మూర్ఛను ఏమార్చేద్దాం!


Tue,February 19, 2019 01:49 AM

seizures
కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటున్న వాళ్లను చూశారు కదా? మీ వంతుగా ఏం చేస్తారు? బండి తాళం చెవో.. ఇంకేదైనా ఇనుప వస్తువో చేతిలో పెట్టి తట్టిలేపుతారు. కానీ.. మూర్ఛవ్యాధి ఎందుకొస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా.. ఈ సమస్య ఎవరికైనా రావచ్చు. అందుకే వ్యాధిపట్ల అవగాహన అవసరం. మూర్ఛ ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? నివారణ ఎలా? తెలుసుకొని దానిని ఏమార్చేద్దాం!


మూర్ఛవ్యాధిని ఫిట్స్ అని అంటారు. ఇది సాధారణమైందే. బేసికల్‌గా ఇది నరాలకు సంబంధించిన వ్యాధి. నిర్లక్ష్యం చేస్తే జీవ రసాయనాల్లో వ్యత్యాసం ఏర్పడి మెదడుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే దీనిని మెదడుకు ఏర్పడిన గాయంగా పరిగణిస్తారు. మామూలుగా కొందరికి తాత్కాలిక ఆరోగ్య పరిస్థితుల ప్రభావం వల్ల ఇది వస్తుంది. రెండుసార్ల కంటే ఎక్కువ ఫిట్స్ వస్తే మాత్రం దానిని వ్యాధిగా భావించాలి.


12౦ లక్షల మందికి

ఇటీవల అంతర్జాతీయ మూర్చ వ్యాధి దినోత్సవం జరిగింది. ఇంటర్నేషనల్ బ్యూరో ఫర్ ఎపిలెప్సీ (ఐబీఈ), ఇంటర్నేషనల్ లీగ్ ఎగేనెస్ట్ ఎపిలెప్సీ (ఐఎల్‌ఈ) ఆధ్వర్యంలో 120 దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఈ సందర్భంగా ఐబీఈ, ఐఎల్‌ఈ ప్రతినిధులు వ్యాధి గురించి ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం.. భారతదేశంలో సుమారు 30 మిలియన్ల మంది వివిధ రకాల న్యూరోలాజికల్ డిజార్డర్స్‌తో బాధపడుతున్నారు. వారిలో సుమారు 12౦ లక్షల మంది మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. మూర్ఛవ్యాధి సాధారణ నరాలకు సంబంధించింది. అయినప్పటికీ అవగాహన లోపంతో కొందరు దానిని నిర్లక్ష్యం చేస్తూ చేజేతులా తీవ్రతరం చేస్తున్నారు.


వ్యాధి లక్షణాలు

మూర్ఛపోయే ముందు తీవ్రమైన వణుకు పుడుతుంది. వణుకు వల్ల నాడీ వ్యవస్థలో ఆటంకం ఏర్పడి గిలగిలా కొట్టుకుంటారు. నోటి నుంచి చొంగ కారుతుంది. నాలుక కరుచుకొని శ్వాస బిగ్గరపడుతూ దమ్ము తీస్తుంటారు. చేతి పిడికిళ్లు బిగిసిపడతారు. కాలి వేళ్లు గట్టిగా అవుతాయి. మెదడులో విద్యుత్ కార్యకలాపాలను ప్రారంభింపచేసే అంశాలకు.. దానిని నియంత్రించే అంశాలకు మధ్య ఒక సున్నితమైన సమతుల చర్య ఉంటుంది. విద్యుత్ కార్యకలాప చర్యలే కాదు.. వాటి వ్యాప్తిని పరిమితం చేసే వ్యవస్థలు కూడా ఉంటాయి. ఫిట్స్ వచ్చే సమయంలో ఈ పరిమితులు విచ్ఛిన్నమవుతాయి. విపరీతమైన విద్యుత్ విడుదల అవుతుంది.


నిర్ధారణ

మెదడులో ఏ భాగం ఫిట్స్‌కు కారణమవుతుందో కచ్చితంగా తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేయాలి. స్కానింగ్‌తో పాటు రక్త పరీక్షలు చేస్తారు. ఈఈజీ ద్వారా కూడా నిర్ధారిస్తారు. సీటీస్కానింగ్.. ఎంఆర్‌ఐ ద్వారా మెదడులో నిర్మాణాత్మక లోపాలను గుర్తించి మూర్ఛ వ్యాధిని నిర్ధారిస్తారు.

seizures1

ఏం చేయొద్దు?

మహిళల్లో ఫిట్స్ సమస్యలు ఎక్కువవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఒక్కసారిగా మందుల డోస్ పెంచుకోవడంగానీ.. తగ్గించడం గానీ.. ఆపేయడంగానీ చేయొద్దు. కాంతివంతమైన దీపాలకు.. బిగ్గరగా ఉండే ధ్వనులకు దూరంగా ఉండాలి. సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువసేపు వాహనాలు నడపొద్దు. ఈతకు దూరంగాఉండాలి. ఎత్తులు ఎక్కొద్దు. భారీ యంత్రాలు, విద్యుత్ ఉపకరణాల దగ్గర పని చేయొద్దు. మూర్ఛ వచ్చినప్పు బలవంతంగా నోట్లోకి ఏమీ పెట్టవద్దు. తగినంత గాలి ఆడేలా చూసుకోవాలి.


ఏం చేయాలి?

క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఒకటి, రెండ్రోజులు మందులు ఆపినా కూడా ఫిట్స్ వస్తుంది. రోజుకు 6-8 గంటలు నిద్రపోవాలి. మానసిక ఒత్తిడికి గురికావద్దు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. టీవీ చూడటం తగ్గించాలి. మత్తు మందులు.. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ద్విచక్ర వాహనంపై డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలి. పెళ్ళయిన అమ్మాయిలు ఫిట్స్ మందులతోపాటు.. ఫోలేట్ టాబ్లెట్స్ వాడాలి. దీనివల్ల పుట్టబోయే పిల్లల్లో ఇలాంటి సమస్యలు రావు. మూర్ఛవ్యాధి ఉన్నవాళ్లు తమ జబ్బు గురించి చిన్న స్లిప్ ఒకటి తమ పర్సులో పెట్టుకోవడం చాలా మంచిది.

seizures2

కారణాలు

తరచూ జ్వరం.. పుట్టుకతో వచ్చే లోపాల వల్ల మూర్ఛ వ్యాధి రావచ్చు. మెదడులో లోపాలు లేదా కణతులు వల్ల కూడా కొన్నిసార్లు కారణం అవుతున్నాయి. జీవనశైలికి సంబంధించిన కారణాలను పరిగణనలోకి తీసుకుంటే మద్యపానం.. నిద్రలేకపోవడం.. ఆకలిని అణచివేయడం.. రుతుక్రమ లోపాల వల్ల ఫిట్స్ సమస్య వస్తుంది. రక్తంలో కాల్షియం, సోడియం, గ్లూకోజ్, ఆక్సీజన్ మోతాదులు తగ్గినప్పుడూ రావచ్చు. ఈ రోజుల్లో అయితే ఎక్కువగా డిప్రెషన్ కోసం వాడే మందులతోనూ ఈ సమస్య ఏర్పడుతుంది. మహిళల్లో ముఖ్యంగా హార్మోన్ల తేడా వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో ఫిట్స్ వస్తాయి. మిరుమిట్లు గొలిపే కాంతిని చూసినా.. వెల్డింగ్ మెరుపులను చూసినా.. మధ్యాహ్న వేళ మెరిసే నీటిని చూసినా మూర్ఛ వస్తుంది.


వ్యాధి రకాలు

జ్వరంతో వచ్చేది: బాల్యంలో 2-5% జ్వరంతో ఉండే మూర్ఛవ్యాధి వస్తుంది. పెరుగుదల ఆలస్యంగా ఉన్న పిల్లల్లో.. 28 రోజుల కంటే ఎక్కువగా నియో నాటాల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో గడిపిన పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. నలుగురిలో ఒకరికి సంవత్సరంలోనే మళ్లీ ఈ సమస్య ఎదురవుతుంది.


నియో నాటల్ మూర్ఛ: శిశువు పుట్టిన 28 రోజుల లోపే ఫిట్స్ వస్తే నియోనాటల్ మూర్ఛ అంటారు. కళ్లను ఇటు అటు తిప్పడం.. చుట్టూతా దృష్టి పెట్టి గమనిస్తుండటం ఈ రకమైన మూర్ఛ లక్షణాలు. కొందరు పిల్లలు పెదవులను కొరుకుతూ అసంబద్ధంగా ఊపిరి పీలుస్తుంటారు.


పాక్షిక మూర్ఛ: మెదడులో ఒకవైపు భాగానికి సమస్యలు రాడంవల్ల పాక్షిక మూర్ఛ వస్తుంది. ఇది చాలా క్లిష్టమైన సమస్య.ఒకే పనిని పదే పదే చేస్తుండటం.. మూర్ఛ ఉన్నంతసేపు చప్పట్లు కొడుతుండటం వంటివి దీని లక్షణాలు. మూర్ఛ ఆగిపోయిన తర్వాత పిల్లలు ఏదో భ్రాంతిలో ఉన్నట్లు ఆందోళనగా కనిపిస్తారు.


సాధారణ మూర్ఛ: ఈ సమస్య వచ్చినవాళ్లలో విపరీతంగా ఊగిపోవడం.. వణికిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదుపు చేయలేనంతగా కండరాలు వణుకుతుంటాయి. దాదాపు 5 నిమిషాలు మగతగా.. నిద్రావస్థలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది.


స్ధిర మూర్చ: ఇది చాలా ప్రమాదకరం. 30 నిమిషాలకంటే ఎక్కువ సేపు ఉంటుంది. వచ్చిన వెంటనే మళ్లీ వస్తుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. గొంతు బిగుసుకుపోవడం, పిడికిలి కట్టుకుపోవడం, రాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తాయి.

Dr.-Kailash-Mirche
డాక్టర్ కైలాష్ మిర్చె
అసోసియేట్ కన్సల్టెంట్
న్యూరాలజిస్ట్, కాంటినెంటల్ హాస్పిటల్, హైదరాబాద్

280
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles