రెరా రక్షణ సాధ్యమిలా..


Sat,July 28, 2018 12:38 AM

బిల్డర్లు, ఏజెంట్లు, కొనుగోలుదారులు రెరాకు దరఖాస్తు ఇలా చేయాలి?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజులు రానే వచ్చాయి. ఆగస్టు నుంచి మన రాష్ట్రంలో రెరాను ఆరంభించడానికి పురపాలక శాఖ సన్నాహాలు చేస్తున్నది. 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో.. లేదా ఎనిమిదికి పైగా ఫ్లాట్లను అభివృద్ధి చేస్తే.. రెరా పరిధిలోకి వస్తాయి. 2017 జనవరి 1 తర్వాత రాష్ట్రంలో ప్రారంభమైన నివాస సముదాయాలు, వాణిజ్య కట్టడాలు, వెంచర్లు తప్పనిసరిగా రెరా అథారిటీ వద్ద నమోదు చేసుకోవాలి. మరి, ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇప్పటికే నిర్మాణ పనుల్ని ప్రారంభించిన ప్రాజెక్టుకు సంబంధించి ఏయే వివరాల్ని పొందుపర్చాలి? విక్రయించిన ఫ్లాట్లకు సంబంధించిన సొమ్మును ఎస్క్రో ఖాతాలో జమ చేయాలా? ఇలాంటి విషయాల్ని డెవలపర్లకు అవగాహన కలిగించడానికి రెరా అథారిటీ హైదరాబాద్‌లో ప్రత్యేక సదస్సుని నిర్వహించింది. రెరా వెబ్‌సైటులో డెవలపర్, ఏజెంటు, కొనుగోలుదారుల నమోదు ప్రక్రియను వివరించింది. మరి, ఆ వివరాలు నమస్తే సంపద పాఠకులకు ప్రత్యేకం.

RERA
తెలంగాణ నిర్మాణ రంగంలో పారదర్శకత, ఇళ్ల కొనుగోలుదారులకు భద్రతనిచ్చే రెరా అథారిటీ ఆగస్టులో ఆరంభం కానున్నది. 2017 జనవరి 1 తర్వాత, 500 చదరపు మీటర్ల కంటే అధిక విస్తీర్ణంలో ప్రారంభమైన నివాస సముదాయాలు, వాణిజ్య సముదాయాలు, వెంచర్లను తప్పకుండా ఆగస్టులో ఆరంభమయ్యే రెరా వెబ్‌సైటులో నమోదు చేసుకోవాలి. ఇందుకోసం సుమారు మూడు నెలల దాకా గడువునిచ్చింది. తెలంగాణలో ఉన్న ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, తొమ్మిది పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ, టీఎస్‌ఐఐసీ, 68 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నిర్మాణాలన్నీ రెరా అథారిటీ పరిధిలోకి వస్తాయి. ఇక నుంచి కొత్తగా ఎవరైనా నిర్మాణం చేపట్టాలన్నా రెరా వద్ద నమోదు తప్పనిసరి. ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాల్ని కాపాడే రెరా చట్టాన్ని పక్కాగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏసీ గార్డ్స్‌లోని డీటీసీపీ బిల్డింగ్‌లో శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసింది.

నమోదు విధానమిదే..

-ప్రతి డెవలపర్, ఏజెంటు లేదా కొనుగోలుదారులు ముందుగా రెరా వెబ్‌సైటులోకి వెళ్లి.. నమోదు చేసుకోవాలంటే ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలి. వెబ్‌సైటులోకి వెళ్లాక వ్యక్తిగత అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
-ఎందుకంటే, యూజర్ ఐడీ, పాస్‌వర్డులు క్రియేట్ చేసుకుంటే, రెరాకు దరఖాస్తు చేసిన తర్వాత.. తన ఫైలు ఎక్కడుందనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఏజెంటుకూ ఇదే రీతిలో ఉపయోగం ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ప్రతి మూడు నెలలకోసారి ప్రాజెక్టు తాజా స్థితిగతులను రెరా వెబ్‌సైటులో నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది.
-ఆతర్వాత వెబ్‌సైటులో రెండు ఆప్షన్లు వస్తాయి. మీరు డెవలపరా? ఏజెంటా? అని అడుగుతుంది. ఒకవేళ డెవలపర్ అయితే పూర్తి వివరాలను పొందుపర్చాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఆఫీసు చిరునామా వంటివి పేర్కొనాలి. ఒకవేళ, రెరా వద్ద సంస్థ పేరిట రిజిస్టర్ చేస్తున్నట్లయితే.. ఆయా కంపెనీకి సంబంధించిన ఛైర్మన్, ఎండీ, డైరెక్టర్ల పేర్లు, వారి పూర్తి వివరాలను ఎంటర్ చేసి సేవ్ చేయాలి. దీంతో, డెవలపర్ల ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది.
-ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టును నమోదు చేయాలి. కొత్త ప్రాజెక్టా? ప్రస్తుతం నిర్మాణంలో ఉందా? అనే ఆప్షన్లలో ఏదో ఒకటి పేర్కొనాలి.
-రెసిడెన్షియల్, కమర్షియల్, లేఅవుట్, మిక్స్‌డ్ యూజ్.. ఇలా ఏదీ డెవలప్ చేస్తుంటే ఆ వివరాల్ని పొందుపర్చాలి.
-ఫ్లాట్ల సంఖ్య లేదా ఫ్లాట్ల వివరాలు, భూమి కొనుగోలుకయ్యే వ్యయం, అనుమతులకు ఫీజులు, బ్యాంకులకు చెల్లించే వడ్డీలు.. ఇలా ప్రాజెక్టుకయ్యే వ్యయాన్ని నిర్ణయించి.. ఆ వివరాల్ని నమోదు చేయాలి.
-ఎంత శాతం పని పూర్తయ్యిందో వెల్లడించాలి. ఎన్ని బేస్‌మెంట్లు వేశారు? వేసిన అంతస్తులెన్ని? పూర్తయిన శ్లాబులు, అంతర్గత గోడలు, ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, తలుపుల బిగింపు, శానిటరీ ఫిట్టింగులు, మెట్లు, లిఫ్టులు, ఎక్స్‌టర్నల్ ప్లాస్టరింగ్, ఎలివేషన్.. ఇలా, ప్రస్తుతం ఎంత శాతం నిర్మాణం జరిగిందో స్పష్టంగా తెలియజేయాలి. లేకపోతే జరిమానా విధించే అవకాశముంది.
-ఆయా ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. పాన్ కార్డు, స్థలానికి సంబంధించిన టైటిల్ డీడ్లు, అప్రూవ్డ్ ప్లాన్, ఈసీ, ఒప్పంద పత్రం, ఫ్లాట్ కేటాయింపు పత్రం, అఫిడవిట్ (ఫారం-బి), నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఆర్కిటెక్ట్ సర్టిఫికెట్ (ఫారం-1), సీఏ సర్టిఫికెట్ వంటివి పొందుపర్చాలి. ముఖ్యంగా, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులైతే ఈ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి.
-కొన్ని సందర్భాల్లో డెవలపర్లు ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఆతర్వాత, ఆయా నిర్మాణంపై ఎవరో ఒకరు కోర్టుకెళతారు. అలాంటి వివాదాలుంటే, రెరా దరఖాస్తులో తప్పనిసరిగా పేర్కొనాలి. ఏ విషయాన్ని పొందుపర్చకున్నా.. తర్వాత దాని గురించి తెలిస్తే.. ప్రమోటర్ మీద జరిమానా విధిస్తారు.
-ఇవన్నీ పూర్తయ్యాక.. పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నాలుగు ఆప్షన్లు ఉన్నాయి.

ఫీజెంత కట్టాలి?

రియల్ ఎస్టేట్‌లో క్రమం తప్పకుండా లావాదేవీలను నిర్వహించే ఏజెంట్లు కూడా రెరా వద్ద నమోదు చేసుకోవాలి. 2017 జనవరి 1 తర్వాత రాష్ట్రంలో ప్రారంభమైన నివాస సముదాయాలు, లగ్జరీ విల్లాలు, బహళ అంతస్తుల అపార్టుమెంట్లు, వెంచర్లు రెరా వద్ద తప్పకుండా నమోదు చేసుకోవాలి. ఒకవేళ నిర్మాణాల్ని వెయ్యి చదరపు మీటర్ల కంటే లోపు కడితే చదరపు మీటర్‌కి ఐదు రూపాయలు చొప్పున ఫీజు కట్టాల్సి ఉంటుంది. అంటే, సుమారు రూ.5,000 కట్టాలి. 1000 చదరపు మీటర్లు దాటితే చదరపు మీటర్‌కి రూ.10 కట్టాలి. రూ.10,000 చెల్లించాలన్నమాట. మొత్తానికి, నిర్మాణం ఏదైనా.. ఫీజు మాత్రం రూ.5 లక్షలు మించదు.
-మిక్స్ డెవలప్‌మెంట్.. వెయ్యి చ.మీ.లోపు చదరపు మీటర్‌కి రూ. 10 కట్టాలి. అంటే పదివేలు చెల్లించాలి. వెయ్యి మీటర్లు దాటితే రూ.15 చెల్లించాలి. వాణిజ్య సముదాయాలు చ.మీ.కి రూ. 20, 25 కట్టాలి.
-లేఅవుట్లను అభివృద్ధి చేసేవారు చదరపు మీటర్‌కి రూ.5 కట్టాలి. మొత్తం ఫీజు రూ.2 లక్షలు మించదు.
-ఏజెంటు వ్యక్తిగతంగా నమోదు చేసుకోవాలంటే రూ.10,000 చెల్లించాలి. బృందంగా నమోదు చేసుకోవాలంటే రూ.50,000 కట్టాల్సి ఉంటుంది.
-2017 జనవరి 1 తర్వాత, ప్రారంభమైన నిర్మాణాలకు సంబంధించి కొనుగోలుదారులకు ఎన్ని ఫ్లాట్లు విక్రయించారు? వారి నుంచి వసూలు చేసిన సొమ్ము ఎంత? పూర్తి చేసిన నిర్మాణమెంత? ఇలాంటి విషయాలను పక్కాగా తెలియజేయాలి. మిగతా సొ మ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలి. ఒకవేళ, ఆయా సొమ్మను ముట్టుకోవాల్సి వస్తే.. అందుకు ఛార్టెడ్ అకౌంటెంట్/ ఇంజినీరు సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక.. సొమ్ము చెల్లించిన తర్వాత.. ముప్పయ్ రోజుల్లో రెరా నుంచి అనుమతి లభిస్తుంది.
-ఒకవేళ రెరా మొదటిసారి అనుమతివ్వకపోతే, అందుకు గల కారణాల్ని వివరిస్తుంది. మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి కొంత గడువునిస్తుంది.

జీహెచ్‌ఎంసీ.. హెచ్‌ఎండీఏలో ఎన్ని నిర్మాణాలు?

GHMCHYD
జీహెచ్‌ఎంసీ 2017లో 30 లక్షల చ.మీ, 2017-2018లో సుమారు 47 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతుల్ని మంజూరు చేసింది. ఇక హెచ్‌ఎండీఏ.. 2017లో 745 భవనాలకు అనుమతినిచ్చింది. 250 లేఅవుట్లు, 20 లేఅవుట్లతో పాటు గృహనిర్మాణ సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, 21 ఎన్‌వోసీలను మంజూరు చేసింది. 2018లో నేటివరకూ టీఎస్‌ఐపాస్‌తో కలిపి 1,119 భవనాలకు అనుమతుల్ని జారీ చేసింది. 252 లేఅవుట్లు, 13 గృహనిర్మాణ సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, 11 ఎన్వోసీలను మంజూరు చేసింది. వీటిలో 500 చదరపు మీటర్ల విస్తీర్ణం కంటే ఎక్కువ లేదా ఎనిమిది ఫ్లాట్ల కంటే అధికంగా ఉండే లేఅవుట్లు, అపార్టుమెంట్లు, విల్లా ప్రాజెక్టులన్నీ రెరా పరిధిలోకి వస్తాయి.

జరిమానా ఉంది జాగ్రత్త

-రెరా నిబంధనల్ని బిల్డర్ లేదా రియల్టర్ ఉల్లంఘిస్తే.. పది శాతం జరిమానా విధిస్తారు.
-రెరా ఇచ్చిన ఆదేశాల్ని డెవలపర్ పాటించకపోతే మూడేండ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. ప్రాజెక్టు వ్యయంతో పది శాతం జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ అమలు చేయవచ్చు.
-డెవలపర్ లేదా ప్రమోటర్ రెరాకు తప్పుడు సమాచారాన్ని అందించినా.. ఐదు శాతం జరిమానా పడుతుంది.

చరిత్ర తెలుస్తుంది

రెరా అథారిటీ అందుబాటులోకి వచ్చాక కొనుగోలుదారులకు కలిగే ప్రయోజనం అంతాఇంతా కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాజెక్టును కొనాలన్నా.. అట్టి నిర్మాణం, డెవలపర్‌కు సంబంధించిన సంపూర్ణ చరిత్ర తెలుసుకోవచ్చు. తమకు నచ్చిన ప్రాజెక్టును సులువుగా ఎంపిక చేసుకోవచ్చు.

రెరా.. గేమ్ ఛేంజర్!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. రెరా రాకతో నిర్మాణ రంగానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ పరిశ్రమలో పారదర్శకత ఏర్పడుతుంది. సొమ్ము పక్క దారి పట్టడమంటూ ఉండదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో ఆలస్యం జరగదు. నిర్మాణ రంగానికి, కొనుగోలుదారులకూ ఉపయోగపడుతుంది. రెరా వల్ల తెలంగాణ నిర్మాణ రంగం తీరుతెన్నులు పూర్తిగా మారిపోతాయి. ఈ అథారిటీని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
- జక్కా వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్

రెరా ఎంతో కీలకం..

రియల్ ఎస్టేట్ రంగంలో గతేడాది నుంచి అనేక సంస్కరణలు చోటు చేసుకున్నాయి. ఇందులో రెరా అతి కీలకమైనది. ఈ రంగంలో పునరుత్తేజం కలగడానికి తోడ్పడుతుంది. తెలంగాణ నిర్మాణ రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుంది. పైగా, కొనుగోలుదారుల్లో సరికొత్త విశ్వాసాన్ని కలిగిస్తుంది. దేశ, విదేశీ పెట్టుబడిదారులు మన భాగ్యనగరానికి విచ్చేసి పెట్టుబడులు పెట్టే మహత్తరమైన అవకాశాన్ని రెరా కలిగిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్ మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటుంది.
- రాకేష్‌రెడ్డి, డైరెక్టర్, అపర్ణా గ్రూప్

పదిశాతం మార్టిగేజ్ తొలగించాలి

రెరా వచ్చాక నిర్మాణ రంగంలో పూర్తి స్థాయి పారదర్శకత ఉంటుంది. గతంలో డెవలపర్లు డీవియేషన్లు చేస్తారనే ఉద్దేశ్యంతో పది శాతం మార్టిగేజ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇక, రెరా వచ్చాక ప్రతి అంశాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. పైగా, ప్రాజెక్టు పర్యవేక్షణ కూడా ఉంటుంది. గతంలో మాదిరిగా నిబంధనలకు విరుద్ధంగా కట్టడమంటూ ఉండదు. అందుకే, పది శాతం మార్జిగేజ్ విధానాన్ని తొలగించాలి. అప్పుడే, తెలంగాణ నిర్మాణ రంగంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది
- విజయ్ సాయి, ఉపాధ్యక్షుడు, ట్రెడా

- కింగ్ జాన్సన్ కొయ్యడ

277
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles