వారసత్వానికి వన్నెలద్దిన శోభనా భార్తియా


Mon,December 10, 2018 02:41 AM

వ్యాపార బాధ్యతలను తన తండ్రి నుంచి వారసత్వంగా స్వీకరించినప్పటికీ విధులు నిర్వహించడంలో మాత్రం తనదైన ప్రత్యేకతతో ముందుకెళ్తున్నారు కొందరు మగువలు. ఆడవారు మీడియా వ్యాపారంలో రాణించలేరన్న విమర్శ కుల అంచనాలను తలకిందులు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఢిల్లీకి మాత్రమే పరిమితమైన పత్రికను దేశమంతా విస్తరించేలా ఆమె కృషి చేశారు. మీడియా రంగంలో అత్యంత ప్రభావిత మహిళగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోని వందమంది శక్తివంతమైన మహిళలతో ఈ ఏడాది ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో 88వ స్థానంలో ఉన్న శోభనా భార్తియా సక్సెస్‌మంత్ర.
Shobha
ఢిల్లీకి చెందిన శోభనా భర్తియా 1957లో జన్మించారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో శోభనా చిన్నది. భర్తియా కోల్‌కతాలో పెరిగింది. అక్కడే లోరెటో హౌజ్‌లో పాఠశాల విద్యను, కోల్‌కతా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ను పూర్తిచేశారు. శ్యామ్‌సుందర్ భార్తియాను వివాహం చేసుకున్నారు. ఆయన కూడా వ్యాపారవేత్త. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఆమె హిందుస్థాన్ టైమ్స్ గ్రూపు ఎడిటోరియల్ డైరెక్టర్. ఈ పదవి ఈమెకు తండ్రి కృష్ణ కుమార్ బిర్లా తర్వాత వంశపారంపర్యంగా సంక్రమించింది.

ఈమె తాత స్థాపించిన బిర్లా ఇనిస్టిట్యూట్

ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సంస్థ ప్రొ-చాన్స్‌లర్‌గా కూడా ఈమె పనిచేస్తున్నారు. తండ్రి కె.కె. బిర్లా తాత జి.జి. బిర్లా. శక్తివంతమైన వ్యాపార కుటుంబంలో పుట్టిన శోభన పత్రికా రంగంలో అతి చిన్న వయస్సులో బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఏనాడో ఆమెను గ్లోబల్ లీడర్ ఆఫ్ టుమారోగా కీర్తించింది.
Shobha1
హిందుస్థాన్ టైమ్స్‌లో చేరేనాటికి ఆమె వయస్సు 29 సంవత్సరాలు. అందులో ఆమె చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. ఒక జాతీయ పత్రికలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరిన తొలి మహిళ భార్తియానే. అంతేకాక చిన్న వయస్సులో ఆ పదవిని అలంకరించిన మహిళ కూడా ఆమెనే. ఆమె నాయకత్వంలో హిందుస్థ్తాన్ టైమ్స్ ప్రకాశవంతమైన యువతరం పత్రికగా ఎదిగింది. పత్రికలో భార్తియా ఎడిటోరియల్‌తో పాటు ఆర్థిక సంబంధ విషయాలు కూడా చూసుకునేవారు. 2005 నాటికి నాలుగు బిలియన్ల పబ్లిక్ ఈక్విటీకి చేరుకునేలా హెచ్‌టీ మీడియాను ఆమె తీర్చిదిద్దారు. ఒకప్పుడు ఢిల్లీకి మాత్రమే పరిమితమైన పత్రికను అభివృద్ధిపథంలో నడిపించారు. ఆదివారం అనుబంధంలో బ్రంచ్ మ్యాగజైన్‌ను తీసుకొనివచ్చారు. తర్వాత హెచ్‌టీ నెక్ట్స్‌ను ప్రారంభించారు. ఈ రెండూ యువ పాఠకుల్ని ఆకట్టుకోవడంతో పత్రికను ఉత్తర భారతదేశంలో ఆరు నగరాలకు విస్తరించారు.

2004లో పత్రికల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి వచ్చినప్పుడు వీరి కంపెనీలో 20 శాతం వాటాను హెండర్సన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్‌కు ఇచ్చారు. దానితో పత్రికను ఆధునీకరించారు. ఆ తర్వాత పబ్లిక్ ఇష్యూ ప్రకటించి నిధులు సమీకరించారు. తర్వాత 2007లో మింట్, ఫీవర్ 104 ఎఫ్.ఎం. రేడియో ప్రారంభించారు. వారసత్వంగా ఈ బాధ్యతలు స్వీకరించినప్పటికీ, విధుల్లో మాత్రం తనదైన మార్కుతో ముందు కెళ్తున్నారు. తండ్రి నుంచి బిజినెస్ తీసుకున్న సమయంలో పెద్దగా లాభాల్లేవు. కానీ, ఇప్పుడు హెచ్‌టీ మీడియా దేశంలోనే అత్యంత విజయవంతమైన మీడియా వ్యాపారాల్లో ఒకటిగా నిలిచింది. కె.కె. బిర్లా కుటుంబం హెచ్‌టీ మీడియాలో 75.36 శాతం వాటాను కలిగిఉంది. ఇది 2004లోనే దాదాపు రూ.8.34 బిలియన్ల విలువను కలిగి ఉంది. 2014 సంవత్సరంలో 155 కోట్ల నికర లాభంతో హెట్‌టీ సంస్థ టాప్ ప్లేస్‌లో నిలిచింది. గతేడాది 24 కోట్లు నికర లాభంతో ముందంజలో ఉంది.

2013లో శోభన సింగపూర్‌లో మింట్ ఆసియా బిజినెస్ వీక్లీని ప్రారంభించారు. ఆ తర్వాత సోషల్, డిజిటల్ మీడియా వెబిట్యూడ్స్‌ను కొనుగోలు చేశారు. హెచ్‌టీ మీడియాకు చెందిన స్టడీమేట్ విద్యార్థులకు కోచింగ్ ఇస్తూ క్రమంగా విస్తరిస్తున్నది. భార్తియా తండ్రి కె.కె.బిర్లా రాజకీయాల్లో కాంగ్రెస్‌కు సన్నిహితంగా ఉండేవారు. ఆమె కూడా అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్‌కు చాలా సన్నిహితంగా పనిచేస్తూ 2006 - 2012 మధ్య రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మీడియా రంగంలో ఆమె చేస్తున్న కృషికిగాను ఔట్ స్టాండింగ్ బిజినెస్ విమెన్ అవార్డు, కార్పోరేట్ ఎక్స్‌లెన్స్ అవార్డు, జర్నలిజం రంగంలో పద్మశ్రీ ఆమెను వరించాయి. ప్రపంచంలోని వందమంది శక్తివంతమైన మహిళలతో గతంలో ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో 93వ స్థానంలో నిలిచిన శోభన ఈ ఏడాది 88వ స్థానంలో నిలిచారు.

చిన్నతనం నుండి ఢిల్లీలోని హిందుస్థాన్ టైమ్స్ కార్యాలయానికి వెళ్లి, అందులోని వివిధ విభాగాల పనితీరు, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ అంశాలు ఆకలింపు చేసుకున్నారు శోభన. అదే సమయంలో వాషింగ్టన్ పోస్ట్ యజమాని క్యాథరిన్ గ్రాహమ్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో శోభనా ఆయనతో పాటు వాషింగ్టన్ వెళ్లి వాషింగ్టన్ పోస్ట్‌లో వారం రోజుల పాటు ఆ సంస్థ ఉద్యోగుల పనితీరు గమనించి పత్రికా రంగం పనితీరుపై అధ్యయనం చేశారు. తిరిగివచ్చిన తర్వాత 1986లో హిందుస్థాన్ టైమ్స్‌లో చేరారు.

హిందుస్థాన్ టైమ్స్, వారి ఇతర ప్రచురణ సంస్థలకు చైర్‌పర్సన్‌గా, ఎడిటోరియల్ డైరెక్టర్‌గా మీడియా రంగంలో ప్రభావిత మహిళగా నిలబడ్డారు శోభనా భార్తియా. ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ బిట్స్ పిలానికి ప్రో చాన్సులర్‌గా కూడా ఉన్నారామే. రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్. ఎండెవర్ ఇండియాకి ఈవిడే ప్రస్తుత చైర్మన్.

860
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles