రుణం భారం పొదుపు లాభం


Sat,August 4, 2018 01:19 AM

పరపతి విధానం ప్రభావం

LOAN
రిజర్వ్‌బ్యాంకు వరుసగా రెండో సారీ రెపోరేటును పెంచింది. దీంతో బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌లను సవరించనున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల నుంచి తీసుకున్న, తీసుకోబోయే రుణాలపై వడ్డీ భారం పెరగనుంది. హోమ్‌లోన్, పర్సనల్‌లోన్, ఆటోలోన్ ఇలా అన్ని రకాల రుణాలపై ఈఎంఐ భారం తడిసి మోపెడు కానుంది.
ఇప్పటికే ఎస్‌బీఐ ఎసీఎల్‌ఆర్‌ను పెంచేసింది. ఈ నేపథ్యంలో ఈ పాలసీ రేట్ల పెంపు ప్రభావం ఎలా ఉంటుందో
పరిశీలిద్దాం..

రుణాలపై..

ఉదాహరణకు లక్ష రూపాయల హోమ్‌లోన్‌ను 20 ఏండ్ల కాలపరిమితితో 8.5శాతం వడ్డీతో తీసుకుని ఉన్నారని అనుకుందాం. అప్పుడు ఈఎంఐ రూ. 868. ఇప్పుడు పెంచిన వడ్డీ రేటు 8.75శాతం అయితే, మీ ఈఎంఐ రూ.884 కు పెరుగుతుంది. అదే వడ్డీ రేటు 9 శాతానికి పెరిగితే ఈఎంఐ ఏకంగా రూ. 900కు పెరుగుతుంది. ప్రస్తుతం వడ్డీ రేట్లు ఇక నుంచి పెరుగుతూనే ఉంటాయన్న సంకేతాలు ఉన్నాయి. ఒకవేళ హోమ్‌లోన్ చెల్లింపు కాలపరిమితి తొలి సగం భాగంలో ఉంటే కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించడం ద్వారా భారాన్ని తగ్గించుకోవచ్చు. తొలి సగ భాగంలో ఈఎంఐలో వడ్డీ భారమే అధికంగా ఉంటుంది కనుక ఈ వ్యూహం పనిచేస్తుంది. అన్ని రకాల రుణాలపై వడ్డీ భారం పెరుగుతుంది. అలాగే అప్పు కాలపరిమితి పెరిగే కొద్దీ చెల్లించే మొత్తమూ పెరుగుతుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై..

వడ్డీ రేట్ల పెంపు వల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేటు పెరుగుతుంది. ఇప్పటికే ఎస్‌బీఐ కోటి రూపాయల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 0.05 నుంచి 0.10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మిగతా బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు పెంచనున్నాయి.

చిన్నమొత్తాల పొదుపులపై..

ప్రావిడెంట్ ఫండ్, జాతీయ పొదుపు పథకం, సుకన్యసమృద్ధి, పోస్టాఫీసుపొదుపు పథకాలు తదతర చిన్న మొత్తాల పొదుపులపై గత త్రైమాసికంలో వడ్డీ రేట్లు పెంచలేదు. ఇప్పడు ఆర్బీఐ గత రెండు సమీక్షల్లో వడ్డీ రేటును అర శాతం పెంచింది కనుక జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి చిన్న మొత్తాలపై వడ్డీరేటును కూడా పెంచే అవకాశాలున్నాయి. వీటిపై ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వం వడ్డీ రేట్లను సవరిస్తుంది.

డెట్ మ్యూచువల్ ఫండ్లపై..

వడ్డీ రేట్లు పెరిగితే డెట్ మ్యూచువల్ ఫండ్లలో రాబడులు తగ్గుతాయి. బాండ్ల ధరలు తగుముఖం పడిపోతాయి కనుక డెట్ ఫండ్ల ఎన్‌ఏవీలు కూడా తగ్గిపోతాయి. లాంగ్‌టర్మ్ డెట్ ఫండ్లకు బదులుగా స్వల్ప కాల డెట్ ఫండ్లలో మదుపు చేస్తే బెటర్. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్లలో తక్కువ రిస్క్, తక్కువ ఒడిదుడుకులు ఉంటాయి.

పదేండ్ల జీ-సెక్‌ల రాబడులపై..

ప్రస్తుతం రేట్ పెంపుతో వీటిపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. పదేండ్ల గవర్నమెంట్ సెక్యూరీటీలు 7.65 నుంచి 8 శాతం మధ్యనే ఈ త్రైమాసికంలో ట్రేడ్ కావచ్చు. రిజర్వ్‌బ్యాంక్ పాలసీ రేట్లను ముందుగానే ఇవి డిస్కౌంట్ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధానికి ప్రభుత్వం తీసుకునే రుణాల ట్రెండ్, కనీస మద్దతు ధరలు, క్రూడాయిల్ ధరలు, ద్రవ్యోల్బణ ట్రెండ్ ద్రవ్యలోటు తదితర అంశాల కారణంగా బాండ్లపై రాబడులు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు రిజర్వ్‌బ్యాంక్ ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలను పెంచితే కూడా జీ-సెక్ రాబడులపై ప్రభావం ఉండవచ్చు.
SAVINGS

229
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles