విలేజ్‌లో.. షాపింగ్ చేద్దాం రండి!


Sat,August 25, 2018 01:45 AM

తమ్ముడికి అక్క రక్ష.. చెల్లెకు అన్న రక్ష.! తోడబుట్టిన అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు కట్టే రాఖీల పండుగ రేపు! అంత ప్రేమతో రాఖీ కడితే.. అంతే ప్రేమతో కానుక ఇవ్వాలి కదా? ఏమిచ్చినా తీసుకొనే అక్కాచెల్లెళ్లకు సందర్భమేమొచ్చినా ఇచ్చే ఏకైక కానుక చీరె!
ఈ సహజమైన ప్రేమలకు కానుకగా ఇచ్చే చీరె కూడా సహజరీతుల్లో ఉంటే ఎలా ఉంటుంది? సంబురంగా.. చూడముచ్చటగా ఉంటుంది కదా? సిటీలోని రద్దీ షాపింగ్ మాల్స్‌లో కాకుండా.. విలేజ్ విహారంలో షాపింగ్ చేసి చీరె సంబురం చేసుకుందాం!
సిటీలో షాపింగ్ మజాను ఇస్తుండొచ్చు. కానీ మనీ విషయంలో ఆలోచింపజేస్తుంది. అద్దాల మేడల్లో షాపింగ్ చేయడం ఆనందాన్ని ఇస్తుండొచ్చు. కానీ అద్దం ట్యాక్సూ.. అబ్బుర పరిచే విద్యుత్ దీపాల ట్యాక్సూ భారమే కదా. పైగా రద్దీ ఎక్కువ. రభసా ఎక్కువే. రాఖీ పండుగ పూట షాపింగ్ సంతోషిస్తూ చేయాలి. ఇలా ఆందోళనకర మొఖాలతో కాదు కదా?

Sarees

కొత్త ట్రెండ్!

మీ కోసం కొత్త షాపింగ్ ట్రెండ్ వచ్చేసింది. అదే విలేజ్ షాపింగ్. సిటీలో కనిపించే ఏ ట్రాఫిక్కూ ఉండదు. అదో టూరింగ్‌కు వెళ్లిన ఫీల్ ఉంటుంది. నేరుగా చీరల తయారీ కేంద్రాల దగ్గరికే వెళ్లి షాపింగ్ చేయొచ్చు. నచ్చిన చీరెలు కొనుక్కోవచ్చు. పనిలో పనిగా చేనేత మగ్గాలనూ చూడొచ్చు. ఇంకా.. ఎంతలేదన్నా 30 శాతం తక్కువ ధరకే వస్ర్తాలు కొనుక్కోవచ్చు. శ్రావణమాసం షాపింగ్.. రాఖీ పండుగ షాపింగ్ చేసేవారు ఒకసారి ఈ విలేజ్ షాపింగ్ ట్రై చేయండీ. నల్లగొండ జిల్లా చండూరు, గట్టుప్పల, యాదాద్రి జిల్లా పుట్టపాక, నారాయణపురం, కొయ్యలగూడెంలకు వెళ్లొచ్చు. ఏ ఊరికైనా హైదరాబాద్ నుంచి రెండు గంటలు కూడా పట్టదు. ఆ ఊర్లకు వెళ్లి చేనేత చీరెలు ఎక్కడ దొరుకుతాయని అడగాల్సిన పని లేదు. మగ్గం శబ్దం లయబద్ధంగా వినిపిస్తూనే ఉంటుంది. రంగులు అద్దుతున్న దృశ్యాలు కనువిందు చేస్తాయి. నమూనా డిజైన్లను వేసే యువతరం చేతులు నృత్యం చేస్తూనే ఉంటాయి.

చలో విలేజ్!

వస్త్ర ప్రపంచంలో ఇక్కత్ ఓ పురాతన ట్రెండ్. ఇప్పుడదే ఫ్యాషన్ ట్రెండ్. ఇక్కత్ ఫ్యాషన్ ప్రియులకు ప్యాషన్(అభిరుచి). ఇక్కత్‌తోనే ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలేస్తున్నారు. ఇప్పుడు చేనేత వర్గం ఇక్కత్‌లోనే సరికొత్త ప్రయోగాలతో అదరగొట్టేస్తోంది. కాటన్, పట్టు వస్ర్తాల్లో వైవిధ్యమైన డిజైన్లను క్రోడీకరించి అంతర్జాతీయ మార్కెట్‌ను అందుకుంటున్నారు. చీరలే కాదు.. పట్టు పరికిణి, పంజాబీ డ్రెస్, లెహంగా ఓణి.. షర్టూ ప్యాంటూ.. ఇలా ఒక్కటేమిటి? సెలబ్రిటీలకు సూటూబూటూ అదే! రేమండ్‌తోనే కాదు. ఇక్కత్‌తోనూ షూట్ కుట్టించుకోవచ్చు. మెడలో ఫ్యాషన్ టవల్. అందరికీ స్కార్ఫ్స్‌గానూ వినియోగం. అతిథులను గౌరవించేందుకు శాల్స్ కూడా ఇక్కత్ డిజైన్లే. అందుకే ఇక్కత్ ఓల్డ్.. గోల్డ్.. న్యూ ట్రెండ్.

షాపింగ్ విహారం!

అన్నింటికీ మించి అందరి మనసు దోచిన డిజైన్ ఇక్కత్. అందుకే పట్టణాల్లోని అనేక షోరూముల్లో ఎన్నెన్నో మోడళ్లు దర్శనమిస్తున్నాయి. కానీ మగ్గాల దగ్గరే ఇష్టమైన వస్ర్తాలను కొనుగోలు చేయాలంటే మాత్రం.. పట్టు, కాటన్, లినెన్.. చీరెలు. లెహంగా, డ్రెస్ మెటీరియల్.. షర్ట్, ప్యాంట్.. ఇలా ఒక్కటేమిటి! ఏది కావాలన్నా చలో పోచంపల్లి. పెద్ద పెద్ద షోరూములు, పట్టణాల్లో కంటే మగ్గాల దగ్గర, మగ్గాలు నేయించే మాస్టర్ వీవర్ల దగ్గర కొనుగోలు చేయడం బెటర్. ఎల్బీనగర్ నుంచి కేవలం 33 కి.మీ. మాత్రమే. కారులోనైతే 45 నిమిషాలు. బస్సులోనైతే గంట ప్రయాణమే. ఇదొక విహారంతో కూడిన షాపింగ్‌లా అనిపిస్తుండటంతో కస్టమర్లు ఎక్కువ సంఖ్యలో వెళ్తున్నారు.
Sarees1

పరిచయాలతో వ్యాపారం

పెద్ద పెద్ద షోరూముల్లో కొనాలన్న ట్రెండ్‌కు కాలం చెల్లింది. నాణ్యమైన వస్ర్తాలను కొనాలన్న ఆకాంక్ష పెరిగింది. ప్రతి శని, ఆదివారాల్లో భూదాన్‌పోచంపల్లికి హైదరాబాద్ నుంచి 200 నుంచి 250 కార్లల్లో వినియోగదారులు వెళ్తున్నారు. మిగతా ప్రాంతాలకు పరిచయం ఉన్నోళ్లు వెళ్తున్నారు. వారాంతపు రోజుల్లో ఆయా కేంద్రాల్లో రూ.లక్షల్లో వ్యాపారం సాగుతున్నది. నాణ్యమైన వస్ర్తాల కోసం కాస్త టైం కేటాయించడం వల్ల డబ్బు కూడా ఆదా అవుతుంది. మగ్గాలు నేసే ప్రాంతాల్లో ఇక్కత్, ఉప్పాడ, లినెన్, ఎరీ సిల్క్, సిల్క్/లినెన్, లినెన్/లినెన్, లినెన్/కాటన్, కాటన్/సిల్క్, ట్విల్‌వీవ్, జకాట్, సిల్క్/దుప్యాన్, కంచిలో ఇక్కత్, కంచి సిల్క్, చైనా సిల్క్, మూగా సిల్క్, టస్సర్, మల్బరీ, కోటా, ఖద్దర్.. ఇలా ఒక్కటేమిటి? రకరకాల చీరెల తయారీని స్వయంగా చూడొచ్చు. రూ.4 వేల నుంచి రూ.లక్షన్నర వరకు చీరెలు లభిస్తాయి. డ్రెస్ మెటీరియల్స్, దుప్పట్లు, షర్టింగ్‌కు అవసరమైనవన్నీ లభిస్తాయి. కొనుగోలు చేసి అవసరాలను తీర్చుకోవచ్చు. పెండిళ్లలో.. శుభకార్యాల్లో డబ్బు నూ ఆదా చేసుకోవచ్చు.

హైదరాబాద్ కస్టమర్లే అధికం..

ఫ్యాషన్ ట్రెండ్ మారింది. యువతరం చేనేత వస్ర్తాలనే కోరుకుంటున్నారు. అందుకే ఆధునిక కాలానికి తగ్గట్లుగా మేం డిజైన్లను రూపొందిస్తున్నాం. వారాంతపు రోజుల్లో పోచంపల్లి హైదరాబాద్ నుంచి వచ్చే వినియోగదారులతో కిక్కిరిసిపోతున్నది. నాలుగేండ్లల్లో గ్రామీణ ప్రాంతంలోనే హ్యాండ్లూం మార్కెటింగ్ పెరిగింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అవసరమైన వస్ర్తాలను కొనేందుకు ఈ శ్రావణ మాసంలో వచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది. వచ్చే వినియోగదారులు షోరూంలతో పాటు మగ్గాల దగ్గరికీ వెళ్తున్నారు. చీరెల తయారీని స్వయంగా చూస్తున్నారు. దాంతో కార్మికుల పనితీరు, నేర్పరితనాన్ని తెలుసుకుంటున్నారు. చేనేత వస్ర్తాల విలువను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కూడా అధికమైంది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేనేత రంగానికి విలువ పెరిగింది. ప్రచారం విస్తృతంగా కల్పిస్తున్నారు. అందుకే అమ్మకాలు రెట్టింపయ్యాయి.
Sheshagiri

ఇక్కత్ కాటన్

వందల రంగుల్లో ఆకర్షణీయమైన రంగుల్లో ఇక్కత్ కాటన్ చీరలు రూ.1500 నుంచి రూ.3 వేల వరకు లభిస్తాయి. రకరకాల డిజైన్లు లభిస్తాయి.

కంచిలో ఇక్కత్

కంచి చీరెలను ఇక్కత్ నమూనాలోనూ తయారు చేస్తున్నారు. కంచి చీరలంటే ఇష్టపడని వారుండరు. దానికి తోడు ఇక్కత్ ఉండడం వల్ల ఆధునికత సంతరించుకుంది. బార్డర్ లేదా కొంగులో ఇక్కత్ డిజైన్‌ను జోడించడం వల్ల కొత్త రూపు వచ్చింది. అందుకే మంచి డిమాండ్ ఉంది. ఒక్క చీరె రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతున్నది.
Sarees2

కంచి సిల్క్

కంచి సిల్క్ చీరల్లో బార్డర్‌లో బుట్టా(చేతితో పూలు, ఇతర డిజైన్లు తీయడం) తీసిన చీరెలు భలే బాగున్నాయి. ఒక్కో చీరె రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతున్నది.

ఎరీ సిల్క్

నాణ్యమైన ఎరీ సిల్క్ ఇక్కత్ డిజైన్లతో కూడిన చీరెలు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ధర పలుకుతున్నాయి. పోచంపల్లి, చండూరులో వాటిని నేస్తున్నారు.

శిరందాస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్ సిటీబ్యూరో
ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

893
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles