రెరాలో నమోదు కావాలి


Fri,August 31, 2018 11:26 PM

-పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
రెండేళ్ల నుంచి తెలంగాణ రియల్ మార్కెట్‌లో అద్భుతమైన ప్రగతి నమోదు చేసుకుంటున్నది. ఈ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది.. అటు డెవలపర్లకు ఉపయోగకరంగా ఉండటానికి.. ఇటు కొనుగోలుదారులకు న్యాయం చేయడానికి.. రెరా చట్టాన్ని నేటి నుంచి అందుబాటులోకి తెస్తున్నాం. నిర్మాణ రంగం దూకుడు మీద ఉన్నది కాబట్టి.. ఈ సదావకాశాన్ని నిర్మాణ సంస్థలన్నీ ఉపయోగించుకోవాలి. 2017 జనవరి 1 నుంచి తెలంగాణలో ప్రారంభమైన ప్రాజెక్టులన్నీ రెరా అథారిటీ వద్ద నమోదు చేసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.
Dattatreya
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పినట్లు.. తెలంగాణ నిర్మాణ రంగం దూకుడు మీదున్నది. గత రెండేండ్ల నుంచి హైదరాబాద్ రియల్ రంగంలో అమ్మకాలు గణనీయంగా పుంజుకున్నాయి. రెరా చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో.. మన రాష్ట్రంలోకి రెరా ఎప్పుడెప్పుడు అమల్లోకి వస్తుందా? అని తెలంగాణ నిర్మాణ రంగమంతా ఆత్రుతతో ఎదురు చూసింది. మాసబ్ ట్యాంకులోని ఏసీ గార్డ్స్ వద్ద తెలంగాణ రెరా కార్యాలయం ప్రారంభం కావడంతో యావత్ నిర్మాణ రంగమంతా సంతోషం వ్యక్తం చేసింది. ఇక నుంచి తెలంగాణలో నిర్మాణాలన్నీ క్రమపద్ధతిలో జరుగుతాయని.. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడింది. రెరా అమల్లోకి రావాలని కొంతకాలం నుంచి ఎదురు చూస్తున్నామని.. ఈ రోజు ఆరంభం కావడంతో సంతోషంగా ఉన్నదని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు సాయిరెడ్డి రాంరెడ్డి తెలిపారు. జీవో నెంబర్ 86 నుంచి హైదరాబాద్‌లో నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాల్ని చేపట్టడం డెవలపర్లకు అలవాటు అయ్యిందని.. అయితే, రెరా రాక వల్ల మోసపూరిత నిర్మాణ సంస్థల నుంచి కొనుగోలుదారులకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి తెలిపారు.
Indra-sena

మూడు నెలల గడువు..

తెలంగాణలో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యల్ని తీసుకోవడం వల్లే దేశంలోకెల్లా హైదరాబాద్ నిర్మాణ రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జక్కా వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మన రాష్ట్రంలో 2017 జనవరి 1 తర్వాత ప్రారంభమైన ప్రాజెక్టులను రెరాలో నమోదు చేయడానికి మూడు నెలలు గడువును మంత్రి కేటీఆర్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రెరా అథారిటీ ఏర్పడినందుకు ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణాలు చేపట్టే ఏ సంస్థ అయినా.. ఇండ్ల కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటాయి. ఒకవేళ, ఇల్లు కొన్న తర్వాత ఏ సంస్థ అయినా ఇబ్బంది పెడితే.. రెరా ఆఫీసుకు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే చాలు. డెవలపర్, ఇంటి కొనుగోలుదారుడి వాదన విన్న తర్వాత.. చట్టప్రకారం సమస్యకు రెరా పరిష్కారాన్ని సూచిస్తుంది. ఇప్పటివరకూ ఇలాంటి వ్యవస్థ లేకపోవడం వల్ల.. కొందరు బిల్డర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది. ఇక నుంచి, మోసపూరిత డెవలపర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకే రెరా అథారిటీ రాష్ట్రంలో ఏర్పడిందని ఫైట్ ఫర్ రెరాకు చెందిన బీటీ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
- కింగ్ జాన్సన్ కొయ్యడ
శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా తెలంగాణ రెరా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ నిర్మాణ రంగానికి చెందిన ప్రతినిధులు, పలువురు డెవలపర్లు పాల్గొన్నారు. ప్రదీప్ రెడ్డి, ఆదిత్యా గౌరా, క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి మనభూమ్ రామకృష్ణారావు, మురళీకృష్ణారెడ్డి, ట్రెడా శ్రీధర్, మేజర్ శివకిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Indra
తెలంగాణలో రెరా అథారిటీ ఏర్పాటైన మొట్టమొదటి రోజే దాదాపు తొమ్మిది సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. రాష్ట్ర నిర్మాణ రంగ చరిత్రలోనే రెరా కింద ప్రప్రథమంగా నమోదైన ప్రాజెక్టే.. రాజ్యక్షేత్ర. ఈ ప్రాజెక్టును గిరిధారి హోమ్స్ సంస్థ కిస్మత్‌పురాలో నిర్మిస్తున్నది. రెండో నిర్మాణాన్ని సాయికృపా వెంచర్స్ చేపట్టింది. ఈ సంస్థ కొండాపూర్‌లో ఆనంద్ విహార్ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఇదే బాటలో రాష్ట్రంలో గల అనేక నిర్మాణ సంస్థలు పయనిస్తాయని.. రెరాలో తమ ప్రాజెక్టులను నమోదు చేసుకుంటాయని ట్రెడా ట్రెజరర్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. రెరా వల్ల కొనుగోలుదారులు సులభంగా తమ బడ్జెట్‌కి అనుగుణంగా ఇండ్లను కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందన్నారు.

476
Tags

More News

VIRAL NEWS

Featured Articles