలెంట్‌ని, క్రియేటివిటీని అభివృద్ధికి బాటలుగా వేసుకోండి అని సలహా ఇస్తున్నారు.

973
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles