వరలక్ష్మీ నమోస్తుతే!


Thu,August 23, 2018 12:46 AM

varalaxmi
సౌభాగ్యం.. సిరిసంపదలు కలుగాలంటే.. శ్రావణ శుక్రవారం రోజున.. వరలక్ష్మీ వ్రతం ఆచరించాలి.. ఓం ప్రకృత్యై నమః.. ఓం వికృతై నమః అంటూ.. ఆ దేవికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి.. ధూప, దీప, నైవేద్యాలతో పూజించాలి. ఈవారం ఆ అమ్మకు ప్రీతిపాత్రమైన.. తియ్యని, కమ్మని వంటకాలను ఇలా చేయండి.


నువ్వుల అన్నం

nuvulla-annam
కావాల్సినవి :
బియ్యం : 2 కప్పులు
నువ్వులు : పావు కప్పు
శనగపప్పు : ఒక టేబుల్‌స్పూన్
ఎండుమిర్చి : 4
ఇంగువ : చిటికెడు
నువ్వుల నూనె : 1 1/2 టేబుల్‌స్పూన్స్
కరివేపాకు : రెండు రెమ్మలు
ఉప్పు : తగినంత.


తయారీ
బియ్యం కడిగి మెత్తగా కాకుండా పొడిపొడిగా అన్నం వండుకోవాలి. దీన్ని ఒక ప్లేట్‌లో వేసి ఉప్పు, ఒక టేబుల్‌స్పూన్ నువ్వుల నూనె వేసి కలిపి పక్కన పెట్టాలి. కడాయిలో నువ్వులను వేసి రంగు మారేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. చిన్న కడాయిలో నువ్వుల నూనె పోసి శనగపప్పు వేయించాలి. ఇవి వేగాక ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి దించేయాలి. దీన్ని ముందే కలిపి పెట్టుకున్న అన్నంలో వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులను చల్లారనిచ్చి వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఆ పొడిని కూడా అన్నంలో కలిపేస్తే సరిపోతుంది. రుచికరమైన నువ్వుల అన్నం రెడీ!


పూర్ణాలు

poornam-boorelu
కావాల్సినవి :
శనగపప్పు : ఒక కప్పు
బెల్లం తురుము : ఒక కప్పు
యాలకుల పొడి : అర టీస్పూన్
కొబ్బరి తురుము : అర కప్పు
మినప పప్పు : 3/4 కప్పు
బియ్యం : 2 టేబుల్‌స్పూన్స్
నెయ్యి : ఒక టేబుల్‌స్పూన్
నూనె, ఉప్పు : తగినంత.


తయారీ
మినపపప్పు, బియ్యం కడిగి నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. శనగపప్పులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఆ తర్వాత నీళ్లు మొత్తం వంపేసి గంటపాటు నీళ్లు పోసి జల్లి బుట్టలో వేయాలి. దీంట్లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి ఈ మిశ్రమాన్ని సన్నని మంట మీద రంగు మారేవరకు వేయించి పక్కన పెట్టాలి. ఈలోపు నానిన బియ్యం, మినపపప్పుని మెత్తగా పేస్ట్ చేయాలి. దీంట్లో ఉప్పు వేసి ఉంచాలి. కడాయిలో నూనె పోసి ఇప్పుడు పప్పు మిశ్రమాన్ని చిన్న ఉండలు చేసుకోవాలి వాటిని మినపపప్పు మిశ్రమంలో ముంచి వేయించాలి. ఇలా పిండి మొత్తం చేసుకోవాలి. తియ్యటి పూర్ణాలు నోరూరిస్తూ మీ ముందుంటాయి.


గుమ్మడి వడియాలు

budida_gummadikaya
కావాల్సినవి :
బూడిద గుమ్మడికాయ : పావు కేజీ
మినపపప్పు : 75 గ్రా.
బియ్యం పిండి : 2 టీస్పూన్స్
పచ్చిమిరపకాయలు : 30 గ్రా.
ఇంగువ : అర టీస్పూన్
ఉప్పు, నూనె : తగినంత.


తయారీ :
ముందుగా మినపపప్పును కడిగి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. బూడిద గుమ్మడికాయ చెక్కు తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దీంట్లో ఉప్పు వేసి పావు గంట ఉంచాలి. ఆ తర్వాత అందులో నుంచి వచ్చిన నీళ్లను వంపేయాలి. ముక్కల్లో ఉన్న నీళ్లు కూడా పిండేయాలి. ఆ తర్వాత ఆ ముక్కలను ఒక వస్త్రంలో కట్టి దేనికైనా వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల మిగిలి ఉన్న నీరు కూడా బయటకు వెళ్లిపోతుంది. ఈలోపు మినపపప్పు నానితే దాంట్లోని నీళ్లు తీసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇంకా.. బూడిద గుమ్మడికాయ ముక్కలు, బియ్యం పిండి, ఇంగువ, కొద్దిగా ఉప్పు వేసి పది నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ముక్కలను ఒక్కొక్కటిగా వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. ఇలా మొత్తం చేయాల్సి ఉంటుంది. వీటిని కొబ్బరి చట్నీతో లాగించేస్తే యమ టేస్టీగా ఉంటాయి.


సొజ్జప్పాలు

Sojjappalu
కావాల్సినవి :
మైదా : ఒక కప్పు, బియ్యం పిండి : ఒక టీస్పూన్
రవ్వ : 1/3 కప్పు, చక్కెర : 1/3 కప్పు, నెయ్యి : 2 టేబుల్‌స్పూన్స్
యాలకుల పొడి : పావు టీస్పూన్ , ఫుడ్ కలర్ : కొద్దిగా, నూనె, ఉప్పు : తగినంత.


తయారీ :
గిన్నెలో బియ్యం పిండి, మైదా, ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి మరీ వదులుగా కాకుండా కలుపుకోవాలి. పైనుంచి కొద్దిగా నూనె పోసి ఒకసారి కలిపి పదినిమిషాల పాటు వదిలేయాలి. ఈలోపు నెయ్యి వేసి రవ్వ వేయించాలి. దీంట్లో చక్కెర, యాలకుల పొడి వేసి బాగా కలుపాలి. సన్నని మంట మీద ఉంచి ఫుడ్ కలర్ వేసి, నీళ్లు పోసి చిక్కబడేవరకు ఉంచి దించేయాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. మైదా మిశ్రమాన్ని బాగా కలిపి పూరి సైజుల్లో చేసుకోవాలి. దీంట్లో కేసరిని పెట్టి చిన్న ఉండలా చేయాలి. చేతికి నూనె రాసి దీన్ని మళ్లీ పూరీలా చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు లోపల ఉన్న కేసరి బయటకు రాకుండా చూసుకోవాలి. ఈ పూరీలను నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించాలి. రుచికరమైన అప్పాలు నైవేద్యానికి సిద్ధమైపోయాయి.


కొబ్బరి పాయసం

kobbari-payasam
కావాల్సినవి :
బియ్యం : అర కప్పు
కొబ్బరి తురుము : అర కప్పు, పాలు : 2 కప్పులు
చక్కెర : అర కప్పు, యాలకుల పొడి : అర టీస్పూన్
నెయ్యి : ఒక టీస్పూన్, జీడిపప్పు ముక్కలు : 3 టీస్పూన్స్


తయారీ :
బియ్యాన్ని బాగా కడిగి నీళ్లు పోసి గంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లు తీసేయాలి. దీంట్లో కొబ్బరి తురుము వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. మరి గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టొచ్చు. ఆ తర్వాత గిన్నెలో పాలు పోసి బాగా వేడి చేయాలి. దీంట్లో కొబ్బరి, బియ్యం పేస్ట్ వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. సన్నని మంట మీద కాసేపు అలాగే ఉంచాలి. దీంట్లో చక్కెర, యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. చిన్న కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పులను వేయించి దీంట్లో కలిపితే మరింత టేస్టీగా ఉంటుందీ పాయసం.

1797
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles