యత్ర నార్యస్తు పూజ్యంతే..


Wed,March 7, 2018 03:13 AM

Womens
యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతా.. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడుతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారు. అవును.. స్త్రీలను గౌరవించుకోవడం మన సంప్రాదాయం. గౌరమ్మను గంగలో పూజించే బతుకమ్మ సాక్షిగా.. దుర్గమ్మను నైవేద్యంతో పూజించే బోనం సాక్షిగా.. మహిళను గౌరవించుకోవడం, ఆమెను సత్కరించుకోవడం మన వారసత్వం! ఆమె ఉద్యమంలో పాటయ్యింది. మాటయ్యింది. ఆటలో మేటీ అయ్యింది. అక్షరం దిద్దింది. చేదోడు వాదోడయ్యింది. అన్నింటా ఆమె. ఆమెను గౌరవించుకోవడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక సందర్భం మాత్రమే. 70 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక పురస్కారాలను మహిళా దినోత్సవం సందర్భంగా అందజేస్తున్నది. భాషా సంస్కృతిక శాఖ, మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ సంయుక్తంగా తమ వంతు బాధ్యతగా, సరికొత్త సంప్రదాయంగా మూడేండ్లుగా ఈ అవార్డులను అందిస్తున్నది. ఈ ఏడాదికి గాను 17 కేటగిరీల్లో 20 మంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఆ ప్రతిభావంత మహిళల్లో పది మందిని ఈ రోజు పరిచయం చేస్తున్నాం.

సాయం చేయడంలోనే ఆనందం

gandra-ramadevi
నా దగ్గరికి సాయం కోరి వచ్చే మహిళలకు నా వంతు సహకారం అందిస్తున్నాను. సామాజిక, ఆర్థిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాను. 1996, 2006లో రెండుసార్లు జెడ్పిటీసీగా పనిచేశాను. కేవలం ప్రభుత్వ పథకాలే కాకుండా ఆపద అని వచ్చిన ప్రతీ మహిళకు సాయం చేశాను. 2 వేలకు పైగా మహిళా సహకార సంఘాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కృషి చేయడంతో పాటు దీపం పథకం అందరికీ అందేలా చర్యలు తీసుకున్నాను. మహిళలకు నేను చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి అవార్డుకు ఎంపిక చేయడం సంతోషం. ప్రస్తుతం పదవి లేకపోయినా సాయం కోసం వచ్చేవారికి నా వంతు సహాయం చేస్తూనే ఉన్నాను. నేను చేస్తున్న సేవల వెనుక నా కుటుంబ సహకారం గ్రామస్తుల సహకారం ఎంతో ఉంది. నలుగురికి సాయం చేయడం, అందులోనూ మహిళలకు సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉంది.
గండ్ర రమాదేవి, రాయికల్, జగిత్యాల జిల్లా (సామాజిక సేవకుగాను ఆవార్డు)

అవార్డు రావడం గొప్ప వరం

eedunoori-padma
చిన్నతనం నుంచే ఉద్యమ పాటలు పాడిన అనుభవం ఉంది. ప్రజా ఉద్యమాల్లో భాగస్వామిగా అనేక వేదికలపై విప్లవ గీతాలను ఆలపించాను. ఆ తర్వాత మలి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడంతో పాటు ఉద్యమ గీతాలు ఆలపించే అవకాశం వచ్చింది. ఉద్యమం వల్లే ఉద్యమ గాయనిగా పేరొచ్చింది. అనేక ఒడిదొడుగులు, కష్టనష్టాలను భరిస్తూ ఈ స్థాయికి రావడం ఆనందంగా ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన కళలకు, కళాకారులకు నిజమైన గుర్తింపు వచ్చిందని భావిస్తున్నాను. తెలంగాణ వచ్చాకే సాంస్కృతిక సారథిలో ఉద్యోగం రావడం ఒక అదృష్టమైతే, ఇప్పుడు అవార్డు రావడం గొప్ప వరంగా భావిస్తున్నాను. నన్ను ఉద్యమ గాయనిగా గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, సాంస్కృతిక సారథి రసమయి, కన్వీనర్ దయానర్సింగ్‌లకు రుణపడి ఉంటాను.
ఈదునూరి పద్మ, రామగుండం, పెద్దపల్లి జిల్లా. (ఉద్యమ గాయనిగా అవార్డు)

ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తా

ARUNA
జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్‌లో తొలి కాంస్య పతకం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఆ సందర్భంగా ప్రభుత్వం నన్ను సత్కరించడంతో పాటు మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడారంగంలో నాకు అవార్డు ప్రకటించడం ఇంకా సంతోషంగా ఉంది. కుటుంబసభ్యుల సహకారంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ పతకం సాధించాను. నా కెరీర్‌లో లభించిన అతిపెద్ద విజయంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. భవిష్యత్‌లో స్వర్ణపతకంతో దేశానికి, మన రాష్ర్టానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకువస్తాను. భవిష్యత్‌లో జిమ్నాస్టిక్స్‌కు మరింత ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నా. 2020 ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్‌లో మన దేశానికి పతకం తీసుకురావడానికి ప్రయత్నిస్తా.
అవార్డుకు ఎంపిక చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
బుడ్డా అరుణారెడ్డి, జిమ్నాస్టిక్స్ కాంస్యపతాక విజేత.

పాటకు గుర్తింపు

janshi
చిన్నతనం నుంచి పాటలు పాడుతున్నా. మలిదశ ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2001 నుండి కూడా అనేక వేదికల మీదా నా గానం వినిపించే అవకాశం కలిగింది. జానపద, ఉద్యమ గీతాలెన్నింటినో పాడాను. జై బోలో తెలంగాణ, పోరు తెలంగాణ చిత్రాల్లో నటించే అవకాశం కల్గింది. 80కి పైగా ఆల్బమ్‌లలో పాడాను. నా భర్త ఆరెళ్లి దేవేందర్ ప్రోత్సాహంతో పాటు, నగారే కళా బృందం, సాంస్కృతిక సారథి ప్రోత్సాహమే ఈ రోజు నాకు అవార్డు రావడానికి కారణమని భావిస్తున్నా. అవార్డు రావడం వల్ల నాకు, నా పాటకు గుర్తింపు పెరుగుతుందన్న ఆశ ఉంది. నన్ను అవార్డుకు ఎంపికయ్యేలా ప్రోత్సహించిన సారథి చైర్మన్, మా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. భవిష్యత్తులో మరిన్ని పాటలు పాడే అవకాశం రావాలని కోరుకుంటున్నా.
అంతడుపుల ఝాన్సీ, గాయని, మానకొండూరు (జానపద సంగీతంలో రాణిస్తున్నందకు గాను అవార్డు)

గ్రామాభివృద్ధే లక్ష్యం

shailaja-sarpanch
గ్రామాభివృద్ధికి కృషి చేసినందుకు గాను మహిళా దినోత్సవం సందర్భంగా నన్ను అవార్డుకు ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. గ్రామ ప్రజలు, నా భర్త మాజీ సర్పంచ్ జితెందర్‌రెడ్డి సహకారం, ప్రోత్సాహం మూలంగానే నన్ను ప్రభుత్వం గుర్తించింది. భవిష్యత్తులో గ్రామాభివృద్దిలో ఎలాంటి రాజీ లేకుండా పనిచేస్తా. అవార్డు ప్రకటించిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.
ఇనుకొండ శైలజ, కొత్తపల్లి సర్పంచ్ (తిమ్మాపూర్ మండలం,
కరీంనగర్ జిల్లా) (గ్రామాభివృద్ధికి గాను అవార్డు)

ప్రపంచ వ్యాప్తంగా శిష్యులున్నారు!

manjula-srinivas
చాలా సంతోషంగా ఉంది. అసలు అవార్డు వస్తుందని నేను ఊహించలేదు. నేను పనిచేసిన నా డిపార్ట్‌మెంట్ పట్ల కృతజ్ఞతగా ఉన్నా. నేను భరతనాట్యం, కూచిపూడి కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేశా. ఐదు సంవత్సరాల నుంచి ఫీల్డ్‌లో ఉన్నాను. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే మక్కువ. దాంతో 40 సంవత్సరాల నుంచి కథక్, భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు నేర్చుకున్నా. రామ్‌కోఠి మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్‌ని. పెద్ద పెద్ద గురువుల దగ్గర డాన్స్ నేర్చుకున్నా. ఈ సందర్భంగా వారందరికీ నా పాదాభివందనం. నేను చదివిన కాలేజ్‌లోనే నేను డాన్స్ పాఠాలు బోధించా. మా ఆయన శ్రీనివాస్ గారు డాన్స్ డైరెక్టర్. ఆయన ప్రోత్సాహంతో డాన్స్ టీచింగ్‌లోకి వచ్చా. ఆయన స్థాపించిన అకాడమీలో నేను ఇప్పుడు డాన్స్ పాఠాలు చెబుతున్నా. ఆయన ప్రస్తుతం ఈలోకంలో లేకున్నా ఆయన ఆశయాన్ని ముందుకు నడిపించే దిశగా అడుగులు వేస్తున్నా. నా దగ్గర ఇప్పటి వరకు కొన్ని వందల మంది డాన్స్ నేర్చుకున్నారు. వాళ్లంతా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిస్తున్నారు. వాళ్లు కూడా అకాడమీలు స్థాపించుకున్నారు. ఆన్‌లైన్‌లో కూడా పాఠాలు చెబుతున్నారు. ఒక గురువుకి శిష్యుడు అభివృద్ధి చెందితేనే కదా ఆనందం. ఈ అవార్డు దక్కడం పట్ల నా బాధ్యత మరింత పెరిగిందనుకుంటున్నా. నాకు సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వానికి నా ప్రత్యేక అభివందనాలు.
- మంజుల శ్రీనివాస్, క్లాసికల్ డాన్సర్

ప్రభుత్వానికి ధన్యవాదాలు

Nitya_Santhoshini
ప్రభుత్వం ప్రకటించిన అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాను. నాకు అవార్డు వస్తుందని అసలు ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది. నేను నా మూడేళ్ల వయస్సు నుండే పాటలు పాడడం, వివిధ పోటీల్లో పాల్గొనడం చేసేదాన్ని. కర్నాటక సంగీతం కూడా నేర్చుకున్నాను. నా తొలి గురువు అమ్మ రామాలక్ష్మి రంగచార్య. ఇప్పటి వరకు 1500లకు పైగా భక్తి పాటలు, 150 వరకు సినిమా పాటలు పాడాను. మహిళా దినోత్సవం సందర్భంగా మ్యూజిక్ విభాగంలో క్లాసిక్ మ్యూజిక్‌లో గాయనిగా గుర్తించి నన్ను అవార్డుకు ఎంపిక చేయడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
నిత్యసంతోషిని, గాయకురాలు, హైదరాబాద్

పెయింటర్ ఫ్యామిలీ!

kavitha-devuskar
ముఖ్యమంత్రి గారికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా. ఈ ప్రభుత్వం మహిళలను గుర్తించి అవార్డులు ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అందులో ఈ సంవత్సరం నా పేరు ఉండడం వల్ల మరింత సంతోషంగా అనిపిస్తున్నది. మాది పెయింటర్స్ ఫ్యామిలీ. అలాంటి కుటుంబంలో పుట్టినందుకు, ఈరోజు అవార్డును అందుకుబోతున్నదని తెలిసినందుకు నేను చాలా గర్వపడుతున్నా. అలాగే నాకు నేర్పించిన గురువులకు నా అభివాదాలు. వాళ్లే లేకపోతే నేనీ స్థాయిలో ఉండకపోయేదాన్ని. 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టాను. జేఎన్టీయూలో 34 సంవత్సరాలుగా ఫైన్ ఆర్ట్స్ ఆర్కిటెక్చర్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశా. నా బొమ్మల్లో తెలంగాణ గ్రామీణ నేపథ్యం కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడి వాళ్లు ధరించే నగలు, వారి అలంకరణ ప్రత్యేకంగా ఉంటుంది. పల్లె ప్రతిబింబించేలా నా పెయింటింగ్స్ ఉంటాయి. ఎక్కువ పనిచేసేవాళ్ల లైఫ్ ైస్టెల్ నా పెయింటింగ్స్‌లో చూడొచ్చు. నేను సిటీలో పుట్టి, పెరిగినా కూడా నాకు పల్లె వాతావరణం అంటే చాలా ఇష్టం. ఆ మక్కువతోనే ఈ పెయింటింగ్స్ వేస్తున్నా.
- కవితా దేవాస్కుర్, ఆర్ట్

మహిళా దర్శకులకు ప్రోత్సాహం

nandini-reddy
మన ప్రభుత్వం నుంచి అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉంది. ఈ ప్రోత్సాహం చాలామందికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. మరింత మంది మహిళలు దర్శకత్వం వైపు రావడానికి నాకు వచ్చిన అవార్డు వారిలో ప్రోత్సాహం నింపుతుందని భావిస్తున్నాను. మహిళలు ఈ రంగంలో రాలేరు అనే అపోహ కొంతవరకైనా తొలగిపోతుందని, భవిష్యత్తులో ఈ రంగంలోనూ మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నాను. నా కృషికి గుర్తించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.
బి.వి. నందిని రెడ్డి, సినిమా దర్శకురాలు,హైదరాబాద్
(సినీ పరిశ్రమలో దర్శకత్వ రంగంలో రాణిస్తుందుకు గాను అవార్డుకు ఎంపిక)

చాలెంజింగ్‌గా చేశా..

Womens10
తెలంగాణ గవర్నమెంట్‌కి, మామిడి హరికృష్ణ, కవిత గారికి నా కృతజ్ఞతలు. అలాగే నా కుటుంబం మొత్తానికి నేను రుణపడి ఉన్నా. నా భర్త కూడా జర్నలిజం ఫీల్డ్‌లోనే ఉన్నారు. కానీ ఏ రోజు.. ఏ స్టోరీ గురించి ఆయన నాకు సహాయం అందించలేదు. పైగా నేను అందించను అని చెప్పేవారు. దాంతో చాలెంజింగ్‌గా తీసుకునేదాన్ని. పట్టుదలగా స్టోరీలు చేసేదాన్ని. ప్రజలకు సేవ చేయాలని అనుకొని సోషల్ వర్క్‌లోకి వచ్చాను. కానీ మాటలతో కాకుండా రాతలతో ఈ సమాజాన్ని మరింత మార్చవచ్చు అనుకున్నా. అందుకే ఈ ప్రొఫెషన్‌ని ఎంచుకున్నా. ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్లని ఎత్తి చూపే అవకాశం వస్తుంది. ఈ వృత్తిలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కున్నా. ఎన్నో బెదిరింపులు వచ్చాయి. అన్నిటినీ తట్టుకొని ఈ రోజు నిలబడ్డాను.. కాబట్టే ఈ విజయం అందిందని అనుకుంటున్నా. నా వల్ల ఎవరూ బాధపడొద్దు.. కానీ బాగుపడాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ రంగంలో ఇంకా కొనసాగుతున్నా. ఎన్నో స్టోరీలు అందించా. ఒకరితో మాట్లాడినా, సినిమాకెళ్లినా, పార్కుకి వెళ్లినా.. ఏదో ఒక స్టోరీ దొరుకుతుందేమోననే వెతికేదాన్ని. అది చూసి చాలామంది అసూయపడేవాళ్లు. ఎక్కడికి వెళ్లినా పని మీద ధ్యాస ఉంటుందని. కానీ ఈ రోజు వాళ్లందరూ నన్ను అభినందిస్తున్నారంటే.. నా శ్రమకు దక్కిన ఫలితమే కదా!
- లతాజైన్, జర్నలిస్ట్

1678
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles