రంజాన్ విందు భలే పసందు


Wed,May 30, 2018 11:16 PM

ఇది రంజాన్ మాసం. ఈ మాసం మహమ్మదీయులకు ఎంతో పవిత్రమైంది. ఈ నెలలో అందరికీ గుర్తొచ్చేది ఉపవాసం. అయితే, ఇస్లాం మతంలో చేసే ఉపవాసం మిగతా మతాలకంటే భిన్నమైంది. నెలవంక కనిపించినప్పటి నుండి మళ్ళీ నెలవంక దర్శనం ఇచ్చేంత వరకు (సుమారు 30 రోజులు) ... సూర్యోదయం(సహర్) నుండి సూర్యాస్తమయం(ఇఫ్తార్) వరకు రోజా(ఉపవాసం) ఉంటారు. రంజాన్ మాసంలో అందరికీ గుర్తొచ్చేది ఆహారం. అందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది హలీమ్. కేవలం మహమ్మదీయులే కాదు అన్నిమతాలవారు దీనిని ఇష్టపడతారు. కబాబ్, శవర్మ, బిర్యాని, కునఫా, జిలేబి మొదలైన ఆహారాల గురించి కూడా ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇఫ్తార్ అయ్యిందంటే మసీదుకు వెళ్లి ఉపవాస దీక్షలను విరమిస్తుంటారు. ఖర్జూరాను ముందుగా తిని, ఆ తర్వాత తాజా పండ్లు, సమోసలు, రొట్టెలు .. మొదలైనవి తింటారు. ఈ మాసంలో ప్రత్యేక ఆహారాల గురించి కొన్నైనా ప్రస్తావించుకోవాలి. అందులోనూ రంజాన్ మాసంలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెప్పుకొనే ఆహారపదార్థాలను తప్పకుండా ప్రస్తావించాలి.
haleem-ramzan

కౌసర్ బాగ్, కొంద్వా, పుణె

రంజాన్ మాసం వచ్చిందంటే ఆ వేడుకంతా పుణెలోని కౌసర్‌బాగ్, కొంద్వాలోనే కనిపిస్తుంది. ఇఫ్తార్ సమయంలో కౌసర్ బాగ్ ప్రదేశానికి వెళ్లి తీరాల్సిందే. ఇక్కడ ఒక కుటుంబం అనేక సంవత్సరాల నుండి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక రుచికరమైన ఆహారాలను అందిస్తున్నది. ఆ కుటుంబంతో పాటు ఇతర కుటుంబాలు కూడా రంజాన్ వంటల తయారీలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఇక్కడ కడ్డీల మీద కాల్చే నాన్ - వెజ్ (చికెన్ చకోరిస్) ప్రత్యేక రుచితో పాటు అందరికీ ఇష్టమైన ఆహారం. రంజాన్ మాసంలో మీరు పుణెలో ఉన్నట్లయితే సాయంత్రం ఒక అరగంట ఈ ప్రదేశంలో గడపితే చాలు రంజాన్ విందు జీవితాంతం మరిచిపోలేరు.
ఎక్కడ: కౌసర్ బాగ్, కొంద్వా, పుణె, మహారాష్ట్ర.
ఏమేమి తినవచ్చు : చికెన్ లాలిపాప్, ఫిర్ని , చికెన్ బిర్యానీ
biryani

మసీదు రోడ్, ఫ్రాజర్ టౌన్, బెంగళూరు

ప్రత్యేక హలీమ్ రుచి చూడాలంటే బెంగళూరులోని ఫ్రాజర్ టౌన్‌కు వెళ్లాల్సిందే. ఇది అక్కడి శివాజీ నగర్‌లో ఉంటుంది. రంజాన్ మాసంలో ఈ ప్రాంతమంతా కిక్కిరిసి ఉంటుంది. ఇఫ్తార్ సమయంలో సందులన్నింటినీ రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేస్తారు. దీనికి పక్కనే ఫ్రాజర్ టౌన్ ఉంటుంది. ఇక్కడి గల్లీలలోకి వెళితే ఘుమఘుమలాడే నాన్ - వెజ్ వంటకాలు నోరూరిస్తాయి. ఇక్కడ తప్పక రుచి చూడాల్సింది హలీమ్.
ఎక్కడ : ఫ్రాజర్ టౌన్, బెంగళూరు
ఏమేమి తినవచ్చు : డబుల్ కా మీఠా, మటన్ ఖీమా, మటన్ బిర్యాని
haleem-in-hydrebad

బరహ్ హండి, ముంబై

మటన్ పాయా ప్రత్యేకంగా రుచి చూడాలంటే బరహ్ హండి వెళ్ళాల్సిందే. రంజాన్ మాసం వచ్చిందంటే ముంబైలోని బరహ్ హండిని సందర్శించాల్సిందే. దీనికి 150 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఇఫ్తార్ సమయంలో మటన్ పాయాను సూప్‌గా తాగుతుంటారు.
ఎక్కడ : షాప్ నెం : 261, నాగ్ దేవి దేవి స్ట్రీట్, లోహార్ చౌల్, ముంబై, మహారాష్ట్ర .
ఏమేమి తినవచ్చు : పిచోట పాయా తప్పక రుచి చూడండి.
kabab-special

కరిమ్స్, న్యూఢిల్లీ

కరీమ్స్ హోటల్స్ ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీద్ రోడ్‌లో ఉంటుంది. ఇక్కడ మొఘల్ కాలం నాటి ఆహారాలను, పురాతన కాలం నాటి ఆహారాలను రుచి చూడవచ్చు. ఈ ప్రదేశానికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది. నాన్ వెజ్ ప్రియులు కరీమ్స్ కు వెళితే, ఇక్కడ లభించే ఓల్డ్ ైస్టెల్ కబాబ్స్ రుచి చూడాలి.
ఎక్కడ : కలన్ మెహల్, చాందిని చౌక్, న్యూ ఢిల్లీ, ఢిల్లీ .
ఏమేమి తినవచ్చు : మటన్ బుర్ర, మటన్ ఖుర్మా, బ్రెయిన్ కర్రీ, చికెన్ మోఘలాయ్
tandoori

చార్మినార్ ఫుడ్ స్టాల్స్, హైదరాబాద్

రంజాన్ అంటే చెప్పుకోవలసింది హైదరాబాద్‌నే. ప్రపంచమంతా ఒకే దగ్గర చేరిందా అన్నట్లు అన్ని రకాల సంస్కృతుల మేళవింపు హైదరాబాద్. ఇక్కడ రంజాన్ మాసం ఎంత వైభవంగా మొదలవుతుందో అంతే వైభవంగా ముగుస్తుంది. ఇఫ్తార్ సమయంలో చార్మినార్ గల్లీలు, నాంపల్లి గల్లీలు దావత్‌లతో కిటకిటలాడుతుంటాయి. పాతబస్తీ నుండి గోల్కొండ వరకు ఘుమఘుమలాడే ఆహారాలు, హలీమ్‌లు దారి పొడవునా కనిపిస్తుంటాయి. కబాబ్‌లు, యమ్మి యమ్మి పరోటాలు, దాల్ ఖీమా, స్టఫ్డ్ రోస్ట్ చికెన్ దజాజ్, మటన్ కుర్మా, ఖీర్ ఖుర్మా మొదలైనవి రుచి చూడవచ్చు. హలీమ్‌కి పిస్తా హౌస్ హైదరాబాద్‌లో చెప్పుకోదగ్గది. ఇక్కడ హలీమ్ ధర రూ.110 నుండి 150 వరకు ఉంటుంది.
ఎక్కడ : చార్మినార్ స్ట్రీట్, హైదరాబాద్.
ఏమేమి తినవచ్చు : హైదరాబాద్ బిర్యానీ, హలీం.

1972
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles