యత్ర నార్యస్తు పూజ్యంతే..


Wed,March 8, 2017 12:48 AM

handయత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతా.. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారు. అవును.. స్త్రీలను గౌరవించుకోవడం మన సంప్రాదాయం. సంస్కృతి. ఇది మన వారసత్వం. బొడ్డెమ్మలుగా, బతుకమ్మలుగా మహిళలను గౌరవించడం మన జీన్స్‌లోనే ఉంది. ఆమె ఉద్యమంలో పాటయ్యింది. మాటయ్యింది. ఆటలో మేటీ అయ్యింది. అక్షరం దిద్దింది. చేదోడు వాదోడయ్యింది. అన్నింటా ఆమె. ఆమెను గౌరవించుకోవడం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఒక సందర్భం. స్వతంత్ర భారతంలో 70 ఏళ్లుగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక పురస్కారాలను అందజేస్తున్నది. భాషా సంస్కృతిక శాఖ, మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ సంయుక్తంగా.. ఈ ఏడాదికి గాను 13 కేటగిరీల్లో 24 మందికి పురస్కారం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రతిభావంత మహిళల్లో నిన్న తొమ్మిది మంది గురించి చదివారు. మిగిలిన వారిని ఈ రోజు పరిచయం చేసుకోండి.

తొలిమహిళావీసీ!


డాక్టర్ విద్యావతి విద్యారంగం
vidyavathi
ప్రొఫెసర్ విద్యావతి 1939లో వరంగల్ జిల్లాలో జన్మించారు. హైదరాబాద్‌లోని బన్సీలాల్ బాలిక విద్యాలయ (బేగంబజార్)లో హిందీ మీడియంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1968లో ఓయూ పీజీ సెంటర్‌లో అధ్యాపకురాలిగా నియమితులయ్యారు.1974లో కేయూ బోటనీ విభాగంలో రీడర్, ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఏపీలో 1998మే 6 వ తేదీన కాకతీయ యూనివర్సిటీకి మొదటి మహిళా వైస్‌ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. మే 5, వరకు పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఆమె వీసీగా పనిచేసిన కాలంలో యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. ఈ అవార్డు రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

వెయిట్ లిఫ్టర్


ప్రియదర్శిని క్రీడలు
PRIYA-DARSHINI
హకీంపేటలోని స్పోర్ట్స్ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రియదర్శిని ఎనిమిదవ తరగతి నుంచి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటున్నది. తొలిసారి ఢిల్లీలో జరిగిన పోటీలో వెయిట్ లిఫ్టింగ్‌లో రంగ ప్రవేశం చేసింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ స్థాయిలో నిర్వహించిన అనేక పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించింది. నేషనల్ స్థాయిలో పది వరకు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. హర్యానా, పుణేలో జరిగిన పోటీల్లో పాల్గొంది. ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక గోల్డ్ మెడల్ సాధించింది. ఏటూరునాగారం మండలం మారుమూల గిరిజన గ్రామమైన చెల్పాకకు చెందిన తూరం శ్రీనివాస్, శారదల ప్రథమ పుత్రిక ప్రియదర్శిని. తాడ్వాయి మండలం మేడారంలోని ఇంగ్లీషు మీడియం పాఠశాలలో నాల్గవ తరగతి వరకు చదివిన ప్రియదర్శిని లాంగ్ జంప్, హైజంప్‌లో కనబర్చుతున్న ప్రతిభను గుర్తించిన పీఈటీ లక్ష్మీనారాయణ హకీం పేటలోని స్పోర్ట్స్ స్కూల్‌లో జాయిన్ చేశారు.

తబలాలో భళా!


పాయల్ సంగీతం
payal
పాయల్ పేరులోనే అందెల సవ్వడి ఉంది. ఆమె తబలా వాయిస్తూ ఈ లోకాన్ని మరిపిస్తున్నది. ఆమె వాయిద్యానికి ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కూడా ఔరాఅన్నారు. ఈ వాయిద్యంలో 20 ఏళ్లుగా ఓ మహిళ రాణించడం, జాతీయ స్థాయికి ఎదగడం అరుదైన విషయం. పాయల్ నిజామాబాద్ నగరంలోని సంగీత నృత్య కళాశాలలో డిప్లొమా పూర్తి చేశారు. మహిళలు అనుకుంటే దేనినైనా సాధించవచ్చని ధృడ సంకల్పంతో తబలా నేర్చుకుంది. ఇప్పటి వరకు ఎన్నో రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం పాయల్ డిచ్‌పల్లి మండలం బర్దీపూర్ ఎంపీటీసీగా కూడా కొనసాగుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి అవార్డుకు ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. తమ కుటుంబమంతా సంగీత రంగానికి అంకితమయ్యిందన్నారు.

ఉద్యమ పెద్దమ్మ!


షేర్ మణెమ్మతెలంగాణ ఉద్యమకారిణి
Manemma
తెలంగాణ ఉద్యమం ఆరంభం నుంచి మహిళా ఉద్యమనేతగా గుర్తింపు పొందారు కాప్రాకు చెందిన షేర్ మణెమ్మ. ఎలాంటి చదువులు చదువకపోయినా.. తెలంగాణ పట్ల జరిగిన అన్యాయాన్ని వెలుగెత్తి చాటుతూ ఉద్యమం తొలి రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు పట్టువిడువకుండా పాల్గొన్నారు 58 ఏళ్ల మణెమ్మ. కేసీఆర్ ఇచ్చిన ప్రతిపిలుపునకు స్పందించి రైలు రోకో.. రాస్తారోకో.. గర్జన.. సకల జనుల సమ్మె.. తెలంగాణ ధూం ధాంలలో పాల్గొన్న మణెమ్మపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. వీటిలో ప్రధానమైనది రైలురోకో. మొన్నటి వరకు ఈకేసు విషయమై రైల్వేకోర్టుకు హాజరుకాగా గతనెలలో ఆ కేసు కొట్టివేశారు. ఉద్యమం సందర్భంగా ఓయూలో విద్యార్థులపై దాడులకు నిరసనగా చర్లపల్లి జైలుముందు ఐదురోజులపాటు నిరాహారదీక్షకు దిగారు మణెమ్మ. కాప్రాలోని బీజేఆర్‌నగర్‌లో నివసించే షేర్ మణెమ్మ ఉద్యమంతో పాటు సామాజిక సేవల్లో పాల్గొంటూ పలువురిచే ప్రశంసలు.. అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈమె సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ జయశంకర్ స్మారక అవార్డు పొందారు. శ్రీజ్యోతి మహిళామండలి అధ్యక్షురాలిగా ఉంటూ మహిళలకు అండగా ఉన్నారు. పేదప్రజల వివాహాల కోసం కృషిచేశారు. అనాధలకోసం తనవంతు చేయూత అందించారు. ఈ అవార్డు తనకు ఎనలేని సంతోషాన్ని చ్చిందన్నారు మణెమ్మ.

అద్భుత చిత్రం


అంజనీరెడ్డి..చిత్రకారిణి
anjani-reddy
1951లో ప్రస్తుత సంగారెడ్డి జిల్లా నందికంది గ్రామంలో జన్మించారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో పెయింటింగ్‌లో నేషనల్ డిప్లొమా చేసిన అంజనీరెడ్డి, 1976 నుంచి చిత్రకారిణిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పెయింటింగ్ ఎగ్జిబిషన్లలో పాల్గొని తెలంగాణ ఖ్యాతి చాటిచెప్పారు. అమెరికా, రష్యా, సింగపూర్, బ్యాంకాక్‌లతో పాటు న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో పెయింటింగ్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా క్యాంపులు, పెయింటింగ్, మల్టీమీడియా వర్క్‌షాపులకు హాజరయ్యారు. అద్భుతమైన కళాకృతి ఆర్టిస్టుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మహిళల సమస్యలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ఆమె వేసిన చిత్రాలు అందరినీ ఆలోచింపేశాయి. రెండు దశాబ్దాలకు పైగా ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ అధ్యాపకురాలిగా పనిచేశారు.

సేవే వృత్తి


ప్రమీల న్యాయవాది
prameela
ప్రమీల ఎంఏ, బీఈడీ(హిందీ), బీఏ, ఎల్‌ఎల్‌బీ(ఎల్‌ఎల్‌ఎం) డిగ్రీలు చదివారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూరు ప్రాంతంలో 13 ఏళ్ల పాటు ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉత్తమ సేవలు అందించారు. ఏటా తల్లి లేని అమ్మాయిలను చదివిస్తున్నారు. 2008లో సదాశయ ఫౌండేషన్‌లో చేరారు. దేహదానం, నేత్రదానం, రక్తదానం, మట్టి వినాయకులపై అవగాహన సదస్సులు, ఫ్యామెలీ కౌన్సెలింగ్ వంటి కార్యక్రమాలు చేపడుతూ పలువురి నుంచి ప్రశంసలు పొందారు. ఆమె ఆధ్వర్యంలో 55 మంది నేత్రదానం చేసి 110 మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఎన్నో కుటుంబాలు సమస్యల పరిష్కారానికి న్యాయస్థానాల వద్దకు వెళ్లకుండా పేదలకు ఉచిత న్యాయసేవలు అందిస్తున్నారు. ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు, పిల్లల పెంపకంపై అవగాహన తదితర అంశాలపై ముందుకు సాగుతున్నారు. ఆమె సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వృత్తి సేవా విభాగంలో పురస్కారానికి ఎంపిక చేశారు.

సాహితీ కుసుమం


అనిశెట్టి రజిత సాహితీవేత్త
anishetty-rajitha
అనిశెట్టి రజిత. తెలుగు సాహితీ సీమలో ఓరుగల్లు నుంచి విరభూసిన అక్షర కుసుమం. ఆమెది అభ్యుదయ, ప్రజాస్వామిక గొంతుక. కవిత్వంలోని అన్ని పార్వాలను స్పృశించారు. నానీలు, దీర్ఘకవిత, కథ, నవలా అన్ని అంశాల్లోనూ ఆమెది అగ్నిపాళీయే. అగ్నిపాళీ కలంపేరుతో విస్తృత సాహిత్యాన్ని పండించిన ఆమె దాదాపు 45 సంవత్సరాల అక్షర సాగు చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కుమార్‌పల్లి ప్రాంతానికి చెందిన ఈమె వృత్తి రీత్యా కాకతీయ విశ్వవిద్యాలయంలో వివిధ హోదాల్లో బోధనేతర రంగంలోకి పనిచేసి పదవీ విరమణ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఏ స్థాయిలో ఆమె ధిక్కారాక్షరాన్ని మండించారో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అదేస్థాయిలో ఎండగట్టారు. నిర్భయాకాశం, అగ్నిశిఖ ఆమెకు అపారమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తిపురస్కారం నుంచి మొదలుకుంటే 1984 నుంచి ఇప్పటి 2016 అలిశెట్టి ప్రభాకర్ స్మారక పురస్కారం దాకా అనేకం ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం సాహితీ రంగంలో అనిశెట్టి రజిత సుదీర్ఘ అక్షర ప్రయాణానికి గుర్తింపుగా రాష్ట్ర మహిళా పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం పట్ల ఆమె ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

పంట పండింది


సుగుణమ్మ ఉత్తమ రైతు
sugunamma
ఓసారి ఊరి పంచాయతీ కార్యాలయం వద్ద క్రాప్స్ స్వచ్ఛంద సంస్థ మీటింగ్ పెట్టింది. వరి సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అటుగా నుంచి వెళ్తున్న సుగుణమ్మను కూడా ఆ మీటింగ్‌కు రావాలని పిలిచారు. ఆ మీటింగ్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన సలహాలు, సూచనలతో శ్రీవరి సాగు చేసి ఎకరాకు 65 బస్తాల వడ్లు పండించి రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు అందుకుంది. 2010లో ఆమెరికాలోని లొవా రాష్ట్రం డెస్మాయిన్స్‌లో నిర్వహించిన ప్రపంచ ఆహార సదస్సుల్లో పాల్గొన్నది. 60 దేశాలు పాల్గొన్న ఆ సదస్సులో ఆరు విడతల సదస్సు నిర్వహించగా 40 సార్లు శ్రీవరిసాగు పై మాట్లాడింది. ఇప్పటివరకు 15 అవార్డులు పొందింది సుగుణమ్మ. ఈమెది జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామం.

నాట్యతరంగిణి


వనజ ఉదయ్ నాట్యం
vanaja
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్యాన్స్ హెడ్‌గా వ్యవహరిస్తున్న వనజ ఉదయ్‌కి రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా పురస్కారాన్ని ప్రకటించింది. దాదాపు 40 సంవత్సరాలకు పైగా నృత్య రంగంలో సేవలందిస్తున్న వనజ దాదాపు 40కిపైగా దేశాల్లో ఇప్పటి వరకు 4300కు పైగా ప్రదర్శనలిచ్చారు. గత సంవత్సరం ఢిల్లీలో శ్రీశ్రీ రవిశంకర్ నిర్వహించిన వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్‌లో 1200 మంది కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. 40 సంత్సరాల తన కృషిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు వనజ. ముఖ్యమంత్రికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయికి రాగలిగానన్నారు.

ముందు చూపు


గాయత్రి సామాజిక సేవ
GAYATRI
వనపర్తికి చెందిన గాయత్రి పదో తరగతి వరకు హైదరాబాద్ మలక్‌పేట అంధుల పాఠశాలలో చదివారు. ఇంటర్ పటాన్‌చెరు, డిగ్రీ వనపర్తి ఆర్‌ఎల్‌డీ కళాశాలలో పూర్తి చేశారు. పీజీ, బీఈడీ నాంపల్లిలోని ఆంధ్ర మహిళా సభలో చదివారు. 2000లో డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందారు. ఏడేళ్ల అనంతరం జీహెచ్‌ఎంగా పదోన్నతి పొంది కొత్తకోటలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం వనపర్తి బాలుర ఉన్నత పాఠశాలలో జీహెచ్‌ఎంగా పనిచేస్తున్నారు గాయత్రి. అంధురాలైనా తన ప్రతిభాపాటవాలతో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్నారు. తను పనిచేస్తున్న పాఠశాల అభివృద్ధి కోసం దాతల సహకారాన్ని తీసుకుంటూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. గాయత్రి విశిష్టమైన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళా అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని అంటున్నారు గాయత్రి. మహిళలను ప్రోత్సహించడం ద్వారా అనేక ప్రతిభా పాటవాలను చాటుతారని అన్నారు.

వార్తావాహిని


మాడపాటి సత్యవతి రేడియో రంగం
madapati-satyavathi
ఆల్ ఇండియా రేడియోలో తొలి మహిళా న్యూస్‌రీడర్ మాడపాటి సత్యవతికి రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారాని ప్రకటించింది. నగర మొదటి మేయర్ మాడపాటి హనుమంతరావు మనువరాలు సత్యవతి. ఆలిండియా రేడియోలో సుదీర్ఘకాలం న్యూస్ ఎడిటర్‌గా పనిచేసిన సత్యవతి వార్తావాహిని పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేవారు. క్లుప్తంగా, భావయుక్తంగా వార్తలు వినిపించడం ఆమె ప్రత్యేకత. నిజాం కాలం నాటి రజాకార్ల అరాచకాలను కళ్లార చూసిన మనిషి. తెలుగు చదువుకోవడంపై నిషేధం ఉన్న కాలంలోనే హనుమంతరావు స్థాపించిన తెలుగు బాలికల ఉన్నత పాఠశాలలో ఆమె చదువుకున్నారు. తరువాత కాలంలో ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్‌గా పనిచేశారు.

ఆదర్శ వ్యవసాయం


వరికుప్పల నాగమణి ఉత్తమ రైతు
nagamani
వరికుప్పల నాగమణి.. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపాడు గ్రామం నివాసి. భర్త శ్రీనివాస్ సహకారంతో పక్కనే ఉన్న అనాజీపురం గ్రామంలో 4 ఎకరాల భూమిలో ఆదర్శ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. సేద్యానికి అంత సానుకూలంగా లేని భూమిని కొనుగోలు చేసినప్పటికీ.. ఆ భూమిలో పరుచుకున్న రాళ్లను తొలిగించి పైన కొత్తగా మట్టిపోసి సాగు చేపడుతున్నారు. కుటుంబ అవసరాలతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా.. అడపాదడపా మాత్రమే వ్యవసాయాన్ని పరిశీలించే అవకాశం ఉన్నా.. వినూత్న ఆధునిక పద్ధతుల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తుండడం విశేషం. ఆవు పేడ, ఆవు మూత్రం, వేప నూనె, వేప కశాయంతో సేంద్రీయ పద్దతిలో సహజ ఎరువులను తయారు చేయడమే కాకుండా.. ఆ ఎరువులను డ్రిప్ సిస్టమ్ ద్వారా నేరుగా మొక్కల వేర్లకు అందిస్తూ అధిక దిగుబడులను సాధించారు నాగమణి. మిర్చి వంటి వాణిజ్య పంటతోపాటు బంతి అంతర పంటల సాగును సైతం చేపట్టినా దిగుబడి అధికంగా వచ్చేలా వ్యవసాయం చేస్తూ.. నాలుగేళ్లుగా అప్రతిహత విజయాలు సాధిస్తూనే ఉన్నారు. మల్చింగ్‌తోపాటు పంటను నాశనం చేసే కీటకాల నిరోధానికి లింగాకర్షక బుట్టలు, విద్యుత్ బల్బుల వంటివి సైతం ఉపయోగిస్తున్నారు. ఎకరాకు 50 క్వింటాళ్ల మిర్చి దిగుబడి సాధించిన రైతుగా.. ఇప్పటికే జాతీయ స్థాయిలోనూ మహీంద్రా అవార్డు అందుకున్నారు నాగమణి. తాజాగా తనను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళా రైతుగా గుర్తించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

నగదు రహితం1


మల్లెత్తుల పద్మ ఆదర్శ గ్రామం
M.PADMA
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లిని నగదు రహిత గ్రామంగా గుర్తించి పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. గ్రామస్థులందరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ఈ ఉత్సాహంతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషిచేస్తా. మహిళలు కూడా అన్నీ రంగాల్లో రాణించగలరు. కాకపోతే వారికి సరైన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తే మరింత ముందుకు వెళ్తారు. గొల్లపల్లిని నగదు రహిత గ్రామంగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మండల అధికారులకు కృతజ్ఞతలు.

నగదు రహితం2


కుంభాల లక్ష్మి ఆదర్శ గ్రామం
LAXMI
నగదు రహిత లావాదేవీల్లో ఇబ్రహీంపూర్ గ్రామం దక్షిణ భారతదేశంలోనే తొలి గ్రామంగా నమోదైంది. మంత్రి హరీశ్‌రావు దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్ గ్రామం ఇంకుడు గుంతల నిర్మాణం, జలసంరక్షణ కందకాలు, హరితహారం తదితర వినూత్న కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో 270 కుటుంబాలు, 1230 జనాభా ఉంటుంది. వై-ఫై సేవలు అందుతున్నాయి. గ్రామంలో 10 స్వైపింగ్ మిషన్ల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఆటోలకు క్యూఆర్ కోడ్ పద్ధతిని ఏర్పాటు చేశారు. గ్రామంలోని రేషన్ దుకాణం, కిరాణం, పిండి గిర్ని, బాలవికాస ప్లాంట్, పాలకేంద్రం తదితర చోట్ల ఏర్పాటు చేసిన స్వైపింగ్ మిషన్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇటీవలనే గ్రామంలోని ద్విచక్ర వాహనదారులకు 100 హెల్మెట్లు పంపిణీ చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి లైసెన్స్ ఇప్పించారు. పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి గ్రామ సర్పంచ్ నాయకత్వంలో ముందుకు వెళుతున్నారు. ఈ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని లక్ష్మి తెలియచేశారు.

తనవంతసాయం


కుమ్ర లక్ష్మీబాయి సామాజిక సేవ
LAXMIBAI
ఆదిలాబాద్ జిల్లా పిప్పల్‌ధరి గ్రామ పంచాయతీ పరిధిలో గల దహిగూడకు చెందిన కుమ్రలక్ష్మీ బాయి తన తాతలు తండ్రుల కాలం నాటి భూములపై దాదాపు 15 ఏళ్ల పోరాటం చేసి విజయం సాధించింది. ఆమెకు ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు. భర్త సుమారు 13 ఏళ్ల క్రితం మరణించగా అప్పటి నుంచి పిల్లలను ఒక పక్క సాకుతూనే, మరో పక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న తమ భూములు తమకే దక్కాలని కోర్టులో కేసువేసి విజయం సాధించింది. అంతేకాకుండా ఆమె గ్రామంలోని చిన్నాపెద్దా తేడాలేకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే వెంటనే తానున్నానంటూ సహాయం చేయడానికి ముందుకు వచ్చేది. ముఖ్యంగా గ్రామంలోని వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు పింఛన్‌లు రాకపోతే తన పనులు పక్కన పెట్టి మరీ వారి కోసం మండల అధికారుల చుట్టూ తిరిగి వారికి పింఛన్‌లు అందేలా చూసేది. గ్రామంలో పురుషులు గుడుంబాకు బానిసలవుతున్నారని తెలిసి ఆ గుడుంబా నిరోధానికి అనేక రకాలుగా కృషి చేసింది. మహిళలు, పిల్లలను చైతన్యవంతులను చేసి గుడుంబా స్థావరాలపై దాడులు చేసింది. తన సామాజిక సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డును అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలియచేసింది.

1483
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles