యాస మార్చుకొమ్మన్నరు!


Mon,October 3, 2016 02:01 AM

teenmaar-savitri
బాపూ.. ఎట్లున్న వే? అనే పిలుపు వినగానే.. పానం దేవులాడినట్లనిపిస్తది! అవ్వా.. పానం బాగుందా? అని పలకరిస్తే మనుసు కుదుటపడ్డట్లనిపిస్తది! ఆ ఆత్మీయ పలకరింపులకు.. బంధాల భరోసాకు చిరునామా ఆమె! తల్లిదండ్రులు పెట్టిన పేరు జ్యోతి. తెలంగాణ సమాజం పెట్టినపేరు సావిత్రి! నాలిక మీదికెల్లి కాదు.. గుండెలోతులకెల్లి పలికేటి తెలంగాణ ముచ్చట్లు ఆమెవి! ఊరు కచ్చీరు కాడ నలుగురు పెద్దమనుషులు కల్శి ముచ్చటపెట్టినట్టే ఉంటయ్ తీన్మార్ వార్తలు కూడా! పల్లె.. పట్నం.. గుడిసె.. బంగ్లా తేడా లేకుండా రాత్రి తొమ్మిదున్నర కొట్టంగనే ప్రతి వాడకట్టుకు సావిత్రి.. సత్తిల తీన్మార్ సప్పుడు వినిపిస్తది. ప్రకృతి ప్రసాదించిన పూల పండుగ బతుకమ్మ సందర్భంగా.. తెలంగాణ తల్లి గావురాల బిడ్డె సావిత్రితో
జిందగీ ములాఖత్..

జిందగీ :

బతుకమ్మ ఫండుగ శుభాకాంక్షలు

సావిత్రి :

మీకు కూడా.. నమస్తే తెలంగాణ అభిమానులకు, తీన్మార్ వీక్షకులకు, జిందగీ పాఠకులకు, ప్రజలందరికీ శనార్థులు. శుభాకాంక్షలు. ఫండుగ అంటున్నరేంది? ప అక్షరాన్ని మీరు కాదు గనీ మా సత్తిగాడు పలికితేనే మంచిగుంటది.

చిన్నప్పుడు ఎట్ల జరుపుకొనేది బతుకమ్మ పండుగ?


ఏడో తరగతి దాకా మా ఊర్ల బడిల చదువుకున్న. సెలవులున్నా అందరం కలిసి స్కూల్ తరపున బతుకమ్మ ఆడేటోళ్లం. సార్లు మాకోసం వొచ్చి బతుకమ్మ ఆడిపిచ్చేటోళ్లు. ఆ రోజులు ఇప్పటికీ యాదికొస్తయి. ఎంతైనా చిన్నప్పటి జ్ఞాపకాలు బాగుంటయి. వాడకట్టోళ్లందరం ఒక్క దగ్గర కలిసి ఆడేది.

సావిత్రి.. నీ ఒరిజినల్ పేరా? ఉత్తుత్తదా?


నిజంగనా.. అబద్ధమా? కాదు. మీరు సావిత్రి అనుకుంటున్నరు కదా! ఉండనియ్యుర్రి. మా తమ్ముడు (సత్తి) సాఫిత్రి అంటడు. చాలామంది అలా కూడా పిలుస్తున్నరు.

వేరే పేరుంటే బాగుండు అనిపించిందా ఎప్పుడైనా?


ఉంది. ఒక పేరు. జ్యోతి. మా అమ్మనాయిన పెట్టింది. ఆ పేరుతో మీకందిరికీ పరిచయం లేను కదా! సావిత్రి పేరే బాగుంది.

మరెప్పుడు జగడమేనా?


మేమేం జగడం పెట్టుకోం. తెరమీద గొడవపడ్డా తెరవెనక అక్కకన్నా మంచిగ చూస్కుంటడు. తెరమీద సత్తి నాకు తమ్ముడు, తెరవెనక పెద్దన్నలాంటి వాడు.
teenmaar-savitri2

పిప్పర్‌మెంట్లు, పాపడాల కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మెమరీస్?


నవ్వుతూ.. అందరికీ తెలిసిందే! మా వోడిది జర పెద్ద కడుపు. ఏదున్నా మొత్తం ఏం తినడు. నాక్కూడ తెస్తడు. సత్తితో ఉంటే ప్రతిరోజూ ఓ మెమరీ.

ఎంత వరకు సదువుకున్నవ్?


తప్పదా? ఏదో.. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ బడిల చదువుకున్న. ఇంటర్‌ల మంచి మార్కులే వచ్చినయి. డిగ్రీ డిస్‌కంటిన్యూ అయింది.

ఇంత పేరొస్తదని అనుకున్నవా? ఈ అవకాశం ఎలా వచ్చింది?


అస్సలు ఊహించలేదు. యాంకర్‌గా రాణించాలనుకున్నాను. ఇంతకుముందు వేరే ఛానల్‌లో యాంకరింగ్ చేశిన. ఆడ నీ భాష మార్చుకో, గొంతు మార్చుకో అన్నరు. తెలంగాణ యాస మార్చుకో అన్నరు. నాది మీడియాకు పనికిరాని గొంతు అన్నరు. చాలా ఇబ్బంది పడ్డ. మార్చుకోనీకి ప్రయత్నించిన కాని నా వల్ల కాలే. నా గొంతు ఏంది ఇట్లుంది అని చాలాసార్లు మస్తు ఏడ్శిన. వీ6ల అవకాశం వస్తే బాగుండు అనుకునేదాన్ని. అదృష్టంతోఅనుకున్నట్లే అవకాశం వచ్చింది. ముందు సిన్మావార్తలు సదివిన. తర్వాత వీకెండ్ స్పెషల్ తీన్మార్ సదివిన. వాయిస్ ఓవర్లు కూడా సదివిన. నా గొంతు డిఫరెంట్‌గా ఉండడం వల్ల తీన్మార్‌ను జనాలు ఆదరించడం, ఛానల్‌కు రేటింగ్ రావడం, మాకు సక్సెస్ రావడం జరిగిపోయాయి. వీ6 ఛానల్‌కు అందరిలాగే వచ్చాను. అందరిలాగే రెజ్యూమ్ ఇచ్చాను. టెస్ట్‌కట్ ఇచ్చాను.

యాంకరింగ్ చేయాలంటే ఏం తెల్వాలే? నువ్వేమైనా చేశినవా?


నాకైతే ఏం తెల్వదు. కెమెరా ముందు భయం ఉండొద్దు. అయినా నేను తెరమీద నటించను. బయట ఎట్ల ఉంటనో.. వార్తలు కూడా అట్లనే చెప్త. ఎన్ని ప్రోగ్రాములు చేశినా..ఏం చేశినా తీన్మార్ ప్రోగ్రాం చేయడం వేరు.

మదిల మాట అని కూడా ప్రోగ్రాం చేస్తున్నవు కదా?


అవును. జనవరి నుంచి మదిల మాట పేరుతో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టిన. ఇప్పటికీ సుమారు 25 ఎపిసోడ్లు అయినట్టున్నయి.
teenmaar-savitri3

ఇంటర్వ్యూ చేసే ముందు ఎలా ప్రిపేర్ అవుతావు?


అస్సలు ప్రిపేర్ అవ్వను. అందరు మనలాంటి మనుషులే. భయపడాల్సింది లేదు. నేను ఏదైతే అడగాలనుకుంటానో అది అడుగుతాను. ఇప్పుడు మీతో ఎలాగైతే మాట్లాడుతానో, ఇంట్లో ఎలాగైతే ఉంటానో అలాగే ఉంటాను. ముక్కుసూటిగ ముచ్చట పెట్టినట్లు ప్రశ్నలు అడుగుత.

ఇంతమంది సెలబ్రిటీల మదిల మాటలు తెలుసుకున్నవ్ కదా? ఎవరు మంచోళ్లు?


ఒక్కోక్కరు ఒక్కోలా ఉంటరు. నేను మంచిదాన్ని కాబట్టి అందరూ మంచోళ్లే అనుకుంటున్న. అయినా మంచోళ్లు, చెడ్డోళ్లు అనడానికి మనమెవరం? నేను చేశిన ఇంటర్వ్యూలల్ల డిస్కోశాంతి ఇంటర్వ్యూ బాగిష్టం. రకుల్‌ప్రీత్ సింగ్ కూడా ముక్కుసూటిగ సమాధానమిచ్చింది.

బుగ్గల జాకెట్.. డిజైనింగ్ కాన్సెప్ట్ బాగుంది? మీదేనా?


బుగ్గల జాకెట్ ఫేమస్ అయింది. ఇప్పుడు ట్రెండ్ కూడా అయింది. అందరు కుట్టించుకుంటున్నరు. ఒక్కోదగ్గరయితే సాఫిత్రి జాకెట్లు అని పేరు పెట్టిర్రట. బుగ్గల జాకెట్ ఆలోచన మా సీఈఓ సార్‌ది. మన కల్చర్‌కు బాగా దగ్గరగా ఉంటుందని అలా సెలక్ట్ చేశారు.

మాటలైతే బాగనే మాట్లడుతవ్? పాటలు, డ్యాన్సులు చేస్తవా?


పాటలా? నా గొంతు ఏం బాగుంటుంది. పాటలు పాడితే జనాలు తట్టుకోలేరేమో అని పాడను. డాన్స్ అంటే అలవాటు లేదు.

స్క్రిప్ట్ ఉంటదా? తెర వెనక ఎంత మంది పనిచేస్తరు?


ఇది ఒక్కరిక్కరిదో జరిగే పని కాదు. అంతా టీం వర్క్. లైవ్ అంశాన్ని ఎంపిక చేసే దగ్గరి నుంచి రవి సార్ ఆదేశాలుంటాయి. స్టోరీలు, ప్యాకేజీలు రాయడంలో భోనగిరి రఘన్న, అశోక్, రాజు, నరేందర్‌లతో పాటు ఎడిటింగ్, కెమెరా ఇలా అన్ని డిపార్ట్‌మెంట్ల వాళ్లు కష్టపడుతున్నరు.

మీ కుటుంబ నేపథ్యం?


మాది నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగంపేట. మా అమ్మ యశోద. బీడీ కార్మికురాలు. నాన్న రాజమల్లేష్. ఆర్‌ఎంపీ డాక్టర్. దిగువ మధ్య తరగతి కుటుంబం మాది. హైదరాబాద్‌కు రాకముందు వరకు నేను కూడా బీడీలు చేశిన. పొలం పనికి పోయిన. ఊరికిపోతే ఇప్పటికీ బాయికాడ పొలం పనికిపోత.

భవిష్యత్తు ప్రణాళికలేంటి?


ఇప్పటి వరకైతే ఏం అనుకోలేదు. అభిమానుల కొండత బలం, వీ6 యాజమాన్యం ప్రోత్సాహం, తోటి స్నేహితుల సహకారం అన్నీ ఉన్నాయి. ఉన్న పేరును కాపాడుకోవడం, నిలబెట్టుకోవడం అంతే!

ఖాళీ టైమ్ దొరికితే ఏం చేస్తుంటవ్?


ఖాళీ టైం తక్కువనే దొరుకుతుంది. ఎందుకంటే షూటింగ్ హడావిడి ఉంటది కదా. ఎప్పుడన్న దొరికితే టీవీ చూస్త.

ఇంకా ఏదైనా సాధించాలనుకుంటున్నావా?


ఇంతకన్నా ఫేమ్ రావాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎంత ఉంటే అంతలో అడ్జస్ట్ అవ్వాలి.

బిత్తిరి సత్తి లేకపోతే సావిత్రి లేదు ఒప్పుకుంటారా?


ఒప్పుకుంటా. సత్తి లేకపోతే సావిత్రి లేదు. తీన్మార్ లేకపోతే సత్తి, సావిత్రిలు లేరు. సత్తి రాకముందు వరకు సావిత్రి కొంచెం ఉండే. సత్తి ఒచ్చినంక సత్తితో పాటూ అందరికీ సావిత్రక్క అయిపోయాను. పెద్ద వాళ్లు కూడా సావిత్రక్కా అని పిలుస్తున్నరు. ఇంతమందికి అక్కకావడం అదృష్టమే కదా!

జిందగీ పాఠకులకు ఏమైనా చెప్తరా?


సందేశమిచ్చేంత గొప్పదాన్ని, పెద్దదాన్ని కాను. తల్లిదండ్రులూ.. అమ్మాయిలను చిన్నచూపు సూడకండి. అన్ని విధాలా ప్రోత్సహించండి. ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో తెలుసుకోండి. అబ్బాయిలంటే ఎలాగోలా కష్టపడతారు. కానీ అమ్మాయిలు నాలాగా సున్నిత మనస్కులుంటరు. ఎవరినీ ఇబ్బంది పెట్టకండి. కోపతాపాలకుపోయి బంధుత్వాలను ఎడబాపుకోవొద్దు. ఈ పండుగ నుంచైనా కలిసిమెలిసి ఉండండి.
అందరూ బాగుండాలి. అందులో మనముండాలి.

గిది చెప్పు.. గిట్ల టీవీ వార్తలల్ల ఊరి ముచ్చట్లు పెట్టాలని ఆలోచన ఎవరు జేశిన్రు?


ఈ విషయంలో పూర్తి క్రెడిట్ మా సీఈఓ అంకం రవి సార్‌ది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రారంభమైంది వీ6 ఛానల్. మన యాస, మన భాష ఉట్టిపడేలా.. మన సంస్కృతిని తట్టిలేపేలా కార్యక్రమాలు ఉండాలని ఈ తీన్మార్ కార్యక్రమాన్ని రవి సార్ రూపొందించారు. మన బతుకులను అద్దంపట్టే వార్తలు చూపించాలని తపిస్తుంటరు.
teenmaar-savitri4

ఊరికెళ్లినప్పుడు మీ ఊర్లోవాళ్లు ఎలా ఆదరిస్తరు?


ఊర్లోవాళ్లు ఏమోగనీ.. నాకైతే గొప్పగా అపిస్తున్నది. నాగంపేట అనే ఓ ఊర్లో కుట్టు మెషీన్ కుట్టి, బీడీలు చుట్టి, పొలం పనిచేసి ఈ రోజు తీన్మార్‌ల యాంకర్ అయిన. ఒకప్పుడు మా ఊరు నాగంపేట అని చెప్పుకునేదాన్ని. కానీ ఇప్పుడు సావిత్రి ఊరు నాగంపేట అంటున్నరు. ఊరోళ్లు సావిత్రి మా ఊరమ్మాయి అని గర్వంగా చెప్పుకుంటున్నరు.

మంగ్లీ, సుజాతలతో మీ అనుబంధం గురించి?


నవ్వుతూ.. మూడు కొప్పులు ఒక్కదగ్గర ఉండయంటరు. కానీ మేం ఉంటున్నం. ఆడోళ్లం కదా చిన్నచిన్నగా గొడవపడతం. సర్దుకుపోతం. అక్కాచెల్లెండ్ల లెక్క కలిసిమెలిసి ఉంటం.

సత్తి సావిత్రిల జగడాలు చూసి వీళ్లిద్దరు నిజంగ అక్కా తమ్ముళ్లు అనుకుంటున్నరు. నిజమేనా?


నవ్వుతూ.. కాదని ఎవరన్నరు? ఒక తల్లి కడుపుల పుట్టలేదు కానీ.. అన్నా చెల్లెళ్లమే, అక్కా తమ్ముళ్లమే.

నువ్వు, సత్తి ప్రేక్షకులకు ఇంటి మనుసుల్లెక్కయిన్రు. ఎట్లనిపిస్తుంది?


అది మా అదృష్టం. సాధారణంగా ప్రేక్షకులు ఇంతగా అభిమానించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఈ విషయంలో మమ్మల్ని ఇంటి మనుషుల కన్నా ఎక్కువ చూస్కుంటున్నరు. ప్రేక్షకులకు
ఎప్పటికీ రుణపడి ఉంటాం.

హీరోయిన్‌లకున్నంత ఫాలోయింగ్ ఉంది? హీరోయిన్ అయితవా?


హీరోయిన్‌గానా? (ఆశ్చర్యంగా..) ఎందుకు నన్ను టీవీల సూడబుద్ది అయితలేదా? నాకైతే టీవీ చాలు. సినిమాలకు నేను సూట్ అవ్వనేమో?!

ఎవర్నైనా ప్రేమించినవా? కాబోయేటోడు ఎట్లుండాలి అనుకుంటున్నవ్?


కాబోయేవాడా? మా ఆయనలా ఉండాలి. నవ్వుతూ.. నాకు పెళ్లయింది. లవ్ మ్యారేజ్. మా ఆయన గంగూలీ. మార్కెటింగ్ చేస్తడు. కాబోయే వాడు ఎలాగైతే ఉండాలనుకున్నానో
అలాంటోడే దొరికిండు.

లవ్ స్టోరీ అంటే ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది? మరి మీది?


అందరి లవ్‌స్టోరీలాగే మా లవ్‌స్టోరీ. చెప్పేంత గొప్ప స్టోరీ ఏం కాదు.

-అజహర్ షేక్
-కంది సన్నీ

19092
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles