రక్తం పీల్చేసే.. తలసేమియా!


Tue,May 7, 2019 01:06 AM

రక్తం.. శరీరాన్ని నడిపిస్తుంది. రక్త ప్రసరణ నిరంతర ప్రక్రియ. శరీరం చేసే పని.. ఖర్చయిన రక్తాన్ని బట్టి కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. కానీ.. కొందరు చిన్నపిల్లల్లో రక్తం నీళ్లు తాగినట్లే ఖర్చవుతుంది. ఉత్పత్తి కూడా మందగిస్తుంది. మరి బతికేది ఎట్లా? శరీరం పనిచేసేది ఎట్లా? నిరంతరాయంగా రక్తం ఎక్కించడం ఒక్కటే మార్గం. మే 8న అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా దీని గురించి తెలుసుకుందాం!
Thalasemia
అవయవాలన్నీ సక్రమంగా పని చేయాలంటే రక్తం అవసరం. మానవ జీవక్రియలన్నీ రక్త ప్రసరణ ఆధారంగానే జరుగుతాయి. ఎర్ర రక్తకణాలైనా.. తెల్ల రక్తకణాలైనా సమాన స్థాయి లో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటా రు. అయితే కొందరి శరీరంలో ఎర్ర కణాలు తగ్గుతాయి. అవసరమైనంత రక్తం ఉత్పత్తి కాదు. ఇదే తలసేమియా.

Thalasemia2

ఏంటీ తలసేమియా?

ఎముక మూలుగలో హిమోగ్లోబిన్ ఉండే ఎర్రరక్తకణాల ఉత్పత్తి నిలిచిపోవడాన్ని తలసేమియా వ్యాధి అంటారు. మేనరికపు వివాహాలు చేసుకున్న తల్లిదండ్రుల వల్ల జన్యుపరంగా ఇది సంక్రమిస్తుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లెక్కల ప్రకారం ప్రపంచంలో 4.5% మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. 25% మంది పుట్ట్టుకతోనే ఈ వ్యాధిగ్రస్తులయ్యే ప్రమాదం ఉంది. మిగతా 25% మంది సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. మరో 50% కేవలం వాహకులుగా మిగిలిపోవచ్చు. వీరికి పెద్దగా సమస్యలు ఉండవు. కానీ మరో వాహకుడి ద్వారా కలిగిన సంతానానికి మాత్రం తలసేమియా వస్తుంది.


ఎన్ని రకాలు? తలసేమియా


రెండు రకాలు.

1.ఆల్ఫా తలసేమియా ఇది రెండు రకాలు.
హిమోగ్లోబిన్ హెచ్: ఎముకల సంబంధిత సమస్యలు వస్తాయి. నుదురు, దవడల వద్ద ఎముకలు పరిమాణానికి మించి పెద్దగా ఉంటాయి. బుగ్గలు పెరుగుతుంటాయి. కామెర్లు సోకి, చర్మం పసుపురంగులోకి మారిపోతుంది. కళ్లల్లోని నల్ల గుడ్డు పెద్దగా కనిపిస్తుంది.
హైడ్రాప్స్ ఫెటలిస్: ఇది సోకిన శిశువులు జన్మించిన కొద్దిరోజులకే మరణిస్తారు. కొంతమంది గర్భంలోనే చనిపోతుంటారు.

2.బీటా తలసేమియా: ఇది మేజర్ తలసేమియా, ఇంటర్మీడియా తలసేమియా అని రెండు రకాలు. పిల్లలకు రెండేళ్ల వయస్సు రావడానికి ముందే మేజర్ తలసేమియా లక్షణాలు బయటపడతాయి. ఈ వ్యాధివల్ల బీటా గ్లోబిన్ జన్యువులు ప్రభావితమవుతాయి. పిల్లల ప్రాణానికి ప్రమాదం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది సోకినవారికి తరచుగా రక్తాన్ని ఎక్కిస్తుండాలి. ఇంటర్మీడియా తలసేమియా తీవ్రత బీటా కంటే తక్కువగా ఉంటుంది.

లక్షణాలు

-తలసేమియా వ్యాధి సోకిన పిల్లల్లో లక్షణాలు ముందుగా బయటపడవు. కాస్త ఆలస్యంగా బయటపడుతాయి.
-ఈ వ్యాధి చిన్నారులలో మూడు నెలల వయస్సు నుంచి 18 నెలల వయస్సు మధ్య బయటపడుతుంది.
-ముఖం పీక్కుపోయి, బాల్యంలోనే ముడతలు పడినట్టుగా ఉంటుంది.
-తరచుగా అనారోగ్యాలు వస్తుంటాయి.
-ఆకలి సరిగా ఉండదు. మందకొడిగా ఉంటారు.
-శారీరక ఎదుగుదల కనిపించదు.
-పిల్లలు పాలిపోయినట్టుగా ఉంటారు. శరీర రంగులోనూ తేడా ఉంటుంది.
-కామెర్లు సోకి చర్మం పసుపు రంగులోకి మారుతుంది.
-కొన్నిసార్లు కళ్లల్లోని తెల్లగుడ్డు పసుపు రంగులో కనిపిస్తుంది.
-బొడ్డు భాగంలో వాపు ఉంటుంది.

నిర్ధారణ ఎలా?

తలసేమియా వ్యాధిని నిర్ధారించడానికి కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయాలి. దంపతులు, గర్భిణులకు హెచ్‌బీ, ఎ2 స్థాయి రక్త పరీక్షలు చేస్తారు. గర్భిణులకు సీవీసీ శాంపిల్ పరీక్షలు చేసి శిశువుకు తలసేమియా ఉందా లేదా? అన్న విషయం నిర్ధారిస్తారు. హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫొరెసిస్ పరీక్ష ద్వారా ఈ వ్యాధి లక్షణాలను తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా ఎర్ర రక్తకణాల్లో ఉన్న వివిధ కణజాలాలను వేరుచేస్తారు. వాటిలో విభిన్నంగా ఉన్న కణజాలాలను గుర్తిస్తారు.

ఎలా వస్తుంది?

ఆక్సీజన్‌ను రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ అందించే బాధ్యత హిమోగ్లోబిన్‌దే. తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంతగా ఎముకల మూలుగల్లో హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. కొన్నిసార్లు ఉత్పత్తయినా ఎక్కువకాలం నిల్వ ఉండదు. హిమోగ్లోబిన్ నిల్వలు దారుణంగా పడిపోతాయి. అలా పడిపోయిన ప్రతిసారీ హిమోగ్లోబిన్‌ను కృత్రిమంగా రక్తం ద్వారా అందించాలి. సకాలంలో అందించకపోతే ప్రాణం పోతుంది. తల్లిదండ్రుల్లో ఉండే జన్యుపరమైన లోపాల కారణంగా ఈ వ్యాధి పిల్లలకు సంక్రమిస్తుంది. జన్యువుల్లో వ్యత్యాసాలు ఉన్నప్పుడు తలసేమియా వస్తుంది.

జాగ్రత్తలు ఏంటి?

-ఎట్టి పరిస్థితుల్లోనూ మేనరికపు వివాహాలు, రక్త సంబంధీకులు, దగ్గరి బంధువుల మధ్య వివాహాలు చేసుకోకూడదు.
-దూరపు సంబంధాలైనా వివాహానికి ముందుగానే రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
-తలసేమియా ఉన్నట్టు రక్త పరీక్షల్లో తేలితే ముందే జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.
-తలసేమియా సోకిన వారికి రక్తం ఎక్కించిన ప్రతిసారీ ల్యూకో డిప్లీషన్ ఫిల్టర్లు వాడాలి.
-క్రమం తప్పకుండా దంత, గుండె, మూత్రపిండాల, క్యాల్షియం, ఫాస్పరస్ స్థాయిలను తెలిపే పరీక్షలు చేయిస్తుండాలి.
-వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అప్పడే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు.
-తలసేమియా గల పిల్లలకు వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా చూసుకోవాలి.
-నెలకు సుమారు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు మందుల కోసం తప్పనిసరిగా ఖర్చు చేయాలి.

చికిత్స ఏంటి?

తలసేమియా వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి తరచుగా రక్తాన్ని ఎక్కిస్తుండాలి. కొంతమందికి ప్రతి ఇరవైఒక్క రోజులకు ఒకసారి రక్తాన్ని ఎక్కించాలి. ఎముకల్లో ఉన్న కణాలను మార్పిడి చేసి వ్యాధిని నివారించవచ్చు. దీన్ని వైద్య పరిభాషలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అంటారు. ఐతే.. తలసేమియా రోగులందరికీ ఇది చేయడం సాధ్యం కాదు. రక్తం ఎక్కించిన రోగుల్లో ఐరన్ సాధారణ స్థాయికి మించి ఉంటుంది. ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపుతుంది. అలాంటి రోగులు ఐరన్ కేలేషన్ థెరపీ చేయించుకోవాలి. ఈ థెరపీని ఇంజక్షన్ రూపంలో తీసుకోవాలి. శరీరంలో అదనంగా ఉన్న ఐరన్ కణాలను ఇది బయటకు పంపుతుంది.
dr-nagarjuna-chary

301
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles