వికీ వ్యాసాల ప్రణయ్


Tue,September 19, 2017 12:23 AM

వీడియోలు కావాలంటే యూట్యూబ్‌లో దొరుకుతాయి. ఆడియోలు కావాలంటే తెలుగు వ్యాప్‌లో దొరుకుతాయి. మరి సకల సమాచారం కావాలంటే? ఒక విషయం గురించి మూలాల్లోంచి తెలుసుకోవాలంటే? ఇంకేముంది వికీపీడియాలో దొరికేస్తుంది. కానీ సమాచారం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ప్రణయ్‌రాజ్ వంగరి అనే యువకుడికి ఇదే సమస్య ఎదురైంది. ఇలాంటి సమస్య ఇంకొకరికి రాకుండా ఉండేందుకు వికీపీడియాలో వ్యాసాలు రాశాడు. వికీపీడియాలో ఎక్కువ సంఖ్యలో తెలుగు వ్యాసాలు రాసిన యువకుడిగా రికార్డు సాధించాడు. ఈ సందర్భంగా ప్రణయ్ పరిచయం..
pranay
వికీపీడియా అంటే అదొక విజ్ఞాన భాండాగారం. ఎవరికి ఎలాంటి సమచారం కావాలన్నా క్షణాల్లో అందివ్వగల విషయ సాముద్రికం. ప్రపంచ భాషలన్నింటిలో వికీపీడియా సమాచారం అందుబాటులో ఉంది. కానీ చాలారోజుల వరకు తెలుగులో వికీపీడియా లేదు. కానీ ఆ తర్వాత తెలుగు భాషకు ప్రాముఖ్యత ఇవ్వడం పెరిగాక వికీపీడియాలో తెలుగు సంబంధిత అంశాలు కనిపించడం మొదలయ్యాయి. అలా ఒకరోజు ప్రణయ్ ఏదో అంశానికి సంబంధించి వెతికాడు. ఇతర భాషల్లో సమాచారం దొరుకుతుంది. కానీ.. తెలుగులో దొరుకడం లేదు. ఎలాంటి సమాచారమైన తెలుగులో దొరుకాలంటే ఏం చేయాలి? అని ఆలోచించాడు. ఆ ఆలోచన ప్రణయ్‌ని ఖాళీగా ఉండనివ్వలేదు. వికీపీడియాలో తెలుగులో అన్నీ అంశాలపై వివరాలతో సహా వ్యాసాలు రాయడం మొదలుపెట్టాడు.


ఒకటితో మొదలై:

వేల మైళ్ల దూరమైన ఒక్క అడుగుతోనే మొదలవ్వాలి. ఎంత పెద్ద వరదైనా ఒక్క చినుకుతోనే ప్రారంభమవ్వాలి. ప్రణయ్ వికీ వ్యాసాల పరంపర కూడా అలాగే మొదలైంది. తనకు కావాల్సిన సమాచారం కోసం వెతికి వేసారిన ప్రణయ్ ఎవరికి ఏ సమాచారం కావాలన్న తెలుగు వికీపీడియలో వెతుక్కోవాలి అనుకున్నాడు. ఒక్కటితో మొదలైన వ్యాసాల ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది. అలా ఒకరోజు వికీపీడియా నిర్వహించిన వందరోజులు - వంద వ్యాసాలు అనే పోటీలో పాల్గొన్నాడు. ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా వందరోజులు వంద వ్యాసాలు రాశాడు. ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాల, అన్నీ భాషల వారు పాల్గొన్నారు. కొందరు కొన్ని కారణాల వల్ల మధ్యలోనే డ్రాప్ అయితే.. ప్రణయ్ మాత్రం పూర్తి చేసేదాక విశ్రమించలేదు. ప్రతీరోజు ఏదో ఒక అంశం వివరణాత్మకంగా రాసి వికీపీడియాలో పోస్ట్ చేసేవాడు.

అంతటితో ఆగలేదు:

వందరోజులు - వంద వ్యాసాల తర్వాత కూడా ప్రణయ్ విశ్రాంతి తీసుకోలేదు. వందతోటే ఎందుకు ఆపాలి? ఇంకా ఎన్నో అంశాలకు సంబంధించిన వ్యాసాలు రాయాల్సిన అవసరం ఉన్నది కదా అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వ్యాసాలు రాస్తూనే ఉన్నాడు. అలా సంవత్సరంలో ఏ రోజూ మిస్ కాకుండా 365 వ్యాసాలు రాశాడు. రోజుకో వ్యాసం చొప్పున వికీపీడియాలో ప్రణయ్ రాసే వ్యాసాలు చూసి వికీపీడియా నిర్వాహకులే ఆశ్చర్యపోయారు. ఎలాంటి జీతం ఇవ్వరు. కనీసం ప్రోత్సాహకాలు కూడా ఉండవు. ఏ లాభం లేకుండా మాతృభాష మీద మమకారంతో ప్రణయ్ చేస్తున్న కృషిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

ఫిదా అయ్యారు:

ఓ వైపు చదువు కొనసాగిస్తూనే.. మరోవైపు వికీపీడియాలో వ్యాసాలు, చరిత్రలో ఈరోజు అనే కాలమ్‌తో ఆరోజుకు చరిత్రలో ఉన్న ప్రాధాన్యతను తెలుపుతూ, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంఘటనలు, ప్రముఖుల జననమరణాలు, ఇలా అన్నీ అంశాలకు సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్యాసాలు రాస్తున్నాడు. ఇదంతా గమనిస్తున్న వికీపీడియా వ్యవస్థాపకుడు జమ్మీవేల్స్ ఇటలీలో జరిగిన దశమ వార్షికోత్సవాలకు ప్రణయ్‌రాజ్‌ను స్వయంగా ఆహ్వానించాడు. ప్రణయ్‌తో కలిసి గంటలుగంటలు చర్చించాడు. 200 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటే ప్రణయ్‌ని మాత్రం ప్రత్యేక అతిథిలా గౌరవించారు వికీపీడియా నిర్వాహకులు. ఆ వార్షికోత్సవాల్లో భాగంగా చండీఘర్‌లో జరిగిన వికీపీడియా వార్షికోత్సవాల్లో తెలుగు వికీపీడియా అభివృద్ధి, అవసరం, అందుకోసం చేసిన కృషి దేశంలోని అన్ని రాష్ర్టాల వారికి వివరించాడు ప్రణయ్. ఇప్పటివరకు వికీపీడియాలో 736 వ్యాసాలు రాసిన ఘనత ప్రణయ్‌దే. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు వికీపీడియా నిర్వాహకుడు ప్రణయ్‌రాజ్ వరుసగా 365 వ్యాసాలు రాసి రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా ఆయనకు ఇవే అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు. తెలంగాణ ఐటీ మినిష్టర్ కేటీఆర్ సైతం ప్రణయ్‌ని అభినందిస్తూ ట్వీట్ చేసి, తర్వాత శాలువాతో సన్మానించారు.

కథ వేరే ఉంది:

వికీపీడియా వ్యాస రచయితగా జనమెరిగిన ప్రణయ్ అసలు వ్యాపకం ఇది కాదు. తెలుగు నాటకరంగం అంటే ప్రణయ్‌కి చాలా ఇష్టం. వినూత్న నాటకాలతో జనం దృష్టిని ఆకర్షించి, జనాన్ని చైతన్యపరచాలని నిత్యం ఆలోచించేవాడు. ఆ ప్రయత్నంలోనే భాగంగానే పాప్‌కార్న్ థియేటర్‌లో నిత్యం నాటకాలు రాస్తూ, ప్రదర్శిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత దానికి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కూడా చూస్తున్నాడు. నల్లగొండ జిల్లా మోత్కూరుకు చెందిన ప్రణయ్ తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేశాడు. ప్రస్తుతం తెలుగు ప్రపంచ నాటక సాహిత్య అనువాదాలు - ఒక పరిశీలన అనే అంశంపై ఎంఫిల్ చేస్తున్నాడు. అంతేకాదు.. రంగస్థలం మీద నాటకాలు వేశాడు. షార్ట్‌ఫిలింలు కూడా తీశాడు. జెమినీ టీవీలో వచ్చిన దేవత, దూరదర్శన్‌లో వచ్చిన చంటిగాడి స్వయంవరం సీరియల్స్‌కు, అవంతిక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

వెయ్యి పూర్తి చేస్తా..


నాకు తెలుగు భాషంటే చాలా ఇష్టం. దాంతో పాటే నాటకరంగమన్నా ఇష్టం. అందుకే రెండింటినీ సమానంగా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు వికీపీడియాలో నేను రాసిన వ్యాసాలు ఏదో గొప్ప కోసం రాసినవి కాదు. తెలుగు భాష ఎక్కడా తక్కువ కావొద్దని రాసినవి. తెలుగులో సమాచారం వెతికేవారికి కావాల్సిన సమాచారం తెలుగులోనే దొరుకాలి. ఇతర భాషల మీద ఆధారపడాల్సిన అవసరం రాకూడదు. ఇప్పటి వరకు 736 వ్యాసాలు వికీపీడియాలో రాశా. ఇంతటితో ఆపను. నెక్ట్స్ టార్గెట్ వెయ్యి. ఆ తర్వాత అవసరమైతే ఇంకా రాస్తూనే ఉంటా.
ప్రణయ్‌రాజ్ వంగరి, తెలుగు వికీపీడియా వ్యాస రచయిత

1327
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles