మొక్కలు నాటండి..వనజీవులవ్వండి!


Wed,August 1, 2018 01:58 AM

plant-MPkavitha
ముగ్గురు.. ముగ్గురు కదులుతున్నారు. ఆ ముగ్గురు మరో ముగ్గుర్ని కదిలిస్తున్నారు! గ్రీన్ సునామీ సృష్టించేందుకు చేయి చేయి కలిపి తలా ఒక మొక్క నాటుతున్నారు! హరితహారంతో తెలంగాణ గుమ్మానికి కట్టిన తొలి తోరణం.. ప్రపంచానికి పచ్చ తోరణమై
హరిత సవాల్ విసురుతున్నది.సోషల్‌మీడియా వేదికగా.. లోకమంతటినీ ఏకం చేస్తూ ప్రకృతికి పచ్చబొట్టు పొడిపిస్తున్న గ్రీన్ చాలెంజ్‌పై జిందగీ కథనం!
చాలెంజ్ చేస్తే మనమేదైనా సాధిస్తాం. మరి పచ్చదనం కోసం ఎందుకు చాలెంజ్ చేయొద్దు? వానలు పడటం లేదు.. ఇప్పుడైనా పడితే బాగుండు అని మొక్కులు మొక్కే మనం మొక్కలు ఎందుకు నాటడం లేదు? వామ్మో పొల్యూషన్.. వాతావరణం ఇంత వేడెక్కుతున్నదేంటి? అని ఆందోళన చెందే మనం గ్రీన్ రెవల్యూషన్‌లో ఎందుకు భాగం కావొద్దు? భవిష్యత్ తరాల తలరాత మారాలంటే.. మార్చాలంటే..అటవీ కోతను ఆపేసి.. హరిత దూతలుగా మారాల్సిన అవసరం ఉన్నది. అదే గ్రీన్ చాలెంజ్. ఇది మనందరి బాధ్యత!

KTR-PLANTATION
మొన్న సచిన్ టెండూల్కర్.. నిన్న క్యాథరిన్ హడ్డా.. నేడు చిరంజీవి. ఇలా ముగ్గురు ముగ్గురు గ్రీన్ చాలెంజ్‌తో చేతులు కలుపుతున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది కదులుతున్నారు. అలాంటి ఆలోచనను రేకెత్తించింది ఇగ్నైటింగ్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలైతే.. ఆ ఆలోచన నచ్చి స్వచ్ఛందంగా కదిలింది హరితహారం ప్రత్యేకాధికారి ప్రియాంకా వర్గీస్. దానిని విశ్వవ్యాప్తం చేయడంలో ఎంపీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ క్రియాశీలకంగా పనిచేశారు. దేశంలోని సెలబ్రిటీలతో పాటు తెలంగాణ ప్రజా ప్రతినిధులు, అధికారులు దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు.

I Accepted hara Hai Toh Bhara Hai A Green Challenge, What About You?
Plant 3 Trees and Nurture them for 3 years.
Pass the Challenge to 3 others.
A Green Revolution, A Green Resolution
rajamouli-plant
ఫామ్ హౌజ్‌లో మొక్కలు నాటుతున్న దర్శకుడు రాజమౌళి.

ఎవరు శ్రీకారం చుట్టారు?

పచ్చదనాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత మన అందరిదీ అని అవగాహన కల్పిస్తూ గ్రీన్ చాలెంజ్‌కు శ్రీకారం చుట్టిన సంస్థలు ఇగ్నైటింగ్ మైండ్స్, వాక్‌ఫర్ వాటర్. హరితహారంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నది. దీనిలో మరింత మందిని భాగస్వామ్యం చేసేందుకు భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ వర్ధంతి సందర్భంగా జూలై 27వ తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హరా హై.. తో భరా హై అనే నినాదంతో గ్రీన్ చాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు.

చాలెంజ్ అవసరమా?

భూమిపై కేవలం 31%మాత్రమే అటవీ ప్రాంతం ఉన్నది. పట్టణీకరణ పేరుతో ప్రతీ సంవత్సరం 5.2 మిలియన్ హెక్టార్ల అడవి విధ్వంసానికి గురవుతున్నది. మరి మనకేమో.. సంవత్సరానికి ఒక మనిషికి సగటున 284.7 కిలోల ఆక్సీజన్ అవసరం ఉంది. ఒక చెట్టు 100 కిలోల ఆక్సీజన్‌ను యావరేజ్‌గా ఉత్పత్తి చేస్తుంది. అంటే ఒక మనిషికి సంవత్సరానికి సరిపడా ఆక్సీజన్‌ను స్వీకరించాలంటే కనీసం మూడు చెట్లు కావాలి. ఇలా ఎవరికి వాళ్లు మూడు చొప్పున చెట్లు నాటుకుంటూ వెళ్తే ఆక్సీజన్ కొరత ఉండదు. వాతావరణం వేడెక్కదు. గ్లోబల్ వార్మింగ్ గోడలు బద్దలు కొట్టడానికే మనం ఈ చాలెంజ్‌ను స్వీకరించాల్సిన.. మరికొందరికి సవాల్ విసరాల్సిన అవసరం ఉంది.

పవన్ కల్యాణ్:

Pavankalyan
ఎన్‌టీవీ చౌదరి విసిరిన చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసిన చిరంజీవి మొక్కలు నాటి, తన తమ్ముడు పవన్‌కల్యాణ్‌కు గ్రీన్ చాలెంజ్ విసరగా, పవన్ ఆ చాలెంజ్‌ను స్వీకరించి మొక్క నాటారు.

ఎలా కొనసాగుతున్నది?

నిజంగా ఇది గ్రీన్ సునామీని తలపిస్తున్నది. ప్రతీ గంటకు విస్తరిస్తున్నది. గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన పది రోజుల్లోనే 27 రాష్ర్టాలకు విస్తరించింది. 35 దేశాలకు గ్రీన్ చాలెంజ్ నినాదం చేరుకున్నది. ఇప్పటివరకు (31 జూలై సాయంత్రం 4:40) ఈ చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసినవారి సంఖ్య: 797443. గ్రీన్‌చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటుతూ ఫొటోలు అప్‌లోడ్ చేసిన వారి సంఖ్య: 1798136. ఇదొక యజ్ఞంలా కొనసాగుతున్నది. ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సప్ వంటి బహుళ ఆదరణ కలిగిన సోషల్ మాధ్యమాల్లో గ్రీన్ చాలెంజ్‌కు సంబంధించిన పోస్ట్‌లు, ఫొటోలే కనిపిస్తున్నాయి. ఇదే స్ఫూర్తి కొనసాగితే గ్రీన్ తెలంగాణ, గ్రీన్ ఇండియా సులభంగానే సాధ్యమవుతాయని చెప్పొచ్చు.

మహేశ్‌బాబు:

Mahesbabu
చాలెంజ్‌కు ఆహ్వానించినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు. నేను దీనిని స్వీకరించి మొక్కలు నాటాను. నా కూతురు సితార, కొడుకు గౌతంతో పాటు డైరెక్టర్ వంశీని ఈ చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నా.

విదేశాలకు పచ్చ తోరణం!

ఈ కార్యక్రమంలో భాగంగా విదేశాల ప్రతినిధులు మొక్కలు నాటుతూ మరో ముగ్గురికి సవాల్ విసురుతున్నారు. ఈ జాబితాలో.. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త క్రిస్టినా జావియర్ మార్టిన్స్, హాలీవుడ్ నటి గాబ్రియల్ సోసా, గ్రీన్ తావూ ఆర్గనైజేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ గయ్ టానర్, వియ్‌డోంట్ హ్యావ్‌టైమ్.ఆర్గ్ సీఈఓ ఇంగార్ రెంట్‌జాగ్, ఆఫ్రికాకు చెందిన టీమ్54 ప్రాజెక్ట్ సీఈఓ డాక్టర్ డానియెల్ చిడుబెమ్ మొక్కలు నాటారు.

వి.వి. వినాయక్:

VV-VINAYAK
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించి దర్శకుడు వివి వినాయక్ మొక్క నాటారు.

హరిత హారమే!

ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమమే గ్రీన్ చాలెంజ్. ఫొటోలు పోస్ట్ చేయడమే కాకుండా మొక్కల రక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని ఈ చాలెంజ్ సూచిస్తున్నది. చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేస్తూ ట్యాగ్ చేసే వాళ్ల ఫొటోలు, డీటెయిల్స్ నిర్వాహకులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు ఫొటోలు దిగి పోస్ట్ చేయడమే కాకుండా ప్రతీ నెలనెలా మొక్క స్టేటస్ ఏంటో కూడా షేర్ చేయాలి. మూడు నెలల తర్వాత మొక్కల స్థితిని పరిశీలించి చిత్తశుద్ధితో బాధ్యతను నిర్వహించినవారికి వనజీవి అనే అవార్డు ఇస్తారు. మూడేళ్ల వరకు మొక్క స్థితికి సంబంధించిన ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. మూడేళ్ల తర్వాత అది వృక్షంగా మారి దానంతట అది బతికి మనకు బతుకునిస్తుంది.

గ్రీన్ సునామీ సృష్టిద్దాం..

Karunakar-Reddy
హరితహారం వంటి గొప్ప కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే గ్రీన్ చాలెంజ్‌కు శ్రీకారం చుట్టాం. ఏదో పేరుకు ఫొటో దిగి చాలెంజ్‌లో పాల్గొనడమే కాదు.. మూడేళ్ల వరకు మొక్క సంరక్షణ బాధ్యతలు చేపట్టాలనేది మా కాన్సెప్ట్. ప్రోత్సాహకంగా వనమాలి అవార్డు కూడా ఇస్తాం అని చెప్పాం. సింపుల్‌గా చెప్పాలంటే.. పిల్లలకు ఏ దశలో ఏది అవసరముందా అని చాలా కేర్ తీసుకుంటాం. కానీ ఆ పిల్లల భవిష్యత్‌కు సంబంధించిన పర్యావరణాన్ని.. ఆ పర్యావరణంలో భాగమైన మొక్కల పెంపకాన్ని ఎందుకు బాధ్యతగా తీసుకోరు? అని ప్రశ్నిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలను అందర్నీ భాగస్వామ్యం చేయాలన్నది మా ఉద్దేశం. చాలెంజ్ స్వీకరించాలనుకునేవాళ్లు www.ignitingminds.co.inను సందర్శించండి.
కరుణాకర్‌రెడ్డి, ఇగ్నైటింగ్ మైండ్స్ చైర్‌పర్సన్

దాయి శ్రీశైలం
priyanka-varghese
sachin
mega-star-chiranjeev
vvs-axman

2704
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles