విదేశీ ఫర్నీచర్‌లో.. 100% ఎఫ్‌డీఐలు కావాలి


Fri,September 7, 2018 11:20 PM

ఫర్నీచర్ రంగంలో భారత్ నానాటికీ దూసుకు పోతున్నది. ఏటా రెండంకెల అభివృద్ధిని నమోదు చేస్తున్నది. మనదేశంలో ప్రపంచ స్థాయి ఫర్నీచర్‌కు గిరాకీ అధికమవుతున్న నేపథ్యంలో.. ఈ విభాగంలోకి వంద శాతం ఎఫ్‌డీఐలను ప్రవేశపెట్టాలని పరిశ్రమ నిపుణులు కోరుతున్నారు. అప్పుడే, కళ్లు మిరుమిట్లు గొలిపే ఆధునిక రకాల ఉత్పత్తులు మధ్యతరగతి ప్రజానీకానికి అందుబాటులోకి వస్తాయంటున్నారు. ప్రపంచ బ్రాండ్లు ఎంచుకోవడం అతి సులువుగా మారుతుందని చెబుతున్నారు.

గ్లోబల్ మార్కెట్ అంచనాల ప్రకారం, భారత ఫర్నీచర్ రంగంలో కేవలం హోం ఫర్నీచర్ అమ్మకాల వాటా దాదాపు 65 శాతం దాకా నమోదు అవుతున్నది. ఆ తర్వాతి వాటా ఆఫీసు ఫర్నీచర్‌దే. దీన్ని వాటా ఇరవై శాతం. ఒక్క ఆఫీస్ ఫర్నీచర్ విభాగమే 2021 నాటికి 20 శాతం వృద్ది చెందుతుందని నిపుణుల విశ్లేషణ. ఈ లెక్కల్ని ఫర్నీచర్ సంస్థలు పక్కాగా ఆకళింపు చేసుకుని విభిన్నమైన డెకార్ కలెక్షన్లు, ఇంటీరియర్ డిజైన్ కలెక్షన్లు, కొత్తరకం ఉత్పత్తులను గృహ యజమానులకు అందిస్తున్నాయి.
Furnicher

విదేశీ ఫర్నీచరా.. మజాకా..


అప్పటివరకు స్వదేశీ ఫర్నీచర్ అంటేనే భారతీయుల్లో చాలా మందికి తెలుసు. అయితే 2000 సంవత్సరం తర్వాత భారత్‌కు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్లడంతో వారికి బ్రాండెడ్ ఫర్నీచర్ ప్రత్యేకతలు అర్థమైంది. ఈ క్రమంలో ఉన్నత వర్గాలు, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఇంటి డిజైన్, నాణ్యత మీద అధిక దృష్టి పెట్టారు. ఇలాంటి వారంతా ఖర్చు గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశారు. అంతర్జాతీయ ప్రమాణాలు గల ఫర్నీచర్‌ను కొంటున్నారు. ఇలాంటి వారికోసం కొన్ని సంస్థలు ప్రత్యేకంగా షోరూములను ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా గల గ్లోబల్ బ్రాండ్లను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి స్టయిల్, బ్రాండ్, ధర ప్రకారం విభిన్నమైన ఫర్నీచర్‌ను అందజేస్తున్నాయి.

ఆఫీస్ ఫర్నీచర్‌కు భలే గిరాకి..


వాణిజ్య, ఆఫీసు సముదాయాలకు ఉపయోగపడే ఆఫీస్ ఫర్నీచర్‌కు ఈ మధ్య గిరాకి గణనీయంగా పెరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆఫీసు స్పేసుకు డిమాండ్ అధికమైంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్, ఆఫీసు నిర్మాణాలకు రానున్న రోజుల్లో గిరాకి మెరుగ్గా ఉండటంతో ఫర్నీచర్ విభాగంలో డిమాండ్ కొనసాగుతున్నది. ఐటీ రంగం అభివృద్ది చెందుతున్న నేపథ్యం, స్టార్టప్‌లు, కార్పొరేట్ ఆఫీసుల సముదాయం పెరుగుతుండటంతో వాణిజ్య స్థలాలకు గిరాకి పెరిగింది. అందుకే కమర్షియల్ ఫర్నీచర్‌ను అందించడానికి మరికొన్ని ఫర్నీచర్ సంస్థలు సిద్ధమవుతున్నాయి.

దిగుమతులు అధికంగానే..


హౌసింగ్, కమర్షియల్ నిర్మాణాల వల్ల ఫర్నీచర్‌కు గిరాకీ అధికం అవ్వడమే దిగుమతులు పెరగడానికి ప్రధాన కారణం. యూరప్ సంస్థల నుంచే ఎక్కువగా విదేశీ ఫర్నీచర్ మన వద్దకొస్తుంది. ప్రపంచ ఫర్నీచర్‌లో పేరెన్నిక గల సంస్థలతో కలిసి ఇక్కడి సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకొని విక్రయాలు ప్రారంభించాయి. జర్మనీ, ఇటలీ బ్రాండ్స్‌పై దృష్టి సారించాయి. నాతూజీ ఇటాలియా, డొమిటాలియా, లాఫార్మా, రోసినీ, కాంటే, ఆర్క్‌బోన్, పాపాడాటోస్, బోఫి, పసిఫిక్ గ్రీన్, బ్లావ్, గెయిన్స్ విల్లే, నటిసా, ఆర్క్‌బోన్, మోరాడిల్లా, ఎర్బా వంటివి విదేశీ బ్రాండ్లకు మన దేశంలోకి అడుగుపెట్టాయి. ఇవన్నీ మన భాగ్యనగరంలోనూ లభిస్తున్నాయి. ఆధునిక డిజైన్లను కోరుకునే గృహయజమానులకు ఇవి అనేక ప్రత్యామ్నాయాలను అందజేస్తుండటం విశేషం.

విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం


ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరెన్నిక గల ఫర్నీచర్ బ్రాండ్లను హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. అనేక సంస్థలు రావడానికి సంసిద్ధంగా ఉన్నాయి. అందుకే, విదేశీ ఫర్నీచర్ సంస్థలు మన దేశంలోకి అడుగుపెట్టాలంటే, ఈ విభాగంలో మన కేంద్ర ప్రభుత్వం వంద శాతం ఎఫ్‌డీఐలను అనుమతించాలి. ఇలా సరైన ప్రోత్సాహం ఉంటే తక్కువ రేటుకు విదేశీ ఫర్నీచర్ బ్రాండ్లు మన కొనుగోలుదారులకు లభిస్తాయి.
- భవంత్ ఆనంద్,
సీఎండీ, ఖజానా గ్రూప్

350
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles