చిన్న వయసులోనే భవిష్యత్ తరాల గురించి ఆలోచించాడు. ఊహ తెలిసిన దగ్గర్నుంచీ పర్యావరణంపై ప్రేమ పెంచుకున్నాడు. భూమి, చెట్లు, వాతావరణంపై పదేండ్ల నుంచి అధ్యయనం మొదలు పెట్టాడు. పట్టణీకరణ, అభివృద్ధి పేరుతో వనరులను ఎలా ధ్వంసం చేస్తున్నారో తెలుసుకొని.. తనవైన సూచనలు చేస్తున్నాడు. ఈ క్రమంలో నాసా చేపట్టిన కార్యక్రమంలో భాగస్వామిగా మారి.. పర్యావరణ పరిరక్షణకు తన వంతుగా కృషి చేస్తున్నాడు గిరిసాయి తేజ్. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ విద్యార్థి పేరు వేమూరి గిరిసాయి తేజ్. పట్టణంలోని విన్ఫీల్డ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే పర్యావరణంపై మక్కువ పెంచుకున్న గిరిసాయి.. నాసా నిర్వహించిన విజ్ఞానయాత్రలో భాగమయ్యాడు. గత నవంబర్‌లో ది గ్లోబ్ ప్రోగ్రామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని, తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న పథకాలను స్ఫూర్తిగా తీసుకొని, వాటిపై అధ్యయనం చేసి, నాసాకు తన ప్రాజెక్టు వివరాలు పంపాడు. అందులో గిరిసాయి తేజ్ ప్రస్తావించిన కీలక అంశాలు, సమస్యలైన జలం, మృత్తిక, వాతావరణానికి సంబంధించిన పరిష్కారాలు నాసా ప్రతినిధులను మెప్పించాయి. దీంతో విన్ఫీల్డ్ పాఠశాల డైరెక్టర్, సౌత్ స్టేట్స్ కో ఆర్డినేటర్ గద్దె పుల్లారావుల సహకారంతో ఐర్లాండ్‌లో జరిగిన గ్లోబ్ లెర్నింగ్ ఎక్స్పిడిషన్-2018 సదస్సుకు హాజరయ్యాడు గిరిసాయి తేజ్.

తెలంగాణ నుంచి ఒకే ప్రాజెక్ట్..
భారత ప్రభుత్వం, నాసా సంయుక్తంగా ఐర్లాండ్ దేశంలో జూలై 1 నుంచి 6వ తేదీ వరకు పై సదస్సు నిర్వహించారు. వారం పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 52 దేశాల నుంచి 250 మందికిపైగా ప్రాతినిధ్యం వహించారు. ఈ సదస్సుకు మన తెలంగాణ నుంచి గిరిసాయి తేజ్ రూపొందించిన నమూనా ఎంపికైంది. ఐర్లాండ్‌లోని కెలాన్ర్రీ రాష్ట్రంలో ఆయా దేశాల విద్యార్థులకు పరిశోధనల దశలను వివరించారు. జలం, మృత్తిక, వాతావరణంపై పరిశోధనలు చేస్తూ వాటి నుంచి వచ్చే డేటాను స్వీకరిస్తూ ఉపయోగాలను వివరించారు. గ్లోబ్ లెర్నింగ్ విజ్ఞానయాత్ర ప్రతి ఏటా ఒక్కో దేశంలో జరుగుతుంది. వచ్చే ఏడాది అమెరికాలోని డెట్రాయిట్ సిటీలో జరుగనుంది.

రోజుకొక కొత్త అంశం
ఆరు రోజుల పాటు జరిగిన సదస్సులో మొదటి రోజు వివిధ దేశాల విద్యార్థులతో గ్రూప్ డిస్కన్. అందులో వారి సంప్రదాయాలు, ఆహార విధానాలు, విద్యా విధానాలు, వాతావరణం స్థితిగతుల గురించి ఒకరికొకరు తెలుసుకున్నారు. దీంతో విదేశీ విద్యార్థులతో స్నేహ బంధాలు బలపడ్డాయని అంటున్నాడు గిరిసాయి. రెండో రోజు రాస్క్రాస్ నది వద్ద పీహెచ్, టీడీఎస్‌లను, ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించి నీటి ఉష్ణోగ్రత కనుగొనే విధానంలో శిక్షణ ఇచ్చారు. మూడో రోజు సిటీ సెంట్రల్ పార్క్‌లో వాతావరణ అధ్యయనంపై శిక్షణ ఇచ్చారు. క్లౌడ్ టైప్, వర్షాన్ని ఇచ్చే మేఘాలు, ఏరోసాల్స్, కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలను కనుగొనే విధానాన్ని వివరించారు. నాల్గో రోజు లాండ్ కవర్‌పై శిక్షణ ఇచ్చారు. ఐదో రోజు పొలంలోని మృత్తిక రంగు, రకం, పీహెచ్ కార్బోనేట్ల విధానంపై అవగాహన కల్పించారు. ఇంప్రాపర్ లాండ్ మ్యానేజ్మెంట్ డ్యూటు అర్బనైజేషన్ అనే అంశంపై గిరిసాయి తేజ్ ప్రదర్శన ఇచ్చాడు. సారవంతమైన పంట భూములన్నీ రియల్ ఎస్టేట్‌గా మారడం, దీనివల్ల పల్లె ప్రజలు వలస బాటపట్టడం, జనాభా పెరుగుదల వల్ల పంట భూముల్లో ఆవాసాలు, పరిశ్రమలు ఏర్పడడం, తద్వారా ఉష్ణోగ్రతలు పెరిగి, వాతావరణం మారిపోయి కొత్త వ్యాధులు రావడం వంటి అంశాలను ప్రస్తావించిన గిరిసాయి తేజ్‌ను సానా ప్రతినిధులు అభినందించారు.
తెలంగాణ పథకాలే స్ఫూర్తిగా..
తెలంగాణ రాష్ట్రంలో పల్లె వాసులు పట్టణాలకు వలసలు పోవడాన్ని అరికట్టేందుకు, బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న పనులను, ప్రాజెక్టులు, అమలు చేస్తున్న పథకాల గురించి వివరించాడు గిరిసాయి తేజ్. అంతేకాకుండా కులవృత్తులు, చేతివృత్తులకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించే విధానాన్ని నాసా ప్రతినిధులకు వివరించాడు. దీంతో గిరిసాయి ప్రజెంటేషన్‌ను మెచ్చిన వారు అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఐర్లాండ్‌లో గిరిసాయితేజ్ మంచి ప్రదర్శన ఇవ్వడంతో ఉపాధ్యాయుడు గద్దె పుల్లారావు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- మనోజ్‌కుమార్
నమస్తే తెలంగాణ ఖమ్మం ఎడ్యుకేషన్