రూపాయి @ 70 మన పర్స్‌మీద ప్రభావమెంత?


Fri,August 17, 2018 11:43 PM

ప్రపంచ దేశాల మధ్య ఇప్పుడు కరెన్సీ వార్ జరుగుతున్నది. డాలర్ రూపాయి మారకం విలువ రోజు రోజుకు తరుగుతున్నది. రూపాయి విలువ క్షీణించడంతో వాణిజ్య లోటు, కరెంట్ అకౌంట్ ఖాతా లోటు పెరుగుతూ వస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు వీటిని కొలబద్దగా చూస్తే పరిస్థితులు అంత ప్రోత్సాహకరంగా లేవు. రూపాయి మారకం విలువ గత మూడు రోజులుగా రూ. 70 పైనే స్థిరంగా ఉంది. ఇదే విధంగ రూపాయి మారకం విలువ క్షీణిస్తూ వస్తే మన వ్యక్తిగత ఫైనాన్స్‌లు ఏ విధంగా ప్రభావితం అవుతాయో చూద్దాం.
tupee

విదేశీ విద్య, యాత్రలు ప్రియం

డాలర్లలో చేసే చెల్లింపులు ఏవైనా ఇక నుంచి ఖరీదు అవుతాయి. ఉదాహరణకు మీ పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారని అనుకుందాం. నెలకు 2000 డాలర్ల వ్యయం అవుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో రూపాయి-డాలర్ మారకం విలువ రూ.65 ఉన్నప్పుడు మీకు అయిన వ్యయం రూ. 1,30,000. కానీ, ఇప్పుడు అదే మారకం విలువ రూ. 70 దాటింది. దాంతో మీరు రూ. 1,40,000 పైన చెల్లించాల్సి వస్తుంది. మారకం విలువ పతనం అయ్యేకొద్దీ మీకు వ్యయాలు పెరుగుతాయి. అలాగే విదేశీ యాత్రలు కూడా వ్యయభరితంగా మారుతాయి. ఒకవేళ మీరు కొనే వస్తువులు లేదా సేవలకు డాలర్లలో చెల్లింపులుంటే వాటి ఖరీదు కూడా పెరుగుతుంది.

మీకు డాలర్లలో ఆదాయం వస్తే

విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న మీపిల్లలు లేదా మరెవరైనా మీకు డబ్బు పంపిస్తుంటే వారు పంపే అదే వెయ్యి డాలర్లకు ఎక్కువ రూపాయలు వస్తాయి. అలాగే డాలర్లలో మీకు చెల్లింపులు జరిగితే కూడా గతంలో కన్నా ఎక్కువగా రూపాయిలు వస్తాయి.

బంగారం సహా డాలర్ అసెట్లు

మీపెట్టుబడులు డాలర్ రూపేణా ఉంటే వాటి విలువలు కూడా పెరుగుతాయి.ఉదాహరణకు డాలర్లలో ట్రేడ్ అయ్యే షేర్లలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ పండ్లలో మీరు మదుపు చేసి ఉంటే వాటి విలువ పెరుగుతుంది. అలాగే వాటి ఎన్‌ఏవీని రూపాయల్లో చూపిస్తే అధిక రాబడి ఉంటుంది. విదేశీ మార్కెట్లలో ట్రేడ్ అయ్యే స్టాక్స్ మదుపు చేసే అనేక మ్యూచువల్ ఫండ్ స్కీములు ఇప్పుడు అనేకం అందుబాటులో ఉన్నాయి. వాటి ఎన్‌ఏవీలన్నీ సహజంగా పెరుగుతాయి. బంగారం విలువ కూడా పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ ఔన్స్ బంగారం ధర గతంలో కన్నా తగ్గినప్పటికీ మన దేశం లో బంగారం ధరలో పెద్దగా మార్పు లేకపోవడానికి కారణం డాలర్-రూపాయి మారకం విలువనే. రూపాయి పతనం అయ్యే కొద్ది బంగార ధర కూడా రూపాయిల్లో పెరుగుతుంది.
assalto.

ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు

మన దేశం దిగుమతి చేసుకుంటున్న ఇంధనం, బంగారం, మొబైల్‌ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. అధిక ధరలు కాస్త అధిక ద్రవ్యోల్భణానికి దారితీస్తుంది. ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుంది. దీంతో మనం తీసుకునే రుణాలపై అధిక వడ్డీ రేటును చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే గత రెండు త్రైమాసికాలుగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్ల హయాంలో పొదుపు చేయదగిన మొత్తాలు కూడా తగ్గిపోతాయి.

ఎన్‌ఆర్‌ఐ పెట్టుబడులకు రాజయోగం

డాలర్లను దేశంలోకి ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయ పథకాలను ప్రవేశపెట్టనుందన్న కధనాలు వెలువడుతున్నాయి. అధిక వడ్డీ రేటుతో ఎన్‌ఆర్‌ఐ బాండ్లను జారీ చేయవచ్చునన్న అంచనాలు మార్కెట్‌లో ఉన్నాయి. అయితే విదేశీ మారక నిల్వలు సరిపడా ఉన్నందున ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టడానికి కొంత సమయం తీసుకోవచ్చు.. కరెన్సీ మార్కెట్లలో ఒడిదుడుకులు పెరిగే కొద్దీ అధిక రిస్క్ ఉండే సాధనాల్లో కాకుండా భద్రత ఎక్కువగా ఉండే సాధనాల్లోనే మదుపు చేయడం ఉత్తమ మార్గం

433
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles