విధి వంచించింది..విజయం తలవంచింది


Wed,August 29, 2018 01:27 AM

-పట్టుదలతో పర్వతాలెక్కుతున్న ఓ సామాన్యుని కథ ఇది.
-ఆరు పర్వాతాలెక్కిన అసాధ్యుడి కథ ఇది.
-దేశం నలుమూలలా కీర్తిపతాకను ఎగురవేస్తున్న తెలంగాణ బిడ్డ కథ ఇది.
-విధి వంచించినా విజయాన్ని తల వంచుకునేలా చేసిన మరిపెల్లి ప్రవీణ్‌పై ప్రత్యేక కథనమిది.

మామూలు చలికి ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటేనే భయపడుతాం. గడ్డకట్టే చలిలో ఆక్సిజన్ కూడా అందని పర్వతాలు ఎక్కడమంటే మామూలు విషయమా? విధి ఎన్నిసార్లు అడ్డుపడి ఆపాలనుకున్నా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్న యువకుడు మరిపెల్లి ప్రవీణ్. యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకొని పర్వతాలెక్కి సూర్య నమస్కారాలు చేస్తున్నాడు. ఏడు ఖండాల్లో ఎత్తయిన శిఖరాలు ఎక్కడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ బిడ్డ పరిచయమిది.
Praveen
ఒకటి.. రెండు పర్వతాలు ఎక్కితేనే చాలా గొప్పగా భావిస్తారు. ఏకంగా ఆరు పర్వతాలు ఎక్కాడు ప్రవీణ్. ఇది సాధ్యమవ్వాలంటే దీని వెనుక అంతులేని ఆత్మైస్థెర్యం.. పట్టు సడలని విశ్వాసం.. కఠోర శ్రమ తప్పనిసరిగా ఉంటుంది. ఎక్కిన పర్వతాలపై గడ్డకట్టే చలి, అతి తక్కువ ఆక్సిజన్ వద్ద ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడమంటే ఎవరికైనా కష్టమే.. కానీ అలాంటి అనితరసాధ్యాన్ని అవలీలగా చేసి చూపించాడు. విజువల్, ఫైన్ ఆర్ట్స్, యోగాలో ప్రతిభ చూపుతూ దేశం నలువైపులా తెలంగాణ కీర్తిపతాకను ఎగురవేస్తున్నాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన మరిపెల్లి ప్రవీణ్ చిన్ననాటి నుంచి చదువులో మంచి ప్రతిభావంతుడు. అతని ప్రాథమిక విద్యాభ్యాసమంతా స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగింది. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు నాన్న లింగాగౌడ్, పదో తరగతిలో అమ్మ విజయ మరణించారు.

దీంతో అక్క, చెల్లెలి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రవీణ్‌పై పడింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితిలో సైతం 2001 సంత్సరంలో అప్పటి వరకు ఆ పాఠశాలలో ఎవరూ సాధించలేని 500 మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఇతని ప్రతిభను గుర్తించిన మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల ఉచితంగా ప్రవేశం కల్పించగా ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. ఆర్ట్స్ మీద ఉన్న ఆసక్తితో 2003-07 వరకు హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(పెయింటింగ్) చదివాడు. గుజరాత్ వడోదరలోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీలో 2007-09లో మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్(గ్రాఫిక్స్) కోర్సును పూర్తిచేశాడు.

ముందుచూపు.. యోగావైపు

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీనికితోడు అక్క పెళ్లి బాధ్యత ఆర్థికంగా కృంగదీసింది. హైదరాబాద్‌లో బీఎఫ్‌ఏ చదువు కొనసాగిస్తూనే కమర్షియల్ ఆర్టిస్టుగా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో పాటు స్నేహితులు, బంధువుల సహకారంతో 2005లో అక్కకు పెళ్లి చేశాడు. మరోవైపు వడోదరలో మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ చేస్తూనే ఉత్తమ చిత్రాలను గీసి పలు ఎగ్జిబిషన్‌లలో ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో మానసిక ఒత్తిడి ఎక్కువై మెడ, వెన్నునొప్పి, ఒకవైపు తలనొప్పి వంటి రుగ్మతలు చుట్టుముట్టాయి. వైద్యులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో స్నేహితుని సలహా మేరకు 2009లో వడోదరలోని యోగా నికేతన్‌కు వెళ్లాడు. ప్రతి నిత్యం యోగా సాధన చేయడంతో రుగ్మతలు దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో యోగాపై మక్కువ పెంచుకొని అక్కడే యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సును 2010-11లో పూర్తిచేసి శిక్షకునిగా మారాడు. అప్పటి నుంచి పెయింటింగ్ ఎగ్జిబిషన్ చేస్తూనే యోగా శిక్షకునిగా కొనసాగుతూ 2012లో చెల్లికి వివాహం చేశాడు.
Praveen1

పర్వతాలపై అసాధారణ ప్రతిభ..

పర్వతారోహణ ఒక ఎత్తైతే.. దానిపై సూర్య నమస్కారాలు మరో ఎత్తు. ఇప్పటి వరకు ప్రవీణ్ ఆరు ఎత్తైన పర్వతాలను అధిరోహించి అక్కడ తక్కువ ఉష్ణోగ్రతలో 108 సార్లు సూర్య నమస్కారాలు పూర్తి చేసి అసాధారణ ప్రతిభ కనబర్చాడు. మొదటిసారిగా 2016 ఆగస్టు 30న హిమాచల్‌ప్రదేశ్‌లోని 4200 మీటర్ల ఎత్తైన మనీమహేశ్ కైలాస్ పర్వతం ఎక్కాడు. అక్కడ మైనస్ 3 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాల వ్యవధిలో 108 సార్లు సూర్య నమస్కారాలు పూర్తిచేసి అబ్బురపరిచాడు. నేపాల్ దేశంలోని సాహసోపేతమైన ఎవరెస్టు బేస్ క్యాంపును 2017 ఏప్రిల్ 21న అధిరోహించాడు. 5,364 మీటర్ల ఎత్తైన బేస్‌క్యాంపుపై మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలో 27 నిమిషాల్లో 108 సార్లు సూర్యనమస్కారాలు చేసి యోగా ఎంత శక్తివంతమైందో నిరూపించాడు. నేపాల్ దేశంలోని 6470 మీటర్ల ఎత్తైన మేరా పర్వతాన్ని పది రోజుల పాటు 187 కిలోమీటర్లు నడిచి 2017 అక్టోబర్ 16న అధిరోహించాడు. అక్కడ దేశ జెండాను చేత పట్టుకొని జాతీయ గీతాలాపన చేశాడు. పర్వతంపై 6150 మీటర్ల ఎత్తులో మైనస్ 7 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 45 నిమిషాల్లో 108 సార్లు సూర్య నమస్కారాలు చేశాడు. 2018 జూలై 10న జర్మనీలోని 1783 మీటర్ల ఎత్తైన గ్రున్‌టెన్ పర్వతాన్ని ఎక్కి 7 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 25 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు పూర్తి చేశాడు. 2018 జూలై 16న జర్మనీ దేశంలోని 2962 మీటర్ల ఎత్తైన జుగ్‌స్పైట్జ్ పర్వతాన్ని అధిరోహించి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలో 25 నిమిషాల్లో 108 సార్లు సూర్య నమస్కారాలు చేశాడు. ఫ్రాన్స్ దేశంలో ఎత్తైన, అత్యంత క్లిష్టమైన మౌంట్‌బ్లా పర్వతాన్ని 2018 జూలై 29న అధిరోహించాడు. ట్రాకింగ్ ైక్లెంబింగ్, రాక్ ైక్లెంబింగ్, స్నో ైక్లెంబింగ్ చేసి 4863 మీటర్ల ఎత్తైన మౌంట్‌బ్లా పర్వతానికి చేరుకొని జాతీయ పతాకాన్ని ప్రదర్శించాడు. కాగా పర్వతంపై 4360 మీటర్ల ఎత్తులో మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రతలో 30 నిమిషాల్లో 108 సార్లు సూర్య నమస్కారాలు చేసి ఫ్రాన్స్ దేశస్తులను అబ్బురపరిచాడు.

అవార్డులు.. ప్రశంసలు..

వడోదరలో అద్భుతాలను గుర్తించే దీపక్ ఫౌండేషన్ 2017లో ఇటు యోగా.. మరోవైపు విజువల్, ఫైన్ ఆర్ట్స్‌లో రాణిస్తున్న ప్రవీణ్‌ను సెవన్త్ హీరో ఆఫ్ వడోదరగా ప్రకటించింది. 2009లో లలిత్ కళా అకాడమీ వారిచే నేషనల్ అకాడమీ అవార్డుతో పాటు గోవా సీఎం చేతుల మీదుగా రూ. 50 వేల నగదు పారితోషకాన్ని అందుకున్నాడు. 2010లో బెంగళూరుకు చెందిన మహువా ఆర్ట్ గ్యాలరీచే హెచ్‌కే కేజ్రీవాల్ యంగ్ ఆర్టిస్ట్ అవార్డును, 2012లో ముంబాయిలోని ఇన్‌లాక్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఇన్‌లాక్ ఫైన్ ఆర్ట్ అవార్డు కైవసం చేసుకున్నాడు. యోగా నికేతన్ ప్రాజెక్టులో భాగంగా వడోదరలో 12-76 వయస్సు గల 276 మందికి 50 రోజుల పాటు శిక్షణ ఇచ్చి, వారితో 2017 జూన్ 20న మూడో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 107 నిమిషాల్లో 108 సార్లు సూర్య నమస్కారాలు చేయించాడు. 2018 జూన్ 20న నాల్గవ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని 465 మందితో 100 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేపించి వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాడు.
-గొల్లమాడ స్వరూప్ మెట్‌పల్లి రూరల్


సూర్య నమస్కారం.. ఆత్మవిశ్వాసం

యోగాలో భాగంగా సూర్య నమస్కారాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. మామూలుగా పదు సంఖ్యలో సూర్య నమస్కారాలు చేయడమే కష్టం కాగా, 2013 మార్చి 30 నుంచి ప్రతిరోజు ఉదయం 21-30 నిమిషాల్లో 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం అలవాటుగా మార్చుకొని మానసికంగా, శారీరకంగా దృఢంగా మారాడు. మొదటిసారిగా 2016లో హిమాచల్‌ప్రదేశ్‌లోని మనీమహేశ్ కైలాస్ పర్వతానికి యోగా గ్రూపు సభ్యులతో కలిసి వెళ్లాడు. అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుందని, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని యోగా గ్రూపు సభ్యులు చెప్పడంతో ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. కానీ యోగా వల్ల కలిగే శక్తిసామర్థ్యాలు, మానసికంగా, శారీరకంగా తాను ఎంత బలంగా ఉన్నానో తెలుసుకునేందుకు ఇదే చక్కని అవకాశంగా భావించాడు. ఎత్తైన ప్రదేశాల్లో తక్కువ ఆక్సిజన్ వద్ద సూర్య నమస్కారాలు చేస్తూ యోగా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని సంకల్పించాడు. ఇదే సంకల్పం పర్వతారోహణకు కారణమైంది.

యోగాతో మానసిక, శారీరక బలాలు

యోగా సాధనతో మా నసిక, శారీరక బలాలు చేకూరుతాయి. నిత్య సాధనతో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగింది. ఫలితంగానే పర్వతాలను అధిరోహిస్తూ, అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద సూర్య నమస్కారాలు చేయగలుగుతున్నాను. ఏడు ఖండాల్లోని గల ఎత్తైన పర్వతాలపై సూర్య నమస్కారాలు చేసి యోగా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పాలన్నదే తన లక్ష్యం. ఇప్పటి వరకు ఆసియా ఖండంలోని మూడు, యూరప్ ఖండంలో మూడు పర్వతాలను విజయవంతంగా అధిరోహించాను. ఇందుకు వడోదరా నుంచి ఐఐటీ ఆశ్రమం, ఇషితా ఆసుపత్రి, యోగా నికేతన్, ఐకానా లండన్, యోమ్ ఇంటర్నేషనల్, వెల్ విషర్స్ సంస్థలతో పాటు వెల్లుల్ల వీడీసీ, 2000-01 ఎస్సెస్సీ బ్యాచ్ తదితరుల ద్వారా తనకు ఆర్థిక సహకారం లభించింది. ఆఫ్రికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలపై సూర్య నమస్కారాలు చేయాలన్నదే నా జీవితలక్ష్యం.
- మరిపెల్లి ప్రవీణ్

1222
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles