లోపిస్తే అస్తవ్యస్తమే!

Sun,March 19, 2017 11:46 PM

vitamin
వాటిని కొద్దికొద్దిగా తీసుకుంటే చాలు.. శరీరంలోని ప్రధాన క్రియలన్నింటినీ బ్యాలెన్స్ చేస్తాయి. ఎదుగుదలకు కావలసిన అన్ని వనరులనూ సమకూరుస్తాయి. అందుకే వాటిని సూక్ష్మ పోషకాలంటారు. వాటిలో విటమిన్లకు ప్రత్యేక స్థానముంది. ఈ విటమిన్లలో బి-కాంప్లెక్స్ అంటే తెలియనివారుండరు. బి-కాంప్లెక్స్‌లో కీలకమైనది బి12 విటమిన్. ఇది లోపిస్తే.. ఇక అంతా అస్తవ్యస్తమే.

ఎప్పుడూ మగతగా ఉంటోంది.. కాని నిద్రలేమి ఏమీ లేదు.బలహీనంగా అనిపిస్తోంది.. కాని సమయానికి, సరిగ్గానే తింటున్నారు.గుండెదడగా అనిపిస్తోంది.. పరీక్షలు చేయిస్తే గుండె భేషుగ్గా పనిచేస్తోంది.
అందుకే ఇదంతా బద్దకమేమో అనుకుని ఊరుకున్నారు. కాని ఈమధ్య కాళ్లూ చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి. ఏంటా అని డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు విషయం అప్పుడు బయటపడింది. అదే విటమిన్ బి12 లోపం.

దినేష్ ఈ మధ్య సరిగా నడవలేకపోతున్నాడు. నడుస్తుంటే తూలుతున్నాడు. పగటిపూట కూడా తాగావా అంటూ జోకులేశారు స్నేహితులు. వర్టిగోనేమో అనుకుని కొన్ని రోజులు మందులు కూడా వాడాడు. ఫలితం లేకపోగా సమస్య ఎక్కువైంది. ఇటీవలే అసలు విషయం తెలిసింది... బి12 విటమిన్ తగినంత లేదని.

vitamin1
ఇటీవలి కాలంలో చాలామందికి బి12 విటమిన్ లోపం ఉంటున్నది. దీంతో పాటుగా డి విటమిన్ కూడా తక్కువగా ఉంటున్నది. ఆధునిక జీవనశైలే దీనికి కారణం అనుకున్నప్పటికీ, సరైన రీతిలో పోషకాహారం తీసుకోకపోవడమే ఈ సమస్యకు దారితీస్తుంది. ఇప్పుడే ఎక్కువమందిలో విటమిన్ లోపం రావడానికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. గతంలో అయితే బి12కి గానీ, డి విటమిన్‌కి గానీ వాటి మోతాదు తెలుసుకునే పరీక్షలేవీ అందుబాటులో ఉండేవి కావు. కాబట్టి ఎవరిలో లోపించిందో తెలిసేది కాదు. ఇప్పుడు డయాగ్నస్టిక్స్ అభివృద్ధి చెందడం వల్ల బి12 లోపం ఉన్నవాళ్లను కనిపెట్టగలుగుతున్నాం.

ఎందుకు కావాలి?


బి విటమిన్లు ప్రధానంగా 8 రకాలుంటాయి. వీటన్నింటినీ కలిపి బి కాంప్లెక్స్ అంటారు. వీటిలో బి12 అత్యంత కీలకమైనది. రక్తకణాల తయారీకి బి12 తప్పనిసరి. అవి విభజన చెంది, పరిణతి చెందాలంటే బి12 సహాయం కావలసిందే. కణాల్లో డిఎన్‌ఎ తయారుకావడం కోసం కూడా బి12 అవసరం అవుతుంది. నాడీకణాల నుంచి శక్తి విడుదల కావడానికీ బి12 కావాలి. ఫోలిక్ ఆమ్లంతో కలిసి బి12 విటమిన్ కణాల్లో నిలవ ఉన్న ఎటిపి శక్తి విడుదల కావడానికి సహాయపడుతుంది. ఈ శక్తి విడుదల అయినప్పుడే నాడీకణాల మధ్య సమాచార ప్రక్రియ జరుగుతుంది.

ఎక్కడిది?


ఇంత మేలు చేసే ఈ బి12 విటమిన్ మన శరీరంలో తయారుకాదు. మనం తీసుకునే అన్ని రకాల ఆహార పదార్థాల్లో కూడా దొరకదు. ఇది కేవలం జంతువుల శరీరంలో మాత్రమే తయారవుతుంది. ఇవి తినే గడ్డి లాంటి ఆహారం ద్వారా కొన్ని రకాల బాక్టీరియా వాటి శరీరంలో చేరుతాయి. ఇవి వాటిలో బి12 ఉత్పత్తి కావడానికి దోహదపడతాయి. అందుకే కేవలం జంతు సంబంధ పదార్థాల్లో మాత్రమే బి12 విటమిన్ లభిస్తుంది.

లోపిస్తే అన్నీ సమస్యలే!


బి12 లోపించడం వల్ల నాలుగు రకాలుగా సమస్యలుంటాయి.
రక్తం : రక్తకణాలు తగ్గుతాయి కాబట్టి రక్తహీనత ఉంటుంది. తద్వారా చిన్న పనికే ఎక్కువగా అలసిపోవడం, బలహీనత, ఆయాసం, గుండెదడ ఉంటాయి.

నాడీకణాలు : బి12 లోపం నాడులపై ప్రభావం చూపడం వల్ల పెరిఫెరల్ న్యూరోపతి రావొచ్చు. వీరిలో తిమ్మిర్లు, తూలుతుండడం, బ్యాలెన్స్ లేకపోవడం, మగత ఉంటాయి. తీవ్రమైతే చేతిలో ఉన్న వస్తువు వదిలేస్తుంటారు. కాళ్లలోంచి చెప్పులు జారిపోతాయి.

వెన్నుపాము : బి12 లోపం వల్ల కేవలం వెన్నుపాము పైన ప్రభావం పడితే బ్యాలెన్స్ కోల్పోతారు. నడిస్తే తూలుతుంటారు. మరే లక్షణాలూ ఉండవు.

మెదడు : బి12 లోపం ప్రభావం మెదడుపై ఉంటే సాధారణంగా తీవ్రస్థాయి మతిమరుపు ఉంటుంది. నిర్ణయాత్మక శక్తి తగ్గుతుంది. అంతకుముందు వరకు అలవోకగా చేయగలిగే సంక్లిష్టమైన పనులను చేయలేరు. ఆలోచనల్లో గందరగోళం ఉంటుంది. మొత్తంగా కాగ్నిటివ్ సామర్థ్యం తగ్గుతుంది. చురుకుదనం ఉండదు. డిప్రెషన్, యాంగ్జయిటీ ఉంటాయి.

కన్ను : కంటి నరంపై ప్రభావం చూపి అది బలహీనమవుతుంది. తద్వారా నెమ్మదిగా చూపు దెబ్బతింటుంది. అయితే ఇది చాలా అరుదు.

ఎవరిలో ఎక్కువ?


పూర్తిస్థాయిలో శాకాహారులైనవాళ్లు. అంటే పాలు, పాల పదార్థాలను కూడా తీసుకోరు. అందుకే సాధారణంగా జైనమతస్థుల్లో బి12 లోపాన్ని ఎక్కువగా గమనిస్తాం.
బేరియాట్రిక్ సర్జరీ అయినవాళ్లు. వీళ్లకి జీర్ణాశయం చిన్నదిగా చేయడమో, పేగుకి సంబంధించిన సర్దుబాట్లో చేస్తారు కాబట్టి సాధారణంగా పోషకాహార లోపం ఉంటుంది. అదేవిధంగా బి12 లోపం కూడా ఎక్కువ. అందుకే వీళ్లకు సప్లిమెంట్లను సూచిస్తారు.
తీవ్రస్థాయిలో బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా బి12 లోపం ఏర్పడవచ్చు.
దీర్ఘకాలికంగా ఆల్కహాల్‌కు బానిసలైనవారిలో కూడా బి12 లోపం ఏర్పడుతుంది. వీళ్లు ఆహారం తీసుకున్నప్పటికీ ప్రొటీన్ జీవక్రియ సక్రమంగా జరగదు. ప్రొటీన్లు విడిపోకపోవడంతో బి12 విటమిన్ అందదు.

-కొందరిలో జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు. ఇలాంటివాళ్లలో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్‌గా పనిచేసే ప్రొటీన్ లోపిస్తుంది. బి12 విటమిన్ రక్తంలోకి గ్రహింపబడాలంటే దానికి ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ప్రొటీన్ అతుక్కోవాలి. అప్పుడే అది రక్తంలోకి చేరగలుగుతుంది. లేకుంటే నిష్క్రియం అయిపోతుంది. ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ జన్యుపరమైన కారణాల వల్ల కొందరిలో ఉత్పత్తి కాదు. అందువల్ల బి12 శోషణ సరిగా లేక లోపం ఏర్పడుతుంది.
-సాధారణంగా ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉన్నవాళ్లలో కూడా ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ లోపం ఉండొచ్చు.
-మెట్‌ఫార్మిన్ లాంటి డయాబెటిస్ మందులు, గ్యాస్ సమస్యలకు వాడే యాంటాసిడ్లు కూడా బి12 విటమిన్ శోషణను అడ్డుకుంటాయి.

రక్తహీనతా.. బి12 లోపమా..?


-సాధారణంగా లక్షణాలను బట్టే బి12 లోపం ఉందని అర్థమైపోతుంది. నిర్ధారణ కొరకు బి12 రక్తపరీక్ష చేస్తారు. సంపూర్ణ రక్తపరీక్ష ద్వారా కూడా రక్తకణాల సంఖ్యను బట్టి బి12 లోపాన్ని కనిపెట్టవచ్చు.
-రక్తపరీక్ష రిపోర్టులో మైక్రోసైటిక్ హైపోక్రోమిక్ అని ఉంటే రక్తకణాలు చిన్నవిగా ఉండి, రంగు తక్కువగా ఉన్నాయని అర్థం. ఇలాంటప్పుడు ఇనుము తగ్గడం వల్ల రక్తహీనత ఉందని భావించాలి. ఇక మాక్రోస్కోపిక్ అంటే కణాల పరిమాణం పెద్దగా ఉందని ఉంటే ఫోలిక్ ఆమ్లం లేదా బి12 తగ్గిందని అర్థం.
-400 పికోగ్రామ్స్ కన్నా తక్కువ బి12 ఉంటే అది లోపం అని భావించవచ్చు.
-200 పికోగ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే లోపం తీవ్రస్థాయిలో ఉందని అర్థం.

ఫోర్టిఫికేషన్ మేలు!


-సాధారణంగా మాంసాహారుల్లో ఇబ్బంది ఉండదు. శాకాహారులైనవాళ్లు పాలు, పెరుగు, జున్ను, మీగడ, వెన్న లాంటి పాలపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. కోడిగుడ్డు ద్వారా కూడా బి12 పుష్కలంగా అందుతుంది. ముఖ్యంగా కాలేయంలో బి12 మోతాదు ఎక్కువ.
-పాశ్చాత్య దేశాల్లో అయితే సోయాపాలు, బ్రెడ్ లాంటి వాటిని కూడా బి12తో ఫోర్టిఫై (ఆహారానికి పోషకాలను కృత్రిమంగా కలపడం) చేసి తయారుచేస్తున్నారు. మన దగ్గర అయొడిన్ కలిపిన ఉప్పు లాంటివి ఉన్నాయి గాని, పూర్తి స్థాయిలో విటమిన్లతో ఫోర్టిఫై చేసిన పదార్థాలు అందుబాటులో లేవు. కొన్నిచోట్ల సోయా పాలలో బి12 విటమిన్‌ను కలుపుతున్నారు. రెగ్యులర్‌గా తీసుకునే సాధారణ ఆహారంలో కూడా వీటిని కలిపితే మంచి పరిష్కారం లభిస్తుంది.

టాబ్లెట్లా.. ఇంజెక్షన్లా..?


-బి12కు అతుక్కోవడం ద్వారా దాన్ని రక్తంలోకి చేర్చే ప్రొటీన్ అయిన ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ లేకపోతే డైరెక్ట్‌గా బి12 ఇంజెక్షన్లు మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. కాని ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ తక్కువగా ఉందో లేదో తెలుసుకోగలిగే పరీక్షలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అందువల్ల మందులు ఎంత కాలం వాడినా బి12 లోపం పోకపోతే రక్తంలోకి ఇంజెక్షన్లు ఇస్తారు. ఈ ఇంజెక్షన్లు 20 నుంచి 200 రూపాయల వరకు కూడా దొరుకుతున్నాయి. అయితే ఏ ఇంజెక్షన్ అయినా దాని ప్రభావం ఒకటే. ఎక్కువ ధర ఉన్న ఇంజెక్షన్ మరింత బాగా పనిచేస్తుందని అనుకోవద్దు.

vitamin2
-తరచుగా బి12 లోపం ఏర్పడుతున్నవాళ్లు, బి12ని గ్రహించలేకపోతున్నవారికి ఇంజెక్షన్లే ఉత్తమ ఔషధాలు. వీటిని ఒక కోర్సుగా తీసుకోవాలి.
-మొదటి నాలుగు రోజులు ప్రతిరోజూ 1000 మైక్రోగ్రామ్‌లు తీసుకోవాలి.
-తరువాత నాలుగువారాల పాటు వారానికి ఒక ఇంజెక్షన్, ఆ తరువాత ఆరునెలలు నెలకు ఒకటి చొప్పున తీసుకోవాలి. తరువాత ఆరు నెలలకు ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది.
-టాబ్లెట్లు వాడితే ప్రతి 3 - 6 నెలలకు ఒకసారి బి12 పరీక్ష చేయించుకుంటుండాలి. అయినా తగ్గకపోతే ఇంజెక్షన్ వేయించుకోవడమే మంచిది.
-బి12 విటమిన్‌ని అతిగా తీసుకుంటే దుష్ప్రభావాలేమీ ఉండవు. ఇది నీటిలో కరిగే విటమిన్ కనుక హానికరం కాదు.

మనకి బి12 విటమిన్ రోజుకి 1 మిల్లీగ్రామ్ అవసరం అవుతుంది. ఇందుకోసం శాకాహారులైతే రోజూ పాలు, కోడిగుడ్డు తీసుకోవడం మంచిది. గర్భవతులుగా ఉన్నవాళ్లు పూర్తి స్థాయి శాకాహారులైనప్పుడు బి12 తగ్గే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు వాళ్లిచ్చే పాలలో కూడా బి12 తగ్గుతుంది. అందువల్ల బిడ్డకు తగినంత బి12 అందక ఎదుగుదల కుంటుపడుతుంది. అందుకే గర్భిణులుగా ఉన్నప్పుడు పోషకాహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

749
Tags

More News

మరిన్ని వార్తలు...